Wednesday, September 8, 2010

ముచ్చటగా మూడు...? - మరికొన్ని వివరాలు.

ఈ ప్రశ్నలలో ఇచ్చిన చిత్రాలన్నీ అప్పట్లో సూపర్ హిట్ కాకపోయినా అంతో ఇంతో ప్రజాదరణ పొందినవే ! పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేనివి మాత్రం కాదు. జవాబులతో బాటు మరికొన్ని వివరాలు ఇవ్వవలసింది. సులువుగా గుర్తుకొచ్చేవేమో ! నాకు తెలిసిన వివరాలతో బాటు ఆయా చిత్రాల పాటలు కూడా ఇస్తున్నాను. అవి వింటే గుర్తుకు రావచ్చు.

1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ , వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం రామలక్ష్మి గారే రాసిన ' కరుణ ' అనే నవల ఆథారంగా నిర్మించబడింది.
చక్రవర్తి సంగీత నిర్దేశకత్వంలో దాశరథి రచించిన ఈ పాట బాలు గారు పాడారు. అప్పట్లో ఈ పాట ఎక్కువగా రేడియోలో వినిపించేది.





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే ' ( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి  ' మనుషులు-మమతలు ' ( 1965 ) చిత్రం గురించి గత తరం ప్రేక్షకులకు ఎక్కువగా చెప్పనక్కర్లేదనుకుంటాను. అక్కినేని, సావిత్రి, జయలలిత నటించిన ఈ చిత్రంలో జయలలిత ధరించిన దుస్తులు అప్పట్లో సంచలనం కలిగించాయి. ఆ చిత్రంలోని పాటలన్నీ దాదాపుగా ప్రజాదరణ పొందినవే ! ఓసారి వింటే గుర్తుకు రాక మానవు.
తాతినేని చలపతిరావు సంగీతంలో ఈ చిత్రంలోని పాటలు ఆత్రేయ, దాశరథి, సి. నారాయణరెడ్డి రాశారు.




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ? ఏ పాత్రలో ?

జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట
ఘంటసాల, సుశీల పాడారు.
గత తరం తెలుగు సినీ సంగీత ప్రియులు ఈ పాటను మరిచిపోవడం సాధ్యం కాదేమో !



Vol. No. 02 Pub. No. 020b

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం