Sunday, May 23, 2010

సాహితీమూర్తి విశేషాలు

పాటయై వచ్చారు భువనానికి
ధన్యుడై వెడుతున్నారు గగనానికి
అంతిమ యాత్రకూడా పూర్తయింది
ఇక తెలుగు పాటకు ఆ సోగసులద్దేదెవరు ?

తెలుగు సినిమా పాటకు సాహిత్య పరిమళాలు అద్దిన వేటూరి
చెప్పిన కొన్ని విశేషాలు  ........

ఆయన స్వస్థలం గొప్పతనాన్ని చెబుతూ .....

కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లి మా స్వగ్రామం. ఈ తరం వారికి తెలియకపోవచ్చుగానీ గొప్ప శైవక్షేత్రం. కళ్ళేపల్లి వద్ద కృష్ణ ఉత్తరానికి తిరుగుతుంది.  అంచేతే పెదకళ్ళేపల్లిని దక్షిణ కాశీ అంటారు. ఈ వూరు శివాలయంలో శివలింగం వుండదు. నాగం వుంటుంది. అన్నీ నాగ శబ్దంతో మొదలవుతాయి.
తెలుగునాట  భావ కవితకు ఆద్యుడు కొడాలి సుబ్బారావు ఇక్కడివాడే !
త్యాగరాజు శిష్యులలో ముఖ్యుడు ఆకుమళ్ళ వెంకట సుబ్బయ్యగారు నడయాడిన నేల ఇది. సుబ్బయ్య గారి శిష్యులు సుసర్ల దక్షిణామూర్తి, ఆయన శిష్యుడు పారుపల్లి, ఆయన శిష్యుడు బాలమురళీకృష్ణ ... చూసారా ఎంత గొప్ప పరంపరకు ఇది తార్కాణమో !
నాదస్వర వాదనలో దక్షిణాదిలోనే పేర్గాంచిన దాలిపర్తి పిచ్చిహరి ఇక్కడివాడే !
ఛత్రపతి శివాజీ సేనలో ముఖ్యుడు, కమాండర్ మరాఠీ వెంకటభోట్లు ఇక్కడివాడే మాపూర్వీకుడే !
వోకనాటి రంగస్థల స్రష్ట శ్రీరామవిలాస సభ వ్యవస్థాపకుల్లో వొకరు చల్లా లక్ష్మీకాంతం  మా ఊరివాడే !

ఆయన సాహిత్య నేపథ్యం గురించి......

మా తాతగారు వేటూరి సుందరశాస్త్రి గారు మంచి పండితుడు. ' కదళి మహత్యం ' అని వో గ్రంథం రాసారు. మా కళ్ళేపల్లి పై రాసిన గ్రంథమది. నా గురువు, ఆత్మగురువు నా తండ్రిగారైనటువంటి చంద్రశేఖరశాస్త్రి గారు. ఆయన వొడిలోనే తొలి అక్షరాలు దిద్దాను. మా అమ్మ కమలాంబ. నా సరస్వతి. నా సమస్త అక్షరం. అమ్మవాక్కు, నాన్నదీవెనలే నా జీవన చేతనకు పునాదులు. మా పెదనాయిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. గొప్ప శాసన పరిష్కర్త.

'శంకరాభరణం' చిత్రం ప్రారంభోత్సవం గురించి చెబుతూ ..... 

ఆది ' శంకరాభరణం ' ప్రారంభ సమయం. పూజ మొదలుపెట్టారు. మూడు కొబ్బరికాయలు వున్నాయి. విశ్వనాథ్ గారు వచ్చి నన్నొకటి, మహదేవన్ ని వొకటి కొట్టమన్నారు. " నా సినిమాలో హీరో అరవై ఏళ్ళ వాడయ్యా ! ఇదో సాహసం. నిజానికి మీరిద్దరే ఈ సినిమాకి హీరోలు " అంటూ నాభుజం మీద, మామ భుజం మీద చేతులు వేసి ఆర్ద్రంగా చెప్పారు విశ్వనాథ్. ఆయన కలం నిజం చేసాం. ఆ సినిమా ఓ టెక్నిషియన్ గా నాకు సార్థకత.

మువ్వ గోపాల పదాల గురించి, వాటి సృష్టికర్త క్షేత్రయ్య గురించి..........

మనవాళ్ళకి చరిత్రమీద ఆట్టే గురి, గౌరవం లేవు. క్షేత్రయ్యను తీసుకొచ్చి కృష్ణా జిల్లావాణ్ని చేసారు. మొవ్వలో ఆయన నివసించాడని అక్కడే మువ్వగోపాల పదాలు రాసాడంటున్నారు. ఆది తప్పు. క్షేత్రయ్య అసలు పేరు అర్భకం వరదయ్య. ఆయన ఉండేది కంచి దగ్గర. ఆయన చేసిన ప్రయోగాలు గమనిస్తే చాలా చోట్ల నవ్వినీ, చూసినీ అని వుంటాయి. ఆది రాయలసీమ మాండలీకం. మువ్వగోపాలుడున్న ప్రాంతం వేరు. కార్వేటినగరంలో మువ్వగోపాలుని ఆలయం వుంది. అక్కడ కృష్ణుడికి వళ్ళంతా మువ్వలే వుంటాయి. నెమలి ఫించం, మురళీ, కాళ్ళకు, చేతులకు అన్నీ మువ్వలే. వ్యాకరణం ప్రకారం చూసినా మెవ్వ - మువ్వ అవదు. ఈ చారిత్రిక పరిశోధన లేకుండా మొవ్వ క్షేత్రయ్య ఊరని, వేణుగోపాలస్వామి ఆలయం వుంది కాబట్టి అక్కడే క్షేత్రయ్య వుంటాడని చెబుతూ బోర్డులు కట్టడం చూస్తే నాకు బాధ వేసింది. చరిత్ర పట్ల గౌరవం పరిశోధనా లేని జాతైపోయింది మనది.

( 1997 వ సంవత్సరంలో వేటూరిగారు ఆంధ్రజ్యోతి వారపత్రికకిచ్చిన ఇంటర్వ్యూ నుంచి సేకరించిన కొన్ని విశేషాలు ) 


వేటూరి వారి గురించి గతంలో రాసిన తెలుగు పాటకు చిరునామా వేటూరి  చూడండి.


Vol. No. 01 Pub. No. 295

9 comments:

Unknown said...

సాహితీమూర్తి వేటూరి అంతిమయాత్ర దృశ్యాలు మీ బ్లాగులో చూద్దామని ప్రయత్నించాను....కానీ ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు...." పాటయై వచ్చారు భువనానికి ధన్యుడై వెడుతున్నారు గగనానికి " అంటూ పాటగా జీవించి ఉంటారని కంటికి ఇక కనిపించరని ఈ పోష్టు ఇలా వేశారా?

SRRao said...

ధరణి గారూ !
వేటూరి గారికి అంతిమ సంస్కారం జరుగుతున్న సమయంలో వస్తున్న లైవ్ బ్లాగులో ఉంచాను. లైవ్ అవగానే తొలగించాను. రికార్డు చేసానుగానీ క్వాలిటీ బాగులేక పెట్టలేదు. కానీ నా భావనగా అనుకున్నా, మీరన్నది మాత్రం సత్యం. ఆయన భౌతికంగా లేకపోయినా పాటగా మాత్రం మనందరి మనస్సుల్లో జీవించి వుంటారు.

Rao S Lakkaraju said...

ఏదో చెప్పాలని అనిపిస్తుంది చెప్పలేను. వ్రాయాలని పిస్తుంది వ్రాయలేను. మూగబోయిన మాటలతో ఏమి చేయగలను. వేటూరి వారి పై మీ సంధ్యా నివాళుల కన్నా ఎక్కువ నేనేమి చెప్పగలను. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

Rao S Lakkaraju said...

మీరన్నట్లు ధన్యుడై వెళ్లారు గగనానికి.

సుభద్ర said...

పాటయై వచ్చారు భువనానికి
ధన్యుడై వెడుతున్నారు గగనానికి

ఎ౦త బాగాశారో ఈ మాట చెప్పలేను..
పాట రేడు కి నివాళి తో ,
సుభద్ర..

తృష్ణ said...

good tribute sir..

SRRao said...

రావు గారూ !
నిన్న అంతిమ యాత్ర చూస్తుంటే నా పరిస్థితి కూడా అంతే ! ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. ఏదో రాయాలనిపించి ఏదోదో రాసేసాను. ఆ దృశ్యాలు లైవ్ బ్లాగులో పెట్టేసాను. తర్వాత స్పృహ వచ్చినట్లయింది. లైవ్ తొలగించాను. ఆ మహానుభావుడి గురించి రాయగల అర్హత నాకు లేదనిపించింది. అందుకే మొదటి వాక్యాలు మాత్రం వుంచి మిగిలినది తొలగించి ఆయన గురించి ఆయనే చెప్పిన విశేషాలను ఇచ్చాను.

* సుభద్ర గారూ !
* తృష్ణ గారూ !

ధన్యవాదాలు

మాగంటి వంశీ మోహన్ said...

"చరిత్ర పట్ల గౌరవం పరిశోధనా లేని జాతైపోయింది మనది"

ఇది చాలా కరకట్టు మాట...ఈ పిచ్చి జనాలు ఒప్పుకోవాలిగా.. :) ఈ మొవ్వ, మా చల్లపల్లికి చాలా చాలా దగ్గర.....

SRRao said...

వంశీ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం