లైలా తుఫాను లీల ఈ రోజు సాయింత్రం వరకూ కొనసాగింది. ఇదే లైలా తుఫాను తిరిగి సముద్రంలోకి ప్రవేశించి ఒడిస్సా వైపు పయనించి మళ్ళీ తీరం తాకుతుందని, మరో తుఫాను ముప్పు పొంచి వుందని దానికి ' బంద్ ' అనే పేరు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న లైలా తీరం దాటిన విషయంలో కూడా అధికారుల మధ్య, మీడియాలోను గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం రెండుగంటల ప్రాంతంలో బాపట్ల దగ్గర తీరం దాటినట్లు ఒక వార్తా ఛానల్ ప్రసారం చేస్తే కొన్ని చానెళ్ళు సందిగ్డంగానే ప్రకటించాయి. దానికి ముందు వరకూ మచిలీపట్టణం దగ్గర తీరం దాటే అవకాశం అధికంగా వుందని వార్తలు పదే పదే ప్రసారమయ్యాయి. ఆ ప్రాంతంలో ప్రజలకు సహాయం అవసరమవుతుందని వెళ్ళిన మాకు అక్కడ దాదాపుగా ప్రశాంత వాతావరణం ఎదురయ్యింది. అప్పుడప్పుడు కొద్దిగా గాలి, కొద్దిగా వర్షం మాత్రమే అక్కడ కనబడింది. గ్రామాలన్నీ అధికారులు ముందే ఖాళీ చేయించడంతో ప్రశాంతంగా వుంది. తుఫాను ముందు ప్రశాంతత ఏమో అనుకున్నాం. కాసేపటికి బాపట్ల దగ్గర తీరం దాటిందని, కాదు ఒంగోలు దగ్గర దాటిందని రకరకాల వార్తలు వచ్చాయి. దేశమంతా కలవరపడుతున్నా తుఫానులకు అలవాటు పడ్డ మచిలీపట్టణం ప్రజలు ఎప్పటిలాగే వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయున్నారు. తుఫాను గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదనిపించింది. ఆది నిజమేమో కూడా ! ప్రతి సంవత్సరం ఎదురయ్యే పరిస్థితి ఇది.
కోస్తాప్రజల జీవితాల్లో తుఫానులు, వరదలు వాటితో వచ్చే నష్టం కూడా ఒక భాగమైపోయాయి. ప్రజల బలహీనతలతో ఆడుకునే రాజకీయనాయకులకి, వాళ్ళను గుడ్డిగా అనుసరించే అమాయక ప్రజలకు సస్యశ్యామలంగా కనిపించే కోస్తాయే కనబడుతుంది. ప్రతి సంవత్సరం ఇలా రెక్కల కష్టం కొంత ప్రకృతి పాలబడితే, మరికొంత నాయకుల అండతో చక్రం తిప్పే దళారుల పాలవుతుంటే ఎవరు కాపాడుతున్నారు ? అమాయక ప్రజల మధ్య ప్రాంతీయ, కుల, మత బేధాలు రెచ్చగొట్టే నాయకులకు ఈ కష్టం ఏం అర్థమవుతుంది ? ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఏ ప్రాంతం పరిస్థితులు, కష్టాలు వారివి. ఒక ప్రాంతం పచ్చగా వుందని, మరొక ప్రాంతం ఎండిపోయిందని - ఒక ప్రాంతం ప్రజలు సుఖపడిపోతున్నారని, మరొక ప్రాంతం ప్రజలు కష్టపడిపోతున్నారని అనుకోవడం మన అజ్ఞానమే కానీ మరేదీ కాదని అప్పుడప్పుడు ఇలా ప్రకృతి మనకు గుర్తు చేస్తుంది.
ఇక ప్రస్తుతానికి వస్తే తీరం దాటిందో లేదో తేలని స్థితిలో రాబోయే విపత్తుని ఎదుర్కోవడానికి వేచి చూస్తున్న మాకు తీరం దాటిన విషయం మీద ఖచ్చితమైన వార్త సాయింత్రం ఆరుగంటల తర్వాత చేరింది. మరో గంట అక్కడే వుండి ఇక ఏ భయం లేదని తేలిన తర్వాత వెనుదిరిగాము. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిందనుకున్న ఈ రోజుల్లో కూడా ఈ సందిగ్ధత, పరస్పర విరుద్ధమైన ప్రకటనలు, అసలే అయోమయంలో వున్న ప్రజల్ని గందరగోళ పరిచే విధంగా ఎందుకున్నాయి అనే విషయం అర్థం కావడం లేదు.
1990 మే 9 వ తేదీ మచిలీపట్టణం దగ్గర తీరం దాటిన పెను తుఫాను కృష్ణా జిల్లాలో, విజయవాడ నగరంలో విధ్వంసం సృష్టించింది. అప్పుడు ఇప్పుడున్నంత పటిష్టమైన సమాచార వ్యవస్థ లేదు. తుఫాను పరిస్థితి తెలుసుకోవాలంటే రేడియో, దూరదర్శన్ మాత్రమే ఆధారం. అత్యాధునిక శాటిలైట్ వ్యవస్థ లాంటివేవీ లేని రోజులవి. ముందు రోజు వాతావరణ నివేదిక ప్రకారం చెప్పిన సమయానికి, ప్రదేశానికి కొంచెం అటూ, ఇటూగానే తీరం దాటడం జరిగేది. సెల్ ఫోన్ అంటే అసలే తెలీదు. నగరాలలోనే ఎస్టీడీ ఫోన్ బూత్ లు రెండు, మూడు కిలోమీటర్లకు ఒకటిగా ఉండేవి. తుఫానులో చిక్కుకున్న ప్రాంతాల్లో వున్న వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో హైదరాబాద్ గాంధీనగర్లో ఉండే మాకు దరఖాస్తు చేసి ఆరునెలలైనా ఫోన్ రాలేదు. దగ్గరగా ఉండే ఎస్టీడి బూత్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండేది. అక్కడ మామూలు రోజుల్లోనే టోకెన్ పధ్ధతి ఉండేది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాలా ? మన వంతు వచ్చినా సాంకేతికంగా ఇంత అభివృద్ధి లేకపోవడం, తుఫాను తాకిడి ప్రాంతాలలో కేబుల్స్ తెగిపోవడం లాంటి కారణాలవలన అంత సులువుగా కావాల్సిన నెంబర్ దొరికేది కాదు. ఆ సమయంలో ప్రైవేటు టెలిఫోన్ సంస్థల పోటీ లేదు. అయినా మన టెలిఫోన్ శాఖ తుఫాను సమాచారం తెలుసుకోవడానికి అప్పట్లో చక్కని అవకాశం కల్పించింది. తుఫాను తాకిడి ప్రాంతాలకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. అప్పట్లో ఇన్ని కస్టమర్ సర్వీసు కేంద్రాలు లేవు. మాకు దగ్గరలో చిక్కడపల్లిలో ఉండేది. అక్కడ మూడు ఫోన్లు కాబోలు ఉండేవి. ఈ సౌకర్యం గురించి తెలియగానే వెళ్ళడం వలన మాకు తేలిగ్గానే అవకాశం వచ్చింది. కాకపోతే షరా మామూలే ! లైన్లు దొరకడం కష్టమయ్యేది. ప్రయత్నించి, ప్రయత్నించి చాలాసేపటికి క్షేమ సమాచారాలు తెలుసుకోగలిగాం ! అయితే ఒకసారి సమాధానం రాకపోతే తర్వాత వారికి అవకాశమిచ్చి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించడం లాంటి స్వీయ నియంత్రణ పాటించడం వలన జనం ఎక్కువగా వచ్చినా అందరికీ అవకాశం దొరికేది.
ఎలక్ట్రానిక్ మీడియా కొన్ని సందర్భాల్లో ఉన్న విషయాన్ని పెద్దది చేసి చూపి ప్రజలను ఆందోళనకు గురిచేసిందా లేక వాళ్ళు అలా చెయ్యడం వలన ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతో ఉందా అంటే చెప్పడం కష్టం. దీంట్లో మంచి చెడులు నిర్ణయించే కంటే ప్రజలు కొంత ఆందోళన కలిగినా ప్రభుత్వపరంగా విపత్తు జరిగాక చేపట్టే సహాయ చర్యలకంటే ఎక్కువ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధపడే ప్రజలందర్నీ తమ ఏర్పాట్లతోను, ముందు జాగ్రత్త చర్యలతోనూ తృప్తి పరచడం సాధ్యం కాకపోయినా కోస్తా ప్రాంతమంతా సహాయ చర్యల్లో పాల్గొని నిజంగా భయపడినంత పెనుతుఫాను ముంచుకొచ్చినా ప్రాణనష్టం తగ్గించేందుకు నిద్రాహారాలు మాని కృషి చేసిన ప్రభుతోద్యోగులు అభినందనీయులు. ఈ మూడు రోజులు వారి కృషికి కరుణించిందేమో తుఫాను కూడా తలవోగ్గింది. ఒడ్డున కూర్చుని చెప్పడం చాలా సులువు. ముఖ్యంగా తీరప్రాంతంలో ప్రాణాలకు తెగించి ఎవర్నీ సముద్రంకేసి వెళ్ళనివ్వకుండా గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, ప్రమాద నివారణా విభాగ సిబ్బంది సేవలు నిరుపమానం. భయంగోల్పుతున్న కెరటాల అంచున వున్నది వాళ్ళే ! ఉపద్రవం వస్తే మొదట బలయ్యే అవకాశం వున్నది వాళ్ళకే ! అందుకే వారి సేవలకు జోహార్లు.
పెనుముప్పు జరగబోతోందని భయపెట్టి ప్రజలకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసి తీరం దాటకుండా, ఎక్కడ దాటుతుందో, అసలు దాటిందో లేదో అర్థం కాకుండా, దాటాక ఎటు మళ్ళుతొందో అర్థం కాక చాలాసేపు దోబూచులాడిన ఈ లైలా తుఫాను లీల ఇక్కడితో పూర్తయిందా ? మరో తుఫాను రూపంలో మళ్ళీ వస్తుందా ? చూడాలి.
Vol. No. 01 Pub. No. 293
2 comments:
ప్రభుత్వపరంగా విపత్తు జరిగాక చేపట్టే సహాయ చర్యలకంటే ఎక్కువ ముందు జాగ్రత్త తీసుకున్నట్లు కనిపించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధపడే ప్రజలందర్నీ తమ ఏర్పాట్లతోను, ముందు జాగ్రత్త చర్యలతోనూ తృప్తి పరచడం సాధ్యం కాకపోయినా కోస్తా ప్రాంతమంతా సహాయ చర్యల్లో పాల్గొని నిజంగా భయపడినంత పెనుతుఫాను ముంచుకొచ్చినా ప్రాణనష్టం తగ్గించేందుకు నిద్రాహారాలు మాని కృషి చేసిన ప్రభుతోద్యోగులు అభినందనీయులు.
i agree with this.........
వినయ్ గారూ !
ధన్యవాదాలు
Post a Comment