Saturday, May 8, 2010

ఫలరాజు ' పనస '

మృగాలన్నిటికీ రాజు సింహం 
ఫలాలన్నిటికీ రాజు   పనస 

పనసపండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే ! పనసపండులో ఉపయోగపడని భాగమంటూ లేదు. తొనల సంగతి చెబితే అందరికీ నోరూరుతుంది కదా ! గింజలతో కూర చేస్తారు. దుంప కూరల రుచికి ఏమాత్రం తీసిపోదు. తొనలు తీసేసాక మిగిలిన భాగాన్ని కొంతమంది పారేస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో వాటిని శుభ్రం చేసుకొని పులుసు లాగ పెట్టుకుంటారు. అది ఎంత రుచిగా ఉంటుందని !

ఇక పనస ఆకులలో ఔషధ గుణాలుంటాయంటారు. అందుకేనేమో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో వాటిని బుట్టలుగా అల్లి ' పోట్టెంకలు '  అని చేసుకుంటారు. సుభద్ర గారు వాటిని చేసే విధానం గురించి, రుచి గురించి తన బ్లాగు వాలుకొబ్బరిచెట్టు లో  సచిత్రంగా వివరంగా రాసారు.

సరే పనస చెక్క ఫర్నిచర్ తయారీకి, గృహనిర్మాణ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆది చాలా నాణ్యత కలిగి ఉంటుందంటారు. ముఖ్యగా చెదలు లాంటివి పట్టవని చెబుతారు.

ఇన్ని చెప్పి పనస పొట్టు గురించి చెప్పకపోతే ఫలరాజుకు ద్రోహం చేసినట్లే ! పచ్చిగా వున్న పనసకాయను తీసుకొని దాన్ని పొట్టుగా కొట్టే విధానం నుంచి దాంతో కూర చేసే విధానం దాకా అన్ని దశలలోనూ దాని ప్రత్యేకత దానిదే ! ఇప్పుడంటే మిక్సీలు వగైరా వచ్చేసి పని సులువు చేసాయి గానీ గతంలో పనసపొట్టు కొట్టడమంటే అదొక బృహత్కార్యము. పదును మీద వున్న పనసకాయను కోసి దాన్ని పైన ఉండే తొక్కను వలుస్తారు. అప్పుడు జిగురులాంటి పదార్ధం వస్తుంది. ఆది చేతులకు అంటకుండా నూనె రాసుకుంటారు. పొట్టు కొట్టడానికి ప్రత్యేకమైన కత్తి వుంటుంది. కాయకు మధ్యన పట్టుకోవడానికి వీలుగా పెద్ద మేకు గానీ, అట్లకాడ గానీ గుచ్చుతారు. దాన్ని పట్టుకుని కత్తితో సున్నితంగా కొడ్తూ వుంటారు. అలా సుమారుగా వున్న ఒక కాయ కొట్టడానికి సుమారు ఏడు, ఎనిమిది గంటల వరకూ సమయం పడుతుంది. ఒక్కోసారి ఇద్దరు కలసి చెరోవైపు రెండు కత్తులతో కొడతారు. అలా ఓపిగ్గా, సున్నితంగా కొడితే వచ్చే పొట్టు చాలా సన్నగా వుంటుంది. ఆ పొట్టును ఆవ పెట్టి కూర వండితే... ఆహా( !......ఏమి రుచి !

ఇప్పుడు వేసవి కాలం. పనసపండ్లు విరివిగా వచ్చేకాలం. పనస ఒకప్పుడు మనదేశానికే ప్రత్యేకం. విదేశాల వారు ఈ పండు ఆకారానికి, రుచికి తన్మయులై ఈ చెట్టును ( విత్తనాన్ని ) ఇక్కడినుంచి తరలించుకు పోయారని చరిత్ర. మన దేశంలో తూర్పు, పశ్చిమ కనుమల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోను ఈ చెట్లు కనబడతాయి. ఇది ఉష్ణమండల పంట అవడం వలన, దీని పెరుగుదలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి కనుక మన రాష్ట్రంలో ఇవి ఎక్కువగా కోస్తా ప్రాంతంలో పెరుగుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అందులోనూ డెల్టా ప్రాంతమైన కోనసీమ లోను మరీ ఎక్కువగా కనబడతాయి. సారవంతమైన నేల కావడం వలనో, గాలిలో తేమ బాగా వుండటం వలనో కోనసీమ పనస మరింత రుచిగా వుంటుంది.

పనసలో పోషక విలువలు అధికం. దీనిలో కెరోటిన్, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, పొటాషియం, విటమిన్ ' సి ' అధికంగా వుంటాయి. కొన్ని రకాల రుగ్మతలకు పనస మేలు చేస్తుంది. పూజలు, వ్రతాలలో పనస ప్రాధాన్యం చాలా వుంది. పనసపళ్లు దానాలివ్వడం, పూజా ద్రవ్యాలలో మామిడితో బాటు పనస ఆకులను ఉపయోగించడం జరుగుతుంటుంది. దక్షిణాది దేవాలయాల్లో పనస చెట్టుని స్థలవృక్షంగా భావించి పెంచడం కనిపిస్తుంది. కేరళ ప్రాంతంలో హోమాలు, యజ్ఞాలు చేసేటపుడు అగ్ని రగల్చడానికి ఎండు పనస కొమ్మలను రాపాడిస్తారు.

" పనసపండులాంటి బిడ్డను కను " అనే పెద్దల దీవెన ఆ పండుకున్న విశిష్టతలను బట్టే వచ్చివుంటుంది. అందుకే పళ్ళన్నిటిలో పనస రారాజు లాంటిది. అందుకే రాజా ఫలం ' పనస ' . ఈ వేసవిలో విరివిగా దొరికే ఈ ఫలరాజును ఒకసారి గుర్తు చేసుకుందామనిపించి.........         

Vol. No. 01 Pub. No. 284

11 comments:

కౌటిల్య said...

రావు గారూ...పనసపొట్టు ఎక్కడ దొరుకుతుందో విజయవాడలో కాస్త చెప్దురూ

Anonymous said...

మా నీరు తాగి ఇలాంటి పంటలన్నీ పండిస్తారు,ఆంద్రోల్లు
తెలంగానా తెలుగోడు

మాలతి said...

ఇక్కడ పనసతొనలు డబ్బా చూసి కొన్నాను. ప్రాణం ఉసూరుమంది తినబోతే. ఎండుగడ్డి నవిలినట్టే. అంతకంటె మీబొమ్మలు చూస్తే ఎక్కువ ఆనందంగా ఉంది.:)

Anonymous said...

Good one

~sUryuDu

SRRao said...

* కౌటిల్య గారూ !
విజయవాడలో నాకు తెలిసినంతవరకూ సత్యనారాయణపురం శివాలయం దగ్గరలో ఉదయాన్నే దొరుకుతుందంటారు. అప్పుడప్పుడు కాళేశ్వరరావు మార్కెట్లోను, రైతు బజార్లలోను కూడా దొరుకుతుంది.

* అజ్ఞాత గారు !
ఒక పంట పండించడానికి కావల్సింది నీటితోబాటు సారవంతమైన నేల, అనుకూల వాతావరణ పరిస్థితులులాంటి ఎన్నో కావాలి. అవి ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. దానికి ప్రాంతీయ బేధాలు తెలియవు. ఏ ప్రాంతంలో ఏవి ఉండాలో అవి ఉండేటట్లు చెయ్యడం ప్రకృతి లక్షణం.
మీరు అంటున్న ' మా నీళ్ళు ', మీది అనుకుంటున్న ' తెలంగాణా ' ప్రాంతంలో మాత్రం పుట్టలేదు. నీరు పల్లానికి ప్రవహించడం సహజ పరిణామం. దానికి అడ్డుకట్ట కట్టి ఆ నీటిని వినియోగించుకోవడం మన తెలివితేటల మీద ఆధారపడి వుంటుంది. అవి మితిమీరి రాజకీయాలు, స్వార్థం పులిమి ప్రకృతికి ఆగ్రహం తెప్పిస్తే జరిగే పరిణామం గత అక్టోబర్లో మనకి ప్రత్యక్షానుభవం. ప్రాంతీయ విద్వేషాల కంటే పరస్పర సహకారం మన జీవితాల్ని బాగుపరుస్తుంది. ఆలోచన చెయ్యండి.
మీరు నా బ్లాగులో వ్యాఖ్యనుంచే ముందు మీ పేరు తెలియజేసి మరీ రాయండి. అలాగే ప్రకృతిని, స్వశక్తిని నమ్మే నేను ఈ వాదాలకి, ఉద్యమాలకి ప్రస్తుతం దూరం. అనుభవజ్ఞుడిగా చెబుతున్నాను. ఇవి రాజకీయనాయకులకు, వ్యాపారులకు ఉపయోగిస్తాయి తప్ప సామాన్య ప్రజలకు కాదు.

* మాలతి గారూ !
మీరు మన దేశానికి వచ్చినపుడు నాకు తెలియజెయ్యండి. మీకు మంచి పనస తొనలు అందే ఏర్పాటు చేస్తాను. విజయవాడ వస్తే పనసపొట్టు కూరతో తప్పకుండా మా ఆతిథ్యం స్వీకరించాలి.

* సూర్యుడు గారూ !
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య said...

పనసపొట్టు ఆవకూర, పనస తొనలు అమోఘం :)

SRRao said...

సౌమ్య గారూ !
ధన్యవాదాలు

Hima bindu said...

మంచి సమాచారం ఇచ్చారు పనసపొట్టు కూర గురించి .అవునండి ఫలాల రాజు "మామిడి పండు " కదా !

SRRao said...

చిన్ని గారూ !
ధన్యవాదాలు. 'మామిడిపండు' ని కాదనను గానీ ఉపయోగంలో దానితో సమానం, ఆకారంలో దానికంటే పెద్దది కాబట్టి పనసకు కూడా ఆ హోదా ఇచ్చెయ్యొచ్చనుకుంటాను.

Unknown said...

అసలు పనసపొట్టు కూర వలన ఉపయోగం ఏంటి?
చాలామంది వాతం అంటున్నారు...కొంతమంది విపరీతమైన వేడి చేస్తుందని అంటున్నారు...

బుచికి said...

బుచికీ పెరుగుతుంది

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం