ఈరోజు రెండు తెలుగు కోకిలలు నింగికెగసిన రోజు
ఒకటి సుమధుర కవితా స్రవంతి
మరొకటి హాస్యరస సజీవ స్రవంతి
మన మనసున మల్లెల మాలలు పూయించింది ఓ కలం
బుడుగుతో మన మనసుల్ని కోతికొమ్మచ్చులాడించింది మరో కలం
ఓ కలం భావకవితావాహిని
మరో కలం భాషా విన్యాస ప్రవాహం
మూగవోయిన ఓ కోకిల పాట ఆగి మూడు దశాబ్దాలు దాటింది
మరో కోకిల స్వరం మూగవోయి సంవత్సరం గడిచింది
తెలుగు జాతికి నిండు గౌరవాన్ని అందించాయి ఆ రెండు కోకిలలు
తెలుగు భాషకు నిండుతనాన్ని పంచాయి ఆ రెండు కలాలు
ఒక కోకిల దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
మరో కలం ముళ్ళపూడి వెంకటరమణ
ఆ ఇద్దరి స్మృతికి నివాళులు అర్పిస్తూ..............
దేవులపల్లి వారి స్మృతికి నివాళిగా శ్రీ టి. వి.యస్. శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం ........................
తెలుగు కోకిల--శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు(నేడు వారి స్మృతి దినం)
ఒకటి సుమధుర కవితా స్రవంతి
మరొకటి హాస్యరస సజీవ స్రవంతి
మన మనసున మల్లెల మాలలు పూయించింది ఓ కలం
బుడుగుతో మన మనసుల్ని కోతికొమ్మచ్చులాడించింది మరో కలం
ఓ కలం భావకవితావాహిని
మరో కలం భాషా విన్యాస ప్రవాహం
మూగవోయిన ఓ కోకిల పాట ఆగి మూడు దశాబ్దాలు దాటింది
మరో కోకిల స్వరం మూగవోయి సంవత్సరం గడిచింది
తెలుగు జాతికి నిండు గౌరవాన్ని అందించాయి ఆ రెండు కోకిలలు
తెలుగు భాషకు నిండుతనాన్ని పంచాయి ఆ రెండు కలాలు
ఒక కోకిల దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
మరో కలం ముళ్ళపూడి వెంకటరమణ
ఆ ఇద్దరి స్మృతికి నివాళులు అర్పిస్తూ..............
దేవులపల్లి వారి స్మృతికి నివాళిగా శ్రీ టి. వి.యస్. శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం ........................
తెలుగు కోకిల--శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు(నేడు వారి స్మృతి దినం)
శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు ప్రముఖ తెలుగు
భావ కవి.భావ కవితా ప్రపంచానికి చక్రవర్తి.తన కవిత్వం లాగానే ఆయన కూడా చాలా
అందంగా వుండేవారు.బంగారు రంగు శరీరం,వెండి గిరజాలజుట్టు,చక్కని
పంచెకట్టు,శాలువను షోకుగా భుజాన వేసుకొని వస్తుంటే ,వారిని చూడటానికి వేయి
కళ్ళు చాలవు.ఆ రోజుల్లో యువ కవులు ఆయన కవిత్వాన్ని అనుకరించటంతో పాటు,వేష
భాషలను కూడా అనుకరించారని అనటంలో ఏ మాత్రం సందేహం అక్కర లేదు.కవులకు ఒక
వేషాన్నివారు నిర్దేశించక పోయినా,ఆయనలా వుంటేనే కవులుగా గుర్తించబడుతామనే
భావనతో కాబోలు,కవులు వారి భాష కన్నా వేషాన్నే ఎక్కువగా అనుకరించారు.
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి
గారు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే
గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించారు.కృష్ణశాస్త్రి గారు చిన్న వయసునుండే కవితలల్లటం ప్రారంభించారు.
విద్యాభ్యాసమంతా పిఠాపురం
హైస్కూలులో సాగింది.ఆ రోజుల్లో వీరికి కూచి నరసింహం,రఘుపతి వేంకట రత్నం
నాయుడు గార్లు ఉపాధ్యాయులుగా వుండేవారు.వారు కృష్ణ శాస్త్రి గారికి ఆంగ్ల
విద్యపై మక్కువ పెంచారు.
విజయనగరం లో డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు.. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు..
విజయనగరం లో డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు.. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు..
కృష్ణశాస్త్రిగారు ఒకపక్క సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూనే వ్యా వహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలలో తన అధ్యాపకవృత్తిని వదలి చురుకుగా పాల్గొన్నారు.
1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి
వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు
దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం వారి రచనలలో విషాదం అధికమయ్యింది.
తరువాత మళ్ళీ వివాహం చేసుకున్నారు.అటుపైన కొద్దికాలం పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా పని చేశారు.
కాని పిఠాపురం రాజుగారికి
కృష్ణశాస్త్రిగారి భావాలు నచ్చలేదు. స్వేచ్చాజీవి అయిన కృష్ణశాస్త్రిగారు
ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను
సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రచారుకునిగా ఆంద్ర దేశమంతా తిరిగి తన
కవితావాణిని,బాణిని తెలుగు ప్రజలకు వినిపించి చాలామంది యువకవులను ప్రభావితం
చేశారు. ఈ సమయంలో చాలామంది కవులతో పరిచయాలు
కలిగాయి,పెరిగాయి. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని
హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని
కులంనుండి వెలివేశారు. అయినా,కృష్ణశాస్త్రి గారు తన సంస్కరణాభిలాషను
వదలలేదు.వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు
జరిపించారు.. ఆ రోజుల్లోనే వారు "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు.1929లో
విశ్వకవి రవీంద్రనాధ ఠాగూర్ తో పరిచయం ఏర్పడింది.రవీంద్రుని ప్రభావం
వీరిమీద పడింది.ఆ ప్రభావంతో కొన్ని గీతాలు కూడా రచించారు.తిరిగి కొంత
కాలానికి కాకినాడ కాలేజీలో ఉపన్యాసకుడిగా కొనసాగారు.వీరి కవిత్వమంటే విపరీత అభిమానం గల కళాదర్శకుడు శ్రీ బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహంతో 1951 లో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు.ఆ సినిమాలోని పాటలు విశేష ఆదరణకు నోచుకోవటం వల్ల ఆ తరువాత అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. ఆకాశవాణిలో తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు.
గొప్ప
వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రిగారి
గొంతు 1963లో throat cancer వల్ల మూగవోయింది.ఆశ్చర్యమేమిటంటే మూ గవోయిన కోకిల పాటలు పాడటమే! పట్టుదలతో కవితా వ్యాసంగాన్ని కొన సాగించారు.చేతిలో చిన్నnote pad ,కలం ఎప్పుడూ ఉంటూ ఉండేవి.వారు మాట్లాడినంత
వేగంగా ఆ note pad మీద
వ్రాసి ,వ్రాతతోనే సంభాషించేవారు.గొంతు మూగవోయిందని బాధ పడేవారు
కాదు.అంతకు ముందు వ్రాసిన గీతాలకన్నా అతి మధురమైన గీతాలు వారు మూగవోయిన
తరువాత వ్రాశారు.మా పినతల్లిగారు శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి కోడలు.మా
పినతల్లి గారి వివాహం 1965 లో జరిగింది.అప్పుడు నా వయసు 15
సంవత్సరాలు.S.S.L.C.చదువుతున్నా ను.ఆ వివాహానికి ఎందరో కవులు హాజరు
అయ్యారు.రాయప్రోలు వారికి కృష్ణ శాస్త్రి గారు పరమ ఆప్తుడు.ఆ వివాహానికి
కృష్ణ శాస్త్రి గారు కూడా వచ్చారు.వారిని తనివి తీరా చూశాను.వ్రాతతో వారితో
సంభాషించాను.ఆ సందర్భంలో నేను యిలా వ్రాసి చూపించాను,'దేవులపల్లివి
నీవైతే,తెలదేవలపల్లిని నేను!' అని.మా ఇంటి పేరు తెలదేవలపల్లి. వారు
చమత్కారంగా యిలా దానిక్రిందనే వ్రాశారు,"నాకన్నా రెండాకులు(తెల) ఎక్కువ
చదివి అభివృద్ధిలోకి రావాలి!' అని ఆశీర్వదించిన సంఘటన నాకు యింకా గుర్తు
వుంది.వారికి ఒక కుమారుడున్నారు.వారి పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి
గారు .అయితే వారు'బుజ్జాయి' అనే పేరుతొ ప్రసిద్ధులు.గొప్ప చిత్రకారులు.వారు
కూడా దివంగతులయ్యారు. కృష్ణశాస్త్రి
గారి మేనకోడలు కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో
ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు.ఈ మధ్యనే ఆమె 90
సంవత్సరాల వయసులో గళంలో ఏమాత్రం మాధుర్యం తగ్గకుండా రవీంద్ర భారతిలో సంగీత
ప్రియులకు వీనుల విందు చేశారు.వారు పాడిన'మొక్కజొన్న తోటలో' పాట విశేష
ప్రజాదరణ పొందింది.
ఈ మహనీయునికి ఎన్నో సన్మానాలు జరిగాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.సాహితీ మాగాణంలో ఎన్నో పంటలు పండించిన ఈ కవి కృషీవలుడు,1980 ఫిబ్రవరి 24న 'వాణి'కి తన కవితలు వినిపించటానికి, ఈ దేహయాత్ర చాలించి 'బ్రహ్మ'లోకానికి యేగారు అంతే!
ఆయనకు మరణం ఏమిటి?వెన్నెల రాజు,కలుములరాణి,గోరువంకలు,గోరి ంటపొదలు,కోకిలలు ,ఆకులు ,పూలు,పులుగులు,మనసున మల్లెలు....వున్నంతకాలం ఆయన వుంటారు.ఆయన చిరంజీవి!
కృష్ణ శాస్త్రి గారి పైన ప్రముఖుల అభిప్రాయాలు.
చలం గారు---తన బాధంతా అంతా ప్రపంచపు బాధ అనుకుంటాడు కృష్ణశాస్త్రి,ప్రపంచపు బాధంతా తన బాధ అనుకుంటాడు శ్రీ శ్రీ .
మహాకవి శ్రీశ్రీ ---
నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు
కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో
సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద
ఉండేదికాదు.
కృష్ణ శాస్త్రి గారు చనిపోయిన రోజున శ్రీ శ్రీ గారు యిలా అన్నారు---తెలుగుదేశపు నిలువటద్దం బద్దలైంది.షెల్లీ మళ్ళీ మరణించాడు.
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు--- మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
వారి రచనల్లో కొన్ని.
కృష్ణపక్షము, ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి, అమృతవీణ,శర్మిష్ఠ,మహతి లాంటి పెక్కు ప్రసిద్ధ కావ్యాలను వ్రాశారు.
ఈ మధుర కవికి నీరాజనాలు సమర్పించుకుందాం!
ముళ్ళపూడి వారి రచనల గురించి మిత్రులు శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు అందించిన మరో ప్రముఖ రచయిత శ్రీ రమణ వివరణాత్మక ప్రసంగం...............
Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 121
5 comments:
1942లో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు.
కాదేమో.సరిచేయండి.
శ్యామ్
great tribute....love j
దేవులపల్లి కవిత్వం కలిగించే పులకింతలు
ముళ్ళపూడి హాస్యం తెగపెట్టే గిలిగింతలు
చెప్పనలవికాదు అనుభవించాలి తప్ప
ఇద్దరూ మహామహులే తమతమ రంగాలలో
చిరకాలం వుంటారు మన హృదయాంతరంగాలలో
గుర్తుచేసినదుకు ధన్యవాదాలు రావుగారు
ఒక సవరణ
విజ్ఞులైన శిరాకదంబం చదువరులకు చిన్నవిన్నపం.శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్మృత్యర్ధం,నేను వ్రాసిన వ్యాసంలో ఒక ముఖ్యమైన పొరపాటు దొర్లింది.మల్లేశ్వరి సినిమా 1951 లో విడుదల అయింది .పొరపాటున 1942 లో అని వ్రాశాను . పొరపాటును నా దృష్టికి తెచ్చిన శ్రీ శ్యాం గారికి కృతజ్ఞతలు.
భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి.
* శ్యామ్ గారూ !
శాస్త్రి గారు సరి చేశారు. గమనించే వుంటారు. మీ సూచనకు ధన్యవాదాలు.
* ధాత్రి గారూ !
* సూరి గారూ !
ధన్యవాదాలు
* శాస్త్రి గారూ !
మీ స్పందనకు ధన్యవాదాలు
Post a Comment