Friday, February 10, 2012

ఆగిన సుస్వరం


 తెలుగు చిత్ర సీమలో సుస్వరాలు పలికించిన సుసర్ల స్వరం ఆగింది. 
సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న సుసర్ల వంశాభరణం దక్షిణామూర్తి గారు. 
మరుపురాని, మరువలేని మధుర గీతాలను సృష్టించి తెలుగు చలనచిత్ర సంగీతాన్ని సుసంపన్నం చేసారు సుసర్ల.
నిన్న ఈ స్వరలోకాన్ని వదలి సురలోకానికి పయనమైన సంగీత కీర్తి... సుసర్ల దక్షిణామూర్తి గారి గురించి శ్రీ టి. వి. యస్. శాస్త్రి గారు ఘటించిన శ్రద్ధాంజలి................... 
శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి గారి మృతికి  సంతాపం, శ్రద్ధాంజలి !

తెలుగు సినిమా తొలితరం సంగీత దర్శకుడూ. గాయకుడు అయిన శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు గురువారం రాత్రి చెన్నైలోని తన కుమారుని ఇంటిలో తుదిశ్వాస విడిచారని తెలియచేయటానికి దు:ఖిస్తున్నాను. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ,వైద్యుడు వచ్చేలోపే మరణించారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కృష్ణా జిల్లాలోని, పెదకళ్ళేపల్లిలో వీరు 11-11-1921 న శ్రీమతి అన్నపూర్ణమ్మ, కృష్ణబ్రహ్మశాస్త్రి దంపతులకు  జన్మించారు. బాల్యం లోనే వీరు తన తాత గారైన శ్రీ దక్షిణామూర్తి గారి వద్దనే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు. చిన్నతనంలోనే వయోలిన్ కచేరీలు చేశారు. 1946 వ సంవత్సరంలో నారదనారది అనే సినిమా ద్వారా సినీప్రపంచానికి పరిచయమయ్యారు. శ్రీమతి సూర్యకాంతం గారి మొదటి సినిమా కూడా ఇదే ! 1950 లో విదులైన సంసారం సినిమా ద్వారా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాద్వారానే  సావిత్రి గారు పరిచయమయ్యారు. ఆ సినిమా యెంతో విజయవంతమయింది. అందులోని ప్రతి పాటా పండిత, పామరుల మన్ననలను పొందింది. 1955 లో విదులైన సంతానం సినిమా ద్వారా లతా మంగేష్కర్ ని 'నిదురపోరా తమ్ముడా'అనే పాట ద్వారా తెలుగు వారికి కూడా పరిచయం చేసిన ధన్యజీవులు శ్రీ దక్షిణా మూర్తి గారు ! 'అన్నపూర్ణ', 'నర్తనశాల,' శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' మొదలైన సినిమాలకు వీరు అందించిన పాటలు, నేటికీ తెలుగు వారి హృదయాలలో నిలిచిపోయాయి అని చెప్పటం లో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

(వారు సంగీతం సమకూర్చిన కొన్ని మధురమైన పాటలను, మీకు అందిస్తున్నాను)


                      ఆ మహనీయునికి నా శ్రద్ధాంజలి!
భవదీయుడు,
టీవీయస్ .శాస్త్రి
 సుసర్ల వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.................  

సుసర్ల గారి గురించి గతంలో శిరాకదంబంలో టపా -

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 116 

2 comments:

ఆ.సౌమ్య said...

అయ్యయ్యో...మరో ముత్యాన్ని కోల్పోవడం విచారకరం!
ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు సుసర్లవారు!

SRRao said...

ఆ. సౌమ్య గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం