Friday, November 18, 2011

' శకపురుష ' వేదాంతం

నృత్య కళామతల్లికి ప్రీతిపాత్రమైనది గ్రామం కృష్ణా జిల్లాలోని కూచిపూడి. ఆ గ్రామమే నాట్య సరస్వతీ నిలయం. అక్కడ నిత్యం నటరాజు తాండవం చేస్తుంటాడు. సిద్ధేంద్రయోగి కలలరూపం కూచిపూడి నాట్య సంప్రదాయం. అక్కడ ప్రతీ కుటుంబం ఆ నాట్య కళామతల్లి సేవలో తరిస్తుంటుంది.

తెలుగు వారి కళా వైభవానికి చిహ్నమైన ఆ కూచిపూడి గ్రామంలో నాట్యానికి అంకితమైన కుటుంబంలో వేదాంతం రామయ్య అన్నపూర్ణమ్మ దంపతులకు లభించిన నటరాజ ప్రసాదం  రాఘవయ్య. అయిదు సంవత్సరాల లేత వయసులో చింతా వెంకటరామయ్య గారి శిష్యరికం లభించింది. రాఘవయ్య గారికి నాట్యం మీద ఆసక్తి, అంకిత భావం కలిగించడానికి గురువు గారి పాత్ర ప్రధానమైనది.  దాంతో ఆయన ప్రతిభ బహుముఖాలుగా విస్తరించింది. నాట్యం, సంగీతం, నటనలతో బాటు తాళజ్ఞానం అపారంగా లభించింది. ఏడు సంవత్సరాల వయస్సులో ప్రహ్లాదుడిగా ఆరంగేట్రం చేసారు రాఘవయ్య. ఆ మొదటి ప్రయత్నమే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బంగారు పతకం సాధించి పెట్టింది. ఇది కూచిపూడి నాట్య  సువర్ణాధ్యాయానికి నాంది పలికింది. ఆయన లోహితాస్య, కుశలవులు లాంటి ఎన్నో  పాత్రలు పోషించారు. నాట్యానికి తగ్గ గానం ఆయనలోని విశిష్టత. ఇవన్నీ ఒక ఎత్తైతే చింతా వెంకటరామయ్య గారు తీర్చిదిద్దిన ఉషాకన్య పాత్ర రాఘవయ్య గారి కళాజీవితంలో మరో ఎత్తు. ఆ వేషం, అభినయం, గానం ఆయన కళా జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. అప్పటి నుంచి సీత, లీలావతి, చంద్రమతి, శశిరేఖా, మోహిని, సత్యభామ లాంటి స్త్రీ పాత్రల్లో ఆయన అందంగా ఒదిగిపోయారు.

తర్వాత కాలంలో రాఘవయ్య గారు కొందరు మిత్రుల సహకారంతో స్వంతంగా ప్రభాకర నాట్యమండలిని స్థాపించి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అందులో వెంపటి పెదసత్యం, పసుమర్తి కృష్ణమూర్తి లాంటి ప్రముఖులు సభ్యులుగా వుండేవారు. అప్పటివరకూ కూచిపూడి నాట్యంలో చిరకాలంగా వస్తున్న  కొన్ని మూఢ సంప్రదాయాలకు స్వస్తి పలికి ఆధునికతను జొప్పించి ప్రశంసలందుకున్నారు రాఘవయ్య. సుమారు పద్దెనిమిదేళ్ళ పాటు తన కళా వైశిష్ట్యాన్ని ప్రజలకు పంచారు. ఈ కాలాన్ని రాఘవయ్య యుగంగా చరిత్రకారులు వర్ణించారు. రాఘవయ్య గారి శ్లోకాభినయానికి, పదాభినయానికి ఆనాటి మేధావుల ప్రశంసలు లభించాయి. హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు గారి చేతుల మీదుగా శకపురుష బిరుదునందుకున్నారు రాఘవయ్య .

తెలుగు సినిమా మొదలైన దశాబ్దంలోనే వేదాంతం రాఘవయ్య గారి తెరంగేట్రం కూడా జరిగింది. 1932  లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గార్ల సమక్షంలో మద్రాసులో జరిగిన నాట్య కళాపరిషత్తు లో రాఘవయ్య గారి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు గూడవల్లి రామబ్రహ్మం గారు. నాగేశ్వరరావు పంతులుగారు ఆ ప్రదర్శనకు ముగ్ధులై రాఘవయ్యగారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యాల్సిందిగా రామబ్రహ్మం గారికి సూచించారు. అయితే దీనికి గురువుగారి అనుమతి లభించలేదు రాఘవయ్యగారికి. అయినా పలువురి ప్రోత్సాహంతో ' మోహిని రుక్మాంగద ' చిత్రంలో నాట్యం చేసారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. దాంతో నిరుత్సాహపడినా రామబ్రహ్మం గారి ప్రోత్సాహంతో ' రైతుబిడ్డ ' చిత్రంలో చేసిన దశావతారాలు నృత్యం ఆయనకి చిత్రసీమలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ పిమ్మట గరుడ గర్వభంగం, పంతులమ్మ, స్వర్గసీమ, సీతారామజననం, త్యాగయ్య, యోగి వేమన లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు నృత్యదర్శకత్వం వహించారు.

రాఘవయ్య గారిలోని సృజనాత్మకత, ప్రతిభ, తపన నృత్య దర్శకత్వంతో తృప్తి పడలేదు. ఫలితంగా మిత్రులు డి. ఎల్. నారాయణ, సముద్రాల, సుబ్బరాయన్ గార్ల సహకారంతో  వినోదా పిక్చర్స్ వెలసింది. మొదటి చిత్రంగా ' స్త్రీ సాహసం ' విడుదలయింది. రెండవ చిత్రంగా శరత్ బాబు నవలను అద్భుత దృశ్య కావ్యంగా మలచిన చిత్రం ' దేవదాసు ' రాఘవయ్య గారి ప్రతిభను లోకానికి చాటింది. ఆ తర్వాత తెలుగు తెర దృశ్య కావ్యాలు అనదగ్గ ' అనార్కలి ', ' చిరంజీవులు ', ' భలేరాముడు ',  ' సువర్ణ సుందరి ', ' బాలనాగమ్మ ', ' ఋణానుబంధం ', ' ఆడబ్రతుకు ', ' రహస్యం ', ' సతీ సక్కుబాయి ', ' సప్తస్వరాలు ' లాంటి ఎన్నో చిత్రాలను అందించారు రాఘవయ్య.

బహుముఖ ప్రజ్ఞాశాలి వేదాంతం రాఘవయ్య గారి వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలు సమర్పిస్తూ......


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 077

2 comments:

ShasiKala Rao said...

మధరమైన జ్ఞాపకాల జల్లిడ
మన .... " శిరా కదంబం"

SRRao said...

శశికళ గారూ !
మీ అభిమానానికి ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం