మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.
ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.
అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.
ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !
ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?
అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !
పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !
ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు ) వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.
అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !
నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.
Vol. No. 02 Pub. No. 045