Thursday, August 4, 2011

' శాస్త్రీయ ' రచయిత

శాస్త్రానికి, సాహిత్యానికి మధ్య కొంత అంతరం కనబడుతుంది. శాస్త్రకారులు సాహిత్యం జోలికి ఎక్కువగా వెళ్లరు. వెళ్ళినా అందులో తమ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించరు. తమకు తెల్సిన శాస్త్రాన్ని అక్కడక్కడ అవసరానికి వాడుకున్నా, శాస్త్రాన్నే విషయంగా తీసుకుని రచనలు చెయ్యరు. అందులోను తెలుగులో శాస్త్రీయ అంశాల నేపథ్యంలో రచనలు ఎక్కువగా కనిపించవు. కొంతమంది చేసినా అవి పాఠ్య పుస్తకాల కోవలోనే ఉంటాయిగానీ, సాధారణ పాఠకులకి ఆసక్తి కలిగించవు. అయితే అక్కడక్కడా శాస్త్ర విశేషాలని అందరికీ ఆసక్తి కలిగించేలా మలచి రచనలు చేసేవారు మనకి కనిపిస్తారు. అలాంటివారిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన రచయిత మహీధర నళినీమోహన్ రావు గారు .

పండితోత్తములకు ప్రసిద్ధి కోనసీమలోని ముంగండ గ్రామం. మొగల్ పాదుషాల ఆస్థానంలో ప్రముఖుడిగా సత్కారాలు పొందిన జగన్నాథ పండితరాయలు పుట్టిన ఊరు ముంగండ అగ్రహారం. వేద పారాయణంతో, సాహితీ వ్యాసంగంతో నిండిన ఆ ఊళ్ళో ఓ పండిత కుటుంబానికి చెందినవారు మహీధర రామమోహన్ రావు గారు. చాందస భావాలు అధికంగా గల సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఆ చాందస భావాలను, కట్టుబాట్లను కాదని కమ్యూనిస్ట్ , సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ప్రజాశక్తి, విశాలాంద్ర పత్రికలలో పనిచేసారు. అభ్యుదయ భావాలతో ఎన్నో రచనలు చేసారు. ఆయన కుమారుడే నళినీ మోహన్ రావు గారు.

భౌతిక శాస్త్రవేత్తగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన శాస్త్రీయ విషయాలతో చాలా పుస్తకాలు రాసారు. మామూలు పాఠకుడిని కూడా అవి ఆసక్తితో చదివిస్తాయి. అవి ఓ కథ చదువుతున్నట్లో, ఓ నవల చదువుతున్నట్లో వుంటాయి తప్ప పాఠం చదువుతున్నట్లు వుండవు.  శాస్త్రీయ పరిజ్ఞాన్ని పెంచుకోవడానికి అవి బాగా ఉపకరించేవి. ఆయన పుస్తకాలలో లాగే ఆయన ఉపన్యాస శైలి కూడా.... ఓ మిత్రుడు మన ముందు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతున్నట్లు ఉండేది.

1974 - 75 ప్రాంతాలలో అని గుర్తు. నేను ఇంటర్ చదువుతున్న రోజులని మాత్రం బాగా గుర్తుంది. సందర్భం గుర్తులేదు గానీ ఓ సారి ఆయనకు మా ఊళ్ళో సన్మానం జరిగింది. ఆ సభలో ఆయన కొన్ని సైన్సు సంగతులను చెప్పిన తీరు నన్నే కాదు అందర్నీ ఆకట్టుకుంది. అప్పటికి సైన్సు విద్యార్థిని కనుకనో, అప్పటికే పత్రికలలో ఆయన వ్యాసాలూ, కొన్ని పుస్తకాలు చదివి వుండడం వల్లనో నాకు మాత్రం బాగానే అర్థమయినట్లు అనిపించింది. సభ ముగిసిన తర్వాత సైన్సు అంటే భయపడే కొందరు మిత్రులతో సహా అందరూ ఆ విశేషాలే ముచ్చటించుకోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే అంతరిక్ష పరిశోధనలు జరుగుతున్నా ఆ విశేషాలు ఇంకా అందరికీ అవగాహనలోకి రాలేదు. ఆయన ఆ విశేషాలను వివరిస్తుంటే అందరూ ఎంతో ఆసక్తితో విన్నారు. అదీ నళినీ మోహన్ రావు గారి ప్రతిభ. పండితులకు కూడా క్లిష్టంగా కనిపించే శాస్త్రీయ విశేషాలను అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా మలచడంలో దిట్ట నళినీమోహన్ రావు గారు. ఇంతకంటే ఎక్కువగా వివరాలు గుర్తు లేవు.

ఇక ఆయన రచనల విషయానికి వస్తే... వాటి గురించి ప్రముఖ బ్లాగర్ వి. బి. సౌమ్య గారు 2007 లో అంతర్జాల పత్రిక ' పొద్దు ' లో రాసిన వ్యాసంలో చక్కగా వివరించారు. ఆ వ్యాసాన్ని ఈ క్రింది లింక్ లో చదవండి.  


మహీధర నళినీ మోహన్ రావు గారి పుస్తకాలన్నీ పిల్లలకోసం అన్నట్లుగా వున్నా సైన్సు తో అంతగా పరిచయం లేని వారిని కూడా ఆసక్తితో చదివిస్తాయి.

 ' శాస్త్రీయ ' రచయిత మహీధర నళినీ మోహన్ రావు గారి జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....  

Vol. No. 02 Pub. No. 304

Wednesday, August 3, 2011

కళాభినేత్రి


నెల్లూరు నెరజాణ రత్నకుమారి...
చెన్నై చేరి...  రక్తకన్నీరుతో రంగస్థలం ఎక్కి...

చిల్లరకొట్టు చిట్టెమ్మగా ప్రసిద్ధి చెంది...
కన్నడ చిత్రంలో కథానాయికగా రంగప్రవేశం చేసి...

బంగారు తిమ్మరాజులో హాస్యం పండించి...
కనకదుర్గ పూజా మహిమలో సాత్విక పాత్ర పోషించి...

ఎస్వీయార్ చేత వాణిశ్రీగా పేరు మార్పించుకుని...
పద్మిని, సావిత్రి, జీవరలక్ష్మిలను ఆదర్శంగా పెట్టుకుని...

సుఖదుఃఖాలు, మరుపురాని కథతో మరుపురాని నటిగా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్ర్పరచుకుంది.  

చిన్నప్పట్నుంచీ సావిత్రిని అభిమానించిన వాణిశ్రీ... మరుపురాని కథ తమిళంలో సావిత్రి చేసిన పాత్రను తెలుగులో చేసి తన భవిష్యత్తుకు బాట వేసుకున్నారు. తొలిరోజుల్లో చిన్న హీరోలతో నటించినా, తర్వాత నాగేశ్వరరావు గారితో ఆత్మీయులు, రామారావు గారితో నిండుహృదయాలు చిత్రాల్లో తొలిసారిగా కథానాయికగా నటించారు.

సావిత్రికి వారసురాలిగా చెప్పుకునే వాణిశ్రీ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయంతో డెబ్భైల ప్రారంభంలో తనదైన ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు.

వాణిశ్రీ చీర కట్టు...
వాణిశ్రీ హెయిర్ స్టైల్...
వాణిశ్రీ మేచింగ్...
వాణిశ్రీ నడక...

... ఇలా తనకంటూ కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వాణిశ్రీ ధరించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే కథానాయిక ధరించలేదేమో ! బంగారు తిమ్మరాజు లాంటి చిత్రాల్లో హాస్యరస పాత్రలు, మరపురాని కథ.. సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో చెల్లెలుగా, ఇద్దరు అమ్మాయిలు.. గంగ మంగ లాంటి చిత్రాల్లో విభిన్న మనస్తత్వాల గల రెండేసి పాత్రలు, కథానాయిక మొల్ల లాంటి చారిత్రక పాత్రలు, వినాయక విజయం...సతీసావిత్రి లాంటి చిత్రాల్లో పౌరాణిక పాత్రలు, జీవనజ్యోతి..కృష్ణవేణి లాంటి చిత్రాల్లో మానసిక సంఘర్షణతో కూడిన పాత్రలు.... ఇలా ఎన్నో రకాల పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసారు. వీటిలో చాలావరకూ గ్లామర్ తో కూడినవే ! అసలు ఏమాత్రం గ్లామర్ కు అవకాశం లేని పాత్రలను గోరంత దీపం, అనుగ్రహం చిత్రాల్లో ధరించి గ్లామర్ మాత్రమే కాదు, పాత్రే ముఖ్యమని నిరూపించుకున్నారు.  

తొలిరోజుల్లో హాస్యనటుల ప్రక్కన, చంద్రమోహన్ లాంటి చిన్న హీరోల ప్రక్కన నటించిన వాణిశ్రీ రామారావు, నాగేశ్వరరావు లాంటి అగ్రతారలతో... కృష్ణ, శోభన్ బాబు లాంటి తర్వాత తరం తారలతో... రంగనాథ్, శ్రీధర్, రామకృష్ణ లాంటి చిన్న తారలతో కూడా తరతమ బేధాలు లేకుండా నటించింది.

వాణిశ్రీ కున్న మరో ప్రత్యేకత నవలా నాయికా గుర్తింపు.  ప్రేమనగర్, జీవనతరంగాలు, చక్రవాకం, సెక్రటరీ, విచిత్రబంధం ( విజేత ) .... ఇలా నవలల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో వాణిశ్రీయే కథానాయిక.  

తెలుగుతో బాటు తమిళంలో దాదాపు ఎనభై చిత్రాల్లో, కన్నడంలో సుమారు ముఫ్ఫై చిత్రాల్లో, మలయాళంలో రెండు చిత్రాల్లో నటించారు వాణిశ్రీ. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక శకాన్ని ఏర్పరచుకున్నారు వాణిశ్రీ.

అగ్రకథానాయికగా వెలుగొందుతున్న రోజుల్లో తీరిక సమయాలు, తనదైన జీవితం కోల్పోయిన వాణిశ్రీ... తనకంటూ వ్యక్తిగత జీవితం కావాలని కోరుకుని డా. కరుణాకరన్ ని వివాహమాడారు. కొంతకాలం సంతృప్తిగా కుటుంబ జీవితం గడిపిన వాణిశ్రీ... పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ తన నటనా ప్రతిభను వెలికి తీసారు. కొన్ని చిత్రాల్లో నటించారు.... నటిస్తున్నారు.

 కళాభినేత్రి వాణిశ్రీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ...... 






Vol. No. 02 Pub. No. 303

Tuesday, August 2, 2011

ఆధునిక నాటకరంగ రూపశిల్పి

తెలుగునాట సినిమాల ప్రవేశానికి ముందు, ప్రవేశించిన తొలిరోజుల్లో నాటకరంగం ఓ వెలుగు వెలిగింది. అనేకమంది నటీనటులు రంగస్థలాన్ని సుసంపన్నం చేసారు. ఆధునిక నాటక ఆవిర్భావానికి నాంది పలికారు. వారిలో పందొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్థంలో, ఇరవై వ శతాబ్దం పూర్వార్థంలో నాటక కళామతల్లికి ఎనలేని సేవలందించిన నటరత్నం బళ్ళారి రాఘవ. 

ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే అంగ సౌష్టవం, ఏ సంభాషణనైనా భావయుక్తంగా పలకగలిగే స్వరం, పాత్రల భావ ప్రకటనను ప్రస్ఫుటంగా ప్రతిఫలించే వదనం ఆయన సొత్తు. సుదీర్ఘమైన సంభాషణలతో, రాగమే ప్రథానంగా గల పద్యాలతో సాగే సాంప్రదాయ నాటకాలను క్లుప్తమైన సంభాషణలతో, రాగం కంటే హావభావ ప్రకటనకు ప్రాథాన్యతను ఇచ్చే విధంగా తీర్చిదిద్దడానికి కృషి చేసారు. స్త్రీ పాత్రలను పురుషులే ధరించే పద్ధతికి స్వస్తి చెప్పి స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించేటట్లు చెయ్యడానికి నాంది పలికారు. ఆయన కాలంలో ఎందఱో నటీమణులు తెలుగు నాటక రంగానికి లభించారు. 

తెలుగులోనే కాక కన్నడం, హిందీ భాషలతోబాటు ఆంగ్ల భాషలో కూడా నాటకాలు ప్రదర్శించారు బళ్ళారి రాఘవ. 
తన యావజ్జీవితాన్ని కళామతల్లి సేవలకే అంకితం చేసిన కళాకారుడు రాఘవ. వృత్తి రీత్యా న్యాయవాది అయినా నటుడిగానే జీవితంలో ఎక్కువ సంతృప్తి చెందారు. అంతేకాదు సంఘసేవకుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధునిక నాటకరంగాన్ని మలచిన శిల్పి బళ్ళారి రాఘవ.

 1880 లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించిన తాడిపత్రి రాఘవాచార్యులు గారి జయంతి సందర్భంగా ఆయనకు కళానీరాజనాలు సమర్పిస్తూ..... 


బళ్ళారి రాఘవ గారి గురించి గతంలో రాసిన టపాలు..... 

నటరత్నం ' బళ్ళారి రాఘవ '

శిధిల శిల్పం

సమయ స్పూర్తి


Vol. No. 02 Pub. No. 302
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం