Tuesday, August 2, 2011

తెలుగు వజ్రం

 వినువీధుల్లో ఎగురుతోంది మువ్వన్నెల జెండా 
తెలుగు వాడి ఆత్మ నిండి వుంది ఆ జెండా నిండా 

భరత జాతి గౌరవానికి సంకేతం జాతీయ పతాకం  
సృష్టించిన తెలుగు వాణ్ని గౌరవించుకోలేని దౌర్భాగ్యం       

జాతీయ పతాక రెపరెపల్లో నిండి వున్నాడు పింగళి వెంకయ్య 
జాతినంతటినీ ఆ జెండాకి వందనాలు చేయించిన ఘనుడయ్యా 

అయిదేళ్ళ జీవితాన్ని ధారబోసి సృష్టించాడా పతాకాన్ని 
దేశసేవకు నిస్వార్థంగా అంకితమిచ్చాడు తన జీవితాన్ని 

కీర్తి కనకాలకోసం ప్రాకులాడేవారికి ఈ త్యాగం అర్థం కాదు  
స్వార్థపరుల నిఘంటువులో దేశభక్తి అనే మాటకు అర్థమే లేదు 

ఆయనేమైనా గద్దెనెక్కాడా ?... కోట్లు వెనకేసాడా ? 
మూడు రంగులేసి ఓ జెండా తయారుచేసాడు 

ఆయనేమైనా కోటలు కట్టాడా ?... కోతలు కోసాడా ? 
ఉన్న ఇల్లు కూలిపోయి పేదరికంలో మగ్గాడు 

భూగర్భ శాస్త్రం చదివి రాళ్ళలో వజ్రాలను వెదికాడు 
తన కుటుంబానికి మాత్రం వట్టి రాళ్ళనే మిగిల్చాడు  

పరిశోధనలు చేసి రైతులకు తెల్ల బంగారం కంబోడియా పత్తిని అందించాడు 
బంగారం కాదు గానీ పత్తి వెంకయ్యగా పేరు మాత్రం మిగుల్చుకున్నాడు   

భరతజాతికి గుర్తునిచ్చిన తెలుగు వాడికి  
 నిర్మించలేదు ఓ స్మృతి చిహ్నం ఈనాటికీ  

భారతీయులుగా జెండాను గౌరవించడం మన కర్తవ్యం
తెలుగువారిగా వెంకయ్యను గౌరవించడం మన బాధ్యత


 భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతి  
    సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తూ......                

మన జాతీయ పతాకం రూపొందిన క్రమం గురించి రాసిన టపా... 

మన పతాక ప్రస్థానం




Vol. No. 02 Pub. No. 301

Monday, August 1, 2011

భాషామతల్లి ఔన్నత్యం

భారతీయ భాషలు, సాహిత్యం విశిష్టమైనవి. అందులో మనదైన తెలుగు భాషలో సాహిత్యం అనేక పోకడలు పోయింది. అనేక విన్యాసాలు చేసింది. భాషను, సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన, చేస్తున్న సాహితీస్రష్టలేందరో మనకి వున్నారు. అందుకే మనదైన భాషను  సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది. 


తెలుగు సాహిత్యంలో ద్వర్థి కావ్యం అనేది ఓ విచిత్రమైన ప్రక్రియ. అందులో అష్టదిగ్గజాలలో ఒకరైన పింగళి సూరన రచన ' రాఘవ పాండవీయం ' ప్రముఖమైనది. ఒకే పద్యంలో రామాయణ, భారత అర్థాలు వచ్చేటట్లు రెండు అర్థాలతో రచించడం ఆ కావ్య ప్రత్యేకత. 

దీనిపైన క్లిక్ చెయ్యండి 
భారతీయ భాషలన్నిటికీ మూలమైన భాష, తల్లి భాష సంస్కృతం.  ప్రపంచంలోని కొన్ని భాషల్లో కూడా సంస్కృత మూలాలు ఉన్నాయంటారు. అంతులేని సాహితీ సంపద సంస్కృతంలో వుంది. ఇటీవల ఆధునిక సూపర్ కంప్యూటర్లకు అత్యంత అనువైన భాషగా నాసా గుర్తించిందట. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో సంస్కృతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. సంస్కృతం భాషకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారత దేశంలో పుట్టిన మనందరం మళ్ళీ ఆ భాష వికాసానికి కృషి చేస్తే బాగుంటుంది. కనీసం ఇలాంటి విశేషాలను అందరికీ తెలియజేసి ఆ భాష గొప్పతనాన్ని తద్వారా భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి.  

సంస్కృతంలో పద్నాలుగవ శతాబ్దానికి చెందిన దైవజ్ఞ సూర్య పండితుడు అనే కవి రామకృష్ణ విలోమ కావ్యం వ్రాసారు. ఇందులో పద్యాన్ని మామూలుగా మొదటినుంచి చివరకు చదివితే రామాయణార్థం, తిరగేసి అంటే చివరినుంచి మొదటికి చదివితే భారతార్థం వస్తుంది. ఈ కావ్య పరిచయాన్ని పేస్ బుక్ లో మిత్రులు శ్రీ మణికంఠ ప్రసాద్  గారు అందించారు. దాన్ని ఇక్కడ అందిస్తున్నాను.


అలాగే రామకృష్ణ విలోమ కావ్యం లింక్ కూడా ఆయన అందించారు. అయితే ఇది పూర్తి పాఠం కాకపోవచ్చు. ఆ లింక్ .................. 



Vol. No. 02 Pub. No. 300

తిలక్ ద్వయం

 లోకమాన్యుడు 

" స్వరాజ్యం నా జన్మహక్కు "

అని నినదించి భారతజాతి దాస్య శృంఖలాల విముక్తికి శంఖారావం పూరించిన లోకమాన్యుడు బాల గంగాధర తిలక్. ' భారతదేశ అశాంతికి పితామహుడు ' గా బ్రిటిష్ వారిచే పిలువబడిన తిలక్ వృత్తి రీత్యా ఉపాథ్యాయుడు... ప్రవృత్తి రీత్యా జాతీయవాది, సంఘసంస్కర్త. భారత స్వాత్రంత్ర్య సమర ప్రారంభ దినాల్లో ముందు నిలిచి పోరాడిన నాయకుడు తిలక్.

 కాంగ్రెస్ లో తిలక్ అతివాదిగా పేరుబడ్డారు.  ఆడపిల్లలకు పది, పన్నెండేళ్ళ మధ్య వివాహం జరపాలని వుద్ద్యేశించిన బిల్లును కాంగ్రెస్ లోని మితవాదులంతా సమర్ధించగా తిలక్ మాత్రం వ్యతిరేకించారు. ఇది ఆయనలోని మితవాదానికి గుర్తు మాత్రమే కాదు... ఆయనలోని సంఘ సంస్కర్త కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తాడు. సామాజిక సమస్యల పట్ల ఆయన ఎంతగా స్పందించేవారో చెప్పడానికి 1896 - 97 సంవత్సరాలలో బొంబాయి, పూనే లను కుదిపివేసిన ప్లేగ్ మహమ్మారికి గురైన వ్యాధిగ్రస్తులపై బ్రిటిష్ అధికారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ' కేసరి ' పత్రికలో తన రచనల ద్వారా పోరాడారు.

తిలక్ దృష్టిలో దైనందిక జీవనం, మతం వేర్వేరు కాదు " సన్యాసం స్వీకరించడమంటే జీవితాన్ని త్యజించడం కాదు. మనకు స్వంతమనే ఆలోచన లేకుండా వసుధైక కుటుంబమనే భావన కలిగి వుండాలి. మొదట మానవసేవ, తర్వాత మాధవసేవ చెయ్యాలి " అనేవారు. అప్పటివరకూ ఇళ్ల వరకే పరిమితమైన వినాయకచవితి పండుగను సర్వజన ఉత్సవంగా తీర్చిదిద్దిన ఘనత బాల గంగాధర తిలక్ దే ! అలాగే ఛత్రపతి శివాజీ జయంతుత్సవాలను కూడా సామాజికోత్సవాలుగా మార్చారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించడానికి హింసతో సహా అవకాశమున్న అన్ని మార్గాలను ఉపయోగించాలని నమ్మేవారు. గాంధీ లోని నాయకత్వ లక్షణాలను కనిపెట్టి ఆయనను అహింసా సిద్ధాంతం నుంచి మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. స్వాతంత్ర్య సమర పథ నిర్దేశకుడిగా తిలక్ మీద గాంధీ గారికి గురుభావం వున్నా ఈ విషయంలో మాత్రం తన మనసు మార్చుకోలేదు.

భారతదేశ జాతీయ భాషగా దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీని గుర్తించాలని ప్రతిపాదించిన తొలి కాంగ్రెస్ నాయకుడు తిలక్.

 లోకమాన్య బాల గంగాధర తిలక్ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.... 




అమృతం కురిపించిన తిలక్ 


తెలుగు సాహితీ చరిత్రలో విశిష్ట స్థానం పొందిన కవి, రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్. సాహితీ వనంలో రాత్రి పూట అమృతం కురిపించిన తిలక్ తెలుగు సాహితీ ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. పదహారేళ్ళకే కవిత్వం  రాయడం ప్రారంభించి తన 24 యేట ప్రభాతము - సంధ్య అనే కవితాసంపుటి వెలువరించారు.      

వచన కవిత్వంలో ఉన్నత విలువలు గల రచయితగా తిలక్ పేరు తెచ్చుకున్నా ఆయన రాసిన కథలు కూడా తెలుగు పాఠకులను అంతగానూ  అలరించాయి. ' అమృతం కురిసిన రాత్రి ' కి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారం అందుకున్నారు. తెలుగు సాహితీ చరిత్రలో అమృతం కురిసిన రాత్రి ఒక మైలురాయి.



 తన రచనలతో అమృతం కురిపించిన దేవరకొండ బాలగంగాధర తిలక్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ....  

తిలక్ గారి రచనలకు ఆకాశవాణి వారి స్పందన గురించి గతంలో రాసిన టపా......

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?


2008 లొ జరిగిన తిలక్ సాహితీ సమాలోచనం కార్యక్రమ విశేషాలు, ఆ సందర్భంగా ఆలపించిన తిలక్ గీతాలు డా. నాగభైరు అప్పారావు గారి యుట్యూబ్ ఛానల్ ద్వారా..... 









Vol. No. 02 Pub. No. 299
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం