Monday, August 16, 2010

మేకప్ గొప్పా......???

 మేకప్ మహత్యమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనాకారిని అందంగా మలచవచ్చు. అందంగా ఉన్నవారిని కురూపిగా చూపించవచ్చు.

అలాగే సన్నివేశంలోని భావప్రకటనకు అనుగుణంగా ముఖకవళికల్ని మార్చవచ్చు. ఈ విషయం మనతో బాటు ఒకప్పటి హాస్యనటుడు సీతారాం కూడా ఒప్పుకుంటాడు. ఓసారి ఆయన తన ముందు తరంలోని మేకప్ కళాకారుడు హరిబాబుని తలుచుకుంటూ.....

" ఆ రోజుల్లో హరిబాబు ఎంత అద్భుతంగా మేకప్ చేసేవారంటే, చిరునవ్వులు చిందే ముఖాన్ని అరగంటలో దుఃఖరసం ఉట్టి పడేటట్లు మలచేవారు " అన్నాడు.

అంతే ! ఆ ప్రక్కనే వున్న చాయాదేవి వెంటనే అందుకుని .............

" అదో గొప్పా ! ఒక్క మొట్టికాయతో అర సెకండ్ లో నేనా పని చెయ్యగలను " అందట.    

Vol. No. 02 Pub. No. 004

తెలుగు జాతి స్వరం - ప్రభంజనం



 జాతీయ సంగీత వేదిక  ఇండియన్ ఐడల్
ఆ వేదిక మీద నినదించిన తెలుగు స్వరం శ్రీరామచంద్ర

ప్రతిభకు ఎల్లలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు
అని చాటిన తెలుగు జాతి స్వరం శ్రీరామచంద్ర

భాషా, ప్రాంతీయ వివక్షతను చేధించిన స్వరమది
యావత్ భారత జాతిని పులకింపజేసిన గళమది

ఈ ఘనత శ్రీరామచంద్రది మాత్రమే కాదు
ఈ గౌరవం యావత్ తెలుగు జాతిది

తెలుగు జాతికి అతడు సాధించి పెట్టిన కీర్తి
తెలుగు జాతిని అతడు ఎక్కించిన అందలాలు
మరువలేనివి మరపురానివి

తనకీ ఘనకీర్తిని తెచ్చిన తెలుగు గడ్డను
తనకు అండగా నిలిచిన తెలుగు జాతిని
అతడెన్నడూ మరువరాదు

శ్రీరామచంద్ర గానం మరిన్ని శిఖరాలు అధిరోహించాలి 
తెలుగు జాతి స్వరాన్ని హిమాలయాల ఎత్తుకి  చేర్చాలి  

శ్రీరామచంద్రకు అభినందనలతో ........................

Vol. No. 02 Pub. No. 003

Sunday, August 15, 2010

స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి


 పరతంత్ర పాలనలో మగ్గిన భారతజాతి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుని 63 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎన్నెన్నో పంథాలు, పోరాటాలు, విధానాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు.......
వెరసి పరాయి పాలకుల పలాయనం, స్వతంత్ర్య బారతదేశ ఆవిర్భావం


 
స్వాతంత్ర్యోద్యమం కేవలం పరాయిపాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదు
మన హక్కులు, మన సంపద, మన సంస్కృతి కాపాడుకోవడానికి జరిగిన ఆత్మగౌరవ పోరాటం
రాజ్యంలోని మానవులందర్నీ సమానంగా చూడలేని రాజు... రాజు కాడు
సమాజంలోని తోటి మనుష్యుల్ని తమతో సమానంగా చూడలేని ప్రజలు... ప్రజలు కారు

రాజరికంలో యథా రాజా తథా ప్రజా
ప్రజాస్వామ్యంలో యథా ప్రజా తథా రాజా
ఇది స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి మనకు నేర్పించింది
ఇవే హక్కుల్ని రాజ్యాంగం  మనకు ప్రసాదించింది  

మన హక్కుల్ని మనమెంతవరకూ కాపాడుకుంటున్నాం ?
మన అధికారాల్ని మనమెంతవరకూ ఉపయోగించుకుంటున్నాం ?
ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు...సేవకులే అందరూ ....
మరి సేవకుల్ని పాలకులుగా ఎందుకు భావిస్తున్నాం ?

బ్రిటిష్ వలస పాలనలో 200 ఏళ్ళు మగ్గిన మనలో ఆ బానిస భావాలు పోలేదా ?
ఇంకా ఎన్ని తరాలు ఆ భావ దారిద్యంలో మగ్గాలి ? దానినుండి ఈ జాతికి విముక్తి లేదా ?
నవ భావాల ... ఆధునిక యువతరమైనా ఈ బానిస భావాలను చేదిస్తుందా ?
డబ్బు సంపాదనా మార్గాల అన్వేషణలో పడి కర్తవ్యం మరచిపోతుందా ?

వ్యక్తి కంటే సమాజం ముఖ్యమని నవతరం గుర్తిస్తే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను చూడవచ్చు
సమాజం బాగుంటేనే మనం హాయిగా, స్వేచ్చగా జీవించగలమని యువత గుర్తించాలి
నా కుటుంబం, నా బాగు, నా సంపాదన, నా సరదాలు అనే పరిధిని దాటి ఆలోచించాలి
అప్పుడే స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు నిజమైన విలువ నిచ్చినట్లవుతుంది
అప్పుడే సమసమాజ, నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది 

విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకూ ఒకే జాతిగా వున్న భారతీయుల్ని రెండుగా విడదీసింది . 63 ఏళ్ళు గడిచినా ఆ బేధాలు సమసిపోలేదు. సరిగదా మన నాయకులు ఈ బ్రిటిష్ సూత్రాన్ని బాగా వంటపట్టించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా నవతరం మేల్కొని ఇలాంటి కుత్సిత, స్వార్థపూరిత నాయకులకు మంగళం పాడకపోతే మన జాతిలో మరో ముసలం పుడుతుంది.

64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో .................... 
స్వాతంత్ర్యం సిద్ధించిన పరిణామ క్రమం చూడండి..............



Vol. No. 02 Pub. No. 001

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం