ఒక కథ రాయాలన్నా, చెప్పాలన్నా భాష అవసరం.
పదాలు పొందిగ్గా, ఒక పద్ధతిలో, ఎదుటివారికి సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆ భాషకు వ్యాకరణం తోడు చాలా అవసరం.
ప్రతీ భాషకు తనదైన వ్యాకరణం ఉంటుంది.
అమ్మమ్మ చెప్పే కథ దగ్గర్నుంచి నేటి చలన చిత్ర కథల వరకూ మంచి కథ ఎంత అవసరమో..... దాన్ని ఆసక్తికరంగా, అందరికీ సులువుగా అర్థమయ్యే రీతిలో చెప్పే పద్దతి కూడా అంతే అవసరం.
ఈ అవసరాన్ని గుర్తించిన ఏకైక తెలుగు చలన చిత్ర నిర్దేశకుడు కదిరి వెంకట రెడ్డి గారు.
" మనం సినిమా తీసేది వేలిముద్ర గాళ్ళ కోసం, పామరుల కోసం. వాళ్లకి అర్థమయితే పండితులకూ అర్థమవుతుంది. దట్స్ ద వే స్క్రీన్ ప్లే కమ్స్. దారాన్ని లాగితే తెగిపోకుండా చివరిదాకా ఒక సూత్రం లాగా రావాలి కథ ! " అన్నారు కె. వి. రెడ్డి.
ఈ సూత్రం ఆయన వంట పట్టించుకున్నారు గనుకే ఆయన స్క్రీన్ ప్లే లు, వాటి వలన ఆయన చిత్రాలు అజరామరాలు.
" వినేవాడిని కూర్చోబెట్టి వాడికి తెలిసిందే చెప్పుకుంటూ పొతే ' మాకు తెలుసులేవయ్యా ! మహా బోర్ కొడుతున్నావు ' అంటాడు. తెలియని విషయాలు ముక్కు సూటిగా చెప్పుకుంటూ పొతే ' ఏమిటయ్యా ? నీ సొద ఇందాకట్నుంచీ ఒకటే గోల ' అని విసుక్కుంటారు. అందుకని ఏం చెప్పినా వినే వారికి వీనుల విందుగా చెప్పాలి. అందీ అందని విషయాలు సున్నితంగా చెప్పాలి "
ఇదీ ఆయన థియరీ !
తెలిసిన కథలనే వీనుల విందుగా, సున్నితంగా, నేత్ర పర్వంగా చెప్పారు గనుకే ఆయన చిత్రాలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. భవిష్యత్తులో తగ్గదు కూడా !
ఆయన కథకుడే కాదు.... గాయకుడు..... చిత్రలేఖకుడు కూడా !
అందుకే ఆయన కథలెంత ఉన్నతంగా ఉంటాయో, ఆయన చిత్రాల్లోని పాటలంత మధురంగానూ, అయన చిత్రాల్లోని సెట్స్ అంత కన్నుల పండువగానూ ఉంటాయి.
ఖచ్చితంగా తనకేం కావాలో చెప్పి చేయించుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ రెడ్డి గారికది నల్లేరు మీద నడక.
కదిరి నరసింహస్వామి ఆలయం మెట్లు రోజూ కడిగి, ముగ్గులు పెట్టి ఆయన మాతృమూర్తి సంపాదించిన పుణ్యఫలం కె.వి.రెడ్డి గారికి అందింది. ఏమాత్రం స్వార్థ చింతన లేకుండా తరతరాలకు సరిపడే ఆ పుణ్యఫలాన్ని తన భక్తిరస చిత్రాల ద్వారా తెలుగు జాతికి అందించారు రెడ్డి గారు. దానికి నిదర్శనమే ఆయన తొలి చిత్రం ' భక్త పోతన ' లోని భక్తి పారవశ్యం తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం గ్రామంలో ఒక అతి సామాన్య బాలుని ' బాలయోగి' గా మార్చేసింది.
కె. వి. రెడ్డి గారు మూడు కాలాలకు చెందిన వ్యక్తి. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలు ఆయనవే !
తెలుగు చలన చిత్రాలకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించిన దార్శనికుడు,
శ్రద్ధ, ఓర్పు, పట్టుదల, క్రమశిక్షణ లకు మారు పేరు,
చలన చిత్రాలకు ఒక శాస్త్రాన్ని రచించి కళా స్వరూపాలు అని నిరూపించిన చలన చిత్ర శాస్త్రజ్ఞుడు,
తెలుగు చలన చిత్రాలకు మార్గదర్శి
కె. వి. రెడ్డి గారి శతజయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.....
Vol. No. 03 Pub. No. 147