Saturday, August 29, 2009

తెలుగు భాషా దినోత్సవం


రోజు మాతృభాషాదినోత్సవం. సుమారు శతాబ్దం చరిత్ర కలిగిన వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యుడు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినోత్సవం. ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి దాదాపుగా ఒకటిన్నర శతాబ్దం కావొస్తోంది. గ్రాంధిక భాషలో రచనలు చేయనివాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసే రోజుల్లో ప్రజలకు అర్థమయ్యే భాషలోనే రచనలు ఉండాలని తిరుగుబాటు చేసి, ఏటికి ఎదురీది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వ్యావహారిక భాషను ప్రాచుర్యంలోకి తెచ్చి కార్యసాధకుడు ఆయన. గిడుగు కాదు పిడుగు అనిపించుకున్నాడు. 1966 లో మనరాష్ట్రంలో అధికార భాషా సంఘం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషను అమలు చెయ్యాలన్నది సంస్థ ప్రధాన ఆశయం. 43 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. సంవత్సరం ఫిబ్రవరిలో ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న మాతృ భాషల్లో తెలుగు కూడా ఒకటని, దీనికి రెండు దశాబ్దాలలోపు మయముందని తెలుస్తోంది. ఇది మాతృ భాషాభిమానులందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
1. అధికార భాషా సంఘం చిత్తశుద్ధితో పనిచేసి వెంటనే కార్యాలయాలన్నిటిలో తెలుగుభాషనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలి . ముఖ్యంగా పదకోశాలలో కృత్రిమమైన అనువాదాలను సవరించాలి. ప్రజలకు అర్థమయ్యే విధంగా అనువాదాలుండాలి గానీ అనువాదకుల పాండిత్య ప్రతిభ ప్రదర్శనకు వేదిక కాకూడదు.
2. బహుళ వాడుకలో ఉన్నా ఇతర భాషా పదాలను యథాతధంగా వాడటం వలన నిరక్షరాస్యులకు కూడా సులువుగా అర్థమవుతాయి. ఉదాహరణకి రైలు, బస్సు, రోడ్ మొదలయినవి. వీటిని మన భాషా పటిమతో అనువాదం చేసి అందర్నీ గందరగోళపరిచే పని మానుకుంటే అదికార భాష అమలు సులభసాధ్యమవుతుంది.
3. ప్రపంచీకరణ నేపధ్యంలో ఇంగ్లీష్ అవసరాన్ని సాకుగా చూపి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్న కార్పోరేట్ కాలేజీలను నియత్రించాలి.
4. ప్రాచీన భాష హోదా కేవలం నిధులు సాధించడం, ఖర్చు చెయ్యడం కోసం కాక వాస్తవంగా పరిశోధన, ప్రచురణ మొదలైన వాటికోసం మాత్రమే.. కావాలి.
5. విషయాన్నైనా ప్రజాబాహుళ్యం లోకి చొచ్చుకుపోయేటట్లు చేసేవి వివిధ కళారూపాలు. వీటిని తగిన రీతిలో ప్రోత్సహించినపుడు భాష ప్రజల్లోకి వెడుతుంది. కళారూపాలు గతవైభవం కాకూడదు.
6. మన భాషలోని ప్రముఖ కావ్యాల్ని, నాటకాల్ని ..అన్నిటినీ ఇతర భాషల్లోకి అనువాదాలు చేయించాలి. అంతేకాదు. వాటిని ఇతర భాషా ప్రాంతాల్లో ప్రచారం చెయ్యడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఆయా ప్రాంతాల కళారూపాల సహకారం తీసుకోవచ్చు. పరభాషలో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు తెలుగు భాషా వ్యాప్తికి ఉపకరించే కథలను, సన్నివేశాలను ఎన్నుకోవాలి .
ఇవి నాకు తోచిన కొన్ని సూచనలు మాత్రమే! చివరగా ఒక మాట. అందరూ తమవంతు కృషి చేస్తే ఐక్యరాజ్య సమితి నివేదిక తప్పని రుజువు చెయ్యొచ్చు. మన భాషను బతికించుకోవచ్చు. అదే గిడుగువారికి అసలైన నివాళి. అప్పుడే మాతృభాషా దినోత్సవ సార్ధకత.

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం