Friday, October 8, 2010

ఓ ఆచూకీ కథ

 ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలంలో సోషల్ సైట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా, ఇదిగో ఇలా బ్లాగుల ద్వారా కూడా ఎప్పుడో విడిపోయిన, దూరమైన కుటుంబ సభ్యుల, స్నేహితుల, బంధువుల ఆచూకీలు తెలియడం జరుగుతోందని తరచుగా వింటున్నాం. అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా విడిపోయిన వ్యక్తుల్ని మా ఛానల్ కలిపిందని కనీసం ఓ వారం పాటు ఊదరగోట్టడం మనందరికీ తెలుసు. ఇదంతా సాంకేతిక పురోగతి పుణ్యం.
 కానీ ఉత్తరాల కాలంలో అదీ రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఇలా విడిపోయిన వాళ్ళ ఆచూకీ దొరకడమంటే దాదాపు అసాధ్యంగా ఉండేది. వార్తా పత్రికలు, రేడియో లాంటివి వున్నా ఈ విషయంలో వాటి ఉపయోగం చాలా తక్కువే !
అలాంటిది 1938 వ సంవత్సరంలో ఓ సినిమా ద్వారా పారిపోయిన కొడుకు ఆచూకీ కనుగొనగలిగారు ఓ తల్లిదండ్రులు. ఆ విశేషాలు.....

అప్పటి మద్రాసులోని జార్జ్ టౌన్ లోని రోడ్ మీద రోహిణి పిక్చర్స్ వారి ' గృహలక్ష్మి ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పట్లో మద్రాసులో ట్రాం బళ్ళు  ఉండేవి. దర్శకులు హెచ్. ఎం. రెడ్డి గారు కన్నాంబ పై ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె ట్రాం బండి తో బాటు ఏడుస్తూ పరుగెత్తే సన్నివేశం ఆది. చుట్టూరా జనాలు. సహజత్వం కోసం దర్శకులు ఆ జనాల మధ్యలోనే కన్నాంబను పరుగెత్తమన్నారు.
జనాలకు సూచనలు చేస్తూ రెడ్డి గారు ' మీరెవ్వరూ కెమెరా వంక చూడొద్దు. అలా ఎవరైనా చూసారో ల్యాబ్ కెళ్ళాక నెగెటివ్ లో వారి ముఖం మీద సూదితో ఒక ఏసిడ్ చుక్క వేస్తాను. వారి ముఖం సినిమాలో కనిపించకుండా పోతుంది. జాగ్రత్త ' అని హెచ్చరించారు. దాంతో అందరూ భయపడి కెమెరా వంక చూడక పోయినా అక్కడ ఓ తివాచీలు అమ్మే దుకాణం దగ్గర స్టూల్ మీద కూర్చున్న ఓ కుర్రాడు మాత్రం కెమెరా నే తదేకంగా చూడసాగాడు.
తర్వాత ఆ చిత్రం విడుదల అయ్యాక కడప లో ఆ చిత్రం చూస్తున్న ఒకాయన ఆ సన్నివేశం చూస్తూ ఆ కుర్రాడు తన కొడుకుగా గుర్తించాడు. అప్పటికి సంవత్సరం క్రితం స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో భయపడి ఆ అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మద్రాస్ పారిపోయాడు. హెచ్. ఎం. రెడ్డి గారి ' గృహలక్ష్మి ' పుణ్యమాని అతని ఆచూకీ దొరికింది. ఆ తండ్రి ఆనందంతో మద్రాస్ వెళ్ళి తివాచీ దుకాణంలో పనిచేస్తున్న కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 
అదీ ఓ ఆచూకీ కథ. తెలుగు సినిమా ఆవిర్భవించిన దశకంలోనే సినిమా వల్ల ఒనగూడిన సాంఘిక ప్రయోజనం.

Vol. No. 02 Pub. No. 034

నెహ్రూజీ డూప్ - జవాబు

కనుక్కోండి చూద్దాం - 28 - జవాబు


జవాబు : నెహ్రుజీ కి డూప్ లా భ్రమింపజేసిన వ్యక్తి


అయితే ఆయన ఫోటో బ్లాగర్ లో అప్లోడ్ కాకపోవడంతో పికాస ద్వారా ప్రయత్నించగా పేరు మార్చిన ఫైల్ కాకుండా అసలు ఫైల్ అప్లోడ్ అయి ఆ ఫైల్ పేరు పేకేటి గా తెలుస్తోందనే అభిప్రాయాన్ని మాగంటి వంశీమోహన్ గారు వ్యక్తం చేశారు.  శివగారు పేకేటి గారి పూర్తి పేరు రాసారు. ఇక జే.బీ. గారి కోరిక మేరకు పేకేటి గారి వివరాలు ......


పేకేటి గా గత తరం ప్రేక్షకులకు సుపరిచుతులైన పేకేటి శివరాం అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు. తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో 1918 అక్టోబర్ 8 వ తేదీన జన్మించిన శివరాం బి.ఏ. పాసయి ఎస్. ఆర్. సుబ్బారావు పేరుతో , ముఠా, ఉదయగిరి, కస్తూరి అనే కలం పేర్లతో రచనలు చేశారు. హార్మోనియం, జలతరంగిణి వాద్యాలు నేర్చుకున్నారు.

1940 వ దశకంలోనే తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి దర్శకత్వం దాకా అన్ని శాఖలను నిర్వహించారు. 1944 లో ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసే సమయంలో ' సీతారామ జననం ' చిత్రంలో నటించడానికి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు కి మంచి మిత్రుడయ్యారు. అక్కినేని సినీ జీవిత చరిత్రలో పేకేటిది ఒక అధ్యాయం. అక్కినేని జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలకు పేకేటి సాక్షి. వారి మైత్రి చిరకాలం కొనసాగింది.

పేకేటి కొంతకాలం ఫైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఇండియన్ న్యూస్ సర్వీసు లో కెమెరామన్ గా కూడా పని చేశారు.

పేకేటి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆయన నట జీవితంలో చెరిగిపోని ముద్ర వేసిన పాత్ర అక్కినేని ' దేవదాసు ' చిత్రంలోని దేవదాసు మిత్రుడు భగవాన్. ఆ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేవదాసు చూసిన ప్రేక్షకులు అక్కినేనిని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, భగవాన్ పాత్రలో పేకేటిని కూడా అంత బాగానూ గుర్తుంచుకున్నారు.

పేకేటి తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కులగౌరవం, కన్నడంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో హెచ్. ఎం. రెడ్డి పురస్కారం అందుకున్నారు.

ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా ఆయన పుత్రుడు. తమిళంలో ప్రముఖ హీరో ప్రశాంత్ పేకేటి శివరాం మనుమడు.

ఈరోజు పేకేటి శివరాం జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ......


Vol. No. 02 Pub. No. 033a

Thursday, October 7, 2010

నెహ్రూజీ డూప్

కనుక్కోండి చూద్దాం - 28

 నెహ్రూజీ ప్రథానమంత్రిగా వున్నప్పుడు ఓసారి కలకత్తా నుండి బొంబాయి ( నేటి ముంబయి ) కి ప్రయాణం చేస్తున్నపుడు ఆయన వెంటవున్న విలేఖరులలో ఇండియన్ న్యూస్ సర్వీస్ కెమెరామన్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి కూడా వున్నాడు. ఆయన కూడా ఆరోజు నెహ్రూజీ వేసుకున్న జాకెట్ లాంటిదే తొడుక్కున్నాడు. ఆయనకు అప్పుడప్పుడు గాంధీ టోపీ పెట్టుకునే అలవాటు కూడా వుంది. ముంబయిలో విమానం ఆగగానే నెహ్రూజీ కంటే ముందుగా ఆయన విమానం దిగాడు. నెహ్రూగారికోసం అక్కడ వేచి వున్న వారు ఈయన వేషదారణ చూసి నెహ్రూగా పొరబడి పూలమాలలతో ముంచెత్తి స్వాగతం పలికారు. దాంతో తాను నెహ్రుని కానని చెప్పడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన అవస్థ చూసి నవ్వుకుంటూ వెనుకగా దిగిన నెహ్రూజీని చూసి నాలుక కరుచుకున్నారందరూ !

ఇంతకీ నెహ్రూజీగా భ్రమింపజేసిన ఆ వ్యక్తి తర్వాత కాలంలో తెలుగు చిత్రసీమలో  ప్రముఖుడిగా ఎదిగాడు.
ప్రక్క ఫోటోలో వున్న ఆయన ఎవరో గుర్తు పట్టగలరా ?






Vol. No. 02 Pub. No. 033
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం