Tuesday, June 12, 2012

తెలుగు తెరకు మాటలు నేర్పిన ఘనాపాఠీ

 హనుమంతప్ప మునియప్ప రెడ్డి......
ఆయనే హెచ్. యమ్. రెడ్డి
భారతీయ తెరకు మాటలు నేర్పిన ఘనుడు అర్దేషీర్ ఇరానీ అయితే
ఆయన దగ్గర శిక్షణ పొంది తెలుగు తెరకు.... ఆ మాటకొస్తే దక్షిణ భారత తెరకు మాటలు నేర్పిన ఘనాపాఠీ. మాటలే కాదు శాస్త్రం, వ్యాకరణం..... అన్నీ నేర్పారు. 
నిండైన విగ్రహం, కోరమీసాలు.. చూడగానే పోలీసేమో అనిపించే భీకరమైన రూపం.
ఆయన నిజంగానే పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తూ , సినిమా అంటే ఆసక్తి తో ఉద్యోగం మానేసి బొంబాయి చేరి లైట్ బాయ్ గా సినీ జీవితం ప్రారంభించారు.
అలా అట్టడుగు స్థాయినుంచి ప్రారంభించిన ఆయన జీవితం సినిమా ప్రక్రియలోని అన్ని అంశాలను మూకీ రోజుల్లోనే క్షుణ్ణంగా నేర్చుకుని టాకీలకు స్వాగతం పలికింది.
తొలి భారతీయ టాకీ సృష్టికర్త అర్ద్రేషిర్ ఇరానీ దగ్గర ఆ మెలుకువలు కూడా నేర్చుకుని
 " మనమూ తీస్తామయ్యా మాట్లాడే సినిమా " అన్నారు.

అలాగే ఇరానీ సంస్థ ఇంపీరియల్ ఫిల్మ్స్ కోసం అటు తమిళంలో ' కాళిదాసు ', ఇటు తెలుగులో ' భక్త ప్రహ్లాద ' నిర్మించారు. అప్పట్లో సినిమాల మీద అవగాహన లేని సురభి నాటక సమాజానికి నచ్చజెప్పి, ఒప్పించి బొంబాయి తీసుకెళ్ళి ఆ చిత్రం నిర్మించారు.
అలా ' భక్త ప్రహ్లాద ' తో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 1960 లో ' గజదొంగ ' చిత్రం నిర్మాణ దశలో ఉండగానే ఆగిపోయింది.
హెచ్. యమ్. రెడ్డి గారి స్కూల్ నుంచి ఎంతో మంది నటీ నటులు, సాంకేతిక నిపుణులు తయారయి తర్వాత కాలంలో లబ్ద ప్రతిష్టులయ్యారు.
ఆయనకు చిన్నా పెద్దా బేధం లేదు. చిన్న కళాకారుడైనా, సాంకేతిక నిపుణుడి నైనా తనతో సమానమైన స్థాయిలో చూడగలిగే ఉన్నతమైన వ్యక్తిత్వం ఆయనది.

దానికో ఉదాహరణ... 

ఇప్పటి చెన్నై... అప్పటి మద్రాసులో కోడంబాక్కం ఫ్లై ఓవర్ నిర్మించడానికి ముందు ఆ ప్రాంతమంతా చిట్టడవిలా ఉండేది. కొంతవరకూ కంకర రోడ్డు, ఆ తర్వాత అది కూడా ఉండేది కాదు. ఆ చివర ఎక్కడో ఉన్న తన ' రోహిణీ స్టూడియో ' కు ఆయన తన ' ఓల్డ్ మొబైల్ కార్ ' లో వెళ్ళేవారు. రైల్వే గేటు దాటి పట్టపగలే జనసంచారం ఉండని ఆ రోడ్డులోకి రాగానే ఆయన కారుని నెమ్మదిగా పోనిమ్మని డ్రైవర్ కి చెప్పేవారు. ఆ దారిన ఎవరైనా నడిచి వెడుతుంటే కారు ఆపి అతన్ని పలకరించి, ఎక్కడవరకూ వెడుతున్నాడో కనుక్కుని కార్ ఎక్కించుకునేవారు. ఆ రోడ్డులో ఎక్కువగా స్టూడియో లే ఉండడం వల్ల సినిమా రంగంలో పని చేసేవారే ఎక్కువగా వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళాలో కనుక్కుని వాళ్ళని అక్కడ భద్రంగా దింపే వారు. ఇలా అందర్నీ ఎక్కించుకునే సరికి ఆ కార్ కిక్కిరిసి పోయేది.
వీళ్ళని చూసి ఎవరైనా ' ఎవరండీ వీళ్ళు ? మీ క్రింద పని చేసే వాళ్ళా ? ' అనడిగితే
' అబ్బే ! వీళ్ళందరూ నా క్రింద పని చేసేవాళ్ళు కాదండీ ! నాతో కలసి పని చేసేవాళ్ళు ' అనేవారు.
ఇదీ ఆయన కార్మికులకు ఇచ్చిన మర్యాద. ఇప్పుడు సాధ్యమా ?

ఇంకో సంఘటన.... 

' ప్రతిజ్ఞ ' చిత్రంలో మహారాజు పాత్రకు పొదిలి కృష్ణమూర్తి అనే నటుడిని తీసుకున్నారు. మొదటి రోజు షూటింగ్. ఆ నటుడు ఎంత ప్రయత్నించినా సరిగా నటించలేకపోయాడు. దానికి తోడు రెడ్డి గారిని చూడగానే కంగారుతో చెమటలు పట్టేస్తున్నాయి అతనికి. ఈ అవస్థ గమనించిన రెడ్డి గారు అతనితో ' కృష్ణమూర్తీ ! ఇక చాల్లే ! సాయింత్రం ఆఫీసులో కలువు ' అన్నారు. ఇక ఈ ఉద్యోగం ఊడిపోయినట్లే అనుకున్నాడు ఆ నటుడు.
సాయింత్రం రెడ్డి గారిని ఆఫీసు లో కలిసాడు. ' మిస్టర్ కృష్ణమూర్తీ ! నువ్వు సరిగా చెయ్యలేకపోయావు. ఈ వేషానికి ఇంకో నటుడిని తీసుకోవాలి. తప్పదు. నువ్వు దానికి అంగీకరించాలి. అయితే ప్రతీ నెలా పదవ తారీకుకి వచ్చి నీ జీతం మాత్రం తీసుకెళ్ళాలి. ' అన్నారు. అప్పటినుంచి ఆ నటుడు నటించకుండానే ఆరు నెలల పాటు ఆ జీతం తీసుకున్నాడు.

అదీ హెచ్. యమ్. రెడ్డి గారి వ్యక్తిత్వం.

ఆయన తెలుగు తెరకు మాటలే కాదు. అప్పటి తరం సినిమా వాళ్లకి తన పనితనంతో బాటు తన వ్యక్తిత్వం కూడా నేర్పారు. అందుకే ఆ యుగం స్వర్ణయుగం గా విలసిల్లిందేమో !  

తెలుగు చలనచిత్ర పితామహుడు హెచ్. యమ్. రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....

 
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 143

3 comments:

Rao S Lakkaraju said...

హెచ్. యమ్. రెడ్డి గారి పరిచేయం బాగుంది. థాంక్స్.

SRRao said...

రావు గారూ !
ధన్యవాదాలు.

Unknown said...

12/06/2012 హ్చ్ ఎం రెడ్డి

ఈ టాకీ పులిని పరిచయం చెస్తూ వ్రసిన వ్యాసం బాగుంది. అనుకున్నది సాధించాలని ఉన్నది ఒదులుకొని సాహసం చేసి ముందుకు సాగి సఫలీ కృతుడయిన ఈ మహా వ్యక్తి ఎందరికొ ఆదర్శప్రాయుడు.

గుమ్మా రామలింగ స్వామి
27/07/2013

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం