Thursday, July 28, 2011

క్రమాక్రమాలు


హాస్య బ్రహ్మ, గణపతి సృష్టికర్త చిలమర్తి లక్ష్మీనరసింహం గారు చెప్పిన ఓ పిట్ట కథ.......


ఒక ఊరిలో కాస్త కలిగిన కుటుంబంలోని బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వారెవరైనా సరే తనింటికి వస్తే భోజనం పెడతానని ప్రకటించాడు. వేదం రాని వారికి ఆ అవకాశం లేదని కూడా చెప్పేవాడు. ఆ మాట ప్రకారమే వేద పండితులు ఎవరు తన ఇంటికి వచ్చినా లేదనకుండా భోజనం పెట్టి వారిని ఉచిత రీతిని సత్కరించి పంపేవాడు.

ఒకసారి ఒక వేసవి కాలంలో మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్న వేళ ఓ బీద బ్రాహ్మణుడు ఆకలి దప్పికలతో మాడుతూ ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చాడు. అతని షరతులు తెలుసుకున్న ఆ బీద బ్రాహ్మణుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎందుకంటే అతనికి వేదం రాదు. అతని బాధను కూడా గుర్తించకుండా అన్నదాతయైన బ్రాహ్మణుడు ' మీకు వేదం వచ్చునా ? ' అని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఆకలితో బాధపడుతున్న ఆ రెండవ వ్యక్తి తనకు వేదం వచ్చునని, భోజనం చేసిన తరువాత తనను పరీక్షించవచ్చునని చెప్పాడు. గృహస్థుడా మాటలకు అంగీకరించి చాలా గౌరవంగా అతనికి భోజనం పెట్టాడు. మర్యాదలు చేశాడు. కొంతసేపు విశ్రమించి లేచిన తర్వాత పరీక్ష ఇస్తానని బ్రాహ్మణుడు చెప్పాడు. కొంతసేపు నిద్రపోయి లేచిన తర్వాత కూడా అతడు వేదం చదివే దృష్టిలో లేకపోవడం చేత గృహస్థుడు అతనిని మళ్ళీ అడిగాడు. అందుకా బ్రాహ్మణుడు సమాధానం చెబుతూ ముందు ' క్రమము ' చెపుతానని ఇలా మొదలు పెట్టాడు.

' అయ్యా ! మీరు బ్రతికి వుండగా మీ కుమారుడు చనిపోవుట అక్రమము. మీ కుమారుడు జీవించి వుండగా మీరు చనిపోవుట క్రమము ' అని పలికాడు. ఇంటి యజమాని కోపించి అతనిని కొట్టబోగా అందరూ చేరి అతనిని వారించి బ్రాహ్మణుడి యుక్తికి మెచ్చుకుని ఆకలితో వున్నవారికి అందరికీ భోజనం పెట్టడం మంచిది కానీ, వేద పండితులకే భోజనం పెడతాననడం మంచిది కాదని చెప్పి అతనిని మందలించారు.


Vol. No. 02 Pub. No. 293

నవ్వుకు కారణం !


ఒకప్పటి చైనా ప్రధాన మంత్రి చౌ ఎన్ లే ని ఒకసారి ఒక అమెరికన్ పత్రికా ప్రతినిధి కలుసుకున్నాడు. సంభాషణ ప్రారంభిస్తూ

" నేను రెండవ ప్రపంచయుద్ధం ముందూ మీ దేశానికి వచ్చాను. తర్వాతా వచ్చాను. అప్పటి చైనాకి, ఇప్పటి చైనాకి చాలా తేడా కనిపిస్తోంది " అన్నాడు.

ఆ వ్యాఖ్యకు చౌ ఎన్ లే ముఖంలో ఏ విధమైన ప్రత్యేకమైన భావం కనిపించలేదు ఆ విలేఖరికి. కమ్యూనిస్టుల పరిపాలనలో దేశం బాగా వుందని, ప్రజలు హాయిగా వున్నారని చెబుతారని ఆ విలేఖరి భావం.

కానీ చౌ ఎన్ లే

" ఏమిటి మీకు కనిపించిన తేడా ? " అని అతి మామూలుగా అడిగారు.

అప్పుడు ఆ విలేఖరి " ఆ రోజుల్లో చైనా ప్రజలు నవ్వుతూ, తుళ్లుతూ హాయిగా నవ్వుకునేవారు . ఆఖరికి రిక్షా తొక్కే వాడు కూడా స్వేచ్ఛగా జోకులు వేస్తూ మాట్లాడేవాడు. మరి ఇప్పుడు ఎవరి ముఖం చూసినా నవ్వు కనబడడం లేదు. అంతా సీరియస్ గా కనిపిస్తున్నారు " అన్నాడు.

పెట్టుబడిదారీ వ్యవస్థలోని వారికి కమ్యూనిజం అంటే చులకన భావం వుండేది. కనుకనే పెట్టుబడిదారీ దేశమైన అమెరికాకు చెందిన ఆ విలేఖరి వ్యాఖ్యలో వ్యంగం, విమర్శ వుంది. అది చౌ ఎన్ లే గమనించారు. అందుకే

" ఓహో ! ఆదా ! దానికి కారణం వుంది. గతంలో మా ప్రజల జీవనం చాలా దుర్భరంగా వుండేది. అప్పుడు ఆ కష్టాల్ని, బాధల్నీ మర్చిపోవడానికి లేని నవ్వు తెచ్చుకుని నవ్వాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. అందరూ హాయిగా, ఆనందంగా వున్నారు. ఇక నవ్వు... కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది ? అంతా శ్రద్ధగా, సీరియస్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. జీవితం హాయిగా గడిచిపోతోంది. ఇంతకంటే ఏం కావాలి ? ఇక నవ్వుకోవడానికి సమయం ఎక్కడిది ? "

ఆ విలేఖరి సంగతి ఇంకా చెప్పాలా ?


Vol. No. 02 Pub. No. 292

Wednesday, July 27, 2011

ప్రార్థనకు ముందు ప్రార్థన

ఓసారి రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో ఓ సాహిత్య సభ జరుగుతోంది. ముఖ్య అతిధులందర్నీ వేదికపైకి ఆహ్వానించారు నిర్వాహకులు. పెద్దలందరూ ఒక్కొక్కరుగా వేదికనలంకరించారు. అంతా కూర్చున్నాక ప్రార్థన మొదలవుతుందని ప్రకటించారు. అప్పుడు గమనించారు మహామహోపాధ్యాయ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు...... ఆ వేదిక మీద మరో ప్రముఖ రచయిత ఆర్. ఎస్. సుదర్శనం గారు లేరని. ఆయన వేదిక క్రిందనే వుండి పోయారు. వేదిక మీదకు అతిథుల్ని ఆహ్వానించిన పెద్దమనిషి పొరబాటున సుదర్శనం గారి పేరు పిలవడం మరచిపోయాడు.

అప్పుడు నిర్వాహకులు ఆయన దగ్గరికి వెళ్ళి తమ తప్పు మన్నించమని, వేదికనలంకరించమని కోరినా ఆయన మొహమాటపడిపోతూ ' ఫర్వాలేదు లెండి. మీరు సభ నడిపించండి ' అంటూ క్రిందనే వుండిపోయారు. ఇది గమనించిన మధునాపంతుల వారు లేచి కలగజేసుకుని " ప్రార్థనకు ముందు మరో ప్రార్థన. సుదర్శనంగారిని వేదికనలంకరించమని ప్రార్థన " అనగానే సుదర్శనం గారు ఇక తప్పదనుకుని చిన్నగా నవ్వుకుంటూ వేదికనెక్కారు.


Vol. No. 02 Pub. No. 291
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం