' వాహినీ ' కుమారిగా ప్రసిద్ధి చెందిన రాజకుమారి.......మద్దెల నాగరాజకుమారి గత తరం ప్రేక్షకులకు అప్పటి నటీమణులలో చిరపరిచితమైన పేరు.
తెనాలికి చెందిన మద్దెల నాగరాజకుమారి అందం 1934 లోనే సి. పుల్లయ్య గారి ' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలోను, వేల్ పిక్చర్స్ వారి ' సీతాకళ్యాణం ' చిత్రంలోనూ అవకాశాలు వెదుక్కుంటూ వచ్చేటట్లు చేసింది. అయితే నటన, చిత్ర పరిశ్రమ అంటే భయపడ్డ ఆమె తల్లి వాటిని తిరస్కరించింది. 1937 లో ఒక బంధువు ప్రోద్బలంతో ' దశావతారాలు ' చిత్రానికి జరిగిన సెలక్షన్లో కుమారి ఎంపికయ్యారు. తోలి చిత్రంలోనే లక్ష్మి, సీత, యశోధర పాత్రలు ధరించి త్రిపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత 1939 లో ' అమ్మ ' , ' ఉష ' అనే చిత్రాల్లో నటించారు. అయితే ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ' ఉష ' ఘోరంగా పరాజయం పాలైంది.
ఇక కుమారి గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టం..... వాహినీ పిక్చర్స్ లో అడుగుపెట్టడం. వితంతు పునర్వివాహం ప్రధానాంశంగా వాహినీ వారు 1940 లో నిర్మించిన ' సుమంగళి ' లో ఆమె పోషించిన కథానాయిక పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టింది. తర్వాత వాహినీ వారు పతిత జనోద్దరణ ప్రధానాంశంగా నిర్మించిన ' దేవత ' చిత్రం ఆమెను వాహినీ కుమారిని చేసింది. ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. అయితే అనూహ్యంగా ఆ చిత్రం తర్వాత అయిదేళ్లపాటు ఆమె కనుమరుగైపోయింది.
మళ్ళీ 1946 లో ఘంటసాల బలరామయ్య గారి ' ముగ్గురు మరాటీలు ' చిత్రం ద్వారా పునః ప్రవేశం చేసారు. ఆ చిత్రం ఘన విజయం సాధించినా ఆ తరవాత కుమారి కొండచిలువతో పోరాటాలు వగైరా సాహసాలు చేసిన ' మాయపిల్ల ' ( 1951 ) పరాజయం పాలయ్యింది. ఇంకా కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచన చేసిన ' ఆకాశరాజు ' చిత్రంలో గౌరీనాథశాస్త్రి గారి సరసన నటించారు. ఇలా ఆమె నటించిన బయిట చిత్రాలలో కొన్ని పరాజయం పొందగా, మరికొన్ని నిర్మాణ దశలోనే ఆగిపోయాయి.
మళ్ళీ వాహినీ వారి ' మల్లీశ్వరి ' చిత్రంలో రాణి తిరుమలదేవి పాత్ర కుమారికి మరోసారి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రంలో కుమారిది చిన్న పాత్రే అయినా ఆమెకు వాహినీ కుమారి అనే పేరును శాశ్వతం చేసింది. ఆ తర్వాత మరో మూడు చిత్రాల్లో నటించిన కుమారి 1958 లో మద్రాస్ వదలి విజయవాడ కొచ్చి స్థిరపడ్డారు. శేష జీవితం బెజవాడ లోనే గడిపి 2009 మార్చి 3 న స్వర్గస్తులయ్యారు.
వాహినీ కుమారి వర్థంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ యుట్యూబ్ లో ప్రణీత్ ఛానల్ లోని ' దేవత ' చిత్రంలోని ఈ పాట చూడండి ............
Vol. No. 02 Pub. No. 163

