స్వ ' గతం ' - 2

 కార్తీక సంతర్పణ 

కార్తీక మాసం పూర్తి కావస్తోంది. వర్షాకాలానికి, శీతాకాలానికి వారధిగా వుండే ఈ కార్తీక మాసం చేసే సందడి సంవత్సరంలో మరే ఇతర మాసం చెయ్యదేమో ! ఒక ప్రక్క నరకాసుర వధ చేసిన సత్యభామాకృష్ణుల విజయాన్ని  ' దీపావళి ' తో ప్రారంభించి నెలరోజులపాటు ఆ దీపకాంతుల్ని వెలిగిస్తూ, బాణసంచాతో హోరెక్కిస్తూ సంబరాలు జరుపుకుంటాం. మరోప్రక్క ఈ కార్తీక మాసం మహాశివునికి ప్రీతిపాత్రమైందని, ఆయన్ని ఈ మాసంలో పూజిస్తే సకలశుభాలు జరుగుతాయని నమ్ముతూ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం. కార్తీక సోమవారాలు ఉపవాసాలు, కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణం.... ఇంకా కొంతమంది కార్తీక నత్తాలు పేరుతో ఈ మాసమంతా ఉపవాస దీక్ష చెయ్యడం లాంటివి ఎన్నో ! ఒకప్పుడు శివకేశవ బేధాలు ఏ స్థాయిలో వుండేవో మనకు చరిత్ర చెబుతుంది. అయితే ఈ కార్తీక మాసంలో హిందువులు శివకేశవులిద్దర్నీ సమానంగా ఆరాధిస్తారు. దీపావళితో బాటు క్షీరాబ్దిద్వాదశి రోజున కూడా శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. సామాన్య భక్తజన హృదయాల్లో శివకేశవులు ఇద్దరికీ ఏ బేధము లేదనడానికి ఈ కార్తీక మాసం నిదర్శనం.  

ఇవి కాక ఈ కార్తీక మాసంలోనే శారీరిక పరమైన, సామాజికపరమైన ఆరోగ్యాన్నిచ్చే కొన్ని సాంప్రదాయాలు పాటిస్తాం. వాటిలో సముద్రస్నానం లేదా నదీ స్నానం చెయ్యడం, ఉపవాసాలు మొదలైనవి శారీరిక ఆరోగ్యానికి ఉపకరించేవైతే, మహేశ్వరుడికి లక్షపత్రి పూజలు, అభిషేకాలు, పంచారామాలలాంటి పుణ్యక్షేత్రాల సందర్శన వంటి వాటితో అథ్యాత్మిక సంపద పెంచుకోవడం, వనభోజనాలు లాంటి వాటితో స్నేహసంబంధాలు మెరుగుపరుచుకోవడం సామాజికంగా మనకి ఆరోగ్యాన్నిస్తాయి. నెలంతా సందడి చేసే ఈ కార్తీక మాసాన్ని తల్చుకుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని బయిటకొచ్చాయి.   

 మా చిన్నతనంలో మావూళ్లో ముఖ్యంగా మా పేటలో ఈ కార్తీకమాసం మరింత సందడి చేసేది. ముఖ్యంగా ఆ మాసంలో ఒకరోజు మా పేట వారంతా కులబేధాలు లేకుండా కలసి సామూహికంగా చెన్నమల్లేశ్వరస్వామికి లక్షపత్రి పూజ చేసేవారు. మా పేట దగ్గర వుండే దేవాలయ సముదాయంలో ఒక ప్రక్క వైష్ణవాలయం, మరో ప్రక్క శివాలయం వున్నాయి. విశాలమైన ఆవరణలో వున్న ఈ జంట ఆలయాల్లో చెన్నకేశవస్వామి, చెన్నమల్లేశ్వరుడు కొలువుదీరి వున్నారు. లక్షపత్రి పూజ జరిగే రోజున రెండు ఆలయాలలోనూ భక్తుల కోలాహలం వుండేది. అక్కడే కాదు.. మా పేట పేటంతా హడావిడే ! నిజానికి ఈ హడావిడి నాలుగయిదు రోజులముందునుంచే ప్రారంభమయ్యేది. విరాళాలు సేకరించడం, కావల్సిన సరంజామా ఏర్పాటు చేసుకోవడం వగైరా పనులతో పిల్లలు, పెద్దలు బిజీ బిజీ . ఇక ఆ రోజు సంగతి చెప్పేదేముంది ? తెల్లవారుఝామునుంచే హడావిడి మొదలయ్యేది. చిన్నా పెద్దా తలారా స్నానాలు చేసి ఆలయం దగ్గరికి చేరుకునేవారు. అభిషేకాలు, అర్చనలు ముగిశాక ముందురోజే సిద్ధం చేసిన పత్రితో పూజ మొదలయ్యేది. ప్రధానంగా మా పేటలోని పెద్దలు కూర్చుని పూజ జరిపించేవారు. సాయింత్రం వరకూ కొనసాగేది. 

అప్పుడు అసలు సందడి మొదలయ్యేది. ఆదే సంతర్పణ. నిజానికి ఇది వనభోజనం లాంటిదే ! కాకపోతే దూరంగా ఎక్కడో వున్న వనాలకి వెళ్ళడం కాకుండా మా పేటలోనే ఒక విశాలమైన ఆవరణలో ఈ సంతర్పణ ఏర్పాటు చేసేవారు. మా ఇంటి వెనుక శంకరం గారని, చిన్న సైజ్ జమీందారు లాంటి ఆయన ఇల్లు వుండేది. నిజానికి అది ఒక ఇల్లు కాదు. సముదాయం. ఒక పెద్ద మండువా లోగిలి. దాని ప్రక్కన విడిగా మరో ఇల్లు. అయితే ఇవన్నీ అప్పట్లో పెంకుటిళ్ళే ! నిజానికి అప్పట్లో మా పేటలో మేడ లేదా డాబా అనేవి మూడే వుండేవి. అవి ఒకటి మా వీధి చివర సీతయ్య నాయుడు గారి పాత మేడ ఒకటి, దాని ఎదురుగా డాక్టర్ ధర్మారావు గారి మేడ కాక డాబా అనేది మాదే ! అందుకే అప్పట్లో మా ఇంటికి ' డాబా డాక్టర్ గారిల్లు ' అని పేరుండేది. మా తాతగారు బ్రిటిష్ హయాంలో సివిల్ సర్జన్ గా పని చేశారు. దక్షిణాదిన రామేశ్వరం నుండి తూర్పున గంజాం వరకూ చాలా చోట్ల పనిచేసి రిటైర్ అయ్యాక కట్టుకున్న ఇల్లు అది. 

ఇక శంకరం గారి ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ. దాంట్లో అన్నీ రకాల వృక్షజాతులు వుండేవి. నిజానికి కార్తీక మాసంలో వేరే వనానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ ఆవరణే పెద్ద వనంలా వుండేది. అక్కడ ఆ రోజు సాయింత్రం మా పేట వాసులందరికీ సంతర్పణ. ప్రతి ఇంటినుంచి ఆడా మగా, పిల్లా పెద్దా, ధనిక బీదా అనే తేడాలు లేకుండా తప్పనిసరిగా అందరూ భోజనానికి రావాల్సిందే ! అందరూ వచ్చారో లేదో చూసుకుని ఎవరైనా రాలేదనిపిస్తే మళ్ళీ వాళ్ళింటికెళ్ళి తీసుకొచ్చేవారు. సాధారణంగా అలా ఎవరూ మానేవారు కాదుగానీ ఊరికి కొత్తగా వచ్చిన వాళ్లెవరైనా వుంటే కొంచెం మొహమాట పడేవారు. మా వీధి చివర పెద్ద పంట కాలువ వుంది. దాని గట్టు మీద వున్న రోడ్ లోనే చాలా ప్రభుత్వ కార్యాలయాలు వుండేవి. దాంతో మా పేటకు బదిలీల మీద వచ్చే ప్రభుత్వోద్యోగుల తాకిడి ఎక్కువ. వారిలో కొత్తగా వచ్చిన వారు సహజంగానే కొంచెం మొహమాటపడేవారు. ఈ సందర్భంలో మాత్రం పేటలోని వారందరూ ఏకమై వారి మొహమాటాన్ని పోగొట్టి భోజనానికి తీసుకెళ్ళేవారు. దానితో ఆరోజునుంచి వాళ్ళు చిరకాల మిత్రుల్లా అందరితో కలసిపోయేవారు. అరమరికలు లేని స్నేహాన్ని అందుకునేవారు... అందించేవారు. ఇలా ఈ సంతర్పణ మాకు పాత మిత్రులతో బంధాన్ని దృఢం చెయ్యడమే కాకుండా కొత్త మిత్రుల్ని కూడా అందించేది. 

సాయింత్రం పూజ పూర్తయ్యే సమయానికి ఇక్కడ భోజన ఏర్పాట్లు పూర్తయ్యేవి. ఇప్పట్లా టెంట్ హౌస్ లు, సప్లయ్ కంపెనీలు వుండేవి కాదుకదా ! వంటకు అవసరమైన పాత్ర సామగ్రి అందరి ఇళ్లలోనుంచి సేకరించేవారు. తర్వాత విరాళాల్లో మిగిలిన డబ్బుని పాత్రలు కొనడానికి వినియోగించి కొంత సామగ్రి సమకూర్చారు. ఇక్కడ కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ముందు నిలబడినా నిజానికి అందరూ కార్యకర్తలే ! అందరూ అతిథులే ! ఒకరు ఎక్కువ..మరొకరు తక్కువ అని వుండేది కాదు. అందరూ తలో చెయ్యి వేసేవారు. చీకటి పడుతుండగానే నెమ్మదిగా అందరూ తమ తమ ఇళ్ళల్లోనుంచి మంచినీళ్ళ గ్లాసులు తీసుకుని బయిల్దేరేవారు. మొదటి బ్యాచ్ లో కూర్చోవడానికి చోటులేని వాళ్ళు అతిథుల్లా దూరంగా కూర్చొని తమవంతు ఎప్పుడు వస్తుందా అని వేచిచూడడం లాంటివి వుండేవి కాదు. వాళ్ళ వంతు వచ్చేవరకూ బ్యాచ్ లో కూర్చున్న వాళ్ళకు వడ్డన చేసేవారు. అలాగే ముందు బ్యాచ్ లో భోజనాలు చేసేసిన వాళ్ళు తినేసి చెయ్యి కడుక్కుని వెళ్ళి పోయేవారు కాదు. తర్వాత బ్యాచ్ లో కూర్చున్న వారికి వడ్డన చేసేవారు. ఇదంతా స్వచ్ఛందమే ! ఎవరూ ఎవరినీ బలవంతం చేసేవారు కాదు. తరతమ బేధాలేమీ లేకుండా అందరూ హాయిగా, ఆనందంగా , నవ్వుతూ , తుళ్లుతూ ఆ సాయింత్రాన్ని ఎంజాయ్ చేసేవాళ్లం. 
  ఈ సంతర్పణ ప్రభావం చాలాకాలం వుండేది. ఒకసారి ఆ వాతావరణానికి అలవాటైన వాళ్ళు జీవితంలో              మరిచిపోలేని అనుభూతి పొందేవారు. అందుకే ఎక్కేడెక్కడినుంచో ఉద్యోగరీత్యా వచ్చి కొంతకాలం మా మధ్య గడిపి  మరో ఊరు బదిలీ అయి వెళ్ళేటప్పుడు మమ్మల్ని వదిలి వెళ్లడానికి చాలా బాధపడేవారు. మాకు కూడా అలాగే     వుండేది. వాళ్లుండేది తాత్కాలికమైనా అప్పట్లో మేం జరిపే ఉత్సవాలు, ముఖ్యంగా ఇలాంటి సంతర్పణలు            స్నేహబంధాన్ని పెంచి పోషించేవి. దానికి కారణం ఇప్పట్లా అన్నీ రెడీమేడ్ కాకపోవడమే ! కాటరింగ్ లు లాంటి      సౌకర్యాలు లేకపోవడమే ! ఏ ఉత్సవమైనా, ఏ కార్యక్రమమైనా అందరి భాగస్వామ్యం వుండేది. కొందరే              నిర్వాహకులు... మిగిలిన వాళ్ళు అతిథులు అనే సూత్రం అప్పుడు లేదు. అరమరికెలు లేకుండా అందరం కలసి    మెలసి సంబరాలు జరుపుకునే వాళ్ళం. ఇప్పట్లా కుల సంతర్పణలు కావవి. వీటిలో కుల ప్రసక్తి అసలు వచ్చేది      కాదు. పేటలోని వారందరూ పాల్గొనేవారు. కుల బేధాలు లేని, తరతమ బేధాలు లేని, పేకాట, మందు విందులు ,   గానా బజానాలు లేని అలాంటి సంతర్పణలు మళ్ళీ చూడగలమా ? ఏమో... అనుమానమే !                        


 మా బుర్రకథ 


1967 వ సంవత్సరంలో అన్నపూర్ణ వారి ' పూలరంగడు ' చిత్రం విడుదలయింది. అప్పటికి నేను ఏడవ తరగతి చదువుతున్నాను. అక్కినేని నాగేశ్వరరావు, జమున హీరో హీరోయిన్లుగా నటించిన ఆ చిత్రంలో ఒక బుర్రకథ వుంది. అంతకుముందే ఉత్సవాల సమయాల్లో నాజర్ బృందం, నిట్టల బ్రదర్స్ లాంటి ప్రఖ్యాత బుర్రకథ దళాల వారి  నర్తనశాల, అల్లూరి సీతారామరాజు లాంటి బుర్రకథలు విని, చూసి వుండడం వలన అదేమంత వింత కాకపోయినా సినిమా బుర్రకథ కదా ! అందుకని కొంచెం ఎక్కువ క్రేజ్. అప్పట్లో మాకు అలా ఉత్సవాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాలు, సినిమాలు, రేడియో మాత్రమే వినోద సాధనాలు కదా ! అందుకని ఇలాంటి సాంప్రదాయ, జానపద కళా రూపాలంటే మక్కువగా వుండేది. 
అప్పట్లో మా స్కూలుకి తనిఖీకోసం జిల్లా విద్యాశాఖాధికారి ( D.E.O. ) వస్తున్నట్లు సమాచారం వచ్చింది. మా హెడ్మాస్టర్ గారు, టీచర్లకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన సమక్షంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని. అప్పటికే మాకు బాగా సీనియర్లలో మంచి కళాకారులున్న బ్యాచ్ స్కూల్ ఫైనల్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాతి బ్యాచ్ లలో చెప్పుకోదగ్గ కళాకారులు లేరు. వున్నవాళ్లు ఒకరిద్దరు ఎందుకో అంత ఉత్సాహంగా ముందుకు రాలేదు. మా సెక్షన్లో అప్పట్లో హరికథకులుగా ప్రసిద్ధి చెందిన బ్రహ్మశ్రీ కూచి వీరభద్ర శర్మ గారి అబ్బాయి కృష్ణప్రసాద్ వుండేవాడు. వెళ్ళిపోయిన స్కూల్ ఫైనల్ బ్యాచ్లో వాళ్ళన్నయ్య దీక్షిత్ మంచి కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాతి కాలంలో ప్రముఖ సంగీత దర్శకులు జి. కె. వెంకటేష్ గారి దగ్గర సహాయకునిగా చేరి, తర్వాత ఎస్. పి. బాలు గారి దగ్గర, ఇంకా చాలామంది దగ్గర సహాయకునిగా పనిచేసాడు. అతని చేతిలో ఏ వాయిద్యమైనా అందంగా వొదిగి పోయేది. వాళ్ళమ్మాయి కూడా నేపథ్య గాయనిగా పేరు తెచ్చుకుంది. మా కృష్ణ తర్వాతి వాడే నేను గతంలో పరిచయం చేసిన చిత్రకారుడు ' కూచి ' . చిత్రలేఖనంలో అనేక ప్రయోగాలు చేశాడు. చేస్తున్నాడు. 
ఇంతకీ మా కృష్ణ మనం ఏదైనా చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలి నాటకం వేద్దామా అంటే అంత సమయం లేదు. అనుభవమూ లేదు. అప్పుడే విడుదలైన పూలరంగడు చిత్రంలోని బుర్రకథ మమ్మల్ని బాగా ఆకర్షించింది. దాన్ని క్లాస్ లో కృష్ణ పాడుతుండేవాడు. పుట్టుకతో వచ్చినవి కాబట్టి సహజంగానే వాడి కంఠం, శ్రుతి, లయ అన్నీ బాగుండేవి. అందుకని మేము వాడి చేత పాటలు పాడించుకుని వినేవాళ్లం. కంఠాలు బాగులేకపోయినా, శ్రుతి లయ తెలియకపోయినా వాడితో వంత పాడడానికి ప్రయత్నించేవాళ్లం. ఎక్కువగా నేను, కృష్ణ, మరో మిత్రుడు రంగ ఒక జట్టుగా వుండేవాళ్లం. మమ్మల్ని త్రిమూర్తులని పిలిచేవారు. పదోతరగతి వరకూ ఇదే పరిస్థితి. మమ్మల్ని ఎవరూ విడదీయలేకపోయారు. ఆ తర్వాత కూడా ఆర్థిక పరిస్థితులవల్ల రంగ చదువు మానెయ్యగా ఇంటర్లో గ్రూపులు వేరు కారణంగా ఒకే క్లాసులో లేకపోయినా బయిట కూడా మా స్నేహం చాలాకాలం నిరాటంకంగా కొనసాగింది. కాలక్రమేణా కృష్ణ మా వూళ్లోనే స్థిరపడగా, నేను దేశం మీద తిరుగుతున్నాను. రంగ జీవితం చాలాకాలం క్రితమే విషాదాంతమైంది.
....... చివరికి మేము రోజూ సరదాగా పాడుకునే బుర్రకథే చెబుదామని నిర్ణయించుకున్నాం. సాధారణంగా బుర్రకథలో ఒక కథకుడు, ఇద్దరు వంతలు ఉంటారు కదా !  కాకపోతే ఈ బుర్రకథకు సినిమాలో నాగేశ్వరరావు, జమున ఇద్దరు కథకులు వుంటారు. ఒక కథకుడుగా, పాటగాడుగా కృష్ణ వున్నాడు. మరి రెండో కథకుడు ఎవరు ? మాకిద్దరికీ పాడటం రాదు. అప్పుడు బుర్రకథ కళాకారుడు కూడా అయిన మా డ్రాయింగ్ మాస్టారు సుబ్బారావు గారు కృష్ణనే ఇద్దరి పాట పాడమని చెప్పి ఆ సమస్య పరిష్కారం చేశారు. మేం కేవలం ' తందాన తాన ' అనే వంతపాటకు, డైలాగ్ భాగానికి మాత్రమే పరిమితమయ్యాం. దాంతో ఊపిరి పీల్చుకున్నాం గానీ మరో సమస్య. కథకుడు తంబూరా భుజాన్న వేసుకుని మీటుకుంటూ పాడేస్తే సరిపోతుంది. అతని పాటలో తంబురా మీటాడా లేదా అన్నది సరిగా వినిపించదు కూడా ! కానీ వంతల పని అలా కాదు. ఢక్కీ లనే వాటిని భుజాన తగిలించుకుని లయబద్ధంగా వాయిస్తూ కథకుడి పాటకు సహకరించాలి. మాకయితే ఉత్సాహమే గానీ సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేదు. వాయిద్యాలు చూడడమే గానీ వాయించడమసలే రాదు. పైగా ఢక్కీ వాయించడం మరీ అంత సులువు కాదు. 
ఒక వైపు చర్మ వాయిద్యమే కానీ మరో ప్రక్క ఖాళీగా వుండే లోహపు గొట్టం వుంటుంది. వాయించేటపుడు ఒక ప్రక్క దరువు వేస్తూ, మరో ప్రక్క ఆ గొట్టాన్ని చేత్తో మూస్తూ, తెరుస్తూ వుండాలి. ఇదంతా లయబద్ధంగా జరగాలి. పాట ఎలాగూ అంత తక్కువ సమయంలో నేర్చుకుని శ్రుతి పక్వంగా పాడటం సాధ్యం కాదు. అందుకని ఢక్కీ వాయించడం సాధన చెయ్యడం ప్రారంభించాము. అయితే సాధనకు ఢక్కీలెవరిస్తారు ? అందులోనూ మాకు ఆలోచనలు ఎక్కువయినా, వయసు తక్కువ కావడం వలన పాడు చేస్తామనే వుద్దేశ్యంతో ఎవరూ ఇవ్వడానికి ఇష్టపడలేదు. మా మాస్టారు మాత్రం ఆరోజుకు ఎలాగో తెస్తాను, ఈ లోపు ఎలాగోలా ప్రాక్టీస్ చేయండి అన్నారు. అందుకని ఓ వుపాయం ఆలోచించాము. అదేమిటంటే పెద్ద మంచి నీళ్ళ గ్లాసులు తీసుకుని వాటితో ప్రాక్టీస్ మొదలు పెట్టాం. మూసివున్న వైపు కుడి చేత్తో దరువు వేస్తూ, తెరచి వుండే ఎడమవైపు మూస్తూ, తెరుస్తూ అచ్చం ఢక్కీ ల మాదిరిగానే వాయిస్తూ ప్రాక్టీస్ చేశాం. ఈ ఐడియా మాత్రం ఎవరు ఇచ్చారో గుర్తు లేదు. అలా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేశాక ఢక్కీ వాయించడం కొంచెం బాగానే వచ్చేసింది. ఆరోజు ఉదయం మా మాస్టారు నిజమైన ఢక్కీలు తెచ్చి ఇచ్చారు. దాంతో మళ్ళీ ప్రదర్శన సమయం దాకా ప్రాక్టీస్ చేశాం. మొత్తానికి ప్రదర్శన సమయానికి ఫర్వాలేదు అన్న ధైర్యం వచ్చేసింది. డి.ఇ.వో. గారి ముందు ధైర్యంగా బుర్రకథ చెప్పేసాం ! ఆయన మెచ్చుకోవడంతో బాటు సినిమా బుర్రకథలు కాకుండా అసలైన బుర్రకథలు నేర్చుకోమని ఓ సలహా కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత నేర్చుకోవాలనుకోవడమే మిగిలింది గానీ నేర్చుకున్నది లేదు. ఇదండీ మా బుర్రకథను గురించిన కథ. ఈ బుర్రకథలో చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికీ మార్పులేదు. ఇకముందు కూడా వుండదేమో !

పూలరంగడు చిత్రంలో స్వరాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల, సుశీల పాడిన బుర్రకథ వినండి.....అర్థరూపాయి నిజాయితీ


చిన్నప్పటి చిలిపి చేష్టలు కొన్నిటిని ఇప్పుడు తల్చుకుంటుంటే వింతగా అనిపిస్తాయి. చీకూ చింతా లేని జీవితం. హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేసాం. ఇప్పటి పిల్లలకు అంత అదృష్టం లేదేమోననిపిస్తుంది. నేను ఘంటాపధంగా చెప్పగలను.... మాది బంగారు బాల్యం అని. ఒక ప్రక్క పెద్దలు ఎంత కట్టడి చేస్తున్నా అంతా స్వేచ్ఛా అనుభవించాం. ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఒక రసవత్తర ఘట్టం. జీవిత చరమాంకంలో నెమరువేసుకోవడానికి మిగిలేవి ఈ జ్ఞాపకాలే ! ఆ మధుర జ్ఞాపకాల్ని కోల్పోతున్న ఇప్పటి పిల్లల్ని చూస్తుంటే జాలి వేస్తూ వుంటుంది. సరే ! విషయానికి వద్దాం........

ఏడో తరగతిలోననుకుంటాను. ఒకరోజు ఇంటర్వల్ లో స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటున్నాం. చిన్నప్పుడు ఆటల్లో మునిగిపోతే ప్రపంచం తెలీదు. అలాగే ఆరోజు కూడా మునిగిపోయి వున్నాం. ఇంతలో బెల్ వినబడింది. అంతే ఆట కట్టేసి పరుగు పెట్టబోతుండగా గ్రౌండ్ లో ఒక అర్థ రూపాయి బిళ్ళ మిలా మిలా మెరుస్తూ కనబడింది. ఒకసారి ఆగి చూశాం. తీసి ఎవరిదని అందర్నీ అడిగినా ఎవరూ తమది కాదంటే తమది కాదన్నారు. ఒక ప్రక్క క్లాస్ టైమ్ అయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అంతే మా హెడ్మాస్టర్ దగ్గర నిలబడ్డాను. చేతిలో వున్న అర్థరూపాయి ఆయన టేబుల్ మీద పెట్టి గ్రౌండ్ లో దొరికిందనీ, ఎవరిని అడిగినా తమది కాదన్నారని చెప్పాను. ఆయన దాన్ని సొరుగులో వేసుకుని నేను కనుక్కుంటాలే నువ్వు క్లాస్ కి వెళ్ళు అన్నారు. వెళ్లిపోయాను. సాయింత్రం స్కూల్ అయిపోయింది. ఇంటికెళ్లిపోయాను.

బట్టలు మార్చుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని పాలు తాగుతుండగా అమ్మ అడిగింది..... పుస్తకం కొనుక్కోవాలన్నావు. కొనుక్కున్నావా ? అని. అప్పుడు గుర్తుకొచ్చింది ఆటల్లో పడి పుస్తకం కొనుక్కోవడం మర్చిపోయానని. ఆ విషయమే అమ్మకు చెప్పాను. అయ్యో ! ఆ బట్టలు మాసిన బట్టల బుట్టలో పడేసానే... డబ్బులు అందులో వుండిపోయాయేమోనని అమ్మ కంగారుగా ఆ బుట్ట తెరిచి బట్టలు బయిటకు తీసింది. చూస్తే....  అందులో డబ్బులేవీ ? ఆ విషయమే అడిగింది.... డబ్బులేవిరా అని. పాలు తాగుతూ మళ్ళీ ఆడుకోవడానికి ఎలా బయిటకు వెళ్లాలా అని ఆలోచిస్తున్న నేను  ' ఏమో నాకేం తెలుసు ? ' అన్నాను. ' ప్రొద్దున్న ఇచ్చాను కదా పుస్తకం కొనుక్కోవడానికి. ఏం చేశావు ? ఎక్కడైనా పదేశావా ? ' అనేటప్పటికి ఈ లోకంలోకి వచ్చాను. గబ గబా ఆలోచించాను. మధ్యాహ్నం ఆడుకునేటప్పుడు దొరికిన... హెడ్మాస్టర్ గారికిచ్చిన....  అర్థరూపాయి గుర్తుకొచ్చింది. ఉదయం అమ్మ పుస్తకం కొనుక్కోమని నా జేబులో పెట్టి గుర్తుంచుకోమని చెప్పిన అర్థరూపాయి గుర్తుకొచ్చింది. ఇంకేం ! లెక్క సరిపోయింది. అప్పుడు అర్థరూపాయి విషయం అర్థమయింది. స్కూల్లో హెడ్మాస్టర్ గారికిచ్చింది నాదేనన్నమాట. ఆటల ధ్యాసలో నా జేబులోంచి జారిపోయిన అర్థరూపాయి నాకే దొరికితే నిజాయితీపరుడిలాగా హెడ్మాస్టర్ గారికి అప్పగించానన్నమాట. జరిగిందంతా అమ్మకు చెప్పి రేపు ఉదయం హెడ్మాస్టర్ గారిని అడిగి తీసుకుని పుస్తకం కొనుక్కుంటానని చెప్పి బామ్మగారి కంట పడకుండా ఆటలకి జారుకున్నాను.


మర్నాడు స్కూల్ కి వెడుతూనే హెడ్మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళాను. అసలే ఆయనంటే భయం. ఈ విషయం అడిగితే ఏమంటారోనని కంగారు పడుతూనే నిన్న ఇచ్చిన అర్థరూపాయి నాదేనని చెప్పాను. ఆయన వింతగా నాకేసి చూసి ' నిన్న నువ్వే కదరా ! దొరికిందని ఎవర్నడిగినా వాళ్ళది కాదన్నారని చెప్పి ఇచ్చావు. ఇవాళ నీదంటావేమిటీ ? నువ్వు చెప్పేది నిజమేనా ? ' అనడిగారు. ' నిజమేనండీ ! నిన్న పుస్తకం కొనుక్కోవడానికి మా అమ్మ దగ్గర తెచ్చుకున్నాను. ఆటల్లో పడి ఆ విషయం మర్చిపోయాను ' అన్నాను భయపడుతూనే. హెడ్మాస్టర్ మా క్లాస్ టీచర్ ని పిలిచి విషయం చెప్పి ఎవరైనా ఆ డబ్బు పోయినట్లు ఫిర్యాదు చేస్తే వీడి దగ్గర తీసుకుని ఇచ్చేయ్యమని చెప్పి ఆ అర్థరూపాయి నాకిచ్చేశారు. మా నాన్నగారి గురించి మా కుటుంబం గురించి వాళ్ళందరికీ బాగా తెలిసుండడం వల్ల కొంచెం సులువుగానే నా మాట నమ్మారు. అసలు అర్థరూపాయి గురించి ఇంత గొడవా అనుకోకండి. 1967-68 ప్రాంతాల్లో అర్థరూపాయికి ఎంత విలువ వుండేదో మీకు తెలియకపోతే అప్పటి తరానికి చెందిన వాళ్ళనెవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు.

అదండీ నా దగ్గర్నుంచి వెళ్ళి నా దగ్గరికే తిరిగొచ్చిన అర్థరూపాయి నిజాయితీ !  ఇంతకీ ఇందులో నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే గ్రౌండ్ లో దొరికిన అర్థరూపాయిని నేనే వుంచేసుకోకుండా తీసుకెళ్లి హెడ్మాస్టర్ గారికి అప్పగించిన నాది అసలైన నిజాయితీయా ? ఈ అర్థరూపాయి మీ ఎవరిదైనానా అని అడిగినపుడు నాదే అని తమది కానిదాన్ని తీసేసుకోకుండా...  తమది కాదని చెప్పిన నా మిత్రులది అసలైన నిజాయితీయా ?

................ మీకేమైనా అర్థమైతే కొంచెం చెప్పి దశాబ్దాల ఈ సందేహం తొలగించి పుణ్యం కట్టుకోండి.
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం