మానవులందరూ మహనీయులు కాలేరు
మహనీయులు మాత్రం కారణజన్ములవుతారు
లోకకళ్యాణం కోసం తమ జీవితాలను త్యాగం చేస్తారు
అఖండమైన కీర్తిని మూటగట్టుకుని అమరజీవులవుతారు
తెలుగువారి అస్థిత్వం కోసం అలుపెరుగని పోరాటం చేశారు పొట్టి శ్రీరాములు
ఆత్మార్పణతో ఆంధ్రులకు రాష్ట్రం సాధించి పెట్టి అమరజీవి అయ్యారు
.... అమరజీవి పొట్టి శ్రీరాములు నడయాడిన నేల. అత్యున్నత ఆశయం కోసం, ఆంధ్రుల చిరకాల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 58 రోజులపాటు కఠోర దీక్ష చేసిన చోటు, ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా దీక్షాకంకణ బద్ధుడై, తుది శ్వాస వరకూ ఆంధ్రుల పౌరుషాన్ని నిలబెట్టి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అనితర సాధ్యమైన ఆమరణ దేక్ష చేసిన ప్రదేశం చెన్నై నగరంలోని మైలాపూర్ ప్రాంతం. ఆ ప్రదేశంలో అడుగుపెడుతూనే ఒక రకమైన ఉద్వేగం. ఆ మహనీయుడు చేసిన త్యాగమే ఆంధ్రుల ఉనికికి ఆలంబన అయింది. దశాబ్దాల పోరాటం సఫలం చేసింది. ఆ విషయం తల్చుకుంటుంటే ఒక విధమైన పులకింత. ఆయన దీక్ష చేసిన చోటు, ఆయన సమాధి, అక్కడ ప్రతిష్టించిన విగ్రహం.... వీటన్నిటి వెనుక ఆయన దీక్షా దక్షత, పట్టుదల, త్యాగం... ఇవన్నీ కనిపిస్తాయి. ఆంధ్ర దేశంలోని ప్రతి అణువణువులో ఆయన ఉనికి వుంది. అయితే ఆ ఉనికి గుర్తించి, ఆ స్ఫూర్తినుంచి ప్రేరణ పొందితేనే ఆయన ఆశయాన్ని సాధించినట్లు అవుతుంది.
పొట్టి శ్రీరాములు గారు దీక్ష చేసిన ప్రదేశంలో అడుగుపెట్టడమే అదృష్టం అనుకుంటే... ఆయన 116 వ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం నేను చేసుకున్న పుణ్యం. మనం ఎలాగూ మహానుభావులం కాలేము. కనీసం అటువంటి మహనీయులను స్మరించుకుని తరిస్తే... వారి ఆశయాల సాధనకు మన వంతు కృషి చేస్తే.... మన జన్మ ధన్యం.
ఒకసారి సందర్శించినందుకు, ఆ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు నేనే అదృష్టవంతుణ్ణి అనుకుంటుంటే.... నిత్యం ఆయనని, ఆయన ఆశయాలను సజీవంగా వుంచి, వారి స్ఫూర్తిని అందరికీ పంచుతున్న చెన్నైలోని " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు నిజంగా ధన్యులు. ఆయన 58 రోజుల దీక్ష తర్వాత ఆత్మార్పణ చేసిన ప్రదేశంలోనే ముచ్చటైన స్మారక భవనం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆయన స్మృతికి నివాళి గా అనేక కార్యక్రమాలు నిర్వహణకు రూపకల్పన చేస్తున్న ఆ సంస్థ సారధి శ్రీ వై. రామకృష్ణ గారు అభినందనీయులు.
ఈ నెల 12 వ తేదీ శనివారం రోజున వారు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతిని వైభవంగా చెన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో నిర్వహించారు. ఆ సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న రచయిత, రంగస్థల నటులు శ్రీ వాడ్రేవు సుందరరావు గారు పొట్టి శ్రీరాములు గారి జీవిత చిత్రాన్ని ఆహుతుల కళ్ల ముందు ఆవిష్కరించారు. దీక్ష ప్రారంభానికి ముందే పొట్టి శ్రీరాములు గారు తన దీక్షను ఆమరణ దీక్షగా ప్రకటించారు అనేదానికి నిదర్శనంగా అప్పటి వార్తాపత్రికలను కూడా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారు యువజనుల కోసం ప్రారంభించిన
త్రైమాసిక అంతర్జాల పత్రిక " యువ " ను ఆవిష్కరించారు.
ఆ పత్రిక లింక్ :
అమరజీవి ఆశయాలను, తెలుగువారి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న చెన్నై లోని తెలుగువారిని, తెలుగు రాష్ట్రాల్లోని వారందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగు భాష, తెలుగు సంస్కృతి పరిరక్షణ మన ప్రధాన ఆశయం కావాలి. తెలుగు వారి పౌరుషాన్ని ప్రదర్శించి మన ఉనికిని కాపాడుకోవాలి.
పొట్టి శ్రీరాములు లాంటి ఎందరో మహానుభావులు తెలుగు జాతి ఉన్నతికి కృషి చేశారు. వారినందర్నీ స్మరించుకునే విధంగా చెన్నైలోని ' పొట్టి శ్రీరాములు స్మారక భవనం ' లో ఆ మహనీయులందరి చిత్రపటాలను ఏర్పాటు చెయ్యడం అభినందనీయం. ఆ కార్యక్రమం లో పాల్గొని ఆ మహనీయుని స్మరించుకునే అవకాశం దక్కడం నా అదృష్టం.
ఆ అవకాశాన్ని కల్పించిన " అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ " వారికి కృతజ్ఞతలతో.....
ఈరోజు " అమరజీవి పొట్టి శ్రీరాములు " గారి 116 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ....
Visit web magazine at
www.sirakadambam.com
Vol. No. 07 Pub. No. 014