Wednesday, April 19, 2017

ముట్నూరి కృష్ణారావు పంతులు గారు



ఆంద్రప్రదేశ్ లోని ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో మణి కిరీటం వంటివారు శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు గారు. వేదాంతము, దేశభక్తి, సాహిత్యము త్రివేణి సంగమం ఆయన సంపాదకీయాలలో ఉరికెత్తుతూ తెలుగువారిని 
ముంచెత్తుతూ  ఉండేవి. హిమవన్నారము వంటి ఆయన రూపం, మంచు వంటి తెల్లని దుస్తులు ధరించి, తెల్లని తలపాగా చుట్టి ఆయన ఠీవిగా నడుస్తుంటే బందరులో ప్రజలు దారి లో తప్పుకోనేవారుట.
కృష్ణా జిల్లా తరఫున వెలువడే కృష్ణా పత్రికకు 1903 లో సహాయ సంపాదకులుగా పని చేశారు. 1905 లో గుంటూరు మండలం విడిపోయిన సందర్భంలో కొండా వెంకటప్పయ్యగారు గుంటూరు వెళ్లిపోవడంతో ఆనాటి నుంచి కృష్ణారావు గారు కృష్ణాపత్రికకు సంపాదకులయారు. 
దేశానికి స్వాతంత్ర్యం రాని రోజుల్లో కృష్ణారావు గారు ప్రజలను ఉత్తేజపరుస్తూ భావ స్ఫోరకమైన సంపాదకీయాలు వ్రాసేవారు. ఆయన పత్రికలో సాహిత్యానికి, నాటకానికి, చిత్రకళలకు, ఆధ్యాత్మికతకు ప్రముఖ స్థానం ఇచ్చి కృష్ణాపత్రికను ఉన్నత శిఖరంపై అధిష్టింపచేసారు. కృష్ణాపత్రికలో ఒక వ్యాసం గాని, ఒక కధ గాని, ఒక గేయం కాని ప్రచురితమైతే రచయితలకు ఎంతో గర్వకారణం గా వుండేది.  
కృష్ణారావు గారు చాలా గంభీరమైన వ్యక్తి. కాని హాస్యోక్తులు విసురుతూ వుండేవారు. వారి గంభీరత గురించి ఒక సంఘటన వివరిస్తాను. కాంగ్రెసు ప్రచారం ఊళ్ళల్లో విరివిగా సాగుతున్న రోజులవి. డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు, చెరుకువాడ నరసింహం పంతులుగారు, గురుజాడ రాఘవ శర్మ గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు వూళ్ళకు వెడుతూ కృష్ణారావు గారిని కూడా ఆహ్వానించేవారు. వారు వెళ్లి ఉపన్యాసాలివ్వడానికి అంగీకరించే వారు కాదు." పోనీ మా వెంట రండి..... కొంత గౌరవం ఏర్పడుతుంది " అని వారు బలవంతం చేసి తీసుకు వెడుతూ వుండేవారట. ఒకసారి అలా వెళ్ళినపుడు పట్టాభి గారు " కృష్ణారావూ వేదిక మీద కూర్చో. అధ్యక్షుడు గానూ ఉంటావు....... అందరికి కనిపిస్తావు అన్నారుట. సభా ప్రారంభంలో కృష్ణారావు గారు పక్కనున్న వ్యక్తిని వేలితో సౌజ్ఞ చేసారుట, సభ ప్రారంభించమన్నట్లు. తరువాత వారిని అంటే – మౌనం గానే ఆజ్ఞాపించారట. అలా అందరూ అయిన తరువాత సభ పూర్తి అయింది అంతా లేవవచ్చు అన్నట్లు చేతితోనే చెప్పారట.
సభకు వచ్చిన ఒక రైతు " పాపం ! ఏమిచేస్తాం ! మనిషి చూస్తే మహారాజులా వున్నాడు. మాట మాత్రం లేదు.... భగవంతుడలా పుట్టించాడు గావున్ను...... ఆ రూపానికి మాట కూడా వుంటే ఎంత  గొప్పవాడయ్యే వాడో ! అని ఎంతో విచార పడ్డాడట.
- తటవర్తి జ్ఞానప్రసూన
  
Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 016

Monday, April 17, 2017

భర్తృహరి సుభాషితాలు 01


పద్మాకరం దినకరో వికచం కరోతి
 చంద్రో వికాసయతి కైరవచక్రవాలం,
నాభ్యర్ధితో జలధరోపి జలం దదాతి,
సంత: స్వయం పరహితే విహితాభియోగా:

ద్యుమణి పద్మాకరము విక చముగ చేయు
కుముదహర్షంబు గావించు నమృతసూతి,
యర్ధితుడు గాక జలమిచ్చు నంబుధరుడు;
సజ్జనులు కారె పరహితా చరణమతులు.
తామరకొలను అడుగకముందే సూర్యుడు తామరకొలనును వికసింపజేయుచున్నాడు.
తెల్లకలువల సముదాయమును చంద్రుడు తానే విరియించుచున్నాడు.
ఎవరిచేతనూ యాచింపబడకనే మేఘుడు నీటిని ఇచ్చుచున్నాడు. అదే విధముగా సత్పురుషులెప్పుడూ ఇతరులకు హితము కూర్చుటకే ఇష్టపడుట లోక సహజము.
********************************************
ఏతే సత్పురుషా: పరార్ధఘటకా స్స్వార్ధాన్ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్ధ ముద్యమభృత: స్వార్ధావిరోధేన యే,
తేZమీ మానుషరాక్షసా: పరహితం స్వార్ధాయ నిఘ్నంతి యే
 యే తు ఘ్నంతి నిరర్ధకం పరహితం తే కే న జానీమహే.

తమకార్యంబు పరిత్యజించియు పరార్ధప్రాపకుల్ సజ్జనుల్,
తమకార్యంబు ఘటించుచున్ పరహితార్ధవ్యాపౄతుల్ మధ్యముల్,
తమకైయన్యహితార్ధ ఘాతుకజనుల్ దైత్యుల్,వౄధాన్యార్ధభం
గము గావించెడువార లెవ్వరొ యెరుం గన్ శక్యమే యేరికిన్?

స్వకార్యములను విడిచి పరులకార్యములను చేయువారు సత్పురుషులు. తమ కార్యములకు భంగము లేకుండా పరుల కార్యములను చేయువారు మధ్యములు అనబడతారు. స్వప్రయోజన నిమిత్తమై పరులకార్యములను చెడగొట్టువారు మనుష్యులలో రాక్షసులు. తమకు ఏమాత్రమూ ప్రయోజనము లేకున్నాపరులకు నష్టము చేయువారికి ఏపేరు పెట్టవలెనో ఎవరికీ ఎరుంగ శక్యము కాదు.
********************************************
పాపాన్నివారయతి,యోజయతే హితాయ,
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి ,
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే;
సన్మిత్రలక్షణ మిదం ప్రపదంతి సంత:
అఘమువలన మరల్చు,హి తార్ధకలితు
జేయు, గోప్యంబు దాచు, పో షించు గుణము,
విడువ డాపన్ను,లేవడి వేళ నిచ్చు;
మితృ డీ లక్షణంబుల మెలంగుచుండు.
పాపకార్యములనుండి తప్పించుచు
ధర్మోపదేశము చేయుచు మంచిపనులను చేయుటకు ప్రేరేపించుచు రహస్యములను కాపాడుచు సద్గుణములను ప్రకటించుచూ ఆపద సమయమున విడువక అవసరమైన సమయమున ఆర్ధిక సహాయము చేయుచు, క్షీరనీర న్యాయమున మంచి మిత్రుడు మెలగవలెను.
- ఎర్రమిల్లి శారద



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 08 Pub. No. 015
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం