Sunday, May 13, 2012

క్షమాస్వరూపిణి

చిత్రం : శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన
మనకు జీవితాన్నిచ్చిన ...... 
ఆ జీవితానికి వెలుగు నిచ్చిన ....... 
ఆ  వెలుగుకో విలువనిచ్చిన ..... 
అమ్మకు మనమేం ఇవ్వగలం..... 
అమ్మ త్యాగానికి విలువేమి కట్టగలం.... 
అవసరం తీరాక, వయసు మళ్ళాక.....   
అంత శ్రద్ధగానూ చూసుకుని ఋణం తీర్చుకుంటే చాలు. 
ఏ  వృద్ధాశ్రమానికో, శ్మశానానికో అప్పగించకుండా వుంటే అదే పదివేలు. 

యాంత్రిక మవుతున్న, కుచించుకు పోతున్న  మనస్సులు సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మని, ఆమె త్యాగాన్నీ  ఒక్కసారి మనసారా తలుచుకోవాలని కోరుకుంటూ ............    

 అమ్మలందరికీ మాతృ దినోత్సవ వందనాలతో.................... 


గతంలోని టపాలు : 


అమ్మంటే కమ్మని భావన
జానపద గీతం ఆమె స్వరంలో పదం పాడింది. అఖిలాంధ్ర శ్రోతల మనస్సులను పరవశింపజేసింది. ఆవిడే వింజమూరి సీత, అనసూయ జంటలో శ్రీమతి అనసూయ. 
మాతృ దినోత్సవం సందర్భంగా జానపద గీతాలకు తల్లి లాంటి ఆమెతో  పరిచయ  కార్యక్రమం శ్రీమతి దుర్గ డింగరి టోరి రేడియోలో పాటలపల్లకిలో ఈరోజు మధ్యాహ్నం గం. 12.30 నుండి గం. 02.30 వరకూ ( సమయంలో మార్పు జరిగింది ) నిర్వహిస్తున్నారు. విని అనందించండి......     
.

ఆమ్మకున్న అంతులేని సహనాన్ని, క్షమాగుణాన్ని వివరించే శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి వ్యాసం చదవండి.......


క్షమాస్వరూపిణి 


          అమ్మ అన్న మాట తలుచుకోగానే మనసు ఆర్ద్రమై పోతుంది. కళ్ళు ఆమె పాదాల మీదకు వెళ్ళిపోతాయి, భావాలు పవిత్రతను సంతరించుకొని ఆమెకు అంకితమయి పోతాయి. కళ్ళు తెరిచిన క్షణం నుంచి కనిపించే దేవత  అమ్మ. అమ్మ అనే పదంలోనే క్షమాగుణం దాగి ఉందేమో ?  మా అమ్మకి విపరీతమైన సహనం, ఆ సహనం చూసి అవతల వాళ్ళు జుట్టు పీక్కొంటారు, ఇదెక్కడి సహనం బాబూ ! అని, కానీ మా అమ్మ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన సహనాన్ని వదులుకోలేదు. సహనం వున్న వాళ్ళకే నిత్య జీవితంలో చిన్నవి, పెద్దవి సమస్యలు ఎదురౌతూ వుంటాయి. చిరునవ్వుతో వాటికి స్వాగతం పలుకుతూ వుంటారు.
              మా నాన్నగారి తండ్రి అయిదు ఊళ్ళు కరిణీకం చేసి ఆస్తిపాస్తులతో దర్జాగా పెరిగాడు. అన్నగారి దగ్గర అన్నిటికి " సరే “ " సరే " అనడంతో ఆస్తి అంతా హారతి కర్పూరం లాగా హరించుకుపోయింది. నలుగురికి పెట్టడం, నలుగురికి ఇవ్వడం అనే స్వభావం మాత్రం తాతయ్యకి ఊపిరి వున్నన్నాళ్ళూ వదలలేదు. నా చిన్నప్పుడు మేము బందరులో వుండే వాళ్ళం మేడమీద కాపురం. ఇల్లు అద్దెకిచ్చి బాడుగ తీసుకోవడమే  కానీ సౌకర్యాలు కల్పించడం ఇంటి వాళ్లకి అనవసరం. మాకు పైకి నీళ్ళు వచ్చేవి కావు. పంపు వుండేది. పని చేసేది కాదు. ప్రతి నీటి బొట్టు కిందనుంచి రావాల్సిందే ! పనివాళ్ళ సహాయం అంతంత మాత్రమే ! నాకు ఈ కష్టాలు తెలుసు కానీ సహాయం చేసే వయసు లేదు.   
                  మంచి ఎండాకాలం. మా తాతయ్య వచ్చాడు. బందరులోనే మా రెండో పెద్దనాన్న వుండేవారు. ఆయనకీ భార్య గతించింది. ముగ్గురు పిల్లలు. మా పెద్దనాన్నగారికి ఒక గురువుగారు వుండేవారు. ఆయన వైష్ణవ భక్తుడు. మా పెద్దనాన్న అన్ని వ్యవహారాలూ ఆయన సలహాతో చేసేవారు. అది మా తాతయ్యకి నచ్చేదికాదు. ఏదో విషయంలో మాటా మాటా వచ్చి తాతయ్య అక్కడికి వెళ్లడం మానేసాడు. మా పెదనాన్న వుండటం కూడా గురువుగారి ఇంట్లోనే అద్దెకుండేవారు.   
          సరే ! అసలు సంగతికి వద్దాము. ఆ రోజు మా ఇంటికి ఎవరో భోజనానికి వచ్చారు. మా అమ్మ వంటలు చేసి అలిసిపోయి, ఒక కునుకు తీసి లేచింది.  మాఇంట్లో మూడు పెద్దబిందె నీళ్ళు పట్టే గుండిగ వుండేది. దాంట్లో నీళ్ళు పట్టేవారు. మా అమ్మ లేచి ఆ గుండిగలో నీళ్ళు ముంచుకొందామని చెంబు లోపల పెట్టింది. నీళ్ళు బరువుగా లోప తగిలాయి తీరా చూస్తే గుండిగలో పొట్టు మినపపప్పు పోసివుంది. మా అమ్మ నన్ను పిలిచి " ఇదేమిటే ! దీన్నిండా మినపపప్పు వుంది, నువేమయినా పోసావా ? అంది. లేదమ్మా అన్నాను. తాతయ్యే పోసి ఉంటాడని అర్ధమయింది. తాతయ్యని పిలిచా ! తాతయ్య వచ్చి " గారెలు వండుతారని నేనే మినప పప్పు నీళ్ళల్లో పోసా ! “ అన్నాడు. మా  అమ్మకి నోట మాట రాలేదు కాని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఒక్కసారి నన్ను అడిగి పోయ్యవచ్చుగా అనుకొంది. దీనికి రెండు కారణాలు. పొట్టుపప్పు కడగటానికి నీళ్ళు ధారాళంగా కావాలి. నీళ్ళు లేవు. రెండోది పప్పురుబ్బటానికి ఆ రోజుల్లో ఎలెక్ట్రికల్ మిక్సీలు, గ్రైండర్లు లేవు. చిన్నసంసారం, చిన్నరోలు. రెండుశేర్ల పప్పు ఎప్పటికి రుబ్బగలదు ? మా అమ్మ సన్నగా రివటలా వుండేది. బలహీనురాలు. " ఇంత పప్పు ఎందుకు పోసారు ? " అంది ధైర్యం తెచ్చుకొని మా తాతయ్యకి రయ్యిమని కోపం వచ్చింది. తన పొట్టమీద చేత్తో కొట్టుకొంటూ " నా పొట్ట పెద్దదే ! కాస్తా కూస్తా చాలదు. నువ్వు రుబ్బకపోతే నే రుబ్బుతాలే ! “ అన్నాడు విసురుగా. అమ్మ కిందకి వెళ్లి నీళ్ళు తెచ్చి పప్పు కడిగింది. రుబ్బు పొత్రానికి పట్టుకొనేందుకు కర్ర పిడి వుండేది పొడుగ్గా, మా అమ్మ రుబ్బుతుంటే నేను ఆ కర్రపిడి పైనపట్టుకోనేదాన్ని. దానివల్ల మా అమ్మకి ఇబ్బంది అయేది, కానీ సహాయం తక్కువ. అందుకని అమ్మ రుబ్బుతుంటే పప్పు రోలు గుంత లోకి తోసేదాన్ని. ఘంటసేపటికి ఆ పప్పు రుబ్బటం అయింది. మా అమ్మ గారెలు చేసింది. తాతయ్యని పిలిచి గారెలు పెట్టింది. ఆయన ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని ఓ డజను గారెలు పెట్టించుకొని అవన్నీ ఒక విస్తరాకులో చుట్టి ఉత్తరీయంలో మూట కట్టాడు. మేం చూస్తూ నుంచున్నాము. “ చిన్నాడి ఇంటికి వెళ్లి వస్తానే " అని లేచాడు. “ మీరు తిని, తీసుకెళ్ళండి “ అంది అమ్మ. “ నే  తరవాత తింటానులే “ అన్నాడు తాతయ్య. “ తాతయ్యా ! నువ్వు  పెదనాన్న ఇంటికి వెళ్ళవుగా ! “ అన్నాను. “ సందు చివర నుంచుంటే ఏ మనమడో బయటికి వస్తాడుగా ! అప్పుడు ఇచ్చి వస్తా ! “ అని తాతయ్య వెళ్ళాడు. ఆయన ప్రేమకి జోహారులు అంది అమ్మ. కానీ తాతయ్యని ఏమీ అనలేదు. తరవాత రెండు రోజులు మా అమ్మ లేవలేదు. మా నాన్నగారికి ఇదంతా తెలిసి కోపం వచ్చింది కాని ఆయనా తాతయ్యని ఏమీ అనలేదు. మా అమ్మ సహనమే మా నాన్నగారి నోరు మూయించేదేమో ?     
                                ఈ సంఘటన గుర్తుకు వచ్చినపుడల్లా అనుకొంటాను. " అమ్మా ! నీ  సహనంలో  వందోవంతు వుంటే చాలమ్మా ! జీవితం శాంతంగా గడిచిపోతుంది " అని. మా అమ్మ ఏమిటి ? అమ్మలందరికి సహనం వుంటుంది. లేకపోతే అసహాయులైన పసిగుడ్డుని ఎంత ఓర్పుతో పెంచి పెద్దచేస్తుంది అమ్మ. అమ్మని అర్ధం చేసుకొని,  చేయించుకొన్న సేవని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పుకొంటూ అమ్మని ఆనందంగా వుంచుకోగలిగితే  బిడ్డల జీవితాలు ధన్యమవుతాయి.   Visit web magazine at www.sirakadambam.com


 Vol. No. 03 Pub. No. 138

5 comments:

వనజవనమాలి said...

మా తృ దేవో భవ ..
జ్ఞానప్రసూనాంబ గారి "అమ్మ" కన్నీళ్లు తెప్పించింది. అలాటి అమ్మలందరికి శిరసా నమామి !
మంచి విషయాలు తెలిపే పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదములు.

Jaya Peesapaty said...

శ్రీమతి తటవర్తి జ్ఞానప్రసూన గారి వ్యాసం కన్నీళ్లు తెప్పించింది ...

Padmini Bhavaraju said...

ఆ రోజుల్లో ఆడవాళ్ళకి అంత సహనం ఎలా ఉండేదో. గ్రయ్న్దర్ లు మిక్సీ లు లేకపోయినా అండ మందికి పొట్టు పొయ్యిల మీద, కట్టెల పొయ్యి మీద వండి పెట్టే వాళ్ళు. రోజంతా గానుగేద్దుల్లా, పని చేస్తూనే ఉండేవాళ్ళు. భూదేవి తో సమానమయిన వారి సహనంలో, వెయ్యోవంతు కూడా, ఇప్పటి మాకు లేదు.

Durga said...

జ్ఞాన ప్రసూన గారి వ్యాసం నాకు మా అమ్మని గుర్తుకి తెచ్చింది. మా ఇంటికి ఎప్పుడు, ఏ సమయంలో అతిథులు వచ్చినా లేచి వండిపెట్టడం మా అమ్మ మరో మాట మాట్లాడకుండా వారికిష్టమయినట్టుగా చేసి పెట్టేది. అంత చేసినా మా అమ్మ గురించి ఒక్కళ్ళు కూడా మంచి మాట మాట్లాడటం నేను వినలేదు. అమ్మలు అది పెద్దగా పట్టించుకోరేమో!
చాలా బాగా రాసారు జ్ఞాన ప్రసూన గారు.
టోరిలో ప్రసారమయిన ఇంటర్వ్యూ గురించి బ్యానర్ పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు.
అభినందనలతో,
దుర్గ.

SRRao said...

* వనజా వనమాలి గారూ !
* జయ గారూ !
* పద్మిని గారూ !
* దుర్గమ్మా !

ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం