Wednesday, February 29, 2012

కాలగణనం - మాసము......


 
శ్రీ నందన ఉగాది శుభాకాంక్షల సందేశాలు  
శ్రీ నందన నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం
కోటి ఆశలతో వసంతాగమనం కోసం ఎదురు చూస్తున్నాం
రాబోయే నూతన సంవత్సరంలో దేశ, విదేశాల్లో వుంటున్న తెలుగు వారందరూ సాటి తెలుగు వారికి
ఈ ఉగాది శుభాకాంక్షలు  శిరాకదంబం ‘ ద్వారా తెలపండి.
మీ పేరు, ఇతర వివరాలకు ఒక చిన్న సందేశం కూడా కలిపి
మార్చి 15 వ తేదీలోగా ఈ క్రింది ఇ -  మెయిల్ చిరునామాకు పంపండి.
మీ ఫోటో కూడా ఒకటి జత పరచవచ్చు.
గడువు తేదీలోపున వచ్చినవి మాత్రమే ప్రచురించబడతాయని గమనించ ప్రార్థన .
sirarao@gmail.com

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 122

Friday, February 24, 2012

రెండు తెలుగు కోకిలలు

ఈరోజు రెండు తెలుగు కోకిలలు నింగికెగసిన రోజు
ఒకటి సుమధుర కవితా స్రవంతి
మరొకటి హాస్యరస సజీవ స్రవంతి
మన మనసున మల్లెల మాలలు పూయించింది ఓ కలం
బుడుగుతో మన మనసుల్ని కోతికొమ్మచ్చులాడించింది మరో కలం

ఓ కలం భావకవితావాహిని
మరో కలం భాషా విన్యాస ప్రవాహం
మూగవోయిన ఓ కోకిల పాట ఆగి మూడు దశాబ్దాలు దాటింది

మరో కోకిల స్వరం మూగవోయి సంవత్సరం గడిచింది

తెలుగు జాతికి నిండు గౌరవాన్ని అందించాయి ఆ రెండు కోకిలలు
తెలుగు భాషకు నిండుతనాన్ని పంచాయి ఆ రెండు కలాలు


ఒక కోకిల దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి
మరో కలం ముళ్ళపూడి వెంకటరమణ

ఆ ఇద్దరి స్మృతికి నివాళులు అర్పిస్తూ..............



దేవులపల్లి వారి స్మృతికి నివాళిగా శ్రీ టి. వి.యస్. శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం ........................  

తెలుగు కోకిల--శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు(నేడు వారి స్మృతి దినం)

శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు ప్రముఖ తెలుగు భావ కవి.భావ కవితా ప్రపంచానికి చక్రవర్తి.తన కవిత్వం లాగానే ఆయన కూడా చాలా అందంగా వుండేవారు.బంగారు రంగు శరీరం,వెండి గిరజాలజుట్టు,చక్కని పంచెకట్టు,శాలువను షోకుగా భుజాన వేసుకొని వస్తుంటే ,వారిని చూడటానికి వేయి కళ్ళు చాలవు.ఆ రోజుల్లో యువ కవులు ఆయన కవిత్వాన్ని అనుకరించటంతో పాటు,వేష భాషలను కూడా అనుకరించారని అనటంలో ఏ మాత్రం సందేహం అక్కర లేదు.కవులకు ఒక వేషాన్నివారు నిర్దేశించక  పోయినా,ఆయనలా  వుంటేనే కవులుగా గుర్తించబడుతామనే భావనతో కాబోలు,కవులు వారి భాష కన్నా వేషాన్నే ఎక్కువగా అనుకరించారు.
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించారు.కృష్ణశాస్త్రి గారు  చిన్న వయసునుండే కవితలల్లటం ప్రారంభించారు.
విద్యాభ్యాసమంతా  పిఠాపురం హైస్కూలులో  సాగింది.ఆ రోజుల్లో వీరికి కూచి నరసింహం,రఘుపతి వేంకట రత్నం నాయుడు గార్లు ఉపాధ్యాయులుగా వుండేవారు.వారు కృష్ణ శాస్త్రి గారికి  ఆంగ్ల విద్యపై మక్కువ పెంచారు.
విజయనగరం లో  డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరారు.. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టారు..
కృష్ణశాస్త్రిగారు  ఒకపక్క  సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూనే  వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలలో తన అధ్యాపకవృత్తిని వదలి  చురుకుగా పాల్గొన్నారు. 
1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం వారి రచనలలో విషాదం అధికమయ్యింది.
తరువాత మళ్ళీ వివాహం చేసుకున్నారు.అటుపైన కొద్దికాలం పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా పని చేశారు.
కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రిగారి భావాలు నచ్చలేదు. స్వేచ్చాజీవి అయిన కృష్ణశాస్త్రిగారు ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రచారుకునిగా ఆంద్ర దేశమంతా  తిరిగి తన కవితావాణిని,బాణిని తెలుగు ప్రజలకు వినిపించి చాలామంది యువకవులను ప్రభావితం చేశారు.  ఈ సమయంలో చాలామంది కవులతో  పరిచయాలు కలిగాయి,పెరిగాయి. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని కులంనుండి వెలివేశారు. అయినా,కృష్ణశాస్త్రి గారు తన సంస్కరణాభిలాషను వదలలేదు.వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు జరిపించారు.. ఆ రోజుల్లోనే వారు "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు.1929లో విశ్వకవి రవీంద్రనాధ ఠాగూర్ తో పరిచయం ఏర్పడింది.రవీంద్రుని ప్రభావం వీరిమీద పడింది.ఆ ప్రభావంతో  కొన్ని గీతాలు కూడా రచించారు.తిరిగి కొంత కాలానికి కాకినాడ కాలేజీలో ఉపన్యాసకుడిగా కొనసాగారు.వీరి కవిత్వమంటే విపరీత అభిమానం గల  కళాదర్శకుడు శ్రీ  బి.ఎన్.రెడ్డి గారి ప్రోత్సాహంతో 1951 లో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు.ఆ సినిమాలోని పాటలు విశేష ఆదరణకు నోచుకోవటం వల్ల ఆ తరువాత అనేక చిత్రాలకు పాటలు వ్రాశారు. ఆకాశవాణిలో తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు.
గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రిగారి  గొంతు 1963లో throat cancer  వల్ల  మూగవోయింది.ఆశ్చర్యమేమిటంటే మూగవోయిన కోకిల పాటలు పాడటమే! పట్టుదలతో కవితా వ్యాసంగాన్ని కొన సాగించారు.చేతిలో చిన్నnote pad ,కలం ఎప్పుడూ ఉంటూ ఉండేవి.వారు మాట్లాడినంత 
వేగంగా ఆ note pad మీద  వ్రాసి ,వ్రాతతోనే సంభాషించేవారు.గొంతు మూగవోయిందని బాధ పడేవారు కాదు.అంతకు ముందు వ్రాసిన గీతాలకన్నా అతి మధురమైన గీతాలు వారు మూగవోయిన తరువాత వ్రాశారు.మా పినతల్లిగారు శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారి కోడలు.మా పినతల్లి గారి వివాహం 1965 లో జరిగింది.అప్పుడు నా వయసు  15 సంవత్సరాలు.S.S.L.C.చదువుతున్నాను.ఆ వివాహానికి ఎందరో కవులు హాజరు అయ్యారు.రాయప్రోలు వారికి కృష్ణ శాస్త్రి గారు పరమ ఆప్తుడు.ఆ వివాహానికి కృష్ణ శాస్త్రి గారు కూడా వచ్చారు.వారిని తనివి తీరా చూశాను.వ్రాతతో వారితో సంభాషించాను.ఆ సందర్భంలో నేను యిలా వ్రాసి చూపించాను,'దేవులపల్లివి నీవైతే,తెలదేవలపల్లిని నేను!' అని.మా ఇంటి పేరు తెలదేవలపల్లి. వారు చమత్కారంగా యిలా దానిక్రిందనే వ్రాశారు,"నాకన్నా రెండాకులు(తెల) ఎక్కువ చదివి అభివృద్ధిలోకి రావాలి!' అని ఆశీర్వదించిన  సంఘటన నాకు యింకా గుర్తు వుంది.వారికి ఒక కుమారుడున్నారు.వారి పేరు దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి గారు .అయితే వారు'బుజ్జాయి' అనే పేరుతొ ప్రసిద్ధులు.గొప్ప చిత్రకారులు.వారు కూడా దివంగతులయ్యారు. కృష్ణశాస్త్రి గారి మేనకోడలు  కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు.ఈ మధ్యనే ఆమె 90 సంవత్సరాల వయసులో గళంలో ఏమాత్రం మాధుర్యం తగ్గకుండా రవీంద్ర భారతిలో సంగీత ప్రియులకు వీనుల విందు చేశారు.వారు పాడిన'మొక్కజొన్న తోటలో' పాట విశేష ప్రజాదరణ పొందింది.
ఈ మహనీయునికి ఎన్నో సన్మానాలు జరిగాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.సాహితీ మాగాణంలో ఎన్నో పంటలు పండించిన ఈ కవి కృషీవలుడు,1980 ఫిబ్రవరి 24న 'వాణి'కి తన కవితలు వినిపించటానికి, ఈ దేహయాత్ర చాలించి 'బ్రహ్మ'లోకానికి యేగారు అంతే!
ఆయనకు మరణం ఏమిటి?వెన్నెల రాజు,కలుములరాణి,గోరువంకలు,గోరింటపొదలు,కోకిలలు ,ఆకులు ,పూలు,పులుగులు,మనసున మల్లెలు....వున్నంతకాలం ఆయన వుంటారు.ఆయన చిరంజీవి! 
కృష్ణ శాస్త్రి గారి పైన ప్రముఖుల అభిప్రాయాలు.
చలం గారు---తన బాధంతా అంతా ప్రపంచపు బాధ అనుకుంటాడు కృష్ణశాస్త్రి,ప్రపంచపు బాధంతా తన బాధ అనుకుంటాడు శ్రీ శ్రీ .
మహాకవి శ్రీశ్రీ --- నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
కృష్ణ శాస్త్రి గారు చనిపోయిన రోజున శ్రీ శ్రీ గారు యిలా అన్నారు---తెలుగుదేశపు నిలువటద్దం బద్దలైంది.షెల్లీ మళ్ళీ మరణించాడు.
కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు--- మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
వారి రచనల్లో కొన్ని.
కృష్ణపక్షము, ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి, అమృతవీణ,శర్మిష్ఠ,మహతి లాంటి పెక్కు ప్రసిద్ధ కావ్యాలను వ్రాశారు.
                                  ఈ మధుర కవికి నీరాజనాలు సమర్పించుకుందాం!

ముళ్ళపూడి వారి రచనల గురించి మిత్రులు శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు అందించిన మరో ప్రముఖ రచయిత శ్రీ రమణ వివరణాత్మక ప్రసంగం............... 
 


Visit web magazine at www.sirakadambam.com
Vol. No. 03 Pub. No. 121

Tuesday, February 21, 2012

శివతత్వమ్.......

 సృష్టి, స్థితి, లయల విశిష్టతలు ఏమిటి ?
లయకారుడిగా పిలువబడే శివుని తత్వం ఏమిటి ?

 డా. ఇవటూరి శ్రీనివాసరావు గారి ' శివతత్వం ' లో వినండి......


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 120

Monday, February 20, 2012

ఓం నమః శివాయ

సృష్టి ఎంతముఖ్యమో లయము కూడా అంతే ముఖ్యం
ఆ లయకారుడే ఈశ్వరుడు
ఆడంబరాలు, అలంకరణలు ముఖ్యం కాదు
అందుకే బూడిదే అలంకారం, పులిచర్మమే వస్త్రం శివుడికి  
రుద్రనేత్రుడు  శంకరుడు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో వెలసిన సదాశివుడు
భక్తవశంకరుడు పరమశివుడు

ఓం నమః శివాయ 
మహాశివరాత్రి సందర్భంగా మిత్రులందరికీ శుభాకాంక్షలు 


శివరాత్రి విశేషాలు, ఉపవాసం, జాగరణ విశిష్టతలు ఏమిటో ఇక్కడ చూడండి.............. 

మహాశివరాత్రి - డా. ఇవటూరి శ్రీనివాసరావు


శివరాత్రినాడు జరిగే శివపార్వతుల కళ్యాణం గురించి ఇక్కడ చదవండి.................

శివపార్వతుల కళ్యాణం - టి. వి.యస్. శాస్త్రి

 పి. సూరిబాబు గళంలో ' హరహరమహదేవా ! '  " దక్షయజ్ఞం " నుంచి..........

 


Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 119

Saturday, February 18, 2012

అద్వైత సాధకులు శ్రీ రామకృష్ణులు

మానవాళికి మార్గనిర్దేశం చెయ్యడానికి అప్పుడప్పుడు మహానుభావులు ఉద్భవిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రముఖులు పురాణ కాలంలో నరనారాయణులు అర్జునుడు, శ్రీకృష్ణుడు అయితే ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస, వివేకానందుడు ఆ కోవకు చెందుతారు.

శ్రీ ఆదిశంకరులవారి అద్వైతాన్ని అంది పుచ్చుకున్నారు రామకృష్ణులు. ఆయన బాటలో పయనించి భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు వివేకానందులు.

అద్వైతంలో పరాకాష్టకు చేరుకొని ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించి ఈ యుగంలో... ఈ కాలంలో.... ఒక విశిష్ట వ్యక్తిగా భాసిల్లిన శ్రీరామకృష్ణ పరమహంస జన్మదినం సందర్భంగా ఆయన జీవిత విశేషాలతో శ్రీ టి. వి. యస్. శాస్త్రి గారు వ్రాసిన అమూల్యమైన వ్యాసం ఈ లింకులో...........

మహాయోగి-శ్రీ రామకృష్ణ పరమహంస - టి.వి.యస్. శాస్త్రి

 

  Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 119

Tuesday, February 14, 2012

హర హర మహాదేవ ! .....

 హరోం హర ! హర హర మహాదేవ !
ఉపవాసం.... జాగరణ.... రుద్రాభిషేకాలు...... మహాశివరాత్రి ప్రత్యేకతలు.
మహాశివరాత్రికి ఇవన్నీ ఎందుకు చెయ్యాలి ? వీటి విశిష్టత ఏమిటి ?
........... ఇంకా ఈవారం శిరాకదంబం సంచికలో


Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 118

Saturday, February 11, 2012

అమర ' పాట ' శాల

వాగ్గేయకారుడు త్యాగరాజు స్మృతికి ఇప్పటికీ ఆరాధనోత్సవాలు జరుపుతుండడం మనకి తెలుసు.
మధుర గాయకుడు ఘంటసాల గారు మనందరికీ దూరమై నాలుగు దశాబ్దాలు కావస్తోంది. 
ఇప్పటికి కూడా ఆయన పాటలతో ఆంధ్రదేశమంతా స్మృత్యంజలి ఘటిస్తుండడం ఘంటసాల గారి గాన ప్రతిభకు నిదర్శనం.
అది ఆయన పాటకు దక్కిన గౌరవం.

ఆయన పాట అజరామరం
ఆయన స్వరం నిత్యనూతనం
ఇప్పుడు... ఎప్పుడూ...
తెలుగు పాట నిలిచి ఉన్నంతవరకూ
తెలుగు భాష వెలుగుతున్నంతవరకూ
ఘంటసాల పాట నిలిచి వుంటుంది.... నిలిచే వుంటుంది.

అమర ' పాట' శాల ఘంటసాల గారికి స్మృత్యంజలి ఘటిస్తూ ............ 

గత డిసెంబర్ 5  వ తేదీన ఘంటసాల గారి జన్మదినం సందర్భంగా వారి కుమార్తె శ్రీమతి ఘంటశాల శ్యామల గారు ' శిరాకదంబం ' పత్రికకు ప్రత్యేకంగా రాసి పంపిన వ్యాసంతో బాటు కవి, రచయిత స్వర్గీయ దాశరధి గారు తన లలితా గీతాలతో ఘంటసాల గారికి సమర్పించిన శ్రద్ధాంజలి దుర్గ డింగరి సమర్పించిన ' పాటల పల్లకి ' కార్యక్రమం నుంచి,,,,, ఇంకా కరుణశ్రీ గారి బీద పూజ, గోవిలాపం.... ఈ క్రింది లింక్ లో ........................

నాన్నగారి 89 వ జన్మదిన పండుగ - శ్యామల ఘంటసాల 

ఘంటసాల గారి మీద గతంలోని టపాలు - 

గాన గంధర్వుడి పుట్టిన రోజు
అమర గాయకుడు
అజరామరగానం
గాన సామ్రాజ్య సామ్రాట్
గంధర్వ గానం - HMV
మధుర పాటశాల ' ఘంటశాల '

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 117

Friday, February 10, 2012

ఆగిన సుస్వరం


 తెలుగు చిత్ర సీమలో సుస్వరాలు పలికించిన సుసర్ల స్వరం ఆగింది. 
సంగీతాన్ని వారసత్వంగా అందిపుచ్చుకున్న సుసర్ల వంశాభరణం దక్షిణామూర్తి గారు. 
మరుపురాని, మరువలేని మధుర గీతాలను సృష్టించి తెలుగు చలనచిత్ర సంగీతాన్ని సుసంపన్నం చేసారు సుసర్ల.
నిన్న ఈ స్వరలోకాన్ని వదలి సురలోకానికి పయనమైన సంగీత కీర్తి... సుసర్ల దక్షిణామూర్తి గారి గురించి శ్రీ టి. వి. యస్. శాస్త్రి గారు ఘటించిన శ్రద్ధాంజలి................... 
శ్రీ సుసర్ల దక్షిణా మూర్తి గారి మృతికి  సంతాపం, శ్రద్ధాంజలి !

తెలుగు సినిమా తొలితరం సంగీత దర్శకుడూ. గాయకుడు అయిన శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు గురువారం రాత్రి చెన్నైలోని తన కుమారుని ఇంటిలో తుదిశ్వాస విడిచారని తెలియచేయటానికి దు:ఖిస్తున్నాను. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఏర్పడటం వల్ల ,వైద్యుడు వచ్చేలోపే మరణించారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. కృష్ణా జిల్లాలోని, పెదకళ్ళేపల్లిలో వీరు 11-11-1921 న శ్రీమతి అన్నపూర్ణమ్మ, కృష్ణబ్రహ్మశాస్త్రి దంపతులకు  జన్మించారు. బాల్యం లోనే వీరు తన తాత గారైన శ్రీ దక్షిణామూర్తి గారి వద్దనే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు. చిన్నతనంలోనే వయోలిన్ కచేరీలు చేశారు. 1946 వ సంవత్సరంలో నారదనారది అనే సినిమా ద్వారా సినీప్రపంచానికి పరిచయమయ్యారు. శ్రీమతి సూర్యకాంతం గారి మొదటి సినిమా కూడా ఇదే ! 1950 లో విదులైన సంసారం సినిమా ద్వారా వీరు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాద్వారానే  సావిత్రి గారు పరిచయమయ్యారు. ఆ సినిమా యెంతో విజయవంతమయింది. అందులోని ప్రతి పాటా పండిత, పామరుల మన్ననలను పొందింది. 1955 లో విదులైన సంతానం సినిమా ద్వారా లతా మంగేష్కర్ ని 'నిదురపోరా తమ్ముడా'అనే పాట ద్వారా తెలుగు వారికి కూడా పరిచయం చేసిన ధన్యజీవులు శ్రీ దక్షిణా మూర్తి గారు ! 'అన్నపూర్ణ', 'నర్తనశాల,' శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' మొదలైన సినిమాలకు వీరు అందించిన పాటలు, నేటికీ తెలుగు వారి హృదయాలలో నిలిచిపోయాయి అని చెప్పటం లో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

(వారు సంగీతం సమకూర్చిన కొన్ని మధురమైన పాటలను, మీకు అందిస్తున్నాను)


                      ఆ మహనీయునికి నా శ్రద్ధాంజలి!
భవదీయుడు,
టీవీయస్ .శాస్త్రి
 సుసర్ల వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.................  

సుసర్ల గారి గురించి గతంలో శిరాకదంబంలో టపా -

Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 116 

Thursday, February 9, 2012

నాటకాల చెళుకులు

 చెళుకులు - భమిడిపాటి 01 

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు నాటకాల మీద వేసిన చెళుకులు
****************************************************************************************************
పుల్లంరాజు : ఆ నాటకంలో వేషం వేసే ఆయనకి అంతకంతకు చెముడు ముదురుతోంది. 
విస్సన్న : వినిపించుకోవడం మానేసాడు. ఆ వినికిడి శక్తి కాస్తా ఎగిరి చక్కాపోయింది. 
పుల్లంరాజు : ఏం ? ఎందుకు మానేసాడు ? 
విస్సన్న : ఏమో ! రంగం మీద ఆయన అభినయించేటప్పుడు పుట్టే అరుపులు, తిట్లూ ఇంకా ఎన్నేళ్ళని వినగలడూ ?
 ***************************************************************************************************
 ***************************************************************************************************
వేషధారి : ఏమండోయ్. మేనేజర్ గారు. మూడో అంకం రెండో సీనులో నేను బ్రాందీ పుచ్చుగోవలసి వస్తుంది. తెప్పించి ఉంచారా ?
మేనేజర్ : తప్పకుండా బాబూ ! అదీ తెప్పించాను. అయిదో అంకం ఒకటో సీనులో నువ్వు పుచ్చుగోవలసిన విషం కూడా సిద్ధం ఇందాకే చేయించి వుంచాను.
**************************************************************************************************** 

 Visit web magazine at www.sirakadambam.com 
Vol. No. 03 Pub. No. 115

అష్టావధానం

ఆంధ్రులకే స్వంతమైన అవధాన ప్రక్రియ గురించి, హైదరాబాద్ లో ఈ ఆదివారం జరగనున్న అష్టావధాన కార్యక్రమ వివరాలు శ్రీ చింతా రామకృష్ణారావు గారు తమ ' ఆంధ్రామృతం  ' బ్లాగులో తెలియజేస్తున్నారు. ఈ క్రింది లింకులో చూడవచ్చు. 

అష్టావధానం అంటే ఏమిటి? దీని వలన ప్రయోజనమేమిటి?


  మియాపూర్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ లో అష్టావధానం.


 సాహితీ బంధువులారా !

 తే.12 - 02 - 2012 న  జయప్రకాశ్ నారాయణ్‌నగర్‌
( హైదరాబాద్. మియాపూర్ )  
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణంలో
మధ్యాహ్నం 3 గంటల నుండి
డా.కట్టమూరి చంద్రశేఖరావధాని గారిచే అష్టావధానం జరుపబడుతుంది.
 
హైదరాబాద్ లోని సాహితీ మిత్రులందరూ తప్పక పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యవలసినదిగా శిరాకదంబం విజ్ఞప్తి.

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 114

Tuesday, February 7, 2012

మాఘ స్నానాల విశేషాలు... ఇంకా.........

మౌని అమావాస్య తర్వాత ప్రవేశించిన మాఘమాసం చాలా ప్రత్యేకతలు కలిగి వుంటుంది. శారీరిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే సముద్ర స్నానాలు, సూర్యదేవునికి పూజలు ఈ మాసం ప్రత్యేకత. మాఘపూర్ణిమ రోజున తప్పనిసరిగా చాలామంది సముద్ర స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఈ మాఘమాసంలో స్నానాల ప్రత్యేకతలు, మాఘ పూర్ణిమ విశేషాలు .... ఇంకా ఎన్నో విశేషాలు ఇక్కడ.............



 పత్రికపైన, రచనల మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను sirarao@gmail.com కు పంపండి. 

ధన్యవాదాలతో..........

శి. రా. రావు

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 114

Sunday, February 5, 2012

భక్తరామదాసు కష్టాలు

తెలుగు చిత్రసీమకు నాన్నగారైన చిత్తూరు వి. నాగయ్య గారు ' భక్త రామదాసు ' చిత్ర నిర్మాణం చేపట్టారు. అటువంటి కథల్ని నిజాయితీగా తెరకెక్కించడమన్నా, అటువంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చెయ్యడమన్నా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అయితే ఆయన దురదృష్టం ఆ చిత్ర నిర్మాణం సజావుగా సాగలేదు. సుమారు ఏడు సంవత్సరాలు సాగిన ఆ చిత్ర నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని అడుగడుగునా చికాకు పెట్టాయి.

వీటికి తోడు కబీర్ పాత్రధారి, అప్పటి మేటి నటుడు గౌరీనాథ శాస్త్రి మరణం రూపంలో మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆయన పాత్ర షూటింగ్ పూర్తి కాలేదు. దాంతో గుమ్మడి గారిని ఆ పాత్రకు తీసుకుని ఆ సన్నివేశాలు మళ్ళీ షూట్ చెయ్యవలసి వచ్చింది. దాంతో ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి.

గోరు చుట్టుపై రోకటి పోటులా కన్నాంబ కూడా మరణించారు. అయితే అదృష్టం కొద్దీ కొన్ని షాట్స్ మినహా మిగిలిన భాగమంతా పూర్తయింది. ఆ షాట్స్ వేరే వారితో తీసినా ఆ విషయం ప్రేక్షకులు గుర్తించలేనంత జాగ్రత్తగా పూర్తి చేసారు. ఇన్ని కష్ట నష్టాల కోర్చి విడుదలైన ' రామదాసు ' బాక్సాఫీసు దగ్గర అపజయం పాలై నాగయ్యగారిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసాడు. 


Visit web magazine at www.sirakadambam.com 


Vol. No. 03 Pub. No. 113

Friday, February 3, 2012

నో గో కలర్

కస్తూర్బా గాంధీ గారికి ఆంగ్లంలో ప్రవేశం అంతంత మాత్రం. 

ఆవిడ ఓసారి తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచెంగోడ్ వెళ్లారు. అక్కడ గాంధీజీ ఆశ్రమం వుంది. ఆ ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు. గాంధీ దంపతులకు సన్నిహితుడైన రాజాజీ ఆమె కూడా వుండి ఆశ్రమంలోని అన్ని విభాగాలు చూపించి వివరిస్తున్నారు. అలా ఖాదీ వస్త్రాలపై అద్దకం చేసే విభాగం వద్దకు వచ్చారు. ఆ పనిని పరిశీలిస్తున్న కస్తూర్బాకు ఒక సందేహం వచ్చింది. ప్రక్కనే వున్న రాజాజీని ఇలా అడిగారు. 
" దిస్ కలర్ గో " 
రాజాజీ గారికి అర్థమైపోయింది కస్తూర్బా మాటల్లోని భావం. అక్కడ అద్దుతున్న రంగులు వెలిసిపోతాయా అన్నది ఆవిడ సందేహం. 
 రాజాజీ సహజంగా చమత్కార భాషణులు. అందుకే వెంటనే " నో ! దిస్ ఈజ్ ' నో గో కలర్ ' ! " అన్నారట. దాంతో చుట్టూ వున్న వాళ్ళు నవ్వారట. అంతే... కస్తూర్బా గారికి ఎక్కడో తేడా వచ్చిందని అర్థమైపోయింది.
" ఏం ? నేనేమైనా తప్పు మాట్లాడానా ? " అని అడిగారట. 
దానికి రాజాజీ " లేదు లేదు. ఇది కస్తూర్బా ఇంగ్లీష్ " అని మరో చమత్కారం విసిరారట. 

Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 112
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం