Friday, December 2, 2011

' విజయ ' పథం


ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా చెప్పుకుంటున్న ' ఎవరెస్ట్ ' ఒక్కరోజులో ఏర్పడలేదు. అంతటి ఉన్నతమైన రూపం సంతరించుకోవడానికి శతాబ్దాలు పట్టింది. పవిత్రమైన నదిగా చెప్పుకుంటున్న గంగ పుట్టినచోట చిన్న పరిమాణం లోనే వుంటుంది. పోను పోను విస్తృతమై అఖండ గంగగా దర్శనమిస్తుంది.

అలాగే మహానీయులందరూ తొలి రోజుల్లో సామాన్యులే ! తమ కృషితో, మేధస్సుతో ఉన్నత శిఖరాలకు ఎదిగి అందరికీ ఆదర్శ మూర్తులుగా నిలిచి పోతారు. తెలుగు సాహిత్యాన్ని, పత్రికా రంగాన్ని, సినిమా రంగాన్ని తెలుగు వెలుగులతో నింపి కొన్ని విలువలను ఆపాదించిన వ్యక్తి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఆయనే ' విజయ ' నాగిరెడ్డి.

1912 వ సంవత్సరంలో కార్తీక సోమవారం డిసెంబర్ ఒకటి అర్థరాత్రి ( తెల్లవారితే రెండవ తారీకు ) కడప జిల్లాలోని చిత్రానది ఒడ్డున  పొట్టిపాడు గ్రామంలో సహజ సుందరమైన ప్రకృతి ఒడిలో జన్మించారు నాగిరెడ్డి. తండ్రి నరసింహారెడ్డి మద్రాసులో కమీషన్ వ్యాపారం చేస్తుంటే  పల్లెటూరిలో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. రోజూ సాయింత్రం జరిగే రామాయణ, భారత, భాగవతాల పారాయణం వినడం,  రోజూ తెల్లవారకుండా లేచి పశువుల్ని బయిట కట్టి కొట్టం శుభ్రంచెయ్యడం, అమ్మ పశువులకోసం గడ్డి కోస్తుంటే మోపులు కట్టి మోసుకు రావడం లాంటి పనులు చేస్తూ వుండడం ఆయన చిన్నప్పటి దైనందిన చర్య.


ప్రకృతిని, పక్షుల్ని ఆయన ఎంత ప్రేమించేవారో ఆయన విజయ గార్డెన్స్ సంరక్షణ గురించి తెలుసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఒక ప్రాంతంలో ఏదైనా చెట్టుని తొలగించవలసి వస్తే పూర్తిగా వేళ్ళతో సహా తెగిపోకుండా వచ్చేటట్లు పెకిలించి  మరో చోట భద్రంగా పాతించి అది మళ్ళీ చిగిర్చే వరకూ ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు.

అన్నకు ( బి. ఎన్. రెడ్డి ) చదువు మీద ఆసక్తి, తమ్ముడికి  వ్యాపారం మీద ఆసక్తి. ఫలితంగా అన్న ఆడిటింగ్ చదివారు. తమ్ముడు తండ్రికి వ్యాపారంలో చేదోడు అయ్యాడు. ఇద్దరికీ స్వాతంత్ర్య పోరాటం మీద ఆసక్తి. తండ్రి అనుమతితో గ్రామాల్లో ఖద్దరు ఉద్యమం నిర్వహించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధ ఉద్యమాల్లో పాల్గొన్నారు.


1939 లో ' వందేమాతరం ' చిత్రంతో బి. ఎన్. రెడ్డి గారి వాహినీ పిక్చర్స్ ఆవిర్భావానికి మూలకారకులైన వారిలో నాగిరెడ్డి కూడా ఒకరు. ఆయన వ్యాపార దక్షతకు నిదర్శనం ' సుమంగళి ' చిత్రానికి చేసిన వినూత్నమైన పబ్లిసిటీ. చెన్నై డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కలేదనే కోపంతో కార్పోరేషన్ నుంచి వీధిదీప స్తంభాలపై బోర్డులు పెట్టే లైసెన్స్ కలిగిన వ్యక్తి అభ్యంతరం పెట్టడంతో ప్రత్యేకమైన బ్యానర్లు తయారు చేసి చెట్ల కొమ్మలకి కట్టించారు. అది వివాదమై తరవాత తొలగించినా ఒక వారం రోజులు వినూత్నంగా వుండి ప్రజల్ని ఆకర్షించి చిత్రానికి మంచి ప్రచారాన్ని తెచ్చి పెట్టాయి. చిత్రం విడుదలయిన థియేటర్ దగ్గర బ్లాకులో టికెట్లు అమ్ముతున్న వాళ్ళని సినిమా ఫక్కీలో ఫైటింగ్ చేసి దారికి తెచ్చి వారి చేతనే  బజార్లలో, ట్రాములు, బస్సుల్లో కరపత్రాలు పంచి పెట్టించి పబ్లిసిటీ కి వాడుకున్న ఘనత నాగిరెడ్డి గారిది.


రెండో ప్రపంచ యుద్ధం వ్యాపారానికి తీరని నష్టం కలగజేస్తే అన్నగారు, స్నేహితుల సలహాతో చిత్ర రంగంలో అడుగు పెట్టిన నాగిరెడ్డి గారు వాహినీ వారి చిత్రం ' భక్త పోతన ' కు బెంగుళూరులో చేసిన పబ్లిసిటీ ఆయన సృజనాత్మకతకు అద్దం పడుతుంది. అప్పటికే పెద్ద సంస్థ అయిన జెమిని లాంటి సంస్థ పబ్లిసిటీతో ఢీ కొనడానికి ఆయన అనుసరించిన విధానం నుంచి ఇప్పటి నిర్మాతలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నగరం నిండా ఎక్కడ చూసినా జెమిని వారి ' బాలనాగమ్మ ' పోస్టర్లే ! వాటి మధ్యలో ఎన్ని పోస్టర్లు వేసినా ' భక్తపోతన ' కనిపించడు. ఏం చెయ్యలా అని ఆలోచిస్తూ మల్లేశ్వరం మిట్ట దగ్గరకు వచ్చిన నాగిరెడ్డి గారికి స్పురించిన ఆలోచన ఫలితమే పది అడుగుల పీఠం మీద ముఫ్ఫై అడుగుల హనుమంతుడి కటౌట్ వెలియడం. ఇది నగరంలో సంచలనం సృష్టించింది. నిజంగా హనుమంతుడు వెలిసాడని తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. అవును... అప్పటికి అది వింతే మరి. ఫలితంగా భక్త పోతన ఘనవిజయం సాధించింది.


ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డ వాహినీ స్టూడియోను గట్టెక్కించడానికి మిత్రుల కోరికతో నిర్వహణా బాధ్యతలను తీసుకున్నారు నాగిరెడ్డి.  జెండాపై కపిరాజు తో  ' విజయా ప్రొడక్షన్స్ ' ప్రారంభించారు. మొదటి చిత్రంగా ' షావుకారు ' రూపుదిద్దుకుంది.


పి. పుల్లయ్య గారి ' ధర్మపత్ని ' చిత్రంతో రచయితగా రంగ ప్రవేశం చేసిన ఆలూరు వెంకట సుబ్బారావు వాహినీ వారి ' స్వర్గసీమ ' కు కూడా రచయితగా పనిచేయ్యడంతో నాగిరెడ్డి గారికి మంచి మిత్రులయ్యారు. ఆ స్నేహం వికసించి 1945  లో రాజకీయ, సామాజిక చైతన్యం కలిగిన  ' ఆంధ్రజ్యోతి ' మాస పత్రిక ఆవిర్భావం, 1947  లో పిల్లల పత్రికగా ప్రారంభమై చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ' చందమామ '  ఆవిర్భవించాయి.

ఒక తల్లి కడుపున పుట్టినవారే అని తెలుగు జాతి అంతా భావించే స్థాయికి చేరిన స్నేహబంధం వారిది. ఆ జంట ఎన్నో కళాఖండాలను తెలుగు వారికి అందించింది.  తెలుగు సినిమాకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.  ఆ జంటను విడదీయడం ఎవరికీ సాధ్యం కాలేదు, ఒక్క మృత్యువుకి తప్ప. ఆ జంటే నాగిరెడ్డి - చక్రపాణి. స్నేహానికి నిర్వచనంగా ఇప్పటికీ, ఎప్పటికీ చెప్పుకునే జంట నాగిరెడ్డి - చక్రపాణి. ఒకరి మీద ఒకరికి అభిమానం, ప్రేమ, ఆప్యాయత, గౌరవం, ఎదురి వారి మాటను మన్నించే లక్షణం, ఎవరి పని వారు చేసుకుంటూ ఎదుటి వారి పనిలోగానీ, నిర్ణయాలలో గానీ కలుగజేసుకోకపోవడం లాంటి మంచి లక్షణాలెన్నో ఆ స్నేహాన్ని కూర్చిన దారంలా అమరాయి. పత్రిక నడిపినా, సినిమాలు తీసినా ఏం చేసినా విజయ కేతనం ఎగురవేసింది ఆ స్నేహం.


అసలైన నిర్వహణా సామర్థ్యం ప్రతిభను గుర్తించడంలో తెలుస్తుంది. ఆ ప్రతిభను విజయవంతంగా ఉపయోగించడంలో రాణిస్తుంది. అలా చక్రపాణి గారి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, ఆయన మీద నమ్మకముంచి, ఆయనకు బాధ్యతలను పంచి విజయం సాధించారు నాగిరెడ్డి. తన విజయానికి అసలు కారకుడు చక్రపాణే అని చెప్పడం ఆయన ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఎదుటి వారి ప్రతిభను, శ్రమను వాడుకుని తమ గొప్పతనంగా చెప్పుకునే ఇప్పటి సమాజానికి ఈ సంస్కారం అర్థరహితంగా కనిపించవచ్చు. కానీ నాగిరెడ్డి గారి విజయాలు అసత్యం కాదుగా !


దక్షిణ భారత చలన చిత్ర రంగానికి పెద్ద దిక్కుగా వెలిగిన జెమిని వాసన్ అంటే అమితమైన గౌరవం. జెమిని స్టూడియోను అమ్మివేసినపుడు తన స్వంత ఆస్తి పరుల పాలైనంత బాధ పడ్డారు నాగిరెడ్డి. ' నాన్నగారూ ! ' అని ఆప్యాయంగా పిలిచే ఎన్టీయార్ అన్నా, ఎంజీయార్ అన్నా  విపరీతమైన అభిమానం. వారికి కూడా ఆయన మాటంటే వేదం.  ' ఎంగవీట్టు పిళ్ళై ' తమిళ చిత్రానికి ఎంజీయార్, సరోజాదేవి ల మీద చిత్రీకరించిన పాట రష్  చూసి నాగిరెడ్డి గారు అసంతృప్తి వ్యక్త పరిస్తే ఆ రోజు రాత్రికి రాత్రి దాన్ని ఆయనకు నచ్చేటట్లు రీ షూట్ చేసి చూపించి శభాష్ అనిపించుకున్నారు ఎంజీయార్.


...... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని విశేషాలో ఆ ' జ్ఞాపకాల పందిరి ' లో ! అవును. ఇవన్నీ ' విజయ ' నాగిరెడ్డి గారి సుదీర్ఘజీవితంలో మాణిక్యాల లాంటి జ్ఞాపకాలను వెలికి తీసి సంకలించిన విజయ పబ్లికేషన్స్ వారి ' జ్ఞాపకాల పందిరి ' పుస్తకంలోని కొన్ని విశేషాలు. 

వెలకట్టలేని విలువైన ఈ పుస్తకాన్ని ' శిరాకదంబం ' కు కానుకగా అందించిన 
' మాధురీకృష్ణ ' గారికి ధన్యవాదాలతో...... 

' విజయ ' పథమే తన లక్ష్యమన్న బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా కళా నీరాజనాలు అర్పిస్తూ...............  


నాగిరెడ్డి గారి గురించి గతంలో రాసిన టపాలు.....

'విజయ' నాగిరెడ్డి
విజయాధినేతకు నివాళి 
విజయా చందమామ
' విజయా ' రెడ్డి 



Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 081
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం