Wednesday, November 23, 2011

' మా తెలుగు తల్లి ' కవికి గుర్తింపు...?

 1975  లో హైదరాబాద్ లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అంత పెద్ద ఎత్తున, అంత వైభవంగా మళ్ళీ జరగలేదేమో ! అప్పటికి విద్యార్థిగా వున్న నాకు ఆ సభలకు ప్రతినిధిగా హాజరయ్యే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఎంతోమంది తెలుగు వెలుగుల్ని చూడగలిగే అదృష్టం కలిగింది. ఆ సభలకు ప్రతినిధులుగా దేశ విదేశాల్లోని తెలుగు వారెందరో వచ్చారు.

ప్రధాన వేదికగా లాల్ బహదూర్ స్టేడియం వున్నా అనేక సదస్సులు, సమావేశాలు నగరంలోని పలుచోట్ల జరిగేవి. అలా రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంతో తెలుగు జాతి పులకించిపోయింది. దానికి కారణం అప్పటివరకూ రేడియో ద్వారా, రికార్డుల ద్వారా మాత్రమే వినబడుతూ వచ్చిన గేయం, స్వరం వేదికపైన ప్రత్యక్షమై సభికులందరికీ వీనుల విందుతో బాటు కనుల విందు కూడా చేసింది.

ఆ గేయమే ' మా తెలుగు తల్లికి మల్లె పూదండ '


ఆ గేయాన్ని మధురంగా, భావయుక్తంగా ఆలపించి ప్రతీ తెలుగు వాడినీ పులకింప జేసిన గాయనీమణి టంగుటూరి సూర్యకుమారి. అప్పటికే ఇంగ్లాండ్ లో స్థిరపడి అక్కడి పౌరసత్వం కూడా తీసుకున్న ఆమె గురించి తెలియని తెలుగు వారుండరు. గాయనిగా, నటిగా ... బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు వారందరికీ ఆమె సుపరిచితమే ! అలాంటి గాన సరస్వతి వేదిక మీద ప్రత్యక్షంగా కనిపించడమే కాక ఆ గేయాన్ని పాడి వినిపించడం అందర్నీ అలరించింది. దాంతో అందరూ తమ హర్షధ్వానాలు తెలియజేసారు. పూలదండలతో, ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కోలాహలానికి సూర్యకుమారి గారు స్పందిస్తూ

" నా పాటకు ఇంతగా ప్రశంసల వర్షం కురిపించినందుకు చాలా సంతోషం. కానీ ఇంతటి గొప్ప పాట రాసిన అచ్చ తెలుగు కవి...... అరుగో....... అక్కడ జనం మధ్యలో ఇరుక్కుని నలిగిపోతున్నారు. ముందు ఆ మహాకవి గొప్పతనాన్ని గుర్తించి గౌరవిస్తే ఇంకా సంతోషిస్తాను "అనగానే జనమంతా ఆయన వైపు తిరిగారు. ఆయనే ఆహార్యంలో సాదా సీదాగా కనిపించే శంకరంబాడి సుందరాచారి. అంతవరకూ తమ మధ్యలోనే వున్నా ఆయన్ని గుర్తించని సభికులు వెంటనే తమ చేతులే ఆసనంగా చేసి వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించారు. ఆయనకు మళ్ళీ లాల్ బహదూర్ స్టేడియంలోని ప్రధాన వేదికపైన కూడా ప్రజలందరి సమక్షంలో సన్మానం జరిగింది.
 గ్లామర్ , ఆర్భాటాలు ఉంటేగానీ ప్రతిభను త్వరగా గుర్తించరేమో తెలుగు వారు. Visit web magazine at www.sirakadambam.com

Vol. No. 03 Pub. No. 079

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం