Thursday, November 17, 2011

స్థితప్రజ్ఞత

ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యం చెక్కు చెదరకుండా ఉండగలగడం అందరికీ సాధ్యం కాదు. దానికి ఎంతో మనోనిబ్బరం వుండాలి. మహనీయులకు గానీ అది సాధ్యం కాదు.

కాంగ్రెస్ కు స్వర్ణయుగం మన దేశ స్వాతంత్ర్యానికి ముందు కాలమనే చెప్పవచ్చు. నిజానికి కాంగ్రెస్ చరిత్రను స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత అని విడదీసి చూస్తే పూర్వ భాగంలో అధిక భాగం త్యాగధనుల పార్టీగా వుండేది. అలాంటి ఒక త్యాగధనుడు, ఆంధ్రుడు బులుసు సాంబమూర్తి గారు.  అప్పటి కాంగ్రెస్ నాయకుడు. స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాత్ర మరచిపోలేనిది. ఆ ఉద్యమ కాలంలో ఆయనను అరెస్ట్ చేసి నానా హింసలకు గురి చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆయన నోట్లో మలమూత్రాలను కూడా పోసి తమ పాశవికతను ప్రదర్శించారట అప్పటి బ్రిటిష్ పోలీసులు. దేశ స్వాతంత్ర్యం కోసం అలాంటి ఘోరాలెన్నిటినో అనుభవించిన దేశభక్తుడు, త్యాగధనుడు సాంబమూర్తి గారు.  

1923  లో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ కాకినాడలో జరుగుతోంది. ఆ సభకు దేశం నలుమూలనుండీ ప్రముఖ కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఆ ఆహ్వాన సంఘానికి బులుసు వారు కార్యదర్శి. మూడురోజులపాటు జరిగే ఆ సభలకు అన్ని ఏర్పాట్లు ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసారు. రాబోయే అతిధులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆ ఏర్పాట్లు సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది నుండి వచ్చే అతిధులకు ఆంధ్ర భోజనం రుచి మర్చిపోకుండా వుండేటట్లు చెయ్యడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. సాంబమూర్తి గారికి ఊపిరి సలపడం లేదు. మహాసభల తేదీలు సమీపిస్తున్నాయి.

 ఆ సమయంలో ఒక పెను విషాదం. సాంబమూర్తి గారి ఏకైక కుమారుడు టైఫాయిడ్ బారిన పడి మరణించాడు. ఆయనకు అంతులేని శోకాన్ని మిగిల్చాడు. ఆ సమయంలో కూడా ఆయన ఆ శోకాన్ని దిగమింగారు. తనపైన ఉన్న బాధ్యతను గుర్తు చేసుకున్నారు. అంతే ! ఆ శోకాన్ని కర్తవ్యం జయించింది.

ఆ కాంగ్రెస్ మహాసభలు న భూతో న భవిష్యతి అన్నట్లు జరిగాయి. అందరూ ఆయన చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు. జరిగిన విషాదం తెల్సుకున్న భారత కోకిల సరోజినీ నాయుడు సాంబమూర్తి గారి స్థితప్రజ్ఞతకు చలించి అప్పటికప్పుడు ఆ సభలో ఆశువుగా గీతాన్ని ఆలపించారని అంటారు.

అందుకేనేమో తెలుగు జాతి ఆయనను ' మహర్షి ' అనే బిరుదుతో గౌరవించింది.


Visit web magazine at www.sirakadambam.com 

Vol. No. 03 Pub. No. 075

1 comment:

sivasubrahmaniam said...

నిజం. అది అందరికీ సాధ్యం కాని పని. అది తత్కాలం తాను నిర్వహించవలసిన దాని మిద ఏకాగ్రత. బులుసు వారు పుత్రా వియోగం లోకూడా ప్రదర్సంచారు. కాని సాధారణ మనుషులామ్ మనం స్తువంతి ఏ యిబ్బంది లేని సమయాలల్లో కుడా ఒక విషయాన్ని ప్రాధికరణ చేసుకోడం దానికని స్తితప్రజ్ఞాతతో పని చెయ్యడం లో విఫలమవుతున్నాం.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం