Thursday, October 20, 2011

చదవాలే కానీ చూడకూడదు !

 మాట కరుకు, మనసు వెన్న.... తెలుగు సాహితీకారులకి జ్ఞాన పీఠాన్ని రుచి చూపిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకో ఉదాహరణ...... 

బందరులో కుర్రాడు విశ్వనాథ గారి ప్రతిభ విని ముగ్దుడై ఓ రోజు ఆయన్ని చూడడానికి విజయవాడ వచ్చాడు. వారిని, వీరిని అడిగి తెలుసుకుని మొత్తానికి విశ్వనాథ వారిల్లు పట్టుకున్నాడు. ఎండాకాలం. అసలే బెజవాడ. ఓ ప్రక్క ఎండ మండిపోతోంది. మరో ప్రక్క చెమటలు. అలాగే ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ పెద్ద ముత్తైదువ వచ్చి తలుపు తీసింది. 

ఆ అబ్బాయి " విశ్వనాథ సత్యనారాయణ గారున్నారా ? " అని అడిగాడు. ఉన్నారు కూర్చోమని చెప్పి ఆవిడ లోపలికి వెళ్లి పోయింది. ఎంతసేపైనా లోపల్నుంచి ఎవరూ రాకపోయేసరికి అతనే గుమ్మం దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసాడు. వంటిల్లు కనబడింది. ఎండాకాలం ఆవకాయ సీజను కదా ! దానికోసం లోపల పచ్చి మామిడికాయల రాసి పోసి వుంది. దాని ముందు కత్తిపీట పెట్టుకుని కూర్చుని ఒక పెద్దాయన కాయలు తరుగుతున్నాడు. వంటాయన కాబోలు అనుకున్నాడా అబ్బాయి. ఆ శ్రమకు, వేడికి బయిటకు వస్తున్న చెమటలు తుడుచుకుంటూ తరిగేస్తున్నరాయన. ఈ అబ్బాయి ఆయన్ని పిలిచి విశ్వనాథ వారిని గురించి అడిగాడు. తరగడం ఆపి ఓసారి ఇతన్ని పరీక్షగా చూసి లోపలి రమ్మని పిలిచారు. 

ఆ అబ్బాయి లోపలి వెళ్ళాడు.  " నీ పేరేమిటి ? " అని అడిగారాయన. చెప్పాడా అబ్బాయి. ఏం చదువుతున్నావంటే చెప్పాడు. ఊరు, పేరు.... ఇలా ఒక్కొక్కటే అడుగుతుంటే అతనికి విసుగొచ్చింది. 

" ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడా ? " అనడిగాడు. 

" ఆయనతో నీకేం పని " అని ఎదురు ప్రశ్న వేసారు ఆ పెద్దాయన. 

" పనేం లేదు. ఊరికే చూసి పోదామని. అంతే ! " అన్నాడా అబ్బాయి తాపీగా. 

అంతే...  ఆ పెద్దాయనకు కోపం ముంచుకొచ్చింది.  

" వచ్చిన ప్రతీవాడికీ నేనేం ధర్మ దర్శనం ఇస్తానని చెప్పలేదు. నన్నేం చూస్తావు నా పిండాకూడు. ఎలాగూ వచ్చావు. నాలుక్కాయలు తరిగేసి పో ! నాక్కాస్త సాయం చేసినట్లేనా వుంటుంది " అని గయ్యిమన్నారు. 

దాంతో ఆ అబ్బాయికి ఆయనే విశ్వనాథ వారని అర్థమయింది. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నాడు. అంతే ! ఆ మహానుభావుడి మనసు వెన్నలా కరిగిపోయింది.  ఆ అబ్బాయిని లేవదీసి...

" లేరా అబ్బాయ్ ! నువ్వేదో కష్టపడి వచ్చావు గానీ నేను చదవవలసిన వాడినే కానీ చూడవలసిన వాడిని కాదురా ! " 

...... అని ఆ పూట భోజనం పెట్టి, సాహితీ తాంబూలంగా కొన్ని పుస్తకాలు ఇచ్చి పంపారు. 
విశ్వనాథవారి మాటల చమత్కారం అదీ !

Vol. No. 03 Pub. No. 062

4 comments:

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
చాలా బాగుంది " విశ్వనాద వారితో పరిచయం .ఇంతకీ ఆ అబ్బాయి ఎవరొ పేరు తెలియ లేదు. అదృష్ట వంతుడు .

SRRao said...

రాజేశ్వరి గారూ ! ధన్యవాదములు

జ్యోతిర్మయి said...

విస్వనాదుల వారి చమత్కారం విని వున్నాను కాని, ఈ విషయం మీ టపా ద్వారా తెలుసుకున్నాను. ధన్యవాదములు రావు గారూ.

SRRao said...

జ్యోతిర్మయి గారూ !

దన్యవాదాలు. ఆలస్యమైనందుకు క్షంతవ్యుడిని.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం