Tuesday, October 18, 2011

సునిశిత విమర్శ

 విమర్శ అనేది ఎలా ఉండాలంటే ఎదుటివారిలో లోపాలను సునిశితంగా పరిశీలించి వారి లోపం వారికి తెలిసే విధంగా వుండాలి. అది వారి అభివృద్ధికి తోడ్పడాలి. అంతేకానీ లేని లోపాల్నీ వెదికి, అంత ప్రాముఖ్యం కాని అంశాలను ఎత్తి చూపితే అది విమర్శ అనిపించుకోదు. తమలోని అహాన్ని సంతృప్తి పరచడానికి ఎదుటివారిని విమర్శించేవారు మనకు చాలామంది కనబడుతుంటారు. నిండు కుండ తొణకదు అన్నట్లు ఒక అంశంలో నిష్ణాతులైన వాళ్లకి అదే అంశంలో ఇతరులు చేసే చిన్న చిన్న పొరబాట్లు, లోపాలు కూడా స్పష్టంగా అగుపడతాయి. అవి గమనించి ఊరుకోక వారికి చెప్పి వారి లోపాలను సవరించడానికి ప్రయత్నిస్తారు. ఇలా చెప్పడానికి వారికి అహం అనేది అడ్డు రాదు. అలా పెద్దలు, నిష్ణాతులు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తమలోని లోపాలను సవరించుకుంటే వారు కూడా ఆయా కళలలో, ఇతర అంశాలలో నిష్ణాతులుగా తయారయ్యే అవకాశముంది. అలాంటి ఓ సునిశిత విమర్శ లేదా సూచనను గురించి పరిశీలిద్దాం.

తెలుగు నాటక రంగం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా స్థానం నరసింహారావు గారి స్త్రీ పాత్రల గురించి తెలియక పోదు. ఆయన ధరించిన స్త్రీ పాత్రల్లో రోషనార ప్రముఖమైనది. దానికంటే ముందు ధర్మవరపు రామకృష్ణాచార్యులు గారు రచించిన ' రోషనార శివాజీ ' నాటకం ద్వారా రోషనార పాత్రలో పేరు గడించిన నటులు పెమ్మరాజు కేశవమూర్తి గారు.

ఒకసారి ఆ నాటక ప్రదర్శన జరుగుతోంది. ఆ ప్రదర్శనకు ప్రముఖ నటులు, ప్రయోక్త బళ్ళారి రాఘవాచార్యులు గారు హాజరయ్యారు. ముందు వరసలోనే కూర్చున్నారు. ఇది గమనించిన కేశవమూర్తి గారు రెట్టించిన ఉత్సాహంతో నటించడం ప్రారంభించారు. ఫలితంగా ఆనాటి రోషనార పాత్ర ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. దానికి నిదర్శనం హాలంతా మార్మోగిన చప్పట్లు, రంగస్థలం మీద కురిసిన రూపాయిల, బంగారు ఆభరణాల వర్షం. ప్రేక్షకులు అంత తన్మయం చెందినా, ప్రశంసల వర్షం కురిపించినా బళ్ళారి రాఘవ గారి ముఖంలో అంత సంతృప్తి వున్నట్లు కేశవమూర్తి గారికి తోచలేదు. ఆయన అహం దెబ్బతింది. విషయమేమిటో తెలుసుకోవాలనుకున్నారు.

ప్రదర్శన పూర్తి అయ్యాక నేరుగా బళ్ళారి రాఘవ గారి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి
" తమవంటి పెద్దలు నా ప్రదర్శనకు రావడం అదృష్టం. మీకేవైనా లోపాలు కనిపిస్తే చెబితే సరి దిద్దుకుంటాను " అన్నారు. పైకి వినయంగా అడిగినట్లు వున్నా ఆయన మాటల్లో అహంకారం ధ్వనించింది. అది గ్రహించిన రాఘవగారు చిరునవ్వుతో
" బాగుంది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే నీ నటన ఇంకా రాణిస్తుంది " అన్నారు.
నా నటనలో లోపాలా అన్న అహం ధ్వనిస్తుండగా " ఆ లోపాలేవిటో సెలవిస్తే సవరించుకుంటాను " అన్నారు కేశవమూర్తి గారు. అప్పుడు బళ్ళారి వారు
" బాబూ ! నువ్వు వేసిన వేషం రోషనార. అంటే ముస్లిం వనిత. శివాజీకి ఉత్తరం రాసే ఘట్టంలో నువ్వు ఏ భాషలో రాస్తున్నట్లు ? ఉర్దూ భాషలో కదా ! ఆ భాషలో వాక్యాలను కుడినుంచి ఎడమకి కదా రాసేది. నువ్వు అలా రాసావా మరి ? " అన్నారు.

అంతే ! కేశవమూర్తి గారు ఆశ్చర్యచకితులై పోయారు. ఆయన సునిశిత పరిశీలనా శక్తికి ముగ్ధులై రాఘవ గారి పాదాల మీద వాలిపోయారు.

కుడి ఎడమ కావడాన్ని సాధారణ ప్రేక్షకుడు గమనించ లేకపోవచ్చు గానీ బళ్ళారి రాఘవ గారి లాంటి నిష్ణాతుడికి సాధ్యమే ! అందుకే అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు మన అభివృద్ధికి పునాదులు.
 

Vol. No. 03 Pub. No. 060

5 comments:

Anonymous said...

Wow. That's incredible.

Ennela said...

you collect very rare and good inforamtion..hats off to you

SRRao said...

* శ్రీనివాస్ గారూ !
* ఎన్నెల గారూ !

ధన్యవాదాలు

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
నిజమే చాలా చక్కటి విమర్శ. బాగుంది.

SRRao said...

రాజేశ్వరి గారూ ! ధన్యవాదములు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం