Monday, August 29, 2011

తెలుగు పిడుగు ' గిడుగు '

 గిడుగు రామమూర్తి పంతులు గారు అనగానే తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులుగా మాత్రమే అందరికీ గుర్తుకొస్తుంది. ఆ కారణంగానే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  సామాన్య ప్రజలకు అర్థం కాని... వేదాల్లో ఉండే భాషను ప్రామాణికంగా తీసుకున్న కాలంలో తెలుగు భాషను సామాన్యుల స్థాయికి దించడానికి ఆయన జీవితకాల పోరాటం చేసిన మాట వాస్తవమే ! 

 కానీ ఆయన కేవలం తెలుగు భాషోద్ధరణకే పరిమితం కాలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ పట్టని ఆదివాసుల సమస్యలకు ఎన్నిటికో ఆయన పరిష్కారం చూపారు. ఆదివాసుల సంక్షేమానికి కృషి చేసిన వాళ్ళకు ఈయనే మార్గదర్శి అని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల గిరిజనులు మాట్లాడే భాషలలో ముఖ్యమైనది సవర భాష. ఐతిరేయ బ్రాహ్మణంలో కూడా ఈ భాష ప్రస్తావన ఉందంటారు. అప్పటివరకూ ఆ భాషకు లిపి లేదు. వారి మాతృ  భాషలో చదువుకునే యోగం ఆ గిరిపుత్రులకు ఉండేది కాదు. ఈ పరిస్థితి గమనించిన గిడుగు వారు ఆ భాషపై విస్తృత పరిశోధన చేసి ధ్వన్యాత్మక లిపిని రూపొందించారు. 

 కేవలం లిపిని రూపొందించి వదిలివేయలేదు. ఆ లిపిలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసారు. ఆ గిరిజన ప్రాంతాలలో ప్రజలను విద్యావంతులను చెయ్యడానికి పాఠశాలలు ఏర్పాటు చేయించారు. వాటి నిర్వహణకు తన స్వంత డబ్బును సైతం ఖర్చు చెయ్యడానికి వెనుకాడలేదు. వాటిని అభివృద్ధి చెయ్యడానికి ప్రభుత్వంమీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించారు. అంతే కాదు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం కూడా రూపొందించారు. వారి సమస్యలెన్నిటికో ఆయన పరిష్కారాలు చూపారు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతగా కృషి చేసినవారు అప్పటికీ, ఇప్పటికీ ఇంకెవరూ లేరేమో ! 

 గిడుగు వారు కేవలం తెలుగు వ్యావహారిక భాష మీదనే పరిశోధనలు చెయ్యలేదు. గ్రాంథిక భాషలో కూడా ఉద్దండులే ! ఆంగ్ల భాషలో కూడా ఆయన పరిశోధనలు సాగాయి. తెలుగు వారికి ఆంగ్లం సులువుగా నేర్చుకునే పద్ధతులను గురించి తెలియజేసేందుకు ఒక పత్రికను కూడా నిర్వహించారు. 

నిజానికి గిడుగు రామమూర్తి గారి ముందుతరం వారు, సమకాలీనుల గురించి పరిశోధన, ప్రచారం జరిగినంతగా ఆయన గురించి జరుగలేదేమో ! అక్కడక్కడ కొంత జరిగినా అది అసమగ్రంగానే వుంది. మన భాషావికాసానికి ఉద్యమించి తెలుగును సజీవం చెయ్యడానికి పాటుపడిన ఆ మహానుభావుడి గురించి మరింత విస్తృత పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. అప్పుడే ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు సార్థకత వుంటుంది. 


 తెలుగు పిడుగు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ......
తెలుగు సోదర, సోదరీమణులందరికీ తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు.  

తేనే కన్నా తీయనిది తెలుగు భాష
దేశభాషలందు లెస్స తెలుగు భాష ....... 
 



Vol. No. 03 Pub. No. 017

1 comment:

Kishor said...

ఆ బాటలో మళ్లీ కృషి చేసినవారు... నాకు తెలిసిన వ్యక్తులు... జర్నలిజం స్కూల్లో ప్రిన్సిపాల్ గా మాకు పాఠాలు చెప్పిన శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారు. నాకు తెలిసి...గోండు, కోయ భాషలతో బాటు - ఇతర గిరిజన భాషలకు (కొలామి, బంజారా లాంటివి ) నిఘంటువులు రూపొందించారాయన. తన వర్క్ ని ఎవరూ గుర్తించాలని కోరుకోని నిజమైన కర్మయోగి ఆయన.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం