Wednesday, August 3, 2011

కళాభినేత్రి


నెల్లూరు నెరజాణ రత్నకుమారి...
చెన్నై చేరి...  రక్తకన్నీరుతో రంగస్థలం ఎక్కి...

చిల్లరకొట్టు చిట్టెమ్మగా ప్రసిద్ధి చెంది...
కన్నడ చిత్రంలో కథానాయికగా రంగప్రవేశం చేసి...

బంగారు తిమ్మరాజులో హాస్యం పండించి...
కనకదుర్గ పూజా మహిమలో సాత్విక పాత్ర పోషించి...

ఎస్వీయార్ చేత వాణిశ్రీగా పేరు మార్పించుకుని...
పద్మిని, సావిత్రి, జీవరలక్ష్మిలను ఆదర్శంగా పెట్టుకుని...

సుఖదుఃఖాలు, మరుపురాని కథతో మరుపురాని నటిగా
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థిర నివాసం ఏర్ర్పరచుకుంది.  

చిన్నప్పట్నుంచీ సావిత్రిని అభిమానించిన వాణిశ్రీ... మరుపురాని కథ తమిళంలో సావిత్రి చేసిన పాత్రను తెలుగులో చేసి తన భవిష్యత్తుకు బాట వేసుకున్నారు. తొలిరోజుల్లో చిన్న హీరోలతో నటించినా, తర్వాత నాగేశ్వరరావు గారితో ఆత్మీయులు, రామారావు గారితో నిండుహృదయాలు చిత్రాల్లో తొలిసారిగా కథానాయికగా నటించారు.

సావిత్రికి వారసురాలిగా చెప్పుకునే వాణిశ్రీ తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయంతో డెబ్భైల ప్రారంభంలో తనదైన ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు.

వాణిశ్రీ చీర కట్టు...
వాణిశ్రీ హెయిర్ స్టైల్...
వాణిశ్రీ మేచింగ్...
వాణిశ్రీ నడక...

... ఇలా తనకంటూ కొన్ని ప్రత్యేకతలతో ప్రేక్షకులను, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

వాణిశ్రీ ధరించినన్ని వైవిధ్యమైన పాత్రలు మరే కథానాయిక ధరించలేదేమో ! బంగారు తిమ్మరాజు లాంటి చిత్రాల్లో హాస్యరస పాత్రలు, మరపురాని కథ.. సుఖదుఃఖాలు లాంటి చిత్రాల్లో చెల్లెలుగా, ఇద్దరు అమ్మాయిలు.. గంగ మంగ లాంటి చిత్రాల్లో విభిన్న మనస్తత్వాల గల రెండేసి పాత్రలు, కథానాయిక మొల్ల లాంటి చారిత్రక పాత్రలు, వినాయక విజయం...సతీసావిత్రి లాంటి చిత్రాల్లో పౌరాణిక పాత్రలు, జీవనజ్యోతి..కృష్ణవేణి లాంటి చిత్రాల్లో మానసిక సంఘర్షణతో కూడిన పాత్రలు.... ఇలా ఎన్నో రకాల పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసారు. వీటిలో చాలావరకూ గ్లామర్ తో కూడినవే ! అసలు ఏమాత్రం గ్లామర్ కు అవకాశం లేని పాత్రలను గోరంత దీపం, అనుగ్రహం చిత్రాల్లో ధరించి గ్లామర్ మాత్రమే కాదు, పాత్రే ముఖ్యమని నిరూపించుకున్నారు.  

తొలిరోజుల్లో హాస్యనటుల ప్రక్కన, చంద్రమోహన్ లాంటి చిన్న హీరోల ప్రక్కన నటించిన వాణిశ్రీ రామారావు, నాగేశ్వరరావు లాంటి అగ్రతారలతో... కృష్ణ, శోభన్ బాబు లాంటి తర్వాత తరం తారలతో... రంగనాథ్, శ్రీధర్, రామకృష్ణ లాంటి చిన్న తారలతో కూడా తరతమ బేధాలు లేకుండా నటించింది.

వాణిశ్రీ కున్న మరో ప్రత్యేకత నవలా నాయికా గుర్తింపు.  ప్రేమనగర్, జీవనతరంగాలు, చక్రవాకం, సెక్రటరీ, విచిత్రబంధం ( విజేత ) .... ఇలా నవలల ఆధారంగా వచ్చిన చిత్రాల్లో వాణిశ్రీయే కథానాయిక.  

తెలుగుతో బాటు తమిళంలో దాదాపు ఎనభై చిత్రాల్లో, కన్నడంలో సుమారు ముఫ్ఫై చిత్రాల్లో, మలయాళంలో రెండు చిత్రాల్లో నటించారు వాణిశ్రీ. తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక శకాన్ని ఏర్పరచుకున్నారు వాణిశ్రీ.

అగ్రకథానాయికగా వెలుగొందుతున్న రోజుల్లో తీరిక సమయాలు, తనదైన జీవితం కోల్పోయిన వాణిశ్రీ... తనకంటూ వ్యక్తిగత జీవితం కావాలని కోరుకుని డా. కరుణాకరన్ ని వివాహమాడారు. కొంతకాలం సంతృప్తిగా కుటుంబ జీవితం గడిపిన వాణిశ్రీ... పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక మళ్ళీ తన నటనా ప్రతిభను వెలికి తీసారు. కొన్ని చిత్రాల్లో నటించారు.... నటిస్తున్నారు.

 కళాభినేత్రి వాణిశ్రీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ...... 


Vol. No. 02 Pub. No. 303

6 comments:

Anonymous said...

Excellent.... Have been missing this wonderful actress and wondering why she hasn't been acting anymore... would love to see her more and more in Telugu movies...
Thanks to you sir, for the latest info on Vanisri garu.... I can definitely C ur taste in movies, you have a great collection of articles.

-Madhurima

Durga said...

ఎన్నో విబ్బిన్న పాత్రలు ధరించి సినీ రంగంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న నటి శ్రీమతి వాణిశ్రీ గారు. ఆమె గురించి రాసి ఎన్నో జ్ఞాపకాలను వెలికి తీసారు, ఆమె సినిమాలు మళ్ళీ చూడాలి అనిపించేలా చేసారు మీ వ్యాసంతో, కృతజ్ఞతలు.

JANARDHAN said...

వాణిశ్రీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే... బంగారు పంజరం లో అమాయకమైన పాత్ర వేసి , కేవలం ఆమె నటన వల్లనే ఆ సినిమాకి అవార్డు వచ్చింది...వేరే ఏ నటి ఆ పాత్ర చేసినా ఆసినిమా గాలికి పోయేది..ఆమె మహిళలకే కాదు , అందరికీ అభిమాన తార.
ఆమె ఎన్టీఆర్ తో కథానాయికగా నటించిన మొదటి సినిమా నిండుహృదయాలు అని రాశారు.. కానీ . కోడలు దిద్దిన కాపురం అని నాకు గుర్తు...కాదా ?

SRRao said...

* మధురిమ గారూ !
* దుర్గ గారూ !

ధన్యవాదాలు

* జనార్ధన్ గారూ !

ధన్యవాదాలు. వాణిశ్రీ ఎన్టీయార్ కలసి కథానాయికగా నటించిన తొలి చిత్రం నిండు హృదయాలు ( 1969 ). కోడలు దిద్దిన కాపురం ( 1970 ) తర్వాత వచ్చింది.

Palaniappan,M said...

She is a beautiful and great actress.

SRRao said...

పళనియప్పన్ గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం