Tuesday, August 2, 2011

తెలుగు వజ్రం

 వినువీధుల్లో ఎగురుతోంది మువ్వన్నెల జెండా 
తెలుగు వాడి ఆత్మ నిండి వుంది ఆ జెండా నిండా 

భరత జాతి గౌరవానికి సంకేతం జాతీయ పతాకం  
సృష్టించిన తెలుగు వాణ్ని గౌరవించుకోలేని దౌర్భాగ్యం       

జాతీయ పతాక రెపరెపల్లో నిండి వున్నాడు పింగళి వెంకయ్య 
జాతినంతటినీ ఆ జెండాకి వందనాలు చేయించిన ఘనుడయ్యా 

అయిదేళ్ళ జీవితాన్ని ధారబోసి సృష్టించాడా పతాకాన్ని 
దేశసేవకు నిస్వార్థంగా అంకితమిచ్చాడు తన జీవితాన్ని 

కీర్తి కనకాలకోసం ప్రాకులాడేవారికి ఈ త్యాగం అర్థం కాదు  
స్వార్థపరుల నిఘంటువులో దేశభక్తి అనే మాటకు అర్థమే లేదు 

ఆయనేమైనా గద్దెనెక్కాడా ?... కోట్లు వెనకేసాడా ? 
మూడు రంగులేసి ఓ జెండా తయారుచేసాడు 

ఆయనేమైనా కోటలు కట్టాడా ?... కోతలు కోసాడా ? 
ఉన్న ఇల్లు కూలిపోయి పేదరికంలో మగ్గాడు 

భూగర్భ శాస్త్రం చదివి రాళ్ళలో వజ్రాలను వెదికాడు 
తన కుటుంబానికి మాత్రం వట్టి రాళ్ళనే మిగిల్చాడు  

పరిశోధనలు చేసి రైతులకు తెల్ల బంగారం కంబోడియా పత్తిని అందించాడు 
బంగారం కాదు గానీ పత్తి వెంకయ్యగా పేరు మాత్రం మిగుల్చుకున్నాడు   

భరతజాతికి గుర్తునిచ్చిన తెలుగు వాడికి  
 నిర్మించలేదు ఓ స్మృతి చిహ్నం ఈనాటికీ  

భారతీయులుగా జెండాను గౌరవించడం మన కర్తవ్యం
తెలుగువారిగా వెంకయ్యను గౌరవించడం మన బాధ్యత


 భారత జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతి  
    సందర్భంగా ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తూ......                

మన జాతీయ పతాకం రూపొందిన క్రమం గురించి రాసిన టపా... 

మన పతాక ప్రస్థానం




Vol. No. 02 Pub. No. 301

2 comments:

తృష్ణ said...

బావుందండి...మీరిలాగే విలువైన మంచి మంచి విషయాలు రాస్తూండాలని కోరుకుంటున్నాను.

SRRao said...

తృష్ణ గారూ !
అప్పటి తరానికి మరోసారి గుర్తుచెయ్యాలని, ఇప్పటి తరానికి తెలియజెయ్యాలని ఇలా రాస్తున్నాను. మీలాంటి మిత్రుల ప్రోత్సాహం ఇలాగే వుంటే తప్పకుండా అందిస్తాను. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం