Friday, July 22, 2011

దాశరధీ... కవితా పయోనిధీ !


మంచి కవిత్వం భాషలో వుంటే ఆది నా భాష.
మంచి
కవి ఎవరైతే అతను నా మిత్రుడు...
కవితాసౌధం పుష్పకవిమానం వంటిది అన్ని భాషల వారూ రండి....
పుష్పక
విమానంలో ఆనందలోకాల సంచారానికి...

అంటూ అందర్నీ ఆహ్వానించిన విశాల హృదయంగల కవి దాశరథి.

నిజాము పిశాచమా !
కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగలను
తెంపి అగ్నిలో దింపినావు
నా
తెలంగాణా కోటి రతనాల వీణ.....

..... అంటూ ప్రజలను తన నిరంకుశ పాలనతో ప్రజల్ని కడగండ్ల పాలుచేసిన నిజాం ప్రభువుపై ' అగ్నిధార ' కురిపించారు దాశరథి. ఆవేశంతో ' రుద్రవీణ ' పలికించారు. ' తిమిరంతో సమరం ' చేసారు.

ఆయన కవిత్వంలో కేవలం ఆవేశం మాత్రమే లేదు..... అభ్యుదయముంది.... భక్తి భావముంది... ప్రణయోద్వేగముంది.... ఇలా ఆయన కవిత్వంలో ఎంతో వైవిధ్యముంది. ఏది రాసినా ఆది ఆయన గుండె లోతుల్లోనుంచి వచ్చింది. అంతేకానీ పడిగట్టు పదాలతో అల్లిన కవిత్వం కాదు. అందుకే ఆయన కవిత్వం సజీవం.

దాశరథి అనువదించిన గాలిబ్ గీతాలు అనువాదాల్లా కనిపించవు. గాలిబే స్వయంగా తెలుగులో రాసాడా అన్నట్లు ఉంటాయి. ఉర్దూ, పారశీక భాషల మీద ఆయనకున్న పట్టు ఏమిటో ఇలాంటి అనువాద రచనలలో తెలుస్తుంది.

లలిత గీతాల్లో ఈనాటికీ తలమానికంగా, అమర గాయకుడు ఘంటసాల గళంలో శాశ్వతంగా నిలిచిన ' తలనిండ పూదండ దాల్చిన రాణీ ! ' గీతం దాశరథి కలం నుండి జాలువారినదే ! లలితమైన పదాలతో, అందమైన భావాలతో అల్లిన గీతం కాబట్టే ఈనాటికీ శ్రోతల హృదయాలలో నిలిచివుంది.




తెలుగు చలనచిత్ర ప్రపంచంలోకి ఎందఱో కవులు వచ్చారు. కొందరే ప్రేక్షక శ్రోతల మదిలో నిలిచిపోయారు. శ్రోతలు పాట వింటూ దృశ్యం ఊహించుకునేలా రాయగలగడం అందరికీ సాధ్యం కాదు. అందులో దాశరథి అగ్రగణ్యులు. ఆయన పాట వింటే చాలు....దృశ్యం మన కళ్ళముందు కదలాడుతుంది.

' మముగన్న మాయమ్మ అలిమేలు మంగమ్మ
పతిదేవు
ఒడిలోన మురిసేటి వేళ
స్వామి
చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ
విభునికి
మామాట వినిపించవమ్మా
ప్రభువుకు
మా మనవి వినిపించవమ్మా ! '

అంటూ ' మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ ' అన్న భక్తరామదాసును గుర్తుకు తెస్తారు.

వాహిని సంస్థ ఆస్థాన కవిగా దేవులపల్లి వారు వెలుగుతున్న రోజుల్లో దాశరథి గారు రాసిన ఈ పాట బి. ఎన్. రెడ్డి గారిని మెప్పించింది. ఆయన రంగులరాట్నం చిత్రం ద్వారా బయిటకు వచ్చి తెలుగు వారి మదిలో శాశ్వతంగా నిలిచిపోయింది.

పాట విని స్వంతం చేసుకుని తనదైన శైలిలో పాడడం ఘంటసాల మాస్టారికి అలవాటు. కానీ మామూలు సాధన కాక ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో సాధన చేసి ఘంటసాల గారు పాడిన పాట బుద్ధిమంతుడు చిత్రంలోని ' నను పాలింపగ నడచి వచ్చితివా గోపాలా ! ' ఆ పాట వింటుంటే మన కళ్ళ ముందు ఆ గోపాలుడు నడచి వస్తున్నట్లే వుంటుంది.

ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో మేనకోడలు చిత్రానికి సుశీల గారు పాడిన పాట చిత్రంలో వుంటే..... ఆ సాహిత్యం మీద మోజు పడి తన కోసం తానే విడిగా గానం చేసుకున్న గీతం ' తిరుమల మందిర సుందరా ! '. ఘంటసాల గారి గళంలో వచ్చిన పాట చిత్రంలో లేకపోయినా రికార్డులుగా విడుదలై బహుళ ప్రజాదరణం పొందింది.

' కన్నయ్యా... నల్లని కన్నయ్యా ! ' అంటూ పిలిచి ' నిన్ను పూజింతురే ! నన్నుగనినంత నిందింతురే ! ' అంటూ ప్రశ్నించిన అమ్మాయిపై దేవుడు మాటెలా వున్నా ఏ మనిషైనా జాలి కురిపించకుండా ఎలా వుండగలడు ?

' నేనే రాధనోయీ గోపాలా ! ' అంటూ ' రారా కృష్ణయ్యా ! రారా కృష్ణయ్యా !! దీనులను కాపాడ.... ' అంటూ పిలిస్తే ఏ దేవుడు రాకుండా ఉంటాడు ?

' శ్యామ సుందరా ! ప్రేమ మందిరా ! నీ నామమే వీనుల విందురా ! ' అంటూ ' జగదభిరామ రఘుకుల సోమా ! శరణమునీయవయా ! ' అని వేడుకుంటూనే ' ఎక్కడో దూరాన కూర్చున్నావు... ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు... చిత్రమైన గారడీ చేస్తున్నావు... తమాషా చూస్తున్నావు... ' అంటూ నిలదీస్తారు దాశరథి.

గోదావరి పరవళ్ళు ఆయన రాసిన ' గల గల పారుతున్న గోదారిలా.... ' పాటలో కనిపిస్తే ఆ గోదావరి గట్టు మీదున్న పిల్ల మనసులోని చిలిపిదనం ' గోదారి గట్టుంది... ' పాటలో మనకు తెలుస్తుంది.

' శుభసమయంలో... కవి హృదయంలో... ' ప్రణయ కవిత్వం మెరిసిందో గానీ తెలుగు వారికి మరో భావకవి లభించాడని తెలుగుతల్లి మురిసిపోయింది. ' విన్నవించుకోనా చిన్న కోరికా... ' అంటూనే ' రాశాను ప్రేమలేఖలెన్నో... ' అంటారు. ' ముందరున్న చిన్నదాని అందమేదో.. ' చందమామే సిగ్గుపడి పారిపొయాడంటూ మదిలో ' వినిపించని రాగాలే కనిపించని అందాలే ' మెదిలాయంటారు. ' చిలిపి నవ్వుల నిను చూడగానే వలపు ' పొంగిందంటూ హుషారుగా ' ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు ' రువ్వుతారు. ' సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే ! ' అంటూ ' మనసే కోవెలగా మమతలు మల్లెలుగా ' పరుస్తారు. ' నా కంటి పాపగా నిలిచిపోరా ...' అని అడుగుతూ ' నీవు రావు నిదురరాదు నిలిచిపోయే రేయి... ' అని వాపోతారు. ' బంగరు రంగుల చిలకా ! పలకవా ! ' అని అడుగుతూ ' తనివి తీరలేదే నా మనసు నిండలేదే.... ' అని ఏనాటిదో తమ అనురాగ బంధమంటారు. ' కలసిన హృదయాలలోన.... ' ' కలిసే కళ్ళలోన విరిసే పూల వాన ' కురిపిస్తారు. ' దివిలో విరిసిన పారిజాతమో ! కవిలో మెదిలిన ప్రేమ గీతమో ! ' అన్నా ఆది దాశరథి గారి మదిలో మెదిలిన ఆణిముత్యమే !

పెళ్లి విశిష్టతను, మానవ సంబంధాలను వివరిస్తూ ' పెళ్ళంటే నూరేళ్ళ పంట...ఆది పండాలి కోరుకున్న వారి ఇంట.. ' అని కోరుకుంటారు. ' మంటలు రేపే నెలరాజా ! ఈ తుంటరితనమూ నీకెలా ? ' అని విరహంతో ప్రశ్నిస్తూ ' చీకటి కొంత.. వెలుతురూ కొంత.. ఇంతేలే జీవితమంతా... ' అంటూ నిరాశ చెందవద్దంటారు దాశరథి.

' బాబూ వినరా అన్నాదమ్ములా కథ ఒకటీ ! ' అంటూ మానవ సంబంధాలను వర్ణిస్తూ కథ చెబుతూనే ' మంచిని తుంచీ వంచన నేర్చీ... నరుడే ఈనాడు వానరుడైనాడు ' అని స్వార్థపరుల వాస్తవ స్వరూపాన్ని మన కళ్ళ ముందుంచుతారు.

దేవుడు, దేవతలు ఎక్కడో లేరు. మనందరికీ కళ్ళ ముందు కదలాడే దేవతా స్వరూపం అమ్మ. అసలు ' అమ్మ అన్నది ఒక కమ్మని మాట.... ఆది ఎన్నెన్నో తెలియని మమతల మూట '.... ' అమ్మంటే అంతులేని సొమ్మురా ! ఆది ఏనాటికి తరగని భాగ్యమ్మురా ! ' ..... ' దేవుడే లేదనే మనిషున్నాడు.. అమ్మేలేదనువాడు అసలే లేడు ' ............. అమ్మ గురించి ఇంతకంటే బాగా నిర్వచించడం ఎవరికైనా సాధ్యమా ?

తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ ఈ పాటలన్నీ పాటలన్నీ చిరంజీవులు. తెలుగువారందరి మదిలో దాశరథిగారు కూడా చిరంజీవే !

మనసు కవిత్వంలో మునిగినపుడు ఉచ్చ్వాసలో కవిత్వం జొరబడి గాలి కంటే ముందుగా నరాలలోకి పాకిపోయి ఏదీ అందుకోలేని ఆత్మను తాకుతుంది. నాకు స్థలాన్ని ఆక్రమించుకోవడం మీద నమ్మకం లేదు.... కాలాన్ని ఆక్రమించాలనే ఆశ తప్ప. క్షోభలోంచే రాస్తుంటాను. క్షోభ లేందే రాయలేను. క్షోభ, ఉద్వేగం కలసి నాతో ఏవేవో రాయించాయి. జైల్లో, రైల్లో, తోటలో, బాటలో, కత్తుల్లో, మెత్తని పూలగుత్తుల్లో......

... అంటూ తన గురించి చెప్పుకొచ్చిన మహాకవి దాశరథి గారి జన్మదినం సందర్భంగా ఆయనకు సాహితీ నీరాజనాలు సమర్పిస్తూ...

గత సంవత్సరం దాశరథి గారి జయంతి సందర్భంగా రాసిన టపా.... ఆయన పాటల్లో ముఖ్యమైన వాటిని జ్ఞప్తికి తెచ్చే కదంబం క్రింది లింకులో ........

కోటి రతనాల పాట ' దాశరధి '



Vol. No. 02 Pub. No. 287

3 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీకు ధన్యవాదములండి.

Devika Sai Ganesh Puranam said...

మంచి పాటలని ప్రస్తావించారు. యెందుకొ దాశరది గారికి రావలసినంత పేరు రాలేదు అనిపిస్తుంది.

దాశరధి గారు రాసిన పాటలు అన్నిటిలొకి నాకు అద్బుతంగా అనిపించే పాట"రంగులరాట్నం" సినిమాలొ 'కనరాని దేముడే కనిపించినాడే'.

అందులొ ఒక చరణం ప్రస్తావిస్తాను. "అందాల కన్నయ్య కనిపించగానే, బృందావనమేల్ల పులకించి పొయే - యమునమ్మ కెరటాల నెలరాజు నవ్వే, నవ్వులొ రాధమ్మ స్నానాలూ చేసే" అద్బుతంగా ఉంది కదా భావన!

దాశరధి గారి మంచి పాటలని గుర్తు చేసినందుకు ధన్యవాధములు.

SRRao said...

* మందాకిని గారూ !
* దేవిక గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం