Wednesday, June 29, 2011

పౌరాణికచిత్ర బ్రహ్మ

రామాయణాన్ని వాల్మీకి మహర్షి వ్రాసారు
మహాభారతాన్ని వ్యాస మహర్షి వ్రాసారు
తెలుగుతెర మీద ఆ పురాణాలని లిఖించిన మహర్షి కమలాకర కామేశ్వరరావు గారు

మన భావాల్ని వ్యక్తపరచడానికి భాష వుంది. ఆ భాషను అందమైన క్రమ పద్ధతిలో పలకడానికి, రాయడానికి వ్యాకరణం వుంది. భాషకే కాదు. కళకు కూడా వ్యాకరణం వుంటుంది. అందులోనూ సకల కళల సమాహారమైన చలనచిత్రం అందర్నీ ఆకట్టుకునేలా, చెప్పే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఆ చిత్ర రూపశిల్పికి ఈ వ్యాకరణం తెలిసి వుండడం చాలా అవసరం. చలనచిత్ర వ్యాకరణాన్ని ఔపోసన పట్టిన అగస్త్యుడు కమలాకర కామేశ్వరరావు గారు.  కె. వి. రెడ్డి గారి బళ్ళో చదువుకున్న కామేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాలు అంటే కమలాకర వారే అనిపించే  స్థాయికి ఎదిగారు.  

పాండురంగ మహాత్మ్యం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం, పాండవవనవాసం, నర్తనశాల, వీరాంజనేయ, బాలభారతం లాంటి ఎన్నో పౌరాణిక చిత్రాలతో బాటు మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు లాంటి చారిత్రాత్మక చిత్రాలు, రేచుక్క పగటిచుక్క లాంటి జానపదాలు, పెంకిపెళ్ళాం, శోభ, గుండమ్మ కథ, కలసిన మనసులు, మాయని మమత లాంటి సాంఘిక చిత్రాలు రూపొందించి బహుముఖ ప్రజ్ఞాశాలినని నిరూపించుకున్నారు. 

మచిలీపట్టణం నుంచి వెలువడిన ప్రతిష్టాకరమైన ' కృష్ణాపత్రిక ' లో చలనచిత్ర విభాగంలో పనిచేసిన కామేశ్వరరావు గారు మారుపేరుతో పక్షపాతరహితంగా రాసిన చిత్ర సమీక్షలు తెలుగు చలనచిత్ర పితామహుడనదగ్గ హెచ్. యమ్. రెడ్డి గారిని ఆకర్షించాయి. కామేశ్వరరావు గారిని చిత్రరంగానికి పిలిపించాయి. హెచ్. యమ్. రెడ్డి, బి. ఎన్. రెడ్డి, కె. వి. రెడ్డి లాంటి లబ్ద ప్రతిష్టుల శిష్యరికం లభించింది. ఫలితంగా మరో అద్భుత చిత్ర బ్రహ్మ తెలుగు రంగానికి లభించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు రాశిలో అర్థశతం మించకపోవచ్చు గానీ వాసిలో మాత్రం మిన్న అయినవి. కలకాలం గుర్తుండిపోయేవి కమలాకర చిత్రాలు. ప్రతీ చిత్రమూ ఆణిముత్యమే ! మన మనస్సులోనుంచి అంత త్వరగా చెరిగి పోయే ముద్రలు కావు ఆయన చిత్రాలు.  

నర్తనశాల చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చారు.... తెలుగు పౌరాణికాలను అంతర్జాతీయ స్థాయికి చేర్చారు.

 తెలుగు పౌరాణిక చిత్రాలకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన పౌరాణికచిత్ర బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు గారి వర్థంతి సందర్భంగా కళానీరాజనాలు 
 
Vol. No. 02 Pub. No. 268

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం