Monday, May 2, 2011

నేనెందుకు సినిమాలు తీస్తాను ?

" మీరెందుకు చిత్రాలను తీస్తారు ? " అని నన్నెవరైనా అడిగితే సమాధానం అంత తేలికగా చెప్పడానికి వీలుకాదు. అయితే నేను సినిమాలు తీయటానికి సంతృప్తికరమైన కారణాలు లేక కాదు. కాని ఆ కారణాల బాహుళ్యం వలన సమాధానం చెప్పటం కష్టం. 

నా సంతృప్తి కొరకు నేను సినిమాలు తీస్తాననటం ఆ ప్రశ్నకు నిజమైన జవాబు. 
సినిమా తీయడం అనే చర్యలో ప్రతీ క్షణం నాకు ఆనందం కలుగుతుంది. సినేరియోని, సంభాషణలను నేను సమకూర్చుకుంటాను. ఈ పనులు నాకు ఫాసినేటింగ్ గా వుంటాయి. 

నా నటులను నేనే నిర్ణయించుకుంటాను. ఒక్కొక్కసారి వృత్తి  కళాకారుల్లోనుంచి తీసుకుంటాను.. మరోసారి రోడ్ మీద పోయే జనంలోనుంచి ఎంపిక చేసుకుంటాను.  సినేరియో రాస్తున్నపుడు ఊహించుకున్న పాత్రలను సజీవ వ్యక్తుల్లో వెదకటం అనేది చాలా ఆనందాన్నిస్తుంది. 

 ఒక్కొక్కప్పుడు నా నటులతో బాటు నేను కూడా చాలా శ్రమపడి పనిచెయ్యాల్సివస్తుంది. మరొకప్పుడు అప్పుడే కొత్తగా కెమెరా ముందుకు వచ్చిన ఔత్సాహిక నటుడు కూడా మొదటి టేక్ లోనే నేను కోరిన విధంగా నటించవచ్చు.  

 షూటింగ్ అనేది సినిమా తీయటంలోని ప్రధానమైన శక్తుల సమీకరణ. దర్శకుడిగా నేను, సినిమా తీసే యంత్రం ఒకరికొకరు అనుబంధంతో ఏకమై పనిచేయటానికి పథకం వేసుకోవాలి. ఇది చాలా కష్టం. ఎంతో సహనం కావాలి. కానీ చక్కగా రూపొందించిన ఘట్టము,  తీసిన దృశ్యము వలన కలిగే ఆనందానుభూతి అనుభవైకవేద్యం. పడిన శ్రమకు సాఫల్యమది. 

ఎడిటింగ్ కూడా చాలా ఉత్సాహకరంగా వుంటుంది. కానీ ఇది బుద్ధికి సంబంధించింది. ఖచ్చితమైన, సున్నితమైన ఆలోచనలకు లోబడి కూర్పు అనేది పని చేస్తుంది. దృశ్యాలను అతికించడమనే ప్రత్యేకమైన పని వలన మాత్రమే చిత్రం జీవం పోసుకుంటుంది.

సృజనాత్మక ప్రక్రియే కాకుండా సినిమా తీయడం నన్ను.. నా దేశానికి, నా ప్రజలకు దగ్గరగా తీసుకుని వెడుతుంది. ప్రతి సినిమా చిత్రీకరణ విషయ గ్రహణానికి ఎంతో తోడ్పడుతుంది. నా ప్రజల్లోని భిన్నత్వాన్ని గ్రహించే అవకాశం కలిగిస్తుంది. నా చిత్రాలు విభిన్న జీవితాలను మిళితం చేసే ప్రక్రియను వెదికేందుకు దోహదం చేస్తాయి. దృశ్య, శ్రవణాలలో వున్న భిన్నత్వ, ఏకత్వాలను సమ్మేళన పరచి ఒక సృజనాత్మక కళా రూపాన్ని రూపొంచించటం అనేది ప్రతీ చిత్ర దర్శకుడు ఎదుర్కునే సవాలు. 

నేను, నా మొదటి చిత్రం ' పథేర్ పాంచాలి ' ( జీవన గీతం ) తీసేటప్పటికి నాకు వంగ గ్రామీణ జీవితం గురించి కొంతమేరకు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నాను. వంగదేశపు నేల, ఋతువులు, చెట్లు, చేమలు, అడవులు, బీళ్ళు, పువ్వులు, పాటలు, పొలంలో రైతుల మాటలు, బావి దగ్గర అమ్మలక్కల ముచ్చట్లు, ఎండలో తిరిగి వానలో తడిసే పిల్లలు ............. ఇవన్నీ నాకు అవగతం అయ్యాయి. 

నా కలకత్తా నగరం గురించి నాకు ఇప్పుడు ఇంకా బాగా తెలిసింది. దీనిమీద ఒక చిత్రాన్ని తీశాను. చూడ్డానికి ప్రపంచంలో మరే ఇతర నగరంలాగా వుండదు కలకత్తా. అయినా లండన్, న్యూయార్క్, టోకియో లలోని ప్రజల్లాగానే ఇక్కడకూడా ప్రజలు పుడుతుంటారు... బ్రతుకుతుంటారు... ప్రేమించుకుంటారు... ద్వేషించుకుంటారు... చివరికి చనిపోతుంటారు. ఇవన్నీ నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసి సినిమాలను తీసేందుకు ప్రోత్సహిస్తుంటాయి. నేను భారతీయుడినయినా ఈ చిత్ర విశ్వంలో నేనొక పాత్రనని గ్రహించాను. ఈ ప్రాంతీయత, ఈ విశ్వజన నేతల సహజీవనం నా చిత్రాల ద్వారా తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను.

 .............. 1980 ప్రాంతంలో ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురించబడిన సత్యజిత్ రే ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలు అనువదించి 1982 లో మా కోనసీమ ఫిలిం సొసైటీ 5 వ వార్షికోత్సవం సందర్భంగా వెలువడిన ' చిత్రరసజ్ఞ ' ప్రత్యేక సంచికలో ప్రచురించాం.

ఈరోజు ( మే 2 వ తేదీ ) సత్యజిత్ రే జయంతి సందర్భంగా ఆ భాగాల్నిఇక్కడ అందిస్తున్నాను.

గత నెల ( ఏప్రిల్ ) 23 వ తేదీన సత్యజిత్ రే వర్థంతి సందర్భంగా ప్రచురించిన టపా -

భారత చలనచిత్ర ' కిరణం ' 
 

Vol. No. 02 Pub. No. 221

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం