Friday, April 22, 2011

పిలచిన బిగువటరా !


  
ఈ నయగారము....ఈ వయ్యారము...
......అంటూ షష్టిపూర్తి జరుపుకుంటున్న చిత్రం ' మల్లీశ్వరి ' చిత్రంలో గానంలోను, అభినయం లోను వయ్యారమొలికించిన భానుమతి ఆ చిత్రం స్వర్ణోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.....



" మల్లీశ్వరి చిత్ర విజయం ఒక్కరిది కాదు. అందరి కృషితోనే విజయవంతమైంది. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో మల్లీశ్వరి చిత్రం లోని పాటలు రేడియోలో ప్రసారం చేయనీకుండా నిలిపివేయడం.
మల్లీశ్వరి చిత్రం లో వేసిన సెట్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. కృష్ణదేవరాయలు సభకు ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ అద్భుతంగా వేసారు. దర్శకుడు బి. ఎన్. రెడ్డికి మంచి అభిరుచి ఉండటంతో దానికి అణుగుణంగా సెట్స్ ను తయారు చేయించారు.

ఇక సంగీతం విషయానికొస్తే సాలూరి రాజేశ్వరరావులోని క్రియేటివిటీని వెలికి తీయడం ఒక్క భానుమతి వల్లే అవుతుంది. ఆయనకు నౌషాద్ సంగీతం అంటే ఇష్టం. అయితే ఆ ప్రభావం ఇందులో పడకుండా జాగ్రత్త తీసుకుని ఆయన వద్ద మంచి ట్యూన్లు చేయించాం ! ఇక్కడ ఇదే ఇంట్లో ( భానుమతి గారిల్లు ) సంగీతం సమకూర్చాము. నేను పాడే పాటలు నాకిష్టమైన కాఫీ రాగం, కమాసు, సింధుభైరవి, యమన్ కళ్యాణ్ రాగాల్లో సమకూర్చుకున్నాను.
పిలచిన బిగువటరా ( కాఫీ రాగం ), ఎందుకే నీకింత తొందరా ( కమాసు ), ఎవరేమని అందురో ( దర్బారీ రాగం ) , మనసున మల్లెలు ( యమన్ కళ్యాణ్ రాగం ), జయ జయ ( కళ్యాణి రాగం ) పాటలకు సంగీతం సమకూర్చుకున్నాను.

అప్పటికి నాకు 23 సంవత్సరాలు. అప్పటికే కొన్ని పిక్చర్స్ లో చేసిన సీనియర్ నటిని. నేను వేసినందునే మల్లీశ్వరి అంత హిట్ అయింది " అని గర్వంగా చెప్పుకున్నారు.
 
అది గర్వం అయి వుండదు. ఆత్మ విశ్వాసం కావచ్చు. ఏమైనా మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోయిన భానుమతి వయ్యారాలొలికించిన ఈ పాట ఆ చిత్ర షష్టిపూర్తి సందర్భంగా.............   




Vol. No. 02 Pub. No. 209

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం