Saturday, April 30, 2011

దర్శక దాదా !

1978 లో ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెడుతుండగా నారాయణగూడ దీపక్ థియేటర్ దగ్గర ఒక కొత్త రకంగా వున్న హోర్డింగ్ కనబడింది. నలుపు తెలుపు సినిమాలకు కూడా రంగుల్లో పోస్టర్లు ముద్రించే ఆ రోజుల్లో నలుపు తెలుపులోనే ... అదీ ముఖ్యంగా సిల్హౌట్ ( చాయా పధ్ధతి ) లో  హోర్డింగ్ వుండడం నన్ను ఆకర్షించింది. ఏదో కొత్తసినిమా. ఆరోజే విడుదలనుకుంటాను. హీరో హీరోయిన్ లు ఎవరా అని చూసాను. కానీ సరిగా గుర్తుపట్టలేకపోయాను. పైన మేఘాలలో కె. బాలచందర్ అని కనబడింది. అంతే ! ఇదేదో కొత్త సినిమాలా వుంది. ఎలా తీసాడో చూడాలి అనుకున్నాను. అంతకుముందే సర్వర్ సుందరం దగ్గర్నుంచి అంతులేని కథ వరకూ ఆయన చిత్రాలు చూసి ఆయన చిత్రాలపై, ఆయన దర్శకత్వంపైన అభిమానం పెంచుకున్నాను. ఇది మాత్రం పొరిగింటి పుల్లకూర మోజు కాదు.

ఆ రోజు ఎలాగైనా ఆ సినిమా చూడాలనే కోరిక పెరిగింది. ఫలితంగా లంచ్ తర్వాత సీఫెల్ లో క్లాసు ఎగ్గొట్టి దీపక్ థియేటర్ దగ్గరికి వచ్చేసాను. మాటినీ సమయం అయిపొయింది. థియేటర్ దగ్గర జనం కనబడలేదు. హౌస్ ఫుల్ అయిపోయినట్లుంది అనుకుంటూ బుకింగ్ ల కేసి చూస్తే ఆశ్చర్యకరంగా అవి తెరిచి వున్నాయి. గబగబా అక్కడికి వెళ్లి కౌంటర్ లో వున్నతన్ని అడిగితే పెద్దగా జనం లేరని, ఖాళీగానే వుందని అన్నాడు. అనుమానం వచ్చి సినిమా ఎలావుందని అడిగాను. ట్రాజెడీ అనీ, చివర్లో హీరో హీరోయిన్లిద్దర్నీ చంపేశారని అన్నాడు. అందుకేనేమో జనం రావడం లేదని కూడా అన్నాడు. చూడడం రిస్కేమో ఆని కొంచెం భయం వేసింది.  అసలే సినిమా ప్రారంభం కూడా అయిపొయింది అనుకుంటూ అప్పటికి వాయిదా వేసుకున్నాను. తర్వాత వారంరోజుల లోపే సినిమా చాలా బాగుంది. కొత్తదనం వుంది ఆని యూనివర్సిటీ అంతా చెప్పుకోవడం వినబడింది. ఆ తర్వాత సుమారు వందరోజు దాకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో 200 రోజులు పైబడి ఆడి రికార్డులు సృష్టించింది.  ఆ చిత్రం ' మరో చరిత్ర ' . మొదటిసారి చూడడానికి భయపడిన నేను ఎన్నిసార్లు చూసానో, ఇప్పటికీ చూస్తున్నానో లెక్క లేదు.   

సాధారణంగా మన సినిమాల్లో పాటలు ప్రేక్షకులకు గొప్ప రిలీఫ్. ఇంకా చెప్పాలంటే అవి ప్రకటించని ఇంటర్వల్స్. నచ్చని పాట వస్తోంటే  బయిటకొచ్చి రిలాక్స్ అవుతుండేవారు. కానీ బాలచందర్ చిత్రాల్లో అలా కుదరదు. ఎందుకంటే ఆయన చిత్రాల్లో పాటలు కథలో ఇమిడి వుంటాయి. ఒక్కోసారి కథలో కొంత భాగాన్ని అవే చెప్పేస్తాయి. అందుకని బయిటకు వెడితే కథలో కొంత మిస్సయ్యే ప్రమాదముంది.  

బాలచందర్ గారి పాత్రలు మన చుట్టూవున్న సమాజం నుంచే వస్తాయి. నిజజీవిత  సంఘటనలే ఆయన చిత్రాల్లో వుంటాయి. ' అపూర్వ రాగంగళ్ ' ( తూర్పు పడమర -తెలుగు ) చిత్రంలో హీరో మాట్లాడిన ఓ డైలాగ్ కి సెన్సార్ వారు అభ్యంతరం పెట్టారు. నిత్య జీవితంలో సాధారణంగా వాడే మాటేనని, అభ్యంతరకరం కాదని బాలచందర్ వాదించారు. ఆ నిరసన జ్వాలల్లో నుంచి ' గుప్పెడు మనసు ' లో సుజాత పాత్ర పుట్టుకొచ్చింది. అందులో ఆమెది సెన్సార్ బోర్డు సభ్యురాలి్ పాత్ర.

మొదట్లో మానసిక సంఘర్షణలు ఇతివృత్తంగా తీసుకున్నా రాను రాను సామాజిక సమస్యలపైన దృష్టి పెట్టారు. మూస కథల ఒరవడిలో కొట్టుకుపోతున్న సినిమారంగాన్ని మరోవైపు లాక్కొచ్చిన మేధావి బాలచందర్. మంచి అనేది ఎక్కడ వున్నా తీసుకునే విశిష్ట లక్షణం ఆయనలో వుంది. అప్పట్లో వైవిధ్యంగా వుందని పేరు తెచ్చుకున్న కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి చిత్రం ' ఓ సీత కథ ' చూసి ఆయనకు నచ్చి కమలహసన్, రజనీకాంత్, శ్రీదేవి లతో తమిళంలో పునర్నిర్మించారు. ఆయనలోని ప్రతిభను వెలికితీసి జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని అందించిన చిత్రం ' తన్నీర్ తన్నీర్ '. ఇప్పటికి కూడా ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యగా మిగిలిన నీటి సమస్యను ఆ చిత్రంలో వాస్తవిక ధోరణిలో చూపారు బాలచందర్.

ఆయన నిర్మాతగా మారి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించారు. అందులో మణిరత్నం దర్శకత్వంలో నిర్మించిన ' రోజా ' చిత్రం ఎంతటి పేరు తెచ్చుకుందో చెప్పనక్కర్లేదు. సమకాలీన సామాజిక సమస్య లకు ఆయన ఎంతటి ప్రాముఖ్యం ఇస్తారో ఆ చిత్రం చెబుతుంది.

కమలహసన్, రజనీకాంత్, ప్రకాష్ రాజ్ లాంటి ఆణిముత్యాలను చిత్రరంగానికి అందించిన మహాదర్శకుడు బాలచందర్. కమలహసన్, రేవతి జంటగా ఆయన 1986 లో దర్శకత్వం వహించిన ' పున్నగై మన్నన్ ' ( తెలుగు అనువాదం - డాన్స్ మాస్టర్ )   చిత్ర శతదినోత్సవ సంబరాలు చెన్నైలో జరిగినపుడు బాలచందర్ గారి దర్శన భాగ్యం నాకు కలిగింది.  

మరో నాలుగు రోజుల్లో భారత చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించిన తొలి భారతీయ చలన చిత్రం ' రాజా హరిశ్చంద్ర ' 98 వ వార్షికోత్సవం జరుగబోతోంది. ఈ తరుణంలో బాలచందర్ గారికి ఫాల్కే పేరిట వున్న పురస్కారాన్ని ప్రకటించడం తెలుగు వారికి కూడా గర్వకారణం. కళలకు, కళాకారులకు భాషాభేధాలు, ఎల్లలు లేవని నిరూపించారు బాలచందర్. ఈ వార్త విన్న తమిళులెంత ఆనందపడతారో తెలుగు వారు కూడా అంతే ఆనందపడతారు.


దర్శకోత్తముడు బాలచందర్ గారిని అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి భారత ప్రభుత్వం ఎంపిక చేసిన శుభసందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.....
Vol. No. 02 Pub. No. 217

No comments:

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం