Friday, February 11, 2011

గంధర్వ గానం - HMV

--------------------------
11 ఫిబ్రవరి 1974 ....
--------------------------
ఇంద్ర సభ జరుగుతోంది. ఎక్కడనుంచో మధురమైన గానం వినబడింది. అంతే ! సుదీర్ఘ సమాలోచనలతో సందడిగా వున్న సభ నిశ్శబ్దమైంది. అందరూ చెవులు రిక్కించి వినసాగారు. పరవశులై మెల్లగా ఆ గానం వచ్చిన వైపే అందరూ బయిల్దేరారు. వారి దారి భూలోకానికి దారి తీసింది. ముందర దేవేంద్రుడు. వెనుక ఆయన పరివారం. అందరూ భారత దేశంలోని మద్రాస్ లో అడుగు పెట్టారు. అక్కడొక గాయకుడు మధురంగా గానం చేస్తున్నాడు.

ఆ గానం ముందు దేవసభలోని గంధర్వుల గానం దిగతుడుపే ! దేవేంద్రుడు నిగ్రహించుకొలేకపోయాడు. గానం ముగియగానే ఆ గాయకుణ్ణి సమీపించి ప్రశంసించాడు. తమతో పాటు స్వర్గానికి వచ్చి తమను తరింపజేయాల్సిందిగా వేడుకున్నాడు. ఆయనతో బాటు దేవతలందరూ కూడా వంత పాడారు. గంధర్వులైతే ఆ గాయకుని దగ్గర శిష్యరికం చేసి తమ విద్వత్తును మరింత అభివృద్ధి చేసుకోవాలని అభిలషించారు.

విశాల హృదయం కలిగిన ఆ గాయకుడు ఆలోచించాడు. తన గానం ఇప్పటివరకూ భూలోకానికే పరిమితం. సంగీతం విశ్వజనీనం. ఆది అన్ని లోకాలకూ అవసరమే ! గాయకుడు కేవలం ఒక చోటుకే పరిమితం కాకూడదు అనుకున్నాడు. అందుకే దేవేంద్రుని అభ్యర్ధన మన్నించి ఆయనతో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. దేవేంద్రుడు ముల్లోకాలను జయించినంత ఆనందించాడు. సకల స్వర్గ లాంచనాలతో ఆ గాయకుణ్ణి తమ లోకానికి తోడ్కొని వెళ్ళాడు. అమరలోకంలో ఉండవలసిన అద్వితీయ గానం ఈ తుచ్చ మానవులకు మాత్రమే పరిమితం కాకుండా... ఆ మాటకొస్తే అసలు లేకుండా చెయ్యగలిగినందుకు సంతోష పడ్డాడు.

HIS MASTER'S VOICE
ఇక్కడ భూలోకంలో సంగీత కుటుంబమంతా ఘొల్లుమంది. తమ జీవితాల్లో ఇంక చీకటే మిగిలింది అనుకుంది. దేవేంద్రుడు చేసిన అన్యాయానికి ఆగ్రహంతో కుతకుతా వుడికిపోయింది. ఆ విషాదం, ఆగ్రహం చల్లారాక ఆలోచించింది. దేవతలు ఆయన్ని తీసుకెళ్లగలిగారు గానీ ఆయన గానాన్ని కాదుగా ! అని సమాధాన పడ్డారు.ఆయన్ని భౌతికంగా తమకు దూరం చేసినా తమ గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తామని సంగీతాభిమానులందరూ ఒక్కటై ప్రతిజ్ఞ చేసారు.
------------------------
11 ఫిబ్రవరి 2011 .... 
------------------------
గగన విహారం చేస్తున్న దేవేంద్రునికి ఎక్కడ్నుంచో సుపరిచతమైన మధుర గానం వినబడింది. ఆ దిశగా పయనించిన ఇంద్రుడు మళ్ళీ భూలోకానికి వచ్చాడు.

అదే గానం... అదే మార్దవం..... అదే మాధుర్యం.

ఇదెలా సాధ్యం ?

అర్థం కాలేదు దేవేంద్రునికి.

ఆ గాయకుడు గత మూడున్నర దశాబ్దాలకు పైబడి తమ లోకంలో తన గానంతో అలరిస్తున్నాడే ! మళ్ళీ ఇక్కడికెలా వచ్చాడు ? తెలుసుకోవాలనుకున్నాడు. ప్రయత్నం ప్రారంభించాడు.

ఆంధ్ర దేశంలోని ప్రతీ ప్రాంతం తిరిగాడు. ఎక్కడ చూసినా ఆయన గానం వినిపిస్తోంది. ఏ వూరికెళ్ళినా, ఏ పేటకెళ్ళినా, ఏ వీధికెళ్ళినా ఆయన కంఠం వినిపిస్తోంది.

ఎందఱో గాయకులు,.... అందరూ ఆయన పాడిన పాటలే పాడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా టీవీల్లో, రేడియోల్లో, మ్యూజిక్ సిస్టమ్స్ లో, మొబైల్ ఫోన్లలో ఎక్కడ విన్నా ఆయన పాటలే వినిపిస్తున్నాయి. ఆయనకు తెలుగు ప్రజల్లో వున్న ఆరాధనా భావానికి దేవేంద్రుడు పులకించిపోయాడు. ఇన్ని దశాబ్దాలు గడిచినా వారి గుండెల్లో చిరంజీవిగా నిలిచిపోయిన ఆ గంధర్వ గాయకునికి జోహార్లు అర్పించాడు.

 తన గాన మాధుర్యాన్ని తెలుగు వారికి పంచిన... ఇంకా పంచుతూ వున్న గంధర్వ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి వర్థంతి సందర్భంగా స్వర నీరాజనాలర్పిస్తూ ఆయన పాడిన లలిత గీతమాలిక ... 

 




  ఘంటసాల గారిపైన గతంలో రాసిన టపాల లింకులు ...................... 

http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_04.html
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_1328.html
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_11.html
http://sirakadambam.blogspot.com/2010/12/blog-post_04.html

Vol. No. 02 Pub. No. 141

5 comments:

జ్యోతి said...

అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు రావుగారు..

susee said...

Mana andari abhimaana gaayakudu ghantasala venkateswara rao garu.aayana smruti -aayana paata laage- amaram. neti 'vardhanti' bhoutika param gaa bhaavisthoo- ayana smriti ki 'sira kadambam' dwaaraa naa nivaalulu arpisthunnaanu.

SRRao said...

* జ్యోతి గారూ !
* సుబ్బారావు గారూ !

ధన్యవాదాలు

Durga said...

రావు గారు,
కాస్త లేట్ గా ఘంటసాల గారి గురించి మీరు రాసిన పోస్ట్ చదివి ఇప్పుడు కామెంట్ పెడుతున్నందుకు క్షమించాలి.
స్వర్గం లో గంధర్వులను అలరిస్తున్న ఆ మహాగాయకుడు ఇంకా భూలోకం లో కూడా మనందరినీ ఇంకా అలరిస్తూనే వున్నారు, వుంటారు. ఆ అమరగాయకునికి చక్కటి నీరాజనాలర్పించారు.
దుర్గ.

SRRao said...

* దుర్గ గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం