Saturday, February 19, 2011

తెలుగు సినిమా తల్లి


తెలుగు సినిమాలలో అమ్మ
నవరసాలను నటనలో పలికించే అమ్మమ్మ
ఇరవై ఏళ్ళకే అరవై ఏళ్ళ పాత్రలో ఒదిగిన నిర్మలమ్మ

మచిలీపట్నానికి చెందిన నిర్మల 1943 లో ' గరుడ గర్వభంగము ' తో చిత్రసీమలో ప్రవేశించారు. ఆవిడ సినీ జీవిత యాత్ర అంత సాఫీగా ఏమీ సాగలేదు. మళ్ళీ 1944 లో ' పాదుకా పట్టాభిషేకం ' చిత్రంలో అవకాశం వచ్చింది కానీ ప్రాముఖ్యం లేని పాత్ర కావడంతో ఎడిటర్ కత్తెరకు బలయిపోయింది. తర్వాత స్వస్థలానికి తిరిగివచ్చి చాలాకాలం బందరు , విజయవాడ ప్రాంతాల్లో నాటకాలలో వేషాలు వేసారు. 1954 లో సారధి వారు నిర్మించిన ' అంతా మనవాళ్ళే ' చిత్రంలో వల్లం నరసింహారావు ప్రక్కన హీరోయిన్ గా వచ్చిన అవకాశం ఇద్దరూ కొత్త వారైతే జనం చూడరనే కారణంగా చేజారిపోయింది. నిర్మల బక్కపలచగా వుండడం వలన భరణీ వారి ' చక్రపాణి ', వాహిని వారి ' బంగారు పాప ' చిత్రాల్లో వచ్చిన అవకాశాలు కూడా తప్పిపోయాయి. చివరకు మళ్ళీ 1959 లో వచ్చిన సారధి వారి ' భాగ్యదేవత ' ఆమెను కరుణించింది. అయితే అందులో కథానాయిక వేషం కాదు. ఆమెను తెలుగు చిత్రసీమకు తల్లిగా ఆ చిత్రం పరిచయం చేసింది. అందులో ఆమె సావిత్రి, రాజసులోచనలకు తల్లిగా నటించింది. అది మొదలు అనేక చిత్రాలలో ఆమె తల్లి పాత్రలు ధరించింది. 

ఓ ప్రక్క తనకంటే పెద్దవాళ్ళయిన హీరోలకు తండ్రిగా గుమ్మడి నటిస్తుంటే మరో ప్రక్క నిర్మలమ్మది కూడా అదే పరిస్థితి.  1969 లో వచ్చిన ' మనుషులు మారాలి ' ఆమెను అమ్మమ్మను కూడా చేసింది. అప్పట్నుంచి అనేక మంది హీరోలకు, హీరోయిన్లకు అక్కగా, తల్లిగా, బామ్మగా, అమ్మమ్మగా నటించారు. 2007 వ సంవత్సరంలో జరిగిన తెలుగు చలనచిత్ర వజ్రోత్సవ వేడుకలు ఆమె పాల్గొన్న ఆఖరి వేడుక. తర్వాత రెండు సంవత్సరాలకు 2009 వ సంవత్సరం ఫిబ్రవరి 19 వ తేదీన దివంగతులయ్యారు.  

 తెలుగు సినిమా తల్లి నిర్మలమ్మ వర్థంతి సందర్భంగా నీరాజనాలర్పిస్తూ..............

 



Vol. No. 02 Pub. No. 149

3 comments:

Rajendra Devarapalli said...

మీ ద్వారా ఆ గొప్పనటి నిర్మలమ్మకు పాదాభివందనాలు

జయ said...

అవునండి. నిర్మలమ్మగారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవటమన్నది జరగదు. ప్రతిఒక్కరూ ఇష్టపడే నటి ఆవిడ.ఆమె ప్రేమతో తిట్టే తిట్ల కోసం ప్రతీ నటుడూ ఒక్కసారన్నా ఆమెకి కొడుకుగా నటించాలనుకునేవారట.

SRRao said...

* రాజేంద్రకుమార్ గారూ !
* జయ గారూ !

ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం