Sunday, February 13, 2011

సజీవ కళా చిత్రం కళాధర్


*************************************************************************************************
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ లెవరు ?

..... అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు 
 
అజరామరమైన విజయావారి చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్న మహానీయులెవరు ?

అద్భుతమైన పనితనం, నైపుణ్యం గలిగిన ఆ కళాఖండాల సృష్టికర్తలెవరు ?

పాతాళభైరవి విగ్రహం, విజయావారి చందమామ లాంటి అద్భుతాలను ఆవిష్కరించినది ఎవరు ?
*************************************************************************************************
 అరవై నాలుగు కళల మాటేమోగానీ ఇరవై నాలుగు కళల సమాహారం మాత్రం చలన చిత్ర రంగం. అణు ప్రక్రియ అద్భుతాలూ సృష్టిస్తుంది... విలయమూ సృష్టిస్తుంది. దాన్ని ఉపయోగించే వ్యక్తుల వివేకాన్ని బట్టి వుంటుంది అద్భుతమా... విలయమా అన్నది. అలాగే చలనచిత్రాలలో కూడా కళాకారులు సవ్యంగా తమ కళా నైపుణ్యాన్ని చూపితే అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించిన వాళ్ళవుతారు. కళా నైపుణ్యం బదులు తమలోని వికారాల్ని ప్రదర్శిస్తే కళా విధ్వంసకులవుతారు. ఏ కళైనా మనిషి మనసుని రంజింపజేయాలి. అప్పుడే ఆది శాశ్వతంగా నిలబడుతుంది. 

అన్ని రసాలను మేళవించి, అన్ని కళలను రంగరించి తయారు చేసిన చిత్రాలు విజయా వారి చిత్రాలు. ఒకటి ఎక్కువా కాదు... మరొకటి తక్కువా కాదు. వారి చిత్రాల్లో అన్నీ సమతూకంలో అమరి వుంటాయి. అందుకే ఆ చిత్రాలు ఇప్పటికీ సజీవంగా ప్రతీ తెలుగువాడి గుండెలో నిలిచి వున్నాయి.  ఈ విషయంలో మాత్రం తరాల అంతరాల సమస్య తలెత్తదు. ఆ తరం నుండి ఈ తరం వరకూ అందరిదీ ఒకే మాట.

విజయా వారి విజయకేతనం పాతాళ భైరవి . అప్పటివరకూ చూడని  ఓ అద్భుత లోకాన్ని వెండితెర మీద ఆవిష్కరించిన చిత్రం పాతాళభైరవి. సంఘటిత శ్రమ ( Team work ) కు నిదర్శనం ఆ చిత్రం. రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, నృత్య దర్శకుడు, నటీనటులు............ వీరందిరితో బాటు కళా దర్శకులు.... అందరూ సమిష్టిగా చేసిన కృషి, నిర్మాతల ప్రోత్సాహం కలగలిపి తయారైన అద్భుత కళాఖండం పాతాళ భైరవి. ఆ చిత్రం త్వరలో షష్టి పూర్తి చేసుకోబోతోంది.



ఆ సందర్భంగా ఆ చిత్రంతో బాటు ఇంచుమించుగా విజయావారి అన్ని చిత్రాలకు కళా దర్శకత్వ శాఖలో కీలక పాత్ర పోషించిన సజీవ కళా చిత్రం కళాధర్ గారి గురించి, వారి కళావిష్కరణల గురించి కొన్ని విశేషాలు..................
*************************************************************************************************
 తోటరాముణ్ణి పాతాళభైరవికి బలి ఇచ్చి మహాశక్తులు పొందాలనుకుంటాడు నేపాళ మాంత్రికుడు. కొలనులో స్నానం చేసి శుచిగా రమ్మని రాముడికి చెబుతాడు. అతని మాట ప్రకారం స్నానం చెయ్యడానికి కొలనులో దిగిన తోటరాముడు అక్కడున్న మొసలితో పోరాడి సంహరించగానే ఆ మొసలికి శాపవిముక్తి కలిగి యక్ష కన్యగా మారిపోతుంది. తోటరాముడికి మాంత్రికుడి మోసాన్ని తెలియజేస్తుంది. దాంతో మాంత్రికుడ్ని సంహరిస్తాడు రాముడు. వెంటనే సుమారు 20 అడుగులు ఎత్తున్న పాతాళ భైరవి విగ్రహం మూడు ముక్కలుగా విడిపోయి కూలిపోతుంది. 

ఇది పాతాళ భైరవి చిత్రంలోని పతాక సన్నివేశాల్లో ముఖ్యమైన సన్నివేశం. దీని చిత్రీకరణ జరుగుతోంది, ఆ విగ్రహాన్ని మూడు ముక్కలుగా పడెయ్యడానికి అన్నీ సిద్ధం చేసారు. అంతా ఖచ్చితంగా ఒకే టేక్ లో సరిగా జరిగిపోవాలి. రెండో టేక్ అవసరమైతే మాత్రం తప్పనిసరిగా మరో విగ్రహం వుండాలి. అప్పటికప్పుడు ఆది సాధ్యం కాదు. అందుకని ఆ విగ్రహం క్రింద పడినపుడు పాడవకుండా ఉండడానికి క్రింద పరుపులు వేస్తే  బాగుంటుందని సలహా ఇచ్చింది ఎవరో కాదు....... అప్పటికింకా జూనియర్ స్థాయిలో వున్న కళా దర్శకుడు కళాధర్. దీన్ని బట్టి పని మీద ఆయనకున్న శ్రద్ధ,  సునిశిత పరిశీలనా శక్తిని అర్థం చేసుకోవచ్చు.  
*************************************************************************************************

కలలు అందరికీ వుంటాయి. అయితే వాటిని సాకారం చేసుకోవడానికి మాత్రం అంకిత భావం, నిబద్ధత అవసరం. అవి పుష్కళంగా  వున్న కళాకారుడు కళాధర్. చిన్నతనంలో సరదాగా గీసిన గీతలకి ఒక రూపం కల్పించి... ఆ గీతలే తన జీవితంగా మలుచుకున్నారు కళాధర్.

కృష్ణా జిల్లాలో కనీసం సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక మారుమూల పల్లెటూరిలో జన్మించిన సూరపనేని  వెంకట సుబ్బారావు పామర్రు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనాధ్యాపకునిగా తన కళా జీవితం మొదలుపెట్టారు. అక్కడే ఆగిపోకుండా తన కళకు మెరుగులు దిద్దుకోవడంతో బాటు అర్హతా పరీక్షల్లో కూడా వుత్తీర్ణత సాధించారు. దాంతో కూడా సంతృప్తి చెందక తన కళకు రాణింపు రావాలనే కల నెరవేర్చుకోవడానికి మిత్రుల ప్రోత్సాహంతో మద్రాసు చేరారు.

దానికిముందు 1936 లో వెంకట నరసమ్మతో జరిగిన వివాహం ఆవిణ్ణి సుధాదేవి గాను, కళాకారుడైన సుబ్బారావుగారిని కళాధర్ గాను మార్చేసింది. ఆధునిక భావాలు కలిగిన ఆయన పినతండ్రి శోభనరావు గారు వీరి పేర్లు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు.

అప్పటివరకూ బొంబాయిలోవుండి చిత్ర నిర్మాణంలో అనుభవం పొందిన ఎల్వీ ప్రసాద్ ను సారధి ఫిల్మ్స్ వారు మద్రాసు రప్పించి గృహప్రవేశం చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అందులో హీరో కూడా ఆయనే ! ఆ చిత్రానికి కళా దర్శకుడైన వాలి సుబ్బారావు గారికి సహాయకుడిగా చేరారు కళాధర్. ఆ చిత్రానికి ఆయన వేసిన స్కెచ్ లు వాలి గారికి నచ్చి చాలా భాగం పనిని కళాధర్ గారికి అప్పగించారు. అలా 1945 లో గృహప్రవేశం చిత్రంతో కళాధర్ గారి చలనచిత్ర రంగ గృహప్రవేశం జరిగింది.

సారధీ వారు అంతా కొత్తవారితో నిర్మించాలని తలపెట్టిన చిత్రానికి నటీనటుల ఎంపికలో ఎల్వీ ప్రసాద్ గారితో బాటు కళాధర్ గారు కూడా పాల్గొన్నారు. ఆ క్రమంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లభించిన ఆణిముత్యం నందమూరి తారక రామారావు గారు. ఆ నటరాజాన్ని గుర్తించడంలో కళాధర్ గారు కూడా వుండడం విశేషం. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం జరుగకపోయినా 1949 లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో నటి కృష్ణవేణి నిర్మించిన ' మనదేశం ' చిత్రంలో ఎన్టీ రామారావు గారికి తొలి అవకాశం ఇచ్చారు.
 
ఎల్వీ ప్రసాద్ గారి సాహచర్యం గృహప్రవేశం చిత్రంతో ఆగిపోలేదు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో సారధి వారి ఆఫీసులో ఇద్దరూ బస చెయ్యడం వల్ల వారి స్నేహం మరింత ఎదిగింది. ఆ స్నేహబంధం 1949 లో విజయా సంస్థ ప్రారంభ చిత్రం ' షావుకారు ' తో బలపడింది. దాంతో కళాధర్ గారి ' విజయ ' యాత్ర 1968 లో వచ్చిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ వరకూ కొనసాగింది. అప్పట్లో విజయావారి చిత్రాలన్నీ తెలుగు, తమిళం భాషల్లో తయారయ్యేవి. రెండు భాషల్లో కూడా కళాధర్ పనిచేయడం విశేషం.
 ************************************************************************************************
 ఆరోజుల్లో సంవత్సరానికి ఒక సినిమా అతి శ్రద్ధగా, ఎంత ఖర్చు అయినా మంచి టెక్నికల్  ఎఫ్ఫెక్ట్ రావాలన్న ఉద్దేశ్యంతో  తీయడమే విజయాల శాతం ఎక్కువగా ఉండడానికి కారణం. రోజుకు ఎన్ని సీన్లు, ఎన్ని షాట్లు తీశామన్నది ప్రశ్న కాదు. కావలసినంత టైం తీసుకుని తక్కువ పని అయినా శ్రద్ధగా ముగించేవారు.

................. అంటారు కళాధర్.
*************************************************************************************************

కె. వి. రెడ్డి గారి అస్వస్థతతో విజయా వారి నిర్మాణ జోరు తగ్గింది. దాంతో కళాధర్ గారికి బయిటవారి చిత్రాలకు పనిచేసే వెసులుబాటు చిక్కింది. డి. వి. ఎస్. రాజు గారు, నవతా కృష్ణంరాజు గారు, వాసిరాజు ప్రకాశం గారు , విజయబాపినీడు గారు లాంటి నిర్మాతలకు, విఠలాచార్య, కె. విశ్వనాథ్, సి. ఎస్. రావు, సింగీతం శ్రీనివాసరావు, దాసరి, ఎన్. గోపాలకృష్ణ లాంటి దర్శకులతో పనిచేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమ అంతా దాదాపుగా మద్రాసు నుండి హైదరాబాద్ తరలి వెళ్ళినా అప్పటి తరం వారు కొందరు మద్రాసులోనే వుండిపోయారు. అందులో కళాధర్ కూడా ఒకరు. దానికి వయోభారం ఒక కారణమైతే, వారి పిల్లలు కూడా అక్కడ స్థిరపడడం మరో ప్రధాన కారణం.

ఒక చిత్ర నిర్మాణంలో కళా దర్శకుని పాత్ర కీలకమైంది. రచయిత రాసిన, దర్శకుడి మేధస్సులో మెదిలిన సన్నివేశానికి అనుగుణంగా భవనాలు, అలంకరణ సామగ్రి వగైరాలతో దృశ్య నేపథ్యాన్ని సిద్ధం చెయ్యాలి. పాత్రల ఔచిత్యాన్ని బట్టి ఆహార్యం, దుస్తులు రూపకల్పన చెయ్యాలి. దర్శకునితోనే కాక ఛాయాగ్రహకునితో కూడా సమన్వయం చేసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి. కెమెరాకి, లైటింగ్ కి అనుగుణమైన రంగులు వాడినపుడే సన్నివేశ ఔచిత్యం ఇనుమడిస్తుంది. అప్పుడే మనం సంపూర్ణమైన చిత్రాన్ని చూడగలం. అలా కథనూ, కథనాన్నీ అర్థం చేసుకుంటూ వాటికి అవసరమైన నేపథ్యాన్ని అందించడంలో అందివేసిన చెయ్యి కళాధర్ గారు.

ఈ సందర్భంలో మాధవపెద్ది గోఖలే గారితో కళాధర్ గారి అనుబంధాన్ని చెప్పుకోవడం సందర్భోచితం. విజయా వారి చిత్రాల టైటిల్స్ లో కళాదర్శకత్వం అనే టైటిల్ కార్డులో తప్పనిసరిగా కనిపించే జంట పేర్లు గోఖలే - కళాధర్ లు. కొన్ని విలువలకు, నియమాలకు కట్టుబడిన అద్భుత కళాదర్శకుడు మా గోఖలే. సుమారు ఇరవై సంవత్సరాలు ఏ పొరపొచ్చాలు లేకుండా ఆయన సాహచర్యంలో తెలుగు చలన చిత్ర చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత కళాఖండాల సృష్టిలో పాలుపంచుకున్నారు కళాధర్.

 విజయా సంస్థతో బాటు ఇతర సంస్థల చిత్రాలతో కలిపి సుమారు నాలుగున్నర దశాబ్దాలు పనిచేసిన కళాధర్ గారి వయసు ఇప్పుడు 96 సంవత్సరాలు. సంతృప్తికరమైన వృత్తి జీవితంతో బాటు పరిపూర్ణమైన, నిండైన వ్యక్తిగత జీవితానికి  ఉదాహరణగా నిలిచి త్వరలో శతవసంతాలను పూర్తిచేసుకోబోతున్న సజీవ కళా మూర్తి కళాధర్.

కళాధర్ గారు తన కళా జీవిత విశేషాలను ' సినిమా కళలో కళాధర్ ' అనే గ్రంథంలో అక్షర బద్ధం చేసారు. కళాతపస్వి క్రియేషన్స్ మల్లాది సచ్చిదానంద మూర్తి గారి అధ్వర్యంలో ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ఎస్వీ రామారావు గారు, మాటూరు సూరిబాబు గారి రచనా సహకారంతో ఈ గ్రంథం తయారయింది.  తన అనుభవాలను సచిత్రంగా వివరించిన ఈ గ్రంథం ఇప్పటి కళా దర్శకులకు కరదీపిక.

ఆయన కళాజీవిత విశేషాలపై ఒక విహంగ వీక్షణం........

  
Vol. No. 02 Pub. No. 143

6 comments:

Vinay Datta said...

the documentary is simply wonderful.

Durga said...

రావు గారు,

ముందుగా పాటలపల్లకి ప్రసారమయ్యే తెలుగువన్‌రేడియో లింక్ మీ బ్లాగ్ లో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక కళాధర్ గారి గురించి మీ రచన, డాక్యుమెంటరీ చాలా బావున్నాయి. గృహప్రవేశం సినిమాలోని పాట ' మారుతుందోయ్ ధర్మం..' పాట నాకు చాలా ఇష్టం. నేను పాటలపల్లకీలో అప్పుడప్పుడు ఇలాగే ఒకరి గురించి తీసుకుని వారి గురించి సమాచారం సేకరించి చెబుతుంటాను. ధర్శకులు,నిర్మాతలు, సంగీత ధర్శకులు, గాయనీ, గాయకుల ఇంకా ఇతరులు సినీరంగానికి ఎంతో సేవ చేసినవారి గురించి చెబుతుంటాను. అప్పుడు వాళ్ళంతా కష్టపడి ఇంత మంచి, గట్టి పునాదులు వేశారు కాబట్టే మనకు కళాఖండాలను చెప్పుకోదగ్గ సినిమాలు నేటికీ ఎంతో ప్రాచుర్యం లో వున్నాయి.
నాకు ఎప్పుడైనా ఎవరి గురించైనా సమాచారం కావాల్సి వస్తే మీ దగ్గరకు వచ్చి అడుగుతాను. రావు గారు మీరు ఏది రాసినా, ఎవరి గురించి రాసినా చక్కగా ్వారి గురించి సమాచారం, ఫోటోలు, వీడియో క్లిప్స్ పెట్టి చాలా బాగా రాస్తారు. మీ రచనల నుండి నేర్చుకోవలసింది ఎంతైనా వుంది. మాకు ప్రముఖ కళాకారులైన కళాధర్ గారి గురించి రాసి మాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. యూ కీప్ గోయింగ్ సర్!

SRRao said...

* మాధురి గారూ !
ధన్యవాదాలు

* దుర్గ గారూ !

ధన్యవాదాలండీ ! ముఫ్ఫై సంవత్సరాల పైబడి సేకరించి పెట్టుకున్న సమాచారం.... అందరికీ అందించాలన్న తాపత్రయం.... నాకు తెలియనివి, నా సేకరణలలో ఏమైనా పొరబాట్లు వుంటే సరిదిద్దడానికి మీ వంటి మిత్రులు సహకరిస్తారని ఆశ.. వెరసి ఈ బ్లాగు ప్రారంభించి ఇంతదూరం వచ్చేలా చేసాయి. దానికి తగ్గట్లే కొందరు మిత్రులు తమ తోడ్పాటునందిస్తున్నారు కూడా ! శిరాకదంబం విజయం నాది కాదు... నన్ను ప్రోత్సహిస్తున్న మిత్రులదే !

మీకెప్పుడు ఏ సమాచారం అవసరమైనా నిరభ్యంతరంగా అడగవచ్చు. నా దగ్గరున్నంతవరకూ, నా కవకాశమున్నంతవరకూ తప్పకుండా సహకరిస్తాను.

s.v.d.s.sarma said...

annayya
photo surabhi kamalabhai
sira kadambam super

DARPANAM said...

అద్భుతం.
మీరువేసిన పోస్ట్ మామూలుది కాదు.
ఆతరాన్ని,ఈ తరాన్ని ,రాబోయే తరాల్ని సైతం
మరో లోకం లోకి తీసుకుపోగల అద్భుతమైన సెట్స్ వేసిన ఇద్దరు దిగ్గజ కళాకారులను క్లోజ్ గా(మనసుకి) చూపించారు.ఇదేం చిన్న పని కాదు.
ఆయా సెట్స్ ను సినిమాల్లో చూసినపుడు
అక్కడకు వెల్తే బాగున్ను కదా అన్న కోరికను
అతి కష్టం మీద అణుచుకొనే వాళ్లం...కాదంటారా

SRRao said...

సాంబమూర్తి గారూ !
ఒక కళాఖంఢం తయారు కావడానికి అనేకమంది శ్రమ అందులో ఇమిడి వుంటుంది. ఇలాంటి రత్నాలు ఎందరో వున్నారు. అప్పటితరం క్రమంగా కనుమరుగైపోతోంది. వారి గురించి, వారి ప్రతిభ గురించి ఇప్పటి తరం తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ఎందుకంటే ఇప్పటి ప్రగతికి పునాది వేసినది వాళ్ళే ! ఇంకా ఇలాంటి ఆణిముత్యాల గురించి తెలియజెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. దీనికి కొందరు మిత్రులు కూడా సహకరిస్తున్నారు. అదే నాకు కొండంత బలం. ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం