Thursday, February 10, 2011

కథానాయకుడెవరు ?

 ఈ అబ్బాయికి సంగీతం నేర్చుకోవాలని బలమైన కోరిక.

అదీ సంగీతానికి చిరునామా అయిన విజయనగరంలో.... అదికూడా కర్నాటక సంగీతంలో నిధిగా పేరుపొందిన ద్వారం వెంకట స్వామి నాయుడు గారి శిష్యరికంలో....

చేతిలో చిల్లిగవ్వ లేదు. పెద్ద వాళ్ళను అడిగితే అంతదూరం పంపుతారో లేదో తెలీదు. అందుకే తన చేతి వేలికున్న ఉంగరం నలభై రూపాయలకు అమ్మేశాడు. విజయనగరం చేరాడు.

సంగీత కళాశాల ప్రదానాధ్యాపకుడిగా వున్న ద్వారం వారిని కలుసుకున్నాడు. తనను ఆ కళాశాలలో చేర్చుకోవాలని కోరాడు. అప్పుడు కాలేజీకి సెలవులు. తెరిచాక చూద్దామన్నారు అయ్యవారు.

ఎక్కడ వుండాలి ? ఇదీ అతని సమస్య. దానికి కూడా మీరే దిక్కు అని ఆయన్నే వేడుకున్నాడు. అనుమతిస్తే కాలేజీ ఆవరణలోనే ఎక్కడైనా తలదాచుకుని, భుక్తికోసం వారాలు చేసుకుంటూ గడిపేస్తానన్నాడు. అన్నట్లుగానే కాలేజీలోనే బస చేసి, తన నోటి మంచితనంతో వూళ్ళో వారాలు ఏర్పాటు చేసుకున్నాడు.

సాఫీగా, ప్రశాంతంగా రోజులు సాగిపోతే ఇక చెప్పేదేముంది. ఒకరోజు ఆ కాలేజీ ఆవరణలో ఏదో దొంగతనం జరిగింది. సహజంగానే అందరికీ  కొత్తగా వచ్చి ఆవరణలో మకాం పెట్టిన  ఆ అబ్బాయి మీదనే అనుమానం వచ్చింది. అంతే..... అతన్ని అక్కడనుంచి వెళ్ళగొట్టారు. దాంతో అతను రోడ్డున పడ్డాడు. అంతేకాదు దొంగ అనే ముద్ర పడితే అందరూ అనుమానిస్తారు కదా ! వెలివేసినట్లు చూస్తారు కదా ! ( ఇప్పుడు కాదు లెండి ). అప్పటివరకూ ఏర్పాటయిన వారాలు పోయాయి. ఉండడానికి నీడతో బాటు తిండి కూడా కరువయ్యింది. పస్తులతో దిక్కు తోచక ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు.

ఇంతలో ఓ శుభవార్త. కళాశాలలో పోయిన వస్తువు దొరికింది. దొంగా దొరికాడు. అంతే ! ద్వారం వారు అతన్ని అనవసరంగా అనుమానించి వెళ్ళగొట్టినందుకు  పశ్చాతాప్త పడ్డారు. వెదికించి మరీ అతన్ని పిలిపించారు. కళాశాలలో జేర్చుకున్నారు. ఆ తర్వాత అతను ద్వారం వారికి ప్రియ శిష్యుడయ్యాడు. సంగీత విద్వాన్ సాధించాడు. సంగీతంలో నిధి అనిపించుకున్నాడు. ఎన్నెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించాడు.

ఇంతకీ ఈ కథలో కథానాయకుడు ఎవరు ? ఎవరైనా చెప్పగలరా ? ప్రయత్నించండి. చాలామంది చెప్పగలరనే అనుకుంటున్నాను. 

Vol. No. 02 Pub. No. 140

6 comments:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

Ghantasala Venkateswara Rao garu.

susee said...

Inkevarandee- nissandehamgaa- ee photo loni vyakthi mana Ghantasala Venkateswara Rao garu.

Ennela said...

అవునా? నిజమేనా.........!!!!

Vinay Datta said...

Ghantasaala the great.

SRRao said...

* లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారూ !
* సుబ్బారావు గారూ !
* ఎన్నెల గారూ !
* మాధురి గారూ !

అసలు ఈ టపాను క్విజ్ కోసం రాయలేదు. ఘంటసాల గారి వర్థంతి సందర్భంగా ఆయన సంగీతాభ్యాసానికి మొదటి మెట్టు అయిన సంఘటన రాస్తూ చివరలో అలా అడగాలనిపించింది. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

ఎన్నెల గారూ నిజమేనండీ !

Rao S Lakkaraju said...

కొన్ని కొన్ని జీవితంలో మర్చిపోలేము. అటువంటి గురువులు ఆపద్బాన్ధవులు లాగా వచ్చి సహాయం చేసి మన జీవితం నుండి తప్పుకుంటారు. థాంక్స్ ఫర్ పోస్టింగ్.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం