Wednesday, January 19, 2011

చిత్ర రంగ ' వర ప్రసాదం '

సినిమాల మీద మోజుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఓ కుర్రాడు బొంబాయి చేరాడు. అక్కడ స్టూడియోల చుట్టూ తిరిగాడు గానీ ఫలితం కనిపించలేదు. ఇంట్లోనుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. భుక్తి కోసం ఒక సినిమా థియేటర్లో గేటు కీపెర్ గా చేరాడు. అక్కడ టికెట్స్ చింపుకుంటూ సినిమాలు చూస్తూ గడిపెయ్యలేదు. ఖాళీ సమయాల్లో తన ప్రయత్నాలు తాను చేసాడు. చివరికి ఒక స్టూడియో లో పనిదోరికింది. కానీ నటుడవ్వాలన్న కోరిక మాత్రం తీరలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. చివరికి ఒక చిత్రంలో వేషం దొరికింది కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అక్కడితో అతని ప్రయత్నాలు ఆగిపోలేదు. కొనసాగుతూనే వున్నాయి.

1931 లో మన సినిమా మాటలు నేర్చింది. దాంతో అతని కష్టం ఫలించింది. కలలు నిజమయ్యాయి. అర్తేషిర్ ఇరానీ తీసిన తొలి భారతీయ టాకీ ' ఆలం ఆరా ' లో చిన్న పాత్ర లభించింది. అలా తొలి టాకీలో నటించిన తెలుగువాడిగా చరిత్ర సృష్టించిన ఆ కుర్రాడు అక్కినేని లక్ష్మి వర ప్రసాద్.. అదే ఎల్వీ ప్రసాద్.

బొంబాయిలో వున్న సమయంలోనే హెచ్. ఎం. రెడ్డి గారితో పరిచయం అయింది. ఆయన అప్పుడు దక్షిణాదికి టాకీని పరిచయం చేసే ప్రయత్నంలో వున్నారు. తాను తమిళంలో తీసిన ' కాళిదాసు ', తెలుగులో తీసిన ' భక్త ప్రహ్లాద ' చిత్రాల్లో ప్రసాద్ గారికి వేషాలిచ్చారు రెడ్డి గారు. అలా మూడు భాషల్లో వచ్చిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత దక్కించుకున్నారు ఎల్వీ ప్రసాద్ గారు. మద్రాస్ లో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాక ' గృహప్రవేశం ' చిత్రంతో దర్శక గృహ ప్రవేశం చేశారు. అంతేకాదు అందులో ఆయనే కథానాయకునిగా నటించారు. ఆయన దర్శకత్వంలో ' మనదేశం ', ' షావుకారు ', ' మిస్సమ్మ ',  ' అప్పుచేసి పప్పు కూడు ' లాంటి అనేక ఆణిముత్యాలు వచ్చాయి. లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకం పైన ' ఇలవేలుపు ' చిత్రం నిర్మించి నిర్మాతగా మారారు. తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి హిందీలో స్వీయ దర్శకత్వంలో రాజ్ కపూర్ తో  ' శారద ' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయన దర్శక నిర్మాతగా స్థిరపడ్డారు. తర్వాత తన దర్శకత్వంలోను, ఇతరుల దర్శకత్వంలోను ఎన్నో హిందీ చిత్రాలు నిర్మించారు.

ప్రసాద్ ల్యాబ్ పేరుతో మద్రాస్ లోనే కాక మనదేశంలోని చిత్ర పరిశ్రమ వున్న అన్ని ప్రముఖ నగరాలలోను, విదేశాలలో కూడా ల్యాబ్ లు నిర్మించారు. చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. ఆయనకు సినిమాయే ఊపిరి. సామాన్యమైన వ్యక్తిగా చిత్రరంగంలో ప్రవేశించి మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. చిత్రరంగానికి మార్గదర్శకుడు ఆయన. 

 ఎల్వీ ప్రసాద్ గారి జన్మదినం ( జనవరి 17 ) సందర్భంగా ఆయన కు చిత్ర నీరాజనాలు అర్పిస్తూ ............  




మనవి : బ్లాగర్ ప్రియ మరణానికి సంతాపసూచకంగా 17 సాయింత్రం నుండి టపాలేవీ ప్రచురించలేదు. అందువలన ఆరోజు ప్రచురించాల్సిన ఈ టపా ఈరోజు ప్రచురిస్తున్నాను.


Vol. No. 02 Pub. No. 123

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం