Wednesday, January 12, 2011

పుస్తకాల పండుగ

 జనవరి నెల ప్రారంభమే ఒక సంరంభం విజయవాడ పుస్తక ప్రియులకు.
ప్రతీ కొత్త సంవత్సరం సరికొత్త పుస్తకాలతో ముస్తాబవుతుందీ నగరం.
ఒకప్రక్క చలి. మరో ప్రక్క పుస్తకాల లోగిలి.

1989 లో నేషనల్ బుక్ ట్రస్ట్  వేసిన బీజం ఇప్పుడు మహావృక్షమైంది. 1990 లో విజయవాడ లోని పుస్తక ప్రచురణ కర్తలు, విక్రేతలు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం పేరుతో ఒక సంఘంగా ఏర్పడి 1991 నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఆ సంవత్సరం 84 స్టాల్స్ వుంటే ఈ సంవత్సరం 290 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. గతేడాది సుమారు రెండు కోట్ల రూపాయిల వ్యాపారం జరుగగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉండొచ్చని ప్రాథమిక అంచనా.

టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తకాల మీద మోజు తగ్గలేదు. సరిగదా పెరుగుతోందనిపించింది పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న జనాన్ని....ముఖ్యంగా యువతను చూస్తే.......
యువత పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతోందని, తెలుగు భాష మీద, సాహిత్యం మీద మమకారం సన్నగిల్లిపోయిందని బాధపడుతున్న వారికి ఈ పుస్తక ప్రదర్శన జవాబు చెప్పింది. ఎంతోమంది యువకులు, ముఖ్యంగా టీనేజ్ దశను ఇప్పుడిప్పుడే దాటుతున్న వారు మన దేవులపల్లి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ముళ్ళపూడి, బాపు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, రంగనాయకమ్మ లాంటి వారి సాహిత్యం కూడా ఆసక్తిగా పరిశీలించడం కనిపించింది. వారు చదువుతున్నారా లేదా అన్నది ప్రక్కన పెడితే వారిలో ఆయా పుస్తకాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలగడమే శుభసూచకం. ఇదొక ప్రారంభం అనుకుందాం. అలాగే పాత సినిమాలపైన, కళాకారులపైన వచ్చిన పుస్తకాలపైన కూడా వారు ఆసక్తి చూపడం గమనించాను. ఇటీవలే విడుదలైన తెలుగు నాటకాలు, తెలుగు హాస్య నాటికల సంకలనాలపైన కూడా చాలామంది.... ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారు.

 పదకొండురోజులపాటు జరిగిన 22 వ పుస్తకాల పండుగ ఈరోజుతో ( జనవరి 11 వ తేదీతో ) విజయవంతంగా ముగిసింది. విజయవాడ వాసులకు ఆనందాన్ని పంచింది. ఇలాగే కలకాలం ఈ పండుగ జరగాలని విభిన్నమైన కొత్త కొత్త పుస్తకాలతో పుస్తకప్రియుల్ని అలరించాలని, పుస్తకం సజీవంగా వుండాలని కోరుకుంటూ.....
                                                                                                                               
" అక్షర రూపం దాల్చిన 
ఒకేఒక్క సిరాచుక్క 
లక్ష మెదళ్ళకు కదలిక "

Vol. No. 02 Pub. No. 114

4 comments:

Afsar said...

బెజవాడ బుక్ ఫెస్టివల్ గురించి ఎవరూ రాయలేదేమిటా అన్న అసంతృప్తి వుంది ఇప్పటి దాకా.

బెజవాడ బ్లాగ్ లోకం మేలుకోవాలి!

మీరు అయినా రాయడం సంతోషం. మరిన్ని కబుర్లు రాస్తారని ఎదురుచూస్తూ...

తృష్ణ said...

అహా...! మా బెజవాడ ఫోటో చూపెట్టారు...ధన్యవాదాలు. పధ్నాలుగేళ్ళపాటు ఆ పుస్తక మహోత్సవం వదలకుండా ప్రతిసారీ నాలుగైదు మార్లు వెళ్ళేవాళ్ళం...మీరు కొన్న పుస్తకాల కబుర్లు..ఇంకా వివరాలు రాయండి.

భాను said...

విజయవాడ పుస్తక పండగ కు వెళ్ళాలన్న నా కోరిక కోరిక గానే మిగిలిపోయింది. ఈ సారి ఎలా అన్న వెళ్ళాలి అనుకుంటే అస్సలు వీలు కాలేదు . జనవరి ఒకటో తారీఖు నుంచి చూస్తున్న ఎవ్వరయిన ఈ ఫెస్టివల్ గురించి రాస్తారేమోనని అదేంటో మరి ఎవ్వరూ రాయ లేదు. చివరికి మీరు రాశారు సంతోషం. మొన్న ఓ మిత్రురాలినుంచి ఫోన్ కాల్ .. భాను గారూ నేను బుక్ ఫెస్టివల్ లో ఉన్న ఎమన్నా కావాలా అని .. వెళ్ళినంత సంతోష మనిపించింది. ఇంకా ఎమన్నా విశేషాలుంటే రాయండి.

SRRao said...

* అఫ్సర్ గారూ !
ధన్యవాదాలు. హైదరాబాద్ లో వున్నప్పుడు అక్కడ, విజయవాడలో వున్నప్పుడు ఇక్కడ తప్పనిసరిగా పుస్తక ప్రదర్శనలకు రెండు మూడుసార్లు వెళ్ళడం అలవాటు. పనుల వత్తిడుల వల్ల, ఊళ్ళో లేకపోవడం వల్ల ఈసారి ఒకేసారి అదీ చివరి రోజు మాత్రమే కుదిరింది. క్రిందటి సంవత్సరం 'ఇ - తెలుగు' వారి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈసారి వారు ఎందుకో మౌనం వహించారు. కారణం తెలీదు.

* తృష్ణ గారూ !
ధన్యవాదాలు. ఒకసారి ఏయే పుస్తకాలు వున్నాయో, కొత్తవి ఏవి వచ్చాయో చూడడానికి వెళ్ళేవాడిని. మరోసారి నిర్ణయించుకున్న పుస్తకాలు కొనడానికి వెళ్ళేవాడిని. కనీసం ఒకేరోజులో రెండో రౌండ్ లోనైనా కొనేవాడిని. నిన్న మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ప్యాకింగ్ మొదలుపెట్టేసారు. నిర్ణయించుకుని అన్నీ కొనే అవకాశం దొరకలేదు కానీ ' పథేర్ పాంచాలి ' నవలకు మద్దిపట్ల సూరి గారి అనువాదం ... భమిడిపాటి కామేశ్వరరావు గారి హాస్యవల్లరి, మొదలి నాగభూషణ శర్మ గారి 'అలనాటి గ్రామఫోన్ గాయకులు' కొన్నాను. వాటిలోని విశేషాలు త్వరలోనే అందరికీ అందిస్తాను. అన్నట్లు భరణి గారి ' నక్షత్ర దర్శనం ' పుస్తకం చూడగానే మీరు గుర్తుకొచ్చారు.

* భాను గారూ !
ధన్యవాదాలు. ఈ సంవత్సరం కూడా 'ఇ - తెలుగు' వారు కార్యక్రమం ఏర్పాటు చేస్తారనుకున్నాను. బ్లాగ్మిత్రులు కలుస్తారనుకున్నాను. ఎందుకో అది జరగలేదు. బహుశా పనుల వత్తిడి వల్ల అనుకుంటాను. నాకు కూడా అదే పరిస్థితి. పుస్తక ప్రదర్శనకు వెళ్ళకపోతే ఆ సంవత్సరమంతా ఏదో వెలితి. అందుకని నిన్న వీలు చేసుకుని మరీ వెళ్లాను.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం