Monday, January 31, 2011

మాటకు మాట



ప్రపంచ ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్ ఓసారి ప్రక్కింటికి వెళ్ళి ఓ పుస్తకం కావాలని అడిగాడు.

ప్రక్కింటాయన " దానికేముంది అలాగే ఇస్తాను. కానీ మీ ఇంటికి పట్టుకెళ్ళకుండా ఇక్కడే కూర్చుని చదువుకోవాలి " అన్నాడు. 

మార్క్ ట్వైన్ థాంక్స్ చెప్పి తన ఇంటికి వచ్చేసాడు.

కొంతకాలం తర్వాత ఆ ప్రక్కింటాయన మార్క్ ట్వైన్ దగ్గరకొచ్చి " సర్ ! మీ లాన్ కట్టర్ ఓసారి ఇస్తారా ? " అనడిగాడు. మార్క్ ట్వైన్ వెంటనే " అయ్యో ! అంతగా అడగాలా ? తప్పకుండా ఇస్తాను. కానీ దాన్ని మీరు మీ ఇంటికి పట్టుకెళ్ళకుండా ఇక్కడే ఉపయోగించాలి మరి... అన్నాడు.

అప్పుడా ప్రక్కింటాయన మొహం చూడాలి మరి.....

Vol. No. 02 Pub. No.131

Friday, January 28, 2011

జాన ' పథం '

ఒక సామాన్య యువకుడు రాజకుమారిని ప్రేమిస్తాడు. సహజంగానే ఇది రాజుకు కోపం తెప్పిస్తుంది. దాంతో అతన్ని బంధిస్తాడు. ఇంతలో రాణికి పేరు తెలియని జబ్బేదో వస్తుంది. ఆస్థాన వైద్యులు నయం చెయ్యడం తమ వల్ల కాదని, ఎక్కడో చాలా కోసుల దూరంలో వున్న అడవిలో వున్న అరుదైన సంజీవిని మూలికను తీసుకొచ్చి వైద్యం చేస్తేకానీ నయంకాదని చెబుతారు. అయితే ఆ ప్రాంతం ఒక రాక్షసుని అధీనంలో వుందని, వాణ్ణి ఎదిరించి ఆ మూలికను తీసుకురావడం అంత సులువు కాదని కూడా చెబుతారు. దాంతో రాజు అక్కడికి వెళ్ళి ఆ రాక్షసుడ్ని జయించి, ఆ మూలికను తెచ్చిన వాడికి అర్థరాజ్యంతో బాటు రాజకుమారిని ఇచ్చి వివాహం జరిపిస్తానని ప్రకటిస్తాడు. ఆ సాహసం చెయ్యడానికి రాజ్యంలో ఎవ్వరూ ముందుకు రారు. ఖైదులో వున్న కథానాయకునికి ఈ విషయం తెలిసి తనకు అవకాశం ఇస్తే ఆ సాహసం చేస్తానని చెబుతాడు. దాంతో రాజు అతన్ని విడుదల చేస్తాడు.


ఆ యువకుడు బయిల్దేరుతాడు. దారిలో ప్రాణాపాయంలో వున్న జంతువొకటి కనబడుతుంది. దాన్ని అతను రక్షిస్తాడు. దాంతో ఆ జంతువు ఒక దేవకన్యగా మారిపోతుంది. తనకు శాపవశాన ఈ రూపం వచ్చిందని ఆ యువకుని వలన విమోచనం కలిగిందని అతనికి కృతజ్ఞతలు చెప్పి ఒక ఉంగరం ఇస్తుంది. ఆది ధరిస్తే కోరుకున్న చోటుకు వెళ్ళవచ్చని చెప్పి మాయమైపోతుంది. ఆ ఉంగరం మహిమ వలన మూలిక వున్న చోటుకి చేరుకుంటాడు. అక్కడ అడ్డగించిన రాక్షసుని అనుచరులని తొలగించుకుంటూ ముందుకు సాగిన ఆ యువకుడిని రాక్షసుడు తన మాయతో కోతిగా మార్చేస్తాడు. దాంతో అతను వచ్చిన పనికి ఆటంకం కలుగుతుంది. అక్కడ ఇంకా అతని లాంటి వాళ్ళు అనేక రూపాల్లో కనిపిస్తారు. తన అసలు రూపు ఎలా పొందాలా, అక్కడనుంచి ఎలా తప్పించుకోవాలా, ఆ మూలికను ఎలా సాధించాలా అని ఆలోచిస్తుంటాడు. అతనికో మార్గం దొరుకుతుంది.


ఏమిటా మార్గం ? ఆ యువకుడు తప్పించుకున్నాడా ? ఆ మూలిక సాధించాడా ? రాజధాని చేరుకున్నాడా ? రాజకుమారిని చేపట్టాడా ? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే వెండితెరపై చూడండి.   

ఇదేమీ చందమామలోని కథ కాదు. జానపద సినిమాల కథ. ఆ మాటకొస్తే సుమారుగా జానపద కథలన్నీ ఈ బాణీలోనే వుంటాయి. అవి నేల విడిచి సాము చేస్తాయి. ఆది వాటి నైజం. ఇవన్నీ కేవలం కల్పిత కథలని అందరికీ తెలుసు. రచయిత గానీ, దర్శకుడు గానీ, నిర్మాత గానీ ఇదొక సందేశాత్మక చిత్రమనీ, వైవిధ్యభరితమైన కథ అనీ,  అదని, ఇదనీ గొప్పలు చెప్పరు. అయినదానికీ, కాని దానికీ ఆస్ట్రేలియాలు, మారిషస్ లూ వెళ్ళి గుంపు నృత్యాలు లాంటి కవాతులు, గ్రాఫిక్స్ యుద్ధాలు చేయించరు. మనల్ని మనం మరచిపోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా మూడు గంటలు గడపడానికి కావాల్సిన, అందరికీ తెల్సిన కథ, దాంట్లో మలుపులు, పుష్కలంగా వినోదాన్ని అందించే మాయలు.. మహిమలు, అప్పుడప్పుడు సాహస పోరాటాలు, చక్కటి వీనుల విందైన పాటలు, నృత్యాలు .... ఇవన్నీ కలిపితే ఆది విఠలాచార్య చిత్రం.   

సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని హంగుల్నీ దర్శకత్వమనే తన మంత్రదండంతో వెండితెర మీద సృష్టించిన జానపద బ్రహ్మ విఠలాచార్య. మూస చిత్రాలనీ, ట్రెండ్ పేరుతో అన్నీ ఒకే ఫార్ములాతో తీస్తున్నారని మనం ఇప్పుడు తిట్టుకుంటున్నాం. కానీ విఠాలాచార్య చిత్రాలన్నీ ఫార్ములా చిత్రాలే ! కథ ఏదైనా ఆయన ఫార్ములా ఒకటే ! అయినా అవన్నీ వినోదాత్మకమైనవే ! పిల్లల్నీ, పెద్దల్నీ, ఆడా మగా తేడా లేకుండా అందర్నీ అలరించినవే ! రోజంతా కష్టపడి పని చేసిన శ్రమజీవి కష్టాన్ని మరిపించి మర్నాటికి మళ్ళీ పనికి సిద్ధం చేసే అమృత గుళికలు విఠలాచార్య చిత్రాలు. ఆయన చిత్రాల గురించి ఎక్కువ చర్చలు, వాదోపవాదాలు అక్కర్లేదు. హాయిగా కాసేపు చూసి ఆనందించడమే తప్ప సమాజాన్ని ఉద్ధరించేది గానీ, పాడు చేసేది గానీ ఏమీ వుండదు. ఎందుకంటే సమకాలీన సమాజ నేపథ్యం కాదు కనుక ప్రేక్షకులెవరూ తమను తాము ఆ చిత్రాల లోని పాత్రలతోను, సంఘటనలతోను సరి పోల్చుకోరు.... ప్రభావితం కారు. అవన్నీ ఊహాజనితమైన కథలనీ, ఊహాజనిత పాత్రలనీ ప్రేక్షకుల మనస్సులో ముందే స్థిరపడిపోయి వుంటుంది.

అలాంటి ఊహాజనిత ప్రపంచాన్ని తెలుగు తెరపై సృష్టించిన జానపద చిత్రాల బ్రహ్మ విఠలాచార్య.  హోటల్ రంగానికి ప్రసిద్ధి చెందిన కన్నడ దేశంలోని ఉడిపిలో జన్మించి, తెలుగు ప్రేక్షకులకు తన చిత్రాలతో షడ్రసోపేతమైన విందు భోజనం అందించిన దర్శకుడు విఠలాచార్య. కొత్త సినిమా నిర్మాణాన్ని ప్రకటించిన రోజునే విడుదల తేదీ ప్రకటించగలిగిన సత్తా వున్న దర్శకుడు. నిర్మాతల పాలిట వరం విఠలాచార్య.

ఆయన చిత్రీకరణ పైన వున్న అందరికీ తెలిసిన ఓ జోకు........ ఏరోజైనా షెడ్యూలు ప్రకారం హీరో గానీ, హీరోయిన్ గానీ రాకపోతే ఆరోజు వారి మీద తియ్యాల్సిన సీన్లు ఆగేవి కాదట. ఆ దృశ్యంలో మిస్సయిన వారిని కోతిగానో, చిలుక గానో, మరోటి గానో మార్చేసి తీసేసేవారట. అలా ఆయన షెడ్యూల్ ను పాడు కానిచ్చేవారు కాదట.

ఓసారి ఓ నిర్మాత విఠలాచార్య దగ్గరకొచ్చి " అయ్యా ! మీరు అతి తక్కువ ఖర్చుతో చిత్రాలు నిర్మిస్తారని అంటారు. ఆ కిటుకేదో నాకు కూడా చెబితే నన్ను రక్షించిన వారవుతారు " అని అడిగాడు.
దానికాయన " అలాగే చెబుతాను. ఒక్క నిముషం. ఫ్యాన్ వుంటే చాలుగా ! లైట్ ఆర్పేసి వస్తాను. " అని కుర్చీలోంచి లేచారు. అంతే విషయం గ్రహించిన ఆ నిర్మాత " ఇంకే చెప్పనక్కర్లేదు. నాకర్థమైపోయింది. నమస్కారం. వస్తాను " అని లేచి వెళ్ళిపోయాడట. అదీ విఠలాచార్య గారి పొదుపు.

స్టార్ డం మీద కాక టెక్నిక్ మీద నమ్మకం ఎక్కువ ఆయనకి
అందుకే ఆయనకు స్టార్లక్కర్లేదు.. ఆయన చిత్రాల్లో ఆయనే స్టార్

కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే మాట తెలియని రోజుల్లో అద్భుతమైన గ్రాఫిక్స్ సృష్టించిన ఘనుడాయన.    
తెలుగు చిత్రరంగంలో విఠలాచార్యది ఒక ప్రత్యేకమైన పంథా ! అదే జనపదులకు ఇష్టమైన జాన ' పథం '  !!!

 జానపద బ్రహ్మ విఠలాచార్య జయంతి సందర్భంగా ఆయనకు చిత్ర నీరాజనాలతో...............




 Vol. No. 02 Pub. No. 130

Thursday, January 27, 2011

క్రాక్


నెల్లూరులో ధర్మదాతగా పేరుపొందిన రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు తనకున్న భవనాలలో ఒకదాన్ని శిశు వైద్యశాల ఏర్పాటుకు విరాళంగా ఇచ్చారు.

దాన్ని స్వాధీనం చేసుకునే పని మీద వచ్చిన ఓ ప్రభుత్వాధికారి ఆ భవనాన్ని పరిశీలిస్తున్నాడు. రెడ్డిగారు దగ్గరుండి ప్రతీ గదీ చూపిస్తున్నారు. ఆ అధికారి గోడలు, పైకప్పూ అన్నిటినీ పరీక్షగా చూస్తున్నాడు.

ఆది గమనించిన రెడ్డిగారు " ఏమిటయ్యా ? అంత పరీక్షగా చూస్తున్నావు ? బిల్డింగ్ ఎక్కడైనా క్రాకిచ్చిందా ? " అనడిగారు.  

దానికా అధికారి కంగారు పడి " అబ్బెబ్బే ! అదేం లేదు సార్ ! " అన్నాడు.

" లేకపోతే ఇంతమంచి భవనాన్ని దానం చేసిన వీడెంత క్రాకో అనుకుంటున్నావా ? " అనడిగారు రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు.

Vol. No. 02 Pub. No. 129

Wednesday, January 26, 2011

తెలుగు తెర అప్పాజీ

 ఆయన తెలుగు తెరకు అప్పాజీ
ఆయన హీరో కాని హీరో

హీరోకి అర్థం కథానాయకుడు
అయితే ఆయన చాలా చిత్రాల్లో హీరోనే !

తెలుగు తెర ఇంటికి ఆయన పెద్ద
ఆయన అన్న, తండ్రి, తాత, మామ....అన్నీ

సాత్విక పాత్రలు, దుష్ట పాత్రలు, హాస్యం మిళితమైన పాత్రలు
అన్నీ ఆయనకు నల్లేరు మీద మీద బండి నడక

పౌరాణికం, సాంఘికం, చారిత్రాత్మికం....
ఏ పాత్రైనా ఆయనకు అనితర సాధ్యం  

స్వచ్చమైన తెలుగు ఉచ్చారణ ఆయన సొంతం
అద్వితీయమైన సాత్వికాభినయం ఆయనకే సాధ్యం  

ఆయనే సాత్వికాభినయ సామ్రాట్ గుమ్మడి వెంకటేశ్వరరావు
ఆయన మరణించి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది

 కీ. శే. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ప్రథమ వర్థంతి సందర్భంగా కళా నీరాజనాలతో...............

యు - ట్యూబ్ లో ప్రణీత్ గారి ఛానల్లో గుమ్మడి గారి తొలి పౌరాణిక చిత్రం ' హరిశ్చంద్ర ' లోని పద్యములతో కూడిన సన్నివేశం....  



Vol. No. 02 Pub. No. 131

గణతంత్ర దినోత్సవం







 62 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో .................




  పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు ప్రముఖులందరికీ శుభాభినందనలు

Vol. No. 02 Pub. No. 130

Tuesday, January 25, 2011

పద్మభూషణ్ వహీదా

అచ్చమైన తెలుగు పాట ' ఏరువాకా సాగారో ..... '
అందులో అచ్చమైన తెలుగు జానపద సుందరి వహీదా

వహీదా రెహమాన్ తెలుగు వారందరికీ మరిచిపోలేని జ్ఞాపకం. నటిగా, నర్తకిగా తెలుగు సినిమాతో పరిచయమై గురుదత్ చిత్రాలతో హిందీ చిత్ర రంగంలో ప్రవేశించి జాతీయనటిగా ఎన్నో మెట్లు ఎక్కి..... అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుని భారతీయ ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న వహీదా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం పొందడం ఆనందదాయకం.

 దేశంలోని అత్యున్నత పురస్కారానికి ఎంపికైన వహీదా రెహ్మాన్ కు అభినందనలతో................ 




Vol. No. 02 Pub. No. 129

Monday, January 24, 2011

అలనాటి అభిరాముడు

తొలుత భోగి
పిదప విరాగి
ఆపైన యోగి
...... ఇలా పరివర్తన చెంది లోకానికి అమూల్యమైన సూక్తులు చెప్పి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు వేమన యోగి.
ఆ మహనీయునికి........................................

తొలుత స్నేహితునిగా
పిదప అనుచరునిగా
ఆపైన శిష్యునిగా 

జీవిత చరమాంకం వరకూ తోడుగా, నీడగా అనుసరించిన వాడు అభిరాముడు. వేమన జీవితంలోనే భాగమైపోయాడు. అందుకే వేమన ' విశ్వదాభిరామ వినుర వేమా ! ' అన్నాడు. తెలుగు వారి హృదయాల్లో వేమన ఉన్నంత కాలం అభిరాముడు ఉంటాడు.

వేమనను చూడని, చూడలేని వారికి ఆయన నాగయ్య గారి రూపంలో సాక్షాత్కారిస్తే లింగమూర్తి రూపంలో అభిరాముడు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.

వేమన యోగి, అభిరాముల అనుబంధాన్ని చరిత్ర ద్వారా, కథల ద్వారా, యోగి వేమన చిత్రం ద్వారా మనం విన్నాం.... చూసాం. కానీ అదే అనుబంధానికి ఒకప్పటి సజీవ ఉదాహరణ నాగయ్య - లింగమూర్తి ల స్నేహానుబంధం.

1937 లో ' తుకారాం ' చిత్రం ద్వారా రంగస్థలం నుండి చలన చిత్ర రంగానికి వచ్చిన ఆణిముత్యం ముదిగొండ లింగమూర్తి.  వాహినీ వారి ‘ వందేమాతరం ‘ , ‘ సుమంగళి ‘, ‘ దేవత ‘ , ' స్వర్గసీమ ', ‘ యోగి వేమన ‘, ‘ పెద్దమనుష్యులు ‘లాంటి చిత్రాలన్నిటిలో ఆయన నటించారు. ఇవేకాక నాగయ్య గారితో కలసి ' త్యాగయ్య ', ' పోతన ' లాంటి చిత్రాలలో నటించి వారితో అనుబంధాన్ని చిత్రాలలోనే కాదు.... నిజజీవితంలో కూడా పెంచుకున్నారు.

వారి అనుబంధం విడదీయలేనిది. ' బావా ! ' అన్న పిలుపు వారి మధ్య ఆత్మీయతకు, ఆప్యాయతకు చిహ్నం. లింగమూర్తి గారు నిర్మొహమాటి. ముక్కుకు సూటిగా మాట్లాడడం ఆయన నైజం. కొన్ని సందర్భాలలో ఆ స్వభావం కొంతమంది మిత్రులతో, సన్నిహితులు, ఇతరులతో ఇబ్బందులు కల్పించిందని చెబుతారు. కానీ వీరిద్దరి మధ్య మాత్రం ఎప్పుడూ విబేధాలు వచ్చిన దాఖలాలు లేవు. నిష్కల్మషమైన స్నేహానికి ప్రతిరూపం నాగయ్య, లింగమూర్తి గార్లు.

**************************************************************

 వేమన అద్భుతమైన జీవిత సత్యాలతో కూడిన సాహితీ సంపదను లోకానికి అందించి తన జన్మను సార్థకం చేసుకుని భౌతిక కాయం చాలించి అనంత లోకాలకు పయనమయ్యే సమయం ఆసన్నమైంది. ఆయన అనుచరులు, శిష్యులు శోకతప్త హృదయాలతో అంతిమ వీడ్కోలు చెబుతున్నారు. వేమన యోగికి బాల్య స్నేహితుడు, తదనంతరకాలంలో ప్రధాన శిష్యుడిగా సేవలందించిన అభిరాముని పరిస్థితి వర్ణించనలవి కాదు. 


' వేదాతీతుడు వేమననుండీ.... అంతా చేరుట అచటేనండీ...... ' అని పాడుతూ అభిరాముడు వేమన యోగికి వీడ్కోలు పలికే సన్నివేశంలో మనకు అభిరాముడే కనిపిస్తాడు. లింగమూర్తి కనిపించడు. 

*************************************************************

ఈ సన్నివేశ చిత్రీకరణ ముగిసాక ఇద్దరూ వేషం తీసేస్తూ వుండగా లింగమూర్తి గారితో నాగయ్య గారు " బావా ! ఈ సన్నివేశంలో లాగే మనిద్దరిలో ఒకరు ఈ జీవితకాలపు కాల్ షీట్ పూర్తి చేసుకుని భౌతికకాయం వదిలే ముందు అతని చెవిలో రెండవ వారు నారాయణ మంత్రం జపిస్తూ వీడ్కోలు ఇవ్వాలి. అలాగని నాకు మాటివ్వు. " అని ఆయన చేత తన చేతిలో చెయ్యి వేయించుకున్నారు. చివరికి ఆ భాగ్యం లింగమూర్తి గారికి దక్కింది. నాగయ్య గారి అంతిమ ఘడియల్లో లింగమూర్తి గారు తన స్నేహితునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అదీ వారి స్నేహానుబంధం. విలువలు పాటించే వారెప్పుడూ లోకంలో శాశ్వత స్థానం సంపాదించుకుంటారు. తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతకాలమైనా, ఎంతమంది వచ్చి వెళ్ళినా నాగయ్య గారి స్థానాన్ని భర్తీ చేసిన వారు లేరు.... ఉండరు. అలాగే ఆయనకు అత్యంత సన్నిహితునిగా, నవరసాలు పోషించిన నటునిగా లింగమూర్తి గారి స్థానాన్ని కూడా ఎవరూ భర్తీ చెయ్యలేరు. ముఖ్యంగా వారిద్దరూ పాటించిన విలువలు ఇంకెవరూ పాటించలేరేమో !

లింగమూర్తి గారు షష్టి పూర్తి జరిగాక నటనా జీవితం నుండి విశ్రాంతి తీసుకున్నారు. చివరి రోజుల్లో తక్కువ పారితోషికంతో వచ్చిన ఆఫర్లను అంగీకరించలేదు. తనకు వేషాలు తగ్గాయేమో గానీ, తన ప్రతిభ మాత్రం తగ్గలేదు కనుక తన విలువను తానే తగ్గించుకోవాల్సిన అవసరం లేదనేవారు. అంతటి ఆత్మాభిమానం ఆయనది.

 ఈరోజు ( జనవరి 24 ) ముదిగొండ లింగమూర్తి గారి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.............. 

లింగమూర్తి గారికి కళా నీరాజనాలు అర్పించే నా వ్యాసం ..................................
లో ఈ లింకు లో చదవండి.


నాగయ్య - లింగమూర్తి గారల జంట యొక్క వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే ' యోగి వేమన ' చిత్రంలోని అంతిమ ఘట్టం మీకోసం .............. 




Vol. No. 02 Pub. No. 128

Sunday, January 23, 2011

బ్రిటిష్ గాడిదలు

ఉద్యమ స్పూర్తి అనేది మన నాయకులు స్వాతంత్ర్యోద్యమం నుంచే నేర్చుకోవాలి. పదవులకోసమో, డబ్బుకోసమో ఆనాడు వారు ఉద్యమాలు చెయ్యలేదు. ఇంకా చెప్పాలంటే ఉద్యమకారుల్లో  చాలామంది తమ ఉద్యోగాలను, పదవులను, చివరికి డబ్బును కూడా వదులుకొని ఉద్యమం నడిపారు. అందుకే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పెత్తనాన్ని భారతదేశంలో అస్తమించేలా చెయ్యగలిగారు. ఉద్యమాలను వ్యాపారంగా మార్చిన ఈరోజుల్లో ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు. వారి నిబద్ధత, కార్యదీక్ష చేతల్లోనే కాదు...  మాటల్లో కూడా అడుగడుగునా ప్రతిధ్వనించేది.

ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు కరుడుగట్టిన స్వాతంత్ర్య వాది. తూటాల్లాంటి మాటలు వదలడంలో దిట్ట. అందులోను బ్రిటిష్ దొరల మీదనయితే ఇంక చెప్పనక్కరలేదు. ఒకసారి అయన పనిచేస్తున్న కాలేజీకి బ్రిటిష్ జాతీయుడైన గవర్నర్ వచ్చాడు. ఆ సందర్భంలో ఆ గవర్నర్ కాలేజీ లోని తరగతి గదులను పరిశీలిస్తూ గోపాలకృష్ణయ్య గారు పాఠం చెబుతున్న గదికి కూడా వచ్చాడు. ఆ సమయానికి మాష్టారు బోర్డు పైన రెండు గాడిద బొమ్మలు వేశారు. ఆది చూసిన గవర్నర్ అవేమిటని ప్రశ్నించాడు.

దానికి గోపాలకృష్ణయ్య గారు రెండింటినీ చూపిస్తూ " ఆది గాడిద.... ఇది కంచర గాడిద " అని వివరించారు.

అప్పుడు ఆ గవర్నర్ హేళనగా " మీ దేశంలో గాడిదలు ఉంటాయా ? మా దేశంలో లేవే !! " అన్నాడట.

వెంటనే దుగ్గిరాల వారు తడుముకోకుండా  " నిజమే సర్ ! మీ దేశంలోని గాడిదలన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం మాదేశానికి తోలేసిందిగా ! ఇంకెలా వుంటాయి అక్కడ.... " అన్నారట. 

Vol. No. 02 Pub. No. 127

Saturday, January 22, 2011

ఎక్కడ కూర్చుంటేనేం.....?

 తాడేపల్లిగూడెం పట్టణంలో స్వర్గీయ రేలంగి గారికి ఓ సినిమా హాల్ వుంది. ఓసారి ఆట ప్రారంభించేముందు అయన హాలు బయిట కుర్చీలో కూర్చున్నారు. ఇంతలో ఓ పల్లెటూరి ఆసామి ఆయన దగ్గరకు వచ్చి.......

" బాబయ్యా ! సినేమాకి టికెట్టు ఎంత ? " అని అడిగాడు.

దానికి రేలంగి గారు " బాల్కనీ రెండు రూపాయిలు... కుర్చీ రూపాయి.... బెంచీ అర్థ రూపాయి... నేల పావలా.... పాటల పుస్తకం పదిపైసలు...." అని దండకం చదివారు.

వెంటనే ఆ అమాయకుడు " అలాగా బాబూ ! ఎక్కడ కూకోని చూసినా అదే సినెమా కదా ! అందుకని పాతాళ పుస్తకం ఓటి ఇవ్వండి బాబూ ! దానిమీద కూకోని చూసేస్తా ! " అన్నాడు సీరియస్ గా.

ఎప్పుడూ అందర్నీ నవ్వించే రేలంగిగారికి తానే నవ్వక తప్పలేదు. 

Vol. No. 02 Pub. No. 126

Friday, January 21, 2011

ఆత్మకథలూ - అనుభవాలు

 పింగళి సూరన వంశానికి చెందిన ప్రముఖ రచయిత ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారికి డొంక తిరుగుడు వ్యవహారాలు నచ్చవు. మాట్లాడాలనుకున్నది సూటిగా మాట్లాడేవారు.
ఆయన దగ్గరికి ఓసారి ఓ ప్రముఖ రాజకీయ వేత్త వచ్చాడు. పింగళి గారితో ఇలా అన్నాడు.
" కవి గారూ ! నాకు ' ఆత్మకథ ' వ్రాసుకోవాలని వుంది. మీ సలహా చెప్పండి "

పింగళి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా
" ఆత్మకథ అనేది కల్పన లేని నిజమైన జీవితకథ గా వుండాలి. చాలామంది  తమ తప్పుల్ని దాచేసి, తమ ఆత్మకథల్లో గోప్పల్ని మాత్రమే వ్రాసుకుంటారు. అలా కాకుండా ఉన్నదున్నట్లు వ్రాసే ధైర్యం మీకుంటే ' ఆత్మకథ ' వ్రాసుకోండి. లేదా మీకు తోచింది వ్రాసి దానికి ' అనుభవాలు - జ్ఞాపకాలు ' అని పేరు పెట్టుకోండి. అందులో మీకిష్టమైన విషయాలు మాత్రమే వ్రాసుకోవచ్చు. అదీ కాకపోతే మీ కథ వేరొకరితో వ్రాయించండి. వారు ఏమి వ్రాసినా ఫర్వాలేదు " అని ఇలా సుదీర్ఘంగా సలహా ఇచ్చేటప్పటికి ఆ రాజకీయ నాయకుడు ' ఆత్మకథ ' వ్రాసుకోవాలనే ఆలోచనకు స్వస్తి పలికాడట.  

Vol. No. 02 Pub. No. 125

Thursday, January 20, 2011

ఫ్యామిలీ ' ప్లానింగ్ '

క్రిందటి శతాబ్దంలో మన దేశంలో చాలా ఎక్కువగా వినిపించిన నినాదం ' చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం - కుటుంబ నియంత్రణ పాటించండి ' . అధిక జనాభాతో పెరుగుతున్న భారాన్ని తగ్గించడానికి అప్పటి ప్రభుత్వాలు దీన్నొక ఉద్యమంగా చేసాయి. అయితే కొంతమంది సాంప్రదాయవాదులు, ఛాందసులు దీన్ని కొట్టి పారేశారు. మరికొంతమంది ఆశావాదులు, ముఖ్యంగా ఆడపిల్లలు కలిగిన వాళ్ళు మగపిల్లవాడు కావాలని సంతానాన్ని పెంచుకోవడం అప్పటి తరంలో కనిపిస్తుంది. ఈ చాందస వాదానికి కుటుంబ నియంత్రణ అమలు చేస్తున్న ప్రభుత్వాధినేతలు కూడా అతీతులు కారనడానికి ఓ నిదర్శనం.

 మన మాజీ రాష్ట్రపతి వరహగిరి వెంకటగిరి గారు సరస సంభాషణా పరులు. ఆయనకు సంతానం ఎక్కువే ! ఒకసారి ఒక విలేఖరి ఆయన్ని ప్రశ్నిస్తూ
" మీ ప్రభుత్వం దేశ ప్రజలందర్నీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటించమంటోంది. మరి మీరెందుకు పాటించడం లేదు " అని అడిగాడు.
 
దానికి గిరి గారు సమాధానమిస్తూ తన సహజదోరణిలో " ఎందుకు పాటించడంలేదు ? పాటిస్తూనే వున్నానే ! కాకపోతే నాది కొంచెం పెద్ద ఫ్యామిలీ ' ప్లానింగ్ '. అంతే ! " అన్నారట.

Vol. No. 02 Pub. No. 124

Wednesday, January 19, 2011

చిత్ర రంగ ' వర ప్రసాదం '

సినిమాల మీద మోజుతో ఇంట్లో నుంచి పారిపోయిన ఓ కుర్రాడు బొంబాయి చేరాడు. అక్కడ స్టూడియోల చుట్టూ తిరిగాడు గానీ ఫలితం కనిపించలేదు. ఇంట్లోనుంచి తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. భుక్తి కోసం ఒక సినిమా థియేటర్లో గేటు కీపెర్ గా చేరాడు. అక్కడ టికెట్స్ చింపుకుంటూ సినిమాలు చూస్తూ గడిపెయ్యలేదు. ఖాళీ సమయాల్లో తన ప్రయత్నాలు తాను చేసాడు. చివరికి ఒక స్టూడియో లో పనిదోరికింది. కానీ నటుడవ్వాలన్న కోరిక మాత్రం తీరలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు. చివరికి ఒక చిత్రంలో వేషం దొరికింది కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అక్కడితో అతని ప్రయత్నాలు ఆగిపోలేదు. కొనసాగుతూనే వున్నాయి.

1931 లో మన సినిమా మాటలు నేర్చింది. దాంతో అతని కష్టం ఫలించింది. కలలు నిజమయ్యాయి. అర్తేషిర్ ఇరానీ తీసిన తొలి భారతీయ టాకీ ' ఆలం ఆరా ' లో చిన్న పాత్ర లభించింది. అలా తొలి టాకీలో నటించిన తెలుగువాడిగా చరిత్ర సృష్టించిన ఆ కుర్రాడు అక్కినేని లక్ష్మి వర ప్రసాద్.. అదే ఎల్వీ ప్రసాద్.

బొంబాయిలో వున్న సమయంలోనే హెచ్. ఎం. రెడ్డి గారితో పరిచయం అయింది. ఆయన అప్పుడు దక్షిణాదికి టాకీని పరిచయం చేసే ప్రయత్నంలో వున్నారు. తాను తమిళంలో తీసిన ' కాళిదాసు ', తెలుగులో తీసిన ' భక్త ప్రహ్లాద ' చిత్రాల్లో ప్రసాద్ గారికి వేషాలిచ్చారు రెడ్డి గారు. అలా మూడు భాషల్లో వచ్చిన తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఘనత దక్కించుకున్నారు ఎల్వీ ప్రసాద్ గారు. మద్రాస్ లో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాక ' గృహప్రవేశం ' చిత్రంతో దర్శక గృహ ప్రవేశం చేశారు. అంతేకాదు అందులో ఆయనే కథానాయకునిగా నటించారు. ఆయన దర్శకత్వంలో ' మనదేశం ', ' షావుకారు ', ' మిస్సమ్మ ',  ' అప్పుచేసి పప్పు కూడు ' లాంటి అనేక ఆణిముత్యాలు వచ్చాయి. లక్ష్మి ప్రొడక్షన్స్ పతాకం పైన ' ఇలవేలుపు ' చిత్రం నిర్మించి నిర్మాతగా మారారు. తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి హిందీలో స్వీయ దర్శకత్వంలో రాజ్ కపూర్ తో  ' శారద ' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆయన దర్శక నిర్మాతగా స్థిరపడ్డారు. తర్వాత తన దర్శకత్వంలోను, ఇతరుల దర్శకత్వంలోను ఎన్నో హిందీ చిత్రాలు నిర్మించారు.

ప్రసాద్ ల్యాబ్ పేరుతో మద్రాస్ లోనే కాక మనదేశంలోని చిత్ర పరిశ్రమ వున్న అన్ని ప్రముఖ నగరాలలోను, విదేశాలలో కూడా ల్యాబ్ లు నిర్మించారు. చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. ఆయనకు సినిమాయే ఊపిరి. సామాన్యమైన వ్యక్తిగా చిత్రరంగంలో ప్రవేశించి మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. చిత్రరంగానికి మార్గదర్శకుడు ఆయన. 

 ఎల్వీ ప్రసాద్ గారి జన్మదినం ( జనవరి 17 ) సందర్భంగా ఆయన కు చిత్ర నీరాజనాలు అర్పిస్తూ ............  




మనవి : బ్లాగర్ ప్రియ మరణానికి సంతాపసూచకంగా 17 సాయింత్రం నుండి టపాలేవీ ప్రచురించలేదు. అందువలన ఆరోజు ప్రచురించాల్సిన ఈ టపా ఈరోజు ప్రచురిస్తున్నాను.


Vol. No. 02 Pub. No. 123

Monday, January 17, 2011

తొలి గ్రామఫోన్ రికార్డు - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 35_ జవాబులు 


తెలుగు చలన చిత్ర రంగంలో తొలి గ్రామఫోన్ రికార్డు 

అ )  ఏ చిత్రానికి విడుదలయ్యింది ?
 జవాబు : సి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈస్టిండియా ఫిల్మ్స్ వారి ' సావిత్రి ' చిత్రం

ఆ )  ఏ సంవత్సరంలో.... ?
 జవాబు : 1933
 
ఇ )  ఏ కంపెనీ విడుదల చేసింది ?

జవాబు : సన్ రికార్డ్స్ ; కాకినాడ 

ఈ పాటలు చిత్రంలో ఒకరు పాడితే రికార్డుల కోసం మరొకరు పాడారట.

Vol. No. 02 Pub. No. 111a

Sunday, January 16, 2011

పశువులు - ప్రభల పండుగ

కనుమ పండుగ
పశువుల పండుగ

పాడిపంటలకు, మన సౌభాగ్యానికి చిహ్నాలు పశువులు
వ్యవసాయంలో ప్రాధాన్యం తగ్గినా పాడికి మనకింకా పశువే ఆధారం
అందుకే పశువుల్ని సంపదగా గుర్తించిన సంస్కారం మన సంస్కృతిది 
ఈరోజు పశువులను అలంకరించి పూజలు చేసి గౌరవించడం మన సాంప్రదాయం
మానవత్వం మంట కలిసిపోయిన ఈరోజుల్లో పశువులే మనిషికి ఆదర్శం
అందుకే పశుప్రవృత్తి అనే పదాన్ని మానవప్రవృత్తి అని మార్చుకోవాలేమో !!



కనుమ పండుగ
కోనసీమ ప్రభల తీర్థం

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో కనుమ పండుగ రోజు ప్రత్యేక ఆకర్షణ ప్రభల తీర్థం. మొసలపల్లి, పుల్లేటికుర్రు గ్రామాల మధ్యలో జగ్గన్నతోట వద్ద పంట చేలలో జరిగే ఈ తీర్థం కనుల పండువగా వుంటుంది. కోనసీమలోని చాలా గ్రామాల నుంచి వచ్చిన ప్రభలు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి.
వెదురు కర్రలను చీల్చి వాటిని వర్తులాకారంలో వంచి కట్టి, దాన్ని రంగురంగుల వస్త్రాలతో, పూలతో అలంకరిస్తారు. దానిపైన దేవతామూర్తులను ప్రతిష్టించి ఊరేగింపుగా జగ్గన్నతోటకు తీసుకువెడతారు. ఈ ఊరేగింపుకు ప్రత్యేకత ఏమిటంటే ఎత్తుగా, భారీగా కట్టిన ప్రభలను తమ ఊరినుంచి ఊరేగింపుగా తీసుకు వెళ్ళేటపుడు దారిలో కాలువలు, పంట పొలాలు అడ్డువచ్చినా తప్పించి దూరంగా వున్న వంతెన మీదనుంచో, రోడ్ మీదనుంచో వెళ్ళరు. వాటిలోకి దిగి కాలువ నీళ్ళు ప్రభకు తగలకుండా ఎత్తి పట్టుకుని , పంట పొలాల నుండి అయితే ఏపుగా ఎదిగిన పంటను తొక్కుకుంటూ తీసుకు వెడతారు. మామూలుగా పంటచేలో పశువులు, ఇతరులు దిగితే సహించని రైతు ఆరోజు మాత్రం ప్రభను మోసుకుంటూ పంటను తొక్కితే బ్రహ్మానంద భరితుడవుతాడు. అలా ప్రభ తన పోలంలోంచి వెడితే తనకు శుభం జరుగుతుందని రైతుల నమ్మిక. నిజానికి అలా తన పోలంలోంచి ప్రభ వెళ్లాలని కోరుకుంటారు.
అచ్చమైన జానపదుల ఉత్సవం ' ప్రభల తీర్థం ' గురించిన వీడియోలు యు ట్యూబ్ లో లభిస్తున్నాయి.



 మిత్రులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు  

Vol. No. 02 Pub. No. 122

Saturday, January 15, 2011

సంక్రాంతి లక్ష్మి


సంక్రాంతిలక్ష్మి మీ తలుపు తట్టినదండి 
ఏడాదికొకసారి ఏతెంచు పర్వమ్ము 


సిగలోన చేమంతి చేతిలో పూబంతి 
సంక్రాంతి సీమంతి నీ స్వాంతమున కాంతి 

మకరాంక విక్రాంతి ఈ మధుర సంక్రాంతి 
చైతన్య పులకితము ఈ మకర సంక్రాంతి 

                 - మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతిరావు  

 సంక్రాంతిలక్ష్మి  మిత్రులందరికీ సకల శుభాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.....




Vol. No. 02 Pub. No. 121

Friday, January 14, 2011

నట ' శోభను'డు

ఆయన అభిమన్యుడు
ఆయన శ్రీరాముడు
ఆయన నారీనారీ నడుమ మురారి
ఆయన నారీజన వల్లభుడు
ఆయన వృత్తిలోను, ప్రవృత్తిలోను ప్రణాళికా బద్ధుడు 
ఆయన నటుడిగా, వ్యాపారవేత్తగా ఎందరికో ఆదర్శపురుషుడు
ఆయనే నటభూషణుడు శోభన్ బాబు



 ఈరోజు ( జనవరి 14 ) శోభన్ బాబు జన్మదినం సందర్భంగా నివాళి 

 Vol. No. 02 Pub. No. 120

తెలుగు హాస్యం c / o జంధ్యాల

 కొంతకాలం పాటు మనందర్నీ కడుపారా నవ్వించిన హాస్య యోగిపుంగవుడు జంధ్యాల
జగమెరిగిన జంధ్యాలకు పరిచయమేల...... !

ఆయన హాస్యాన్ని మరోసారి, మళ్ళీ ఓ సారి మనసారా ఆస్వాదించి, కడుపారా నవ్వుకోండి


 ఈరోజు ( జనవరి 14 ) జంధ్యాల జన్మదినం సందర్భంగా ఆయనకు నవ్వుల నీరాజనం 



Vol. No. 02 Pub. No. 119

భోగిమంటల భోగుల్లో...........

 కళ్యాణికంఠి ఈ కన్య సంక్రాంతి 
భోగాలబాల ఈ భోగి సంక్రాంతి 
వేడుకల్ విప్పార తోడితెత్తాము 
ప్రియమైన పాటలన్ పిలిచి వత్తాము  
                          - రాయప్రోలు



వక్రదృష్టిని మళ్లించేందుకు పెట్టేవి గొబ్బిళ్ళు
ఆవు పేడతో చేసి అలంకరించేవి గొబ్బిళ్ళు  
ఔషధ గుణాలు కలిగినవి గొబ్బిళ్ళు
ఆరోగ్యాన్ని, సకల శుభాలను ఇచ్చేవి గొబ్బిళ్ళు
భోగి మంటలలో పిడకలుగా చేసి వేసేవి గొబ్బిళ్ళు
తెలుగు ప్రజల నమ్మిక, విశ్వాసం గొబ్బిళ్ళు, భోగి మంటలు

 మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు 



Vol. No. 02 Pub. No. 118

Thursday, January 13, 2011

రాతలతో నిద్ర లేపడం ..........


  జంధ్యాల గారి జోక్స్  

ఓ మొగుడు పెళ్ళాం పోట్లాడుకుని మాట్లాడుకోవడం మానేశారు. మొగుడు మర్నాడు ఉదయం ఆఫీసు పని మీద క్యాంపు కి వెళ్ళాలి. అందుకని
' నన్ను తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేపు ' అని ఓ కాగితం మీద రాసి పెట్టి పడుకున్నాడు. 

ప్రొద్దున్న ఏడింటికి మెలుకువ వచ్చిందాయనకి. కంగారుగా లేచి చూస్తే రాత్రి తాను పెట్టిన కాగితం పక్కనే
' నాలుగయింది. లేవండి ' అని రాసి వున్న కాగితం కనిపించింది.

Vol. No. 02 Pub. No. 117

బంధుజనంతో జాగ్రత్త



 జంధ్యాల గారి జోక్స్   

 ఒకాయన ఇంటిమీదకు ఎప్పుడూ బంధుజనం వచ్చి పడుతుండేవారట. ఉన్నట్టుండి చుట్టాలు రావడం మానేసారట. ఎప్పుడూ గల గలలాడుతూ ఉండే ఇల్లు ప్రశాంతంగా వుండడం చూసి పక్కింటాయనకి ఆశ్చర్యమేసింది.
" ఏంటి సార్ ! ఈమధ్య మీ చుట్టాల రాక తగ్గింది. కుక్క వున్నది జాగ్రత్త లాంటి బోర్డు ఏమైనా తగిలించారా ? " అని అడిగాడు.

దానికా ఇంటాయన " అబ్బే ! కుక్క వున్నది జాగ్రత్త అనికాదు.... 'కుక్కలకు ఆహ్వానం' అని బోర్డు తగిలించాను. అంతే ! ఒక్కడొస్తే ఒట్టు " అన్నాడు.   

Vol. No. 02 Pub. No. 116

Wednesday, January 12, 2011

అదృష్టాలు - ఆర్టీసీ బస్సులు


 
జంధ్యాల గారి సూక్తి   



*********************************************************************************************

అదృష్టాలు  అనేవి ఆర్టీసీ బస్సుల్లాంటివి. వస్తే ఒకేసారి అరడజను వస్తాయి. లేదా ఎంతగా ఎదురుచూసినా రావు. 


****************************************************************************************************************************************
Vol. No. 02 Pub. No. 115

పుస్తకాల పండుగ

 జనవరి నెల ప్రారంభమే ఒక సంరంభం విజయవాడ పుస్తక ప్రియులకు.
ప్రతీ కొత్త సంవత్సరం సరికొత్త పుస్తకాలతో ముస్తాబవుతుందీ నగరం.
ఒకప్రక్క చలి. మరో ప్రక్క పుస్తకాల లోగిలి.

1989 లో నేషనల్ బుక్ ట్రస్ట్  వేసిన బీజం ఇప్పుడు మహావృక్షమైంది. 1990 లో విజయవాడ లోని పుస్తక ప్రచురణ కర్తలు, విక్రేతలు విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం పేరుతో ఒక సంఘంగా ఏర్పడి 1991 నుండి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఆ సంవత్సరం 84 స్టాల్స్ వుంటే ఈ సంవత్సరం 290 స్టాల్స్ ఏర్పాటయ్యాయి. గతేడాది సుమారు రెండు కోట్ల రూపాయిల వ్యాపారం జరుగగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉండొచ్చని ప్రాథమిక అంచనా.

టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఎంతగా అభివృద్ధి చెందినా పుస్తకాల మీద మోజు తగ్గలేదు. సరిగదా పెరుగుతోందనిపించింది పుస్తక ప్రదర్శనలో పాల్గొన్న జనాన్ని....ముఖ్యంగా యువతను చూస్తే.......
యువత పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతోందని, తెలుగు భాష మీద, సాహిత్యం మీద మమకారం సన్నగిల్లిపోయిందని బాధపడుతున్న వారికి ఈ పుస్తక ప్రదర్శన జవాబు చెప్పింది. ఎంతోమంది యువకులు, ముఖ్యంగా టీనేజ్ దశను ఇప్పుడిప్పుడే దాటుతున్న వారు మన దేవులపల్లి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, ముళ్ళపూడి, బాపు, బుచ్చిబాబు, పాలగుమ్మి పద్మరాజు, రంగనాయకమ్మ లాంటి వారి సాహిత్యం కూడా ఆసక్తిగా పరిశీలించడం కనిపించింది. వారు చదువుతున్నారా లేదా అన్నది ప్రక్కన పెడితే వారిలో ఆయా పుస్తకాల గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలగడమే శుభసూచకం. ఇదొక ప్రారంభం అనుకుందాం. అలాగే పాత సినిమాలపైన, కళాకారులపైన వచ్చిన పుస్తకాలపైన కూడా వారు ఆసక్తి చూపడం గమనించాను. ఇటీవలే విడుదలైన తెలుగు నాటకాలు, తెలుగు హాస్య నాటికల సంకలనాలపైన కూడా చాలామంది.... ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారు.

 పదకొండురోజులపాటు జరిగిన 22 వ పుస్తకాల పండుగ ఈరోజుతో ( జనవరి 11 వ తేదీతో ) విజయవంతంగా ముగిసింది. విజయవాడ వాసులకు ఆనందాన్ని పంచింది. ఇలాగే కలకాలం ఈ పండుగ జరగాలని విభిన్నమైన కొత్త కొత్త పుస్తకాలతో పుస్తకప్రియుల్ని అలరించాలని, పుస్తకం సజీవంగా వుండాలని కోరుకుంటూ.....
                                                                                                                               
" అక్షర రూపం దాల్చిన 
ఒకేఒక్క సిరాచుక్క 
లక్ష మెదళ్ళకు కదలిక "

Vol. No. 02 Pub. No. 114

Tuesday, January 11, 2011

గట్టి ప్రధాని

రోజూ ఉదయం నిద్ర లేచాక ఏడు గంటలకు డిల్లీ వార్తలు వచ్చే సమయానికి తప్పనిసరిగా రేడియో మ్రోగుతుండేది. 1966 వ సంవత్సరం జనవరి 11 వ తేదీ. ఆరోజు మామూలుగా రేడియో పెట్టిన మాకు వార్తలకు ముందుగా విషాద సంగీతం వినిపించింది. తర్వాత కొంతసేపటికి ప్రారంభమైన వార్తల్లో పిడుగులాంటి వార్త. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణించారని. అంతకుముందు రెండు, మూడు నెలల క్రితం వరకూ పాకిస్తాన్ తో భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కోవడంతో అంత చిన్న వయస్సులో కూడా ఆయనంటే ఎంతో ఆరాధనా భావం ఏర్పడిపోయింది. శాంతి చర్చలకు రష్యా  వెళ్ళి మనకి ఇంక పాకిస్తాన్ బెడద లేకుండా చేస్తారని ఆశించిన ఈ దేశ ప్రజలందరికీ నిరాశ ఎదురయింది.


రూపానికి చిన్న
గుణానికి మిన్న
నీతి నిజాయితీకి మారుపేరు
మృదుభాషణ, సత్ప్రవర్తన ఆయన తీరు

పేదరికం ఆయన అనుభవించాడు
జీవితం అంటే ఏమిటో ఆయన నేర్చుకున్నాడు
ఆయన పరిపాలన పద్దెనిమిది నెలలే
ఆయన అందించిన సేవలు అనేక వేలు

దేశాన్ని కాపాడడానికి సైనికుడెంత ముఖ్యమో
ప్రజల ప్రాణాలను నిలబెట్టడానికి రైతు కూడా అంతే ముఖ్యమని నమ్మిన మహోన్నతుడు
అందుకే ' జై జవాన్ జై కిసాన్ ' అన్నాడు.

రైల్వే మంత్రిగా వున్నప్పుడు  జరిగిన రెండు ప్రమాదాల్లో
వందలాదిమంది మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన ఆదర్శప్రాయుడు
అందుకే అంతులేని ప్రజాభిమానం చూరగొన్నాడు

ప్రధానిగా ఉంటూ కూడా చివరివరకూ తన కారు అప్పు వాయిదాలు తానే చెల్లించిన నిజాయితీపరుడాయన
ఈ దేశంలోని నిరుపేదల కోసం తన ఒకరోజు జీతాన్ని ప్రతీ నెలా విరాళంగా ఇచ్చిన కార్యశూరుడాయన
హరిత విప్లవాన్ని, శ్వేత విప్లవాన్ని ఈ దేశానికి అందించిన అభ్యుదయ యథార్థ వాది ఆయన  

మచ్చలేని రాజకీయనాయకుడు ఆయన
మంచితనానికి మారుపేరు ఆయన 
అందుకే అల్పాయుష్కుడయ్యాడు

మళ్ళీ లాల్ బహదూర్ ని మన రాజకీయాల్లో చూడగలమా ?
ఎప్పటికైనా మరో లాల్ బహదూర్ మన ప్రధానిగా వస్తాడా ?
అత్యాశైనా..... ఆశించడంలో తప్పులేదుగా ! అందుకని ఆశిద్దాం !!

 మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తూ..........

స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి మరణానికి ముందు పాల్గొన్న తాష్కెంట్ చర్చల విశేషాలు.........



స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి సంస్మరణ కార్యక్రమం ( ఆయన కుమారుడు, మనవడితో )............



Vol. No. 02 Pub. No. 113

Monday, January 10, 2011

ఆ మూడురోజులు తీసుకో !



 జంధ్యాల గారి జోక్స్  


 ఓ అతితెలివి గల ప్రొడక్షన్ మేనేజర్ ఓసారి రేలంగి గారి దగ్గరకెళ్ళి
" సార్ ! మాకు మీ డేట్స్ కావాలండీ !  జస్ట్ మూడురోజులు చాలు. ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నా మాకు అక్కర్లేదు. దాంతో మా సినిమా అయిపోతుంది.... అందుకని....." అన్నాడు అతి వినయంగా.

అతని అధిక ప్రసంగం విన్న రేలంగి గారు ఊరుకుంటారా ? వెంటనే
" సరేనయ్యా ! నీ అంతటివాడు అంత ఇదిగా అడుగుతుంటే కాదనగలనా ! నువ్వడిగినట్లే ఇస్తాను. నా డైరీలో వచ్చే ఫిబ్రవరి నెల 29 , 30 , 31 తేదీలు ఖాళీగా వున్నాయి. ఆ మూడురోజులూ తీసుకో ! " అన్నారుట.

అతితెలివే గానీ అసలు తెలివిలేని ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఆనందంగా నిర్మాత దగ్గరకెళ్ళి తాను సాధించిన ఘనత చెప్పుకుని ముక్క చీవాట్లు తిన్నాడట.

Vol. No. 02 Pub. No. 112

Sunday, January 9, 2011

తొలి గ్రామఫోన్ రికార్డు

   కనుక్కోండి చూద్దాం - 35 


తెలుగు చలన చిత్ర రంగంలో తొలి గ్రామఫోన్ రికార్డు 

అ )  ఏ చిత్రానికి విడుదలయ్యింది ?
ఆ )  ఏ సంవత్సరంలో.... ?
ఇ )  ఏ కంపెనీ విడుదల చేసింది ?


Vol. No. 02 Pub. No. 111

Friday, January 7, 2011

మరణించాను కనుక తొలగించండి

 ఆంగ్లంలో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ కు ఓసారి ఓ వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ దినపత్రికలో ఓ రోజు పతాక శీర్షికలో కిప్లింగ్ మరణించినట్లు వార్త వచ్చింది. ఉదయాన్నే ఆ వార్త చదివిన కిప్లింగ్ కి మతిపోయినట్లయింది. సహజంగానే సంతాప సందేశాలు మొదలయ్యాయి. కాసేపటికి తేరుకున్న కిప్లింగ్ ఆరా తీస్తే తన పేరుగల మరో వ్యక్తి చనిపోయాడని, ఆ పత్రిక వారు పొరబడి రచయిత కిప్లింగ్ అనుకుని ఆ వార్తను అలా ప్రచురించారని అర్థమయింది.

కిప్లింగ్ వెంటనే ఆ పత్రిక సంపాదకుడికి ఇలా ఓ ఉత్తరం రాసాడు...........

" మీ పత్రికలో వార్తలు ప్రచురించేముందు వాటి వాస్తవికతను నిర్థారించుకునే ప్రచురిస్తారని అనుకుంటాను. అందుకని నా మరణవార్త కూడా నిజమే అయి వుండాలి. కనుక మీ పత్రిక చందాదారుల పట్టిక నుండి నా పేరు తొలగించాల్సిందిగా కోరుకుంటున్నాను "

Vol. No. 02 Pub. No. 110

Thursday, January 6, 2011

' వద్దంటే పెళ్లి ' నిడివి

 ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు ఎంత హాస్యరస స్పోరకంగా వుంటాయో తెలుగు పాఠకులకు / ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన 1950 వ దశకంలో కొన్ని పత్రికల్లో చిత్ర సమీక్షలు కూడా చేశారు. అవి ఇప్పటి సమీక్షల్లా కాదు. పక్షపాత రహితంగా వుండేవి. చిత్రాల్లో వుండే మంచిని ఎంత బాగా చెప్పేవారో, లోపాల్ని అంతే సునిశితంగా విమర్శించేవారు. అయితే వాటిలో ముళ్ళపూడి వారి మార్క్ స్పష్టంగా కనిపించేది. మచ్చుకి ఒక ఉదాహరణ చూడండి.

1954 లో వచ్చిన ' వద్దంటే పెళ్లి ' చిత్రం మీద సమీక్ష రాస్తూ ముళ్ళపూడివారు .................

" ఈ చిత్రం నిడివి మూడు మైళ్ళ ఐదు ఫర్లాంగుల తొమ్మిది గజాలు లేదా మూడు గంటల ముఫ్ఫై ఏడు నిముషాల పదిన్నర సెకన్లు " అంటూనే ................

" రెండో ఆటకి పిల్లాజెళ్ళతో వెళ్ళేవాళ్లు పకోడీలు, జంతికలూ వగైరా చేసుకుని రెండు మరచేంబులతో మంచినీళ్ళు పట్టుకుని మరీ వెళ్ళడం మంచిది " అని సలహా కూడా ఇస్తారు.

Vol. No. 02 Pub. No. 109

Wednesday, January 5, 2011

కవి అంటే........

 
కలం వున్నవాడు
కలల్లో బతికేవాడు 
కలయిక లేనివాడు 
కవి ...................



ఇది కవికి వేటూరి సుందరరామమూర్తి గారిచ్చిన నిర్వచనం


Vol. No. 02 Pub. No. 108

Tuesday, January 4, 2011

ఏడుపెందుకు ?

 జగ్గయ్య గారికి గంభీరమైన స్వరంతో బాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగానే ఉండేది. ఓసారి ఆయన షూటింగ్ కోసం లొకేషన్ కి చేరుకున్నారు. కానీ అక్కడ షూటింగ్ జరగడం లేదు. అందరూ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.

" ఏమిటి షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు ? " అని అడిగారు జగ్గయ్యగారు.

" ఇంకా సీన్ సిద్ధం కాలేదు. రచయిత గారు అదిగో ... ఆ ప్రక్కన కూర్చుని రాస్తున్నారు " అన్నాడట ఆ చిత్ర దర్శకుడు.

దానికి కొనసాగింపుగా సహాయ దర్శకుడు " సీన్ చాలా బాగా వస్తున్నట్లుంది సార్ ! రైటర్ గారు రాస్తూ ఏడుస్తున్నారు. " అన్నాడు.

" సీన్ రాస్తూ ఏడుస్తున్నారో, రాయలేక ఏడుస్తున్నారో ముందు కనుక్కో బాబూ ! " అన్నారట జగ్గయ్య గారు.


Vol. No. 02 Pub. No. 107

Sunday, January 2, 2011

మహాకవి పుట్టినరోజు

 మహాకవి శ్రీశ్రీ గారి జన్మదినం విషయంలో ఒక సందిగ్ధత వుంది. కొంతమంది జూన్ 30 వ తేదీ అంటారు. గత సంవత్సరం శ్రీశ్రీ గారి శతజయంతి కూడా ఈ తేదీ ప్రాతిపదికగానే జరిపారు.

మరికొంతమంది ఆయన జన్మదినం జనవరి 2 వ తేదీ అంటారు. ఆయన కుమారుడు నిర్వహిస్తున్న మహాకవి శ్రీశ్రీ సైట్ లో ఆయన జన్మదినాన్ని జనవరి రెండుగానే పేర్కొన్నారు. ఈ క్రింది లింకులో  ఆ విషయం గమనించవచ్చు.

http://www.mahakavisrisri.com/home/auto.html

నిజమేదైనా ఆ మహాకవిని మరోసారి సంస్మరించుకోవడానికి ఈ రెండున రెండవ పుట్టినరోజైనా ఫరవాలేదనిపించింది. సాధారణంగా అందరికీ సంవత్సరంలో ఒకరోజే పుట్టిన రోజుగా పరిగణిస్తాం. శ్రీశ్రీ గారి సాహిత్యం లాగే ఇది కూడా ఒక అసమానమైన, అపూర్వమైన అవకాశంగా పరిగణిస్తూ.....

అందుకే మహాకవి శ్రీశ్రీ గారికి సాహిత్యాంజలి ఘటిస్తూ..........

ఆయనపై గతంలో రాసిన టపాల లింకులు -

ఛలోక్తులు -
http://sirakadambam.blogspot.com/2009/12/blog-post_11.html
http://sirakadambam.blogspot.com/2009/11/2.html
http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_20.html 
http://sirakadambam.blogspot.com/2009/10/blog-post_12.html

ఇతర విశేషాలు -
http://sirakadambam.blogspot.com/2009/11/dishantcom-jukebox.html 
http://sirakadambam.blogspot.com/2010/02/blog-post_579.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_26.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_27.html 
http://sirakadambam.blogspot.com/2010/06/blog-post_15.html

రచనలు
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_09.html 
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_6657.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_600.html
http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_30.html

Vol. No. 02 Pub. No. 107

' శిరాకదంబం ' క్యాలెండర్

2011 నూతన సంవత్సరారంభ సందర్భంగా మిత్రులందరికీ ఒక చిరు కానుకగా ' క్యాలెండర్ ' రూపొందించాను. దాన్ని మిత్రులు డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా ప్రింట్ చేసుకోవడానికి వీలుగా శిరాకదంబం లో వుంచడం జరిగింది. అయితే కొంతమంది శిరాకదంబం బ్లాగు తెరుచుకోవడంలో ఇబ్బందులెదురవుతున్నాయని నా దృష్టికి తేవడం జరిగింది. దాంతో తాత్కాలికంగా ఆ క్యాలెండర్ ను తొలగించడం జరిగింది.

ఇప్పుడు క్రింద ఆ క్యాలెండర్ కి చెందిన లింక్ ఇస్తున్నాను. మిత్రులు ఆ లింక్ నుండి క్యాలెండర్ ను దించుకొని శిరాకదంబాన్ని మీ సిస్టం లో ఉంచుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. పవర్ పాయింట్ లో మీ అప్పాయింట్మెంట్లు రాసుకోవచ్చు. ఈ సంవత్సరమంతా మిత్రులకు శిరాకదంబం ఓ చిరు జ్ఞాపకంగా నిలిచి వుండాలని ఈ క్యాలెండర్ అందించాను. మిత్రులు సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తూ ..........

నిన్న ఇక్కడ వ్యాఖ్యల ద్వారా, మెయిల్ ద్వారా, పేస్ బుక్ వగైరాల ద్వారా, ఎస్. ఎం. ఎస్. ల ద్వారా, ఫోన్ల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులకు ధన్యవాదాలతో.......

అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలతో ............

' శిరాకదంబం ' క్యాలెండర్ లింక్ ఈ క్రింద మీకోసం ............




Vol. No. 02 Pub. No. 106

Saturday, January 1, 2011

కొత్త సంవత్సరం... కొత్త ఆశలు.....

నీకోసమే మేమందరం
కోటి ఆశలతో... కొత్త కొత్త కోరికలతో
ఎదురుచూస్తున్నాం !

గత సంవత్సరపు చెడు జ్ఞాపకాలను చేరిపేసుకుంటూ
నువ్వు అందించబోయే తీపి గుర్తులను ఊహించుకుంటూ

మనుషుల మధ్య మత్సరాలు మాసిపోయె శుభ తరుణం
మనిషి మదిలో స్వార్థచింతన తగ్గిపోయే ఆనందకర క్షణం
ఇప్పటికైనా నువ్వు తీసుకురాగలవా ?

కులమతాల కుమ్ములాటలు, ప్రాంతాల మధ్య వైరుధ్యాలు
రాజకీయ ఉద్యమాలు, అధికార దీక్షలు, కుర్చీకోసం కుమ్ములాటలు
ఇవన్నీ లేని సంవత్సరాన్ని ఈసారైనా ఊహించగలమా ?

అవినీతి వటవృక్షం కూకటి వేళ్ళతో కూలిపోయే రోజు
రాజకీయ మురికి పోయి రామరాజ్యం వచ్చే రోజు
ఈ సంవత్సరమైనా వస్తుందా ? 
నింగినంటిన ధరలు నేలకు దిగివచ్చే శుభదినం
 అన్నదాత అందలమెక్కే శుభతరుణం 
ఈ సారైనా మా కళ్ళతో మేం చూడగలమా ?
 
ఓ కొత్త సంవత్సరమా ! ఇలాగే ఇంకా చాలా ఆశలున్నాయి
ఓ రెండువేల పదకొండా ! ఇంకా బోలెడు కోరికలున్నాయి
ఇవన్నీ అత్యాశలు, అర్థం లేని కోరికలంటావా ?  

అయినా ఆశపడటం, కోరుకోవటం మాకలవాటు
ఎందుకంటే ఆశ మా ఊపిరి, కోరిక మా నైజం 
అందుకే ..............

నీ రాక కోసమే ఈ సంబరం
మంచి తెస్తావనీ..... మంచి చేస్తావనీ...............



  నూతన సంవత్సర శుభాకాంక్షలతో ...................




Vol. No. 02 Pub. No. 105
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం