Wednesday, December 8, 2010

" భీష్మ" పురస్కారాల ప్రదానం

ఈ ఆదివారం ( 06 -12 -2010 ) చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి స్థాపించిన " ఆశ్రమం " పాఠశాల ఇరవయ్యవ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఆ సందర్భంగా రజనీకాంత్ దంపతులు వివిధ రంగాలలోని ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ దర్శకులు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారిని " భీష్మ " పురస్కారంతో సత్కరించడం జరిగింది. విశ్వనాథ్ గారు స్పందిస్తూ రజనీకాంత్ గారితో ఒక్క చిత్రాన్ని కూడా తియ్యకపోయినా ఆయననుంచి ఈ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా వుందని అన్నారు. దానికి రజని ప్రతిస్పందిస్తూ సాగరసంగమం నిర్మాణ సమయంలో ఎయిర్ పోర్ట్ లో కలిసినపుడు విశ్వనాథ్ గారు తనకు ఒక చిత్రం చెయ్యాలని అడిగారని, అయితే అప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఆది సాధ్యం కాలేదని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా ఆలస్యం కాలేదని, ఇప్పుడు కూడా ఆయన తలచుకుంటే తాను సిద్దమనీ అన్నారు రజని. విశ్వనాథ్ గారినుంచి వెంటనే ఏ విధమైన ప్రతిపాదనా రాకపోయినా సభికులు మాత్రం తమ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు.

ఇంకా క్రికెట్ రంగంలో పద్మశ్రీ శ్రీనివాస రాఘవన్ కు, చిత్ర రంగంలో స్క్రీన్ ప్లే, దర్శకత్వాలలో 'వియత్నాం వీడు' సుందరం కు, సంగీతంలో టి. వి. గోపాలక్రిష్ణన్ కు, వైద్య రంగంలో డా. బాలసుబ్రమణ్యన్ కు, వేద సంస్కృతికి అభిరామన్ కు రజనీకాంత్ దంపతులు 'భీష్మ' పురస్కారాలు అందజేశారు, ప్రముఖ నటి రాజసులోచనకు శివాజీ గణేశన్ పురస్కారం కూడా అందజేశారు.
 ధర్మేంద్ర, హేమమాలిని జంటకు రజనీకాంత్ లెజెండరీ పురస్కారం అందజేశారు. 

ఈ సమాచారం, ఫోటోలు పంపినవారు : మాధురి , చెన్నై.
ఈ సందర్భంగా గురువుగారు విశ్వనాథ గారికి అభినందనలు తెలుపుతూ.... ఈ సమాచారం పంపిన మాధురి గారికి ధన్యవాదాలు.

ఆ ఉత్సవ చిత్రమాలిక ఇక్కడ చూడండి.  
 


Vol. No. 02 Pub. No. 078

2 comments:

Dr.Suryanarayana Vulimiri said...

రావు గారు, మంచి మనీషి గురించి మంచి మాట చెప్పారు. "ద్వి"నాథుడు ఈ కాశీనాథుని విశ్వనాథుడు. తను అనుకున్న విధంగా చిత్రాన్ని మలచడంలో పట్టు సడలని భీష్ముడు. అందులో ఈషణ్మాత్రము సందేహం లేదు. కథా స్రోతస్వినిని మన హృదయసైతకాల మీదుగా ప్రవహింపజేసి ఆనందపు మొలకలు మొలిపించాలనుకునే నిజమైన కళా తపస్వి, దర్శక యశస్వి విశ్వనాథ్. అటువంటి మహనీయుడ్ని గుర్తించి గౌరవించడం రజనీకాంత్ గారి సంస్కారం. చక్కగా ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు.

SRRao said...

సూర్యనారాయణ గారూ !
ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం