Sunday, September 12, 2010

' విజయ ' రహస్యం


 విజయా వారి చిత్ర విజయాల వెనుక వున్న రహస్యమేమిటో తెలుసుకోవాలంటే ముందుగా ఆ సంస్థ అధినేతలలో ఒకరైన చక్రపాణి గారు అనుసరించిన సూత్రాల్ని తెలుసుకోవాలి.


" నేను సామాన్యుణ్ణి. పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లీష్ కూడా సరిగా రాదు. ఎక్కువగా చదివే ఓపిక లేదు. కానీ ఎవరైనా చదివి చెప్పింది విని అర్థం చేసుకోగలను. మంచి చెడ్డా విడదీసి చూసుకోగలను. నేను కూడా సాధారణమైన సగటు వ్యక్తినేకాబట్టి నాకు నచ్చింది సామాన్యులైన ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నా నమ్మకం "విజయా వారి చిత్రాల్లో సంగీతం ఎంత ప్రజారణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ తరంలో కూడా వాటిని చాలా ఇష్టంగా వినే శ్రోతలుండడం దీనికి నిదర్శనం. ఆ పాటల రూపకల్పన చక్రపాణి గారు స్వయంగా పర్యవేక్షించించేవారు. దాన్ని గురించి చెబుతూ....

" నాకు స్వరజ్ఞానం గానీ, తాళజ్ఞానం గానీ లేవు. అసలు సంగీతమే రాదు. పాడటం ముందే రాదు. కానీ ఒక మామూలు శ్రోతగా పాట విని బాగుందో లేదో చెప్పగలను. అలాగే నాకు నచ్చితే సామాన్య శ్రోతకు కూడా నచ్చుతుందని నా అభిప్రాయం "


ఆయన ఆలోచనలు, అబిప్రాయాలు, నమ్మకాలు, అంచనాలు ఎంత వరకూ సరైనవో విజయా వారి చిత్రాల విజయాలు చెబుతాయి. నేల విడిచి సాము చెయ్యకుండా ఈ స్థాయిలో ఇప్పటి నిర్మాతలు, దర్శకులు ఆలోచించగలిగితే చాలా చిత్రాలు అందరూ చూడగలిగినవిగా  వుండి విజయాలు సాదిస్తావేమో !

విడుదలకు ముందే ఒక చిత్ర విజయాన్ని అంచనా వెయ్యడంలో చక్రపాణి గారు ఎలా వ్యవహరించేవారో చెప్పడానికి ఓ ఉదాహరణ....

' గుండమ్మ కథ ' ఫస్ట్ కాపీ వచ్చాక అందులో ఇద్దరు ప్రముఖ హీరోలున్నా కథ మొత్తం సూర్యకాంతం పాత్ర చుట్టూనే తిరగడంతో ఆ చిత్ర విజయంపై పరిశ్రమ పెద్దలు అనుమానం వ్యక్తం చేశారు. నాగిరెడ్డి చక్రపాణి గార్లకు కూడా అనుమానం మొదలైంది. ఇంతలో నాగిరెడ్డి గారింట్లో ఒక కార్యక్రమానికి ఆంధ్రలోని పలు ప్రాంతాలనుంచి బంధు మిత్రులు వచ్చారు. ఆ సందర్భంగా వారందరికోసం ' గుండమ్మ కథ ' ప్రివ్యూ ఏర్పాటు చేశారు. అందులో సూర్యకాంతం నటన , రామారావు నిక్కరుతో కనబడం లాంటివి అందర్నీ ఎంతో అలరించాయి. చిత్రం ఆసాంతం హాయిగా అస్వాదించారట ఆ ప్రేక్షకులంతా. ఏవైతే చిత్ర విజయానికి ఆటంకమవుతాయని అందరూ భావించారో అవే ఆ ప్రక్షకుల్ని ఆకట్టుకోవడంతో నాగిరెడ్డి చక్రపాణి గార్లకు ధైర్యమొచ్చింది.

" అన్నం సరిగా వుడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే చాలదూ ! ఇదే మనకు సరైన జడ్జిమెంట్. ఈ సినిమా చాలా బాగా ఆడి తీరుతుంది " అన్నారట చక్రపాణి గారు.
ఆయన అంచనా ఎంతవరకూ సరైనదో ఆ చిత్ర విజయం చెప్పింది. స్టార్ డం చూసుకుని వుంటే తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునే ఒక మహత్తర వినోద భరిత చిత్రం విడుదలకు నోచుకునేది కాదేమో !
 ( ఇదే విషయాన్ని శుక్రవారం అంటే 10 - 09 - 2010 న ఈటీవీ లో ప్రసారమైన WOW కార్యక్రమంలో రచయిత పరచూరి గోపాలకృష్ణ గారు కూడా ప్రస్తావించారు )                   


Vol. No. 02 Pub. No. 024

2 comments:

madhuri said...

That's why they say 'story is the actual hero '.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం