Saturday, August 14, 2010

బ్లాగు లోకంలో తొలి అడుగు

బుడి బుడి నడకలు నేర్చుకున్నాకే పరుగెత్తడం నేర్చుకుంటారు
తప్పటడుగులు వేయడం వచ్చాకే తప్పుటడుగుల మర్మం తెలుసుకుంటారు
సుదీర్ఘ జీవన యానంలో ఒక సంవత్సర కాలం తక్కువేమీ కాదు
వెనుదిరిగి చూసుకుంటే సాధించినదేమిటో, సాధించాల్సింది ఏమిటో తెలుస్తుందిఈరోజు ఆగష్టు 14 వ తారీఖు
సరిగా సంవత్సరం క్రితం అనుకోకుండా ' శిరాకదంబం ' ప్రారంభమైంది
అందులో చెప్పడానికి, రాయడానికి చాలా కనిపించింది
నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను
ఎంత రాసినా తరగడం లేదు.. ఎంత రాసినా తృప్తి కలగడం లేదు
ఇంకా రాయాలి.. నా దగ్గరున్నవి, నాకు తెలిసినవి అన్నీ అందరికీ పంచాలి
అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది

ఇంకెంతకాలం రాయగలనో... ఇంకెన్ని విషయాలు రాయగలనో...!
  
చదివేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మొట్టికాయలు వేసే వాళ్ళు
............ ఇలా ఎంతోమంది కనిపించారు ఈ బ్లాగులోకంలో
అవును ఇదో లోకం
ఇందులో పడితే బయిట ప్రపంచం కనబడదు
కష్టాల, బాధల, అశాంతుల కేకలు వినిపించవు
మన లోకం మనది.... మన రాతలు మనవి
మనకి తెలిసింది రాస్తాం !..... మనకనిపించింది రాస్తాం !!

శిరాకదంబం గణాంకాలు -
సంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 376
సంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, రిపీట్ అయినవి కాక )          - 761
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు
( చేరకపోయినా అభిమానం కురిపిస్తున్నవారు అనేకమంది )                   -   20
శిరాకదంబం సందర్శకులు 
( బ్లాగులో ఉంచిన విడ్జెట్ ద్వారా మాత్రమే !  ఆది కూడా ప్రారంభించిన
నెల తర్వాత పెట్టినది. మిగిలిన లింక్ లలో విషయం తెలీదు )                   - 20928


' కళాకారులకు బలం ప్రేక్షకుల చప్పట్లే ' అన్నారు ఒక రచయిత
బ్లాగర్లకు వ్యాఖ్యలే బలం అంటున్నారు బ్లాగు మిత్రులు
ఆ వ్యాఖ్య మెచ్చుకోలైనా, విమర్శైనా, తిట్లయినా ఏవైనా
టపా రాసాక చకోర పక్షిలా బ్లాగరు ఎదురుచూసేది వ్యాఖ్యలకోసమే !

శిరాకదంబం లో తొలిసారి వ్యాఖ్యలు రాసినవారు
rayraj  గారు , నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు, భావన గారు
ఆది ఏడవ టపా - తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ? 
తొలి వ్యాఖ్యలు రాసిన ఈ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి అప్పుడు వారు కొన్ని ప్రశ్నలేసారు. వాటికి అప్పుడు సరిగా సమాధానం చెప్పగలిగానో.. లేదో గానీ తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతినీ భావితరాలకు అందించే కార్యక్రమం చేపట్టాలనేది నా చిరకాల వాంఛ . అన్నీ వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో ఇది కష్ట సాధ్యమైన విషయమే ! అయినా ఏటికి ఎదురీదడం విశేషం గానీ వాలుకి కొట్టుకుపోవడం విశేషం కాదేమో ! అందుకే చాలాకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికి బ్లాగుల ద్వారా మిత్రులైన కొందరు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది చిన్ననాటి మిత్రులు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు.  పూర్తిగా కార్యరూపం దాల్చాక వివరాలు ఇస్తాను. 

ఈ బ్లాగుల వల్ల కొత్తగా ఎంతోమంది మిత్రులను పొందగలిగాను. ఎన్నో భావాలు, ఉల్లాసాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు...మరికొన్ని విషాదాలు కూడా బ్లాగుల్లో చూసాను. అయితే నా అదృష్టం నాకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే మిత్రులు ఈ బ్లాగులోకంలో లభించారు.... లభిస్తున్నారు. 

ఈ సంవత్సరంలో కొన్ని మధుర జ్ఞాపకాలు  -
1 . ' కొత్తపాళీ ' నారాయణస్వామి గారి ' రంగుటద్దాల కిటికీ ' పుస్తకావిష్కరణ సభలో పాల్గోవడం, అక్కడ ' తెలుగు పద్యం ' భైరవభట్ల కామేశ్వరరావు గారు, ' నవ్వులాట ' శ్రీకాంత్ గారు, ' తెలుగు కళ ' పద్మకళ గారు, తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్  నూర్ రహమతుల్లా గారు మొదలైన వారి పరిచయ భాగ్యం లభించింది.
2 . జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు డెమో నిర్వహణలో పాల్గోవడం, ఆ సందర్భంగా డి.ఎస్.కె. చక్రవర్తి గారు, కశ్యప గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు మొదలైన బ్లాగర్లను కలవడం జరిగింది.
3 . సంక్రాంతికి ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది విజయవాడ బ్లాగర్లు కలవడం జరిగింది.

శిరాకదంబం అనే ఒక బ్లాగు వుందని అంతర్జాలంలో అందరికీ తెలియపరిచి తద్వారా కొంతమంది చదువరులను సంపాదించేందుకు దోహదపదడంలో కూడలి, హారం, మాలిక లాంటి బ్లాగు అగ్రిగేటర్లు, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యా రాక్స్, వెబ్ దునియా - తెలుగు లాంటి సైట్స్, పేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ బజ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పాత్ర మరువలేనిది.   

సంవత్సరం గడిచిందంటే బుడి బుడి నడకల స్థాయి నుంచి ధీమాగా తొలి అడుగు వేసే స్థితికి చేరుకున్నామనుకుంటాను. ఇన్నాళ్ళూ చేయి పట్టుకు నడిపించిన వారెందరో పేరు పేరునా చెప్పడం  కష్టమైనా సీనియర్ లూ, జూనియర్ లూ అనే తేడాలేకుండా బ్లాగు మిత్రులందరూ తమ సలహాలు, సూచనలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇందులో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని లెఖ్ఖలు చెప్పడం ఉచితం కాదనుకుంటాను. బ్లాగర్లే కాదు ఇతర మార్గాల ద్వారా చదవరులు కూడా శిరాకదంబం చూసి తమ అభిప్రాయాల్ని తెలుపుతూనే వున్నారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇలా శిరాకదంబం బలోపేతం కావడానికి దోహదపడుతున్న వారెందరో ................ అందరికీ శతకోటి వందనాలు. ముందు ముందు కూడా ఇలాగే మిత్రులందరూ తమ సలహాలు, సూచనలు, విమర్శలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.............


Vol. No. 01 Pub. No. 374

17 comments:

చిలమకూరు విజయమోహన్ said...

రావుగారికి అభినందనలు.

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ said...

మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షకు. శిరాకదంబం లో కదంబం అంటే ఏమిటి?

జయ said...

రావ్ గారు, మీ తొలిడుగు గట్టి పడిన ఈ శుభదినాన, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు తప్పకుండా కలకాలం, ఎన్నో నూతన విషయాలతో మమ్మల్ని అలరరిస్తారని నాకు తెలుసు. మీకు హృదయపూర్వక అభినందనలు. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా.

విజయవర్ధన్ said...

"నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను"
రావు గారు, మీ ఆశయం గొప్పది. మీరు భద్రంగా దాచుకున్నవి మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.

జ్యోతి said...

ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. రావుగారు ఎంతో అమూల్యమైన సమాచారాన్ని, చిత్రాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

పరుచూరి వంశీ కృష్ణ . said...

రావు గారు అందుకోండి వార్షికోత్సవ శుభాకాంక్షలు

రాధిక(నాని ) said...

రావు గారు ,మీ బ్లాగ్ ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

AMMA ODI said...

రావు గారు: మీ బ్లాగు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

madhuri said...

C O N G R A T U L A T I O N S !

Your blog has always been informative and entertaining. It induces not only love for the Telugu culture but also taps the patriotism that is usually inherent in the people. Infact patritism is the need of the day.

కొత్త పాళీ said...

మాస్టారూ ముందస్తుగా వార్షికోత్సవ సందర్భంగా అభినందనలూ శుభాకాంక్షలూ.
ఇంతకు మునుపు కొన్నిసార్లు వ్యాఖ్యల్లో చెప్పాను - పాతసినిమా సంగీతాల విషయానికి మీ బ్లాగు ఒక నిధి. అంచేత వ్యాఖ్యలొచ్చాయా లేదా అని పట్టించుకోకుండా ప్రొసీడైపోండి. మీరు చేస్తున్నది మంచి పని. ఆ విషయాల్లో ఆసక్తి ఉన్నవారికి పనికొచ్చే పని.
అంతేకాక, వ్యాఖ్యలెప్పుడూ కాంట్రొవర్సీలకీ, పోచికోలు కబుర్లకే ఎక్కువొస్తాయి - అది కొలబద్ద కానక్కర్లేదు.

ఆ.సౌమ్య said...

శుభాకాంక్షలు, మీరు ఇంకా ఎన్నో విలువైన విషయాలను మాకు అందించగలరని ఆశిస్తున్నాను.

Rao S Lakkaraju said...

కొత్త సంగతులు పాత సంగతులు కలుపుతూ మీ బ్లాగు కలకాలం వర్ధిల్లాలి.

మాలా కుమార్ said...

రావు గారు ,
ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలండి .
విడియో డిస్ ప్లే బాగుందండి .

SRRao said...

* విజయమోహన్ గారూ !
* జయ గారూ !
* విజయవర్ధన్ గారూ !
* జ్యోతి గారూ !
* వంశీకృష్ణ గారూ !
* రాధిక ( నాని ) గారూ !
* అమ్మఒడి గారూ !
* కొత్తపాళీ గారూ !
* ఆ. సౌమ్య గారూ !
* రావు గారూ !
* మాలాకుమార్ గారూ !

మీరు కురిపించిన అభిమానానికి ధన్యవాదాలు

* లక్ష్మినారాయణ సునీల్ వైద్యభూషణ్ గారూ !
ముందుగా మీ అభిమానానికి ధన్యవాదాలు. రకరకాల పుష్పాలతో తయారైన మాలను ' కదంబం ' అంటారు.

కొత్త పాళీ said...

కదంబం అంటే పూలే కాదు, ఏదైనా మిక్స్చరు అనుకుంటా. అన్నిరకాల కూరగాయలు వేసి చేసే ఒక పులుసు వంటకాన్ని తమిళ వైష్ణవులు కదంబం అంటారు.

శివ said...

Raoji,

Congratulations. May your blog celebrate many more such anniversaries.

Please do continue the good work.

SRRao said...

* కొత్తపాళీ గారూ !
మీరు చెప్పింది నిజమే ! ' కదంబం ' అంతే వివిధ వస్తువులు కలగలిపినది. కానీ ఎక్కువగా మన ఆంధ్రలో ( తమిళనాడుతో బాటు ) కూడా వాడుకలో వున్నది పువ్వుల ' కదంబ మాల ' . ఉదాహరణగా చెప్పాను. అంతే ! ధన్యవాదాలు.

* శివ గారూ !
మీ అందరి ప్రోత్సాహాలే ఇంతవరకూ నడిపించాయి. ఇకపైన కూడా ఇదే ప్రోత్సాహం ఇస్తారనే నమ్మకంతో .... ధన్యవాదాలు.

' శిరాకదంబం ' టూల్ బార్ ని ఇక్కడినుంచి దించుకోవచ్చు... ప్రయత్నించండి.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం