Sunday, August 8, 2010

ఆంద్ర పుణ్యక్షేత్రాలు

  
 మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రచించిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' అనే గేయం ఆంధ్రదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ సాగుతుంది.  స్వర్గీయ సాలూరి హనుమంతరావు గారి స్వరకల్పనలో శ్రీమతి ఎస్. జానకి, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గేయం ప్రైవేటు ఆల్బం గా గ్రామఫోను రికార్డులలో  విడుదలై అత్యంత ప్రజాదరణ పొందింది.  అప్పట్లో ఆంధ్రదేశంలోని ప్రతి దేవాలయంలోను ప్రతిరోజూ తప్పనిసరిగా వినబడేది. ఆ అద్భుతమైన గేయం మీకోసం ................




ఇదే ఆంధ్ర భూమి ! ఇదే పుణ్య భూమి !
ఇది యోగులకు భోగులకు జన్మభూమి !
గౌతమీకృష్ణాతరంగాల పులకించు
మాతెలుగుసీమలో వెలయువేలుపులారా !
మాయిలవేల్పులారా !


తిరుమలశిఖరాల వెలసినదేవా !
మొర లాలించి లాలించి పాలించరావా ?
దివినుండి భువికి దిగి వచ్చినావు !
స్వర్గముగ తిరుపతిని వెలయించినావు !
కొం డెక్కి కూర్చున్న శ్రీవెంకటేశా !
అడుగుననె పడియున్న బడుగులను కనవా ?
ఒక్కొక్కమెట్టె పై కెక్కించ రావా ?
శ్రీవెంకటేశా ! శ్రీతిరుమలేశా !



శ్రీకాళహస్తీశ్వరా !
భూలోకకైలాసవాసా ! మహేశా !
శ్రీకాళహస్తీశ్వరా !
సాలెపురుగునూ పాము నేనుగును
కన్నప్పను ఏలినదేవా !
నీపరీక్షలకు నిలబడలేము !
నీ చరణములే శర ణన్నాము !
శ్రీకాళహస్తీశ్వరా !



శ్రీశైలమల్లేశ్వరా !
భ్రమరాంబికాసతీహృదయేశ్వరా !
పార్థునికి పాశుపత మందించినావే -
మాకు నీచేయూత నందించ వేమీ ?
మనసులో మల్లియలు విరబూయుస్వామీ :
మాబ్రతుకు పువుబాటగా మలచ వేమీ ?
శ్రీశైలమల్లేశ్వరా !



బెజవాడ కనకదుర్గమ్మా!
విశ్వమోహనముగా వెలసినా వమ్మా !
తెలుగుహృదయాలు నీపూజాసుమాలు !
చల్లగా మము చూడు మమ్మ ! అదే చాలు !
చల్లగా మము చూడు మమ్మా !
బెజవాడ కనకదుర్గమ్మా!


అంగీకృతాభంగగంగాతరంగా!
ఓకోమలాంగా ! శ్రీభీమలింగా !
నీ వెట నుండిన అదె కైలాసం !
దక్షిణకాశీ దక్షారామం !
తెలుంగుసీమకు వెలుం గొసంగిన
దక్షారామమె భూకైలాసం  !
ఈదక్షారామమె భూకైలాసం  !



చిరునవ్వువెన్నెలలచెలువములు పండించి
ర్యాలిలో రాలలో పూలు పూచినస్వామీ !
కోనసీమావాస ! శ్రీజగన్మోహనా !
జోహారు ! జోహారు ! జోహారు ! స్వామీ !
శ్రీజగన్మోహనా ! జోహారు ! స్వామీ !




త్యాగమయా ! అనురాగమయా !
భద్రాద్రినిలయా ! రామయ్యా !
అయోధ్య విడిచి అమ్మ సీతతో
ఆంధ్రావనికి అరుదెంచితివా !


నరుడుగ పుడితే దేవుడె అయినా
నానాబాధలు పడవలెనా ?
రామదాసు నలనాడు కష్టముల
నాదుకొన్నఓరామయ్యా !
చీకటిలో తారాడుమా కిపుడు
వెలుగుదారులను చూపవయా !
త్యాగమయా ! అనురాగమయా !


 శ్రీసత్యనారాయణా ! హేశ్రీఆదినారాయణా !
శ్రీభూదేవులసేవ లందుచూ
అన్నవరములో వెలసినదేవా !
ఆపదమ్రొక్కులవాడ వయీ
మాప్రా పై నిలచినబంగారుకొండా !
కనుగొన వయ్యా ! నీవారమూ మము
కన్నుల వెన్నెల నిండా !
శ్రీసత్యనారాయణా ! హేశ్రీఆదినారాయణా !



యాదగిరిని సింహాచలమందున
వెలసినలక్ష్మీనరసింహా !
ప్రహ్లాదుడు పిలువగనె కంట బడి
వరము లొసంగిన దయామయా ! 

ఎదలో నిలిచీ యెంత పిలిచినా
ఎందుకు పలుకవు ? దయ లేదా ?
నరసింహా ! దయ లేదా ?




అనంతభూభారము వహియింపగ
శ్రీకూర్మములో వెలసినదేవా !
చేకొను మివె మానుతులూ నతులూ ;
శ్రీనాథా ! భూనాథా ! శ్రీకూర్మనాథా !




జగదేకపావనా ! సూర్యనారాయణా !
ప్రత్యక్షదైవమా ! ఓలోకబంధూ !
భక్తజనహృదయాలు పద్మమ్ము లై విరియ
అరసవిల్లిని నీవు వెలసినావా !
అంజలింతుము దేవ ! మ మమ్మేలుకోవా ?
జగదేకపావనా ! సూర్యనారాయణా !
ప్రత్యక్షదైవమా ! ఓలోకబంధూ !
సూర్యనారాయణా ! సూర్యనారాయణా !
సూర్యనారాయణా !  ..........................





Vol. No. 01 Pub. No. 369

3 comments:

Telugu Abbay said...

likes this.

satya said...

చాలా చాలా థాంక్సండీ రావు గారూ,ఈ పాట కోసం ఎన్నాళ్ల నుండో వెతుకుతున్నాను. చెప్పలేనంత ఆనందంగా వుంది.ఇది డవున్ లోడ్ చేసుకొవటం ఎలాగో చెప్పగలరా ప్లీజ్.

SRRao said...

* తెలుగు అబ్బాయి గారూ !
కమ్మటి తెలుగు పేరు పెట్టుకున్న మీకు ధన్యవాదాలు.

* సత్య గారూ !
ధన్యవాదాలు. డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన ప్లేయర్లో కుడి ప్రక్కన వున్న " Divshare " అనేదానిమీద క్లిక్ చేస్తే వాళ్ళ సైట్లో ఈ పాట వున్న పేజీ తెరుచుకుంటుంది. అందులో మీకు డౌన్లోడ్ బటన్ కనబడుతుంది.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం