Monday, August 2, 2010

నటరత్నం ' బళ్ళారి రాఘవ '

బళ్ళారి రాఘవ -  ఆధునికాంధ్ర నాటక రంగం కలకాలం గుర్తుంచుకోవలసిన  పేరు.

అప్పటివరకూ పౌరాణిక పద్యనాటకాలలో రాగాలు సాహిత్యాన్ని, ఒక్కోసారి పాత్ర ఔచిత్యాన్ని మింగేస్తూ ఉండేవి. ఆ సమయంలో పద్యాలలో రాగాలకంటే సాహిత్యాన్ని వినబడేటట్లు చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించి అమలులో పెట్టి విజయం సాధించిన వారు బళ్ళారి రాఘవ.

 అంతేకాదు. పౌరాణిక నాటకాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు నాటక రంగాన్ని సాంఘిక నాటకాలవైపు మళ్ళించడానికి ఎనలేని కృషి చేశారు రాఘవ. సమకాలీన సమస్యలను ప్రతిబించే నాటకాలు రావాలని కోరుకుని ఎన్నో సాంఘిక నాటకాల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగష్టు 2 వ తేదీన నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు జన్మించారు రాఘవ. మద్రాసు లా కళాశాల నుండి న్యాయవాద పట్టా పొంది మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రఖ్యాతి పొందారు. ఆ రంగంలో ఆయన ఘనతను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ' రావు బహద్దూర్ ' బిరుదుతో సత్కరించింది.

న్యాయవాదం ఆయన వృత్తి అయితే నాటకం ఆయన ప్రవృత్తి.  పన్నెండవ ఏటనే రంగస్థలం ఎక్కిన రాఘవ బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి ఆయన నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత బెంగళూర్ లోని కోలాచలం శ్రీనివాసరావు బృందంతో కలసి చాలా నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించారు. తెలుగు నాటకాన్ని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి బళ్ళారి రాఘవ.  మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగోర్ లాంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన మహానటుడు బళ్ళారి రాఘవ.

1936 లో ' ద్రౌపదీ మానసంరక్షణ ' లో దుర్యోధనుడి పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసినా ఎక్కువ కాలం అక్కడ ఇమడలేకపోయారు.

హరిశ్చంద్ర, ప్రహ్లాద, పాదుకాపట్టాభిషేకం, సావిత్రి, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు మొదలైన పౌరాణిక, సాంఘిక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు.

బందా కనకలింగేశ్వరరావు, బసవరాజు అప్పారావు, కొమ్మూరి పద్మావతి, కొప్పరపు సరోజినీ లాంటి శిష్యులెందరినో తయారు చేశారు. ఆయన సంస్మరణార్థం నాటక రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ' బళ్ళారి రాఘవ పురస్కారం ' ఏర్పాటు చెయ్యబడింది.


తెలుగు నాటక రంగానికి జీవితాంతం విశిష్టమైన సేవలందించిన ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆయన నటించిన ' భక్తప్రహ్లాద ' నాటకం రికార్డులను
టాలీ నేషన్ - స్వర నీరాజనం ద్వారా వినండి.







Vol. No. 01 Pub. No. 361

2 comments:

Vinay Datta said...

I didn't know that he was a practicing lawyer and a PP. I heard his name as a stalwart of telugu theatre.

SRRao said...

మాధురి గారూ !
ధన్యవాదాలు

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం