Sunday, August 29, 2010

నృత్య దర్శకత్వం .....జవాబు

 కనుక్కోండి చూద్దాం - 25  
 జవాబు  

1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.

1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?
 
జవాబు : తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభమైన దశాబ్దం తర్వాత 1941 లో వచ్చిన ' భక్తిమాల ' చిత్రంతో ప్రత్యేకంగా నృత్య దర్శకత్వం, దానికో శాఖ ఏర్పడ్డాయి.

 
2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ? 
 
జవాబు : తొలి నృత్యదర్శకుడు  భక్తిమాల చిత్రానికి నృత్య దర్శకత్వం వహించిన వెంపటి ( పెద ) సత్యం గారు

  
Vol. No. 02 Pub. No. 015a

తెలుగు బాట నడుద్దాం !


దేశభాషలందు తెలుగు లెస్స
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు
పంచదారకన్న పాలకోవకన్న తెలుగు భాష తీపి
తెలుగు భాషకు, తెలుగు వెలుగులకి, తెలుగుదనానికి వందనం
తెలుగు వ్యావహారిక భాషకు ఉద్యమించిన గిడుగు వారికి వందనం 

తెలుగులో రాద్దాం
తెలుగులో మాట్లాడుదాం 
తెలుగు చదువుదాం 
                            తెలుగు వాళ్ళమనిపించుకుందాం
                            తెలుగేతరులకు కూడా తెలుగు నేర్చుకోవాలనిపిద్దాం
                            తెలుగు బాట నడుద్దాం ! తెలుగు ఖ్యాతి చాటుదాం !!

తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ..............................



Vol. No. 02 Pub. No. 016

Saturday, August 28, 2010

నృత్య దర్శకత్వం .....??

కనుక్కోండి చూద్దాం - 25  

1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.

1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?
2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ? 

Vol. No. 02 Pub. No. 015

Friday, August 27, 2010

మహాలక్ష్మి - శ్రీరంజని

అలనాటి నటి శ్రీరంజని మేటి నటిగా వెలుగుతున్న కాలంలో జబ్బు పడడంతో తన భర్త నాగమణికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని సంకల్పించింది. తన తల్లిదండ్రుల సమ్మతంతో చెల్లెలైన మహాలక్ష్మినిచ్చి తన భర్తకు మళ్ళీ పెళ్లి చేసింది. ఇది 1940 వ సంవత్సరంలో జరిగింది.

శ్రీరంజని వారసురాలిగా మహాలక్ష్మిని మొదట గుర్తించింది అప్పటి మేటి దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి గారు. 1944 లో  తన భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రనిచ్చి తెలుగు చిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని విడుదల చేసిన చమ్రియా టాకీస్ వారు మహాలక్ష్మి పేరును జూనియర్ శ్రీరంజని గా మార్చారు.

ఆ తర్వాత గొల్లభామ, గృహప్రవేశం, బ్రహ్మరథం, మదాలస వంటి చిత్రాల్లో నటించారు. 1949 లో కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  గుణసుందరి కథ లో  గుణసుందరి పాత్ర  ఆమెకు స్టార్ హోదా కల్పించిందని చెప్పవచ్చు. దాంతో ఆమె అనేక తెలుగు చిత్రరంగంలోనే కాక తమిళ చిత్రరంగంలో కూడా ప్రముఖ నటిగా వెలుగొందారు.  1960 వరకూ పూర్తిస్థాయిలోను, ఆ తర్వాత 1974 వరకూ అడపాదడపా అతిథి పాత్రల్లోనూ నటించారు. మూడు దశాబ్దాలు కొనసాగిన ఆమె సుదీర్ఘ నట ప్రస్థానం 1974 లో ఆగష్టు 27 వ తేదీన ముగిసింది.

జూనియర్ శ్రీరంజని వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ............



Vol. No. 02 Pub. No. 014

Thursday, August 26, 2010

అమ్మకు వందనం


 నూరేళ్ళు నిండిన అమ్మకు శతసహస్ర వందనం 
జనం మదిలో పదిలం మరో వెయ్యేళ్ళు నీ జ్ఞాపకం 

 Vol. No. 02 Pub. No. 013

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?

 అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !
లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికారులలో  చాలామంది తమ అలసత్వానికి, అవినీతికి ప్రభుత్వ నియమనిబంధనలను అడ్డు పెట్టుకుంటారు. కొంతమందికి సృజనాత్మకత లేకపోయినా ఇతర కారణాలవలన ఆ స్థానానికి చేరుకుని యాంత్రికంగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ విభాగాల్లో సృజనాత్మకత తప్ప యాంత్రికత పనికిరాదు.

అలాంటి యాంత్రికత, నియమ నిబంధనలు సృజనాత్మకతకు ఎలా అడ్డు వస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ.......


ప్రముఖ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకసారి ఆకాశవాణికి ఒక కవిత పంపించారు. అందులో ఒక పంక్తిలో ' ఒడిలో బొచ్చుకుక్క పిల్ల ' అంటూ రాసారట. ఆ కవితలో  ' బొచ్చు ' అనే పదం ఆ రేడియో కేంద్ర అధికారులకు అభ్యంతరకరంగా తోచింది. అందుకని ఆ మాట తీసేయ్యమన్నారట. తిలక్ గారికి అందులో అభ్యంతరమేమిటో అర్థం కాలేదు.
" బొచ్చు కుక్క పిల్లను బొచ్చు కుక్క పిల్ల అనక ఒట్టి కుక్కపిల్ల అంటారా ?  "
అని చిరాకు పడ్డారట.


Vol. No. 02 Pub. No. 013

Wednesday, August 25, 2010

హీరో & ద్విపాత్రాభినయం

పాత తెలుగు చిత్రాలతో పరిచయమున్న వారందరికీ ప్రక్క ఫోటోలోని నటుడు గుర్తుండే ఉంటాడు.

ఆయన పేరు బొడ్డపాటి కృష్ణారావు .

వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ' సుబ్బిశెట్టి ' లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ' హాస్యాంబుధి '  అనే బిరుదు పొందారు.


1954 లో ఆదుర్తి సుబ్బారావు గారి ' అమర సందేశం ' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో వేషాలు వేస్తూనే ట్యూషన్లు కూడా చెప్పేవారు. నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆయనే పాఠాలు చెప్పారు. సరిగా చదవకపోతే పిల్లలను దండించడంలో రామారావు గారు కృష్ణారావు గారికి పూర్తి స్వేచ్చనిచ్చారు.

ఒకసారి కృష్ణారావు గారు అందరికీ తాను ఒక చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చాలా నమ్మకంగా చెప్పడంతో విచారించగా ' వినాయక చవితి ' చిత్రంలో వినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. తొండం, చాటంత చెవులు వగైరాలతో ముఖం కనిపించకుండా పోవడంతో ఆయనకి బాధ కలిగింది. ఆ మాటే దర్శక నిర్మాతలతో చెబితే అదే చిత్రంలో యదువీరుడి వేషం కూడా ఇచ్చారు.  దాంతో కృష్ణారావు గారు గర్వంగా అందరికీ తాను ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నట్లు చెప్పుకున్నారట.
  
Vol. No. 02 Pub. No. 012

Tuesday, August 24, 2010

మూగ ప్రజా ప్రతినిధి


 ఈ పేరు గత తరం పాఠకులకు చిరపరిచితం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించిన ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో అఖిలాంద్ర ప్రజల ఆదరాభిమానాల్ని అమితంగా చూరగొంది.

ఆ పత్రికను స్వయంగా నడుపుతూ సంపాదక బాధ్యతలను కూడా చిరకాలం నిర్వహించిన శివలెంక శంభుప్రసాద్ గారు కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసారు. అయితే పార్లమెంట్ లో అనవసర చర్చల్లోను, వాదోపవాదాలలోను పాల్గోవడం ఆయనకు నచ్చని విషయం. అందుకే సాధారణంగా సమావేశాల్లో ఆయన నోరు మెదిపేవారు కాదు.

ఒకసారి ఒకాయన శంభుప్రసాద్ గార్ని " ప్రసాద్ గారూ ! మీరు పార్లమెంట్ లో ఎప్పుడూ మాట్లాడరేమిటి ? " అనడిగాడట.

దానికి సమాధానంగా " అశేష మూగ ప్రజానీకానికి నేను ప్రతినిధిని కదా ! నేనేం మాట్లాడగలను ? " అని చమత్కరించారట శంభుప్రసాద్ గారు.

Vol. No. 02 Pub. No. 011

Sunday, August 22, 2010

ఊర్వశి వివరాలు... జవాబు

  కనుక్కోండి చూద్దాం - 24  
జవాబులు 

ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం వెంటనే చెప్పిన జ్యోతి గారికి ధన్యవాదాలు. ఆవిడ మొదటి ప్రశ్నకు అన్నీ సరిగానే చెప్పారు గానీ శారద పేర్లలో ఒక పేరు మర్చిపోయారు. ఆ వివరాలు........

1 .  ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ' ఊర్వశి ' అవార్డును అందుకొన్న మన సహజనటి శారద ఏ ఏ చిత్రాలకు ఆ పురస్కారాన్ని పొందింది ?

జవాబు : తులాభారం - మలయాళం ( 1968 ) , స్వయంవరం - మలయాళం ( 1972 ), నిమజ్జనం - తెలుగు ( 1979 )

2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పేర్లతో నటించింది. అవి ఏమిటో చెప్పగలరా ? 

జవాబు : శారద అసలు పేరు సరస్వతి. చిత్రసీమలోకి రాకముందు నాటకాల్లో నటించేటప్పుడు ఆ పేరే ఉపయోగించేవారు. నాగభూషణం ' రక్తకన్నీరు ' నాటకంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
చిత్రసీమలోకి ప్రవేశించాక శారద గా పేరు మార్చుకున్నారు. 
తర్వాత మళయాళ చిత్రరంగంలోకి వెళ్ళాక మొదటి చిత్రంలో ' రాహెల్ ' అనే పేరుతో నటించారు.  తర్వాత చిత్రం నుంచి శారద గానే కొనసాగేరు.  

Vol. No. 02 Pub. No. 010a

Saturday, August 21, 2010

ఊర్వశి వివరాలు.....!!!

  కనుక్కోండి చూద్దాం - 24  

1 .  ముచ్చటగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా ' ఊర్వశి ' అవార్డును అందుకొన్న మన సహజనటి శారద ఏ ఏ చిత్రాలకు ఆ పురస్కారాన్ని పొందింది ?

2 . శారద ఆ పేరుతోనే కాక ఇంకా కొన్ని పేర్లతో నటించింది. అవి ఏమిటో చెప్పగలరా ? 
 


Vol. No. 02 Pub. No. 010

Friday, August 20, 2010

హాస్యానికి కొత్త భాష్యం పద్మనాభం


విలక్షణ హాస్యనటుడు పద్మనాభం
మనకందించాడు నవ్వుల లాభం
హాస్యంలో ఆయనదొక ప్రత్యేక బాణీ
మనకందించింది ఆయన వినూత్న వాణి

తడిపేసాడు ఆంధ్రదేశాన్ని నవ్వుల వర్షంలో
కురిపిస్తుంటాడు అదే జడి స్వర్గలోకంలో

హాస్యలోకంలో చిరంజీవి ఆయన 
హాస్యానికే కొత్త భాష్యం ఆయన

ఈరోజు పద్మనాభం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........



Vol. No. 02 Pub. No. 009

వరములనోసగే తల్లులకు శుభాకాంక్షలు


 వరలక్ష్మి వ్రత పుణ్య కథ 
వరములనోసగే తల్లి కథ

వరలక్ష్మి వ్రతం...........
ఆడపడచులందరికీ శుభప్రదం
కుటుంబ క్షేమం కోరుతూ వారు చేసే పూజ
కలిగించాలి అన్ని శుభములు వారికి ఎల్లవేళలా

వరలక్ష్మి వ్రతం సందర్భంగా సోదరీమణులందరికీ
'శిరాకదంబం' శుభాకాంక్షలు





Vol. No. 02 Pub. No. 008

Thursday, August 19, 2010

తీపి జ్ఞాపకం ' చాయా చిత్రం '

 మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచే చాయాచిత్రం
మన జీవితాల్లో విడదీయరాని బంధమైన ఛాయాచిత్రం
మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయాచిత్రం
మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం


ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మధుర స్మృతుల మాల ...............


Vol. No. 02 Pub. No. 007

Wednesday, August 18, 2010

కవి ప్రభావం - పన్ను భారం



తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు బహు భాషావేత్త, పండితులు. సాహితీసమితి ని స్థాపించి నవ్య సాహితీ సమితిగా దాన్ని మార్చి ఎందఱో కవులను, పండితులను ప్రోత్సహించారు.

శివశంకరశాస్త్రి గారికి పళ్ళు ఊడిపోయి బోసినోరు వచ్చేసింది. ఒకసారి ఆయన బోసినోటిని చూసి  ఒక మిత్రుడు " మీరు పళ్ళు కట్టించుకుంటే బాగుంటుంది కదా ! " అని ఓ ఉచిత సలహా పడేసాడు.

దానికి శాస్త్రిగారు ఓ బోసి నవ్వు నవ్వి
" నాకు వాక్ - స్థానం కవి. ఆ కవిగాడి ప్రభావం వల్లనే నా నోట్లో ఒక్క పన్ను కూడా మిగలకుండా పోయింది. కవిగాడి ప్రభావానికి ఎదురు నిలవడం ఎవరితరం. అయినా భారాలు ఎక్కువైపోతున్న రోజుల్లో పన్నుల భారం తగ్గినందుకు సంతోషించాలి కదా ! " అన్నారట.

శ్లేషలంటే పండితులకు నల్లేరు మీద బండి నడక లాంటివి కదా !

Vol. No. 02 Pub. No. 006

Tuesday, August 17, 2010

నవరసాల నటీమణి



నవరసాల నటీమణి ఋష్యేంద్రమణి 





1917 నూతన సంవత్సరం రోజున విజయవాడలో జన్మించిన ఋష్యేంద్రమణి తొలిచిత్రం 1935 లో వచ్చిన ' శ్రీకృష్ణతులాభారం ' .అంతకుముందు అతి చిన్నవయసులోనే రంగస్థలాన్ని అలరించింది. కపిలవాయి రామనాథశాస్త్రి, పువ్వుల రామతిలకం లాంటి ప్రముఖ నటుల వద్ద నాటక కళలో ఓనమాలు నేర్చుకుంది.

మొదటి చిత్రం పరాజయం పాలు కావడంతో తిరిగి రంగస్థలాన్ని ఆశ్రయించిన ఋష్యేంద్రమణి ఆమె భర్త జవ్వాది రామకృష్ణారావు నాయుడు ప్రోత్సాహంతో 1942 లో మళ్ళీ ' సీతారామ జననం ' చిత్రంతో పున: ప్రవేశం చేసింది.

తమిళ చిత్రం ' పత్ని ' ( 1942 ) లో తమిళ ఇతిహాసం ' శిలప్పదికారం ' లోని కన్నగి పాత్ర ధరించడంతో ఆమె ప్రతిభ చిత్రరంగంలో తెలిసింది. అప్పటినుండి ఇంక తిరిగి చూడలేదు. అనేక రకాల పాత్రలు వివిధ చిత్రాల్లో పోషించింది.

1943 లోను, 1958 లోను వచ్చిన ' చెంచులక్ష్మి ' చిత్రాలు రెండింటిలో నటించింది. విజయా సంస్థలో చాలా చిత్రాల్లో నటించింది.
హావబావాలు అలవోకగా పలికించడంలోను, నవరసాల్ని అవలీలగా పోషించడంలోను, సంభాషణలు మంచి టైమింగ్ తో పలకడంలోను ఆమెకు ఆమే సాటి.

2002 ఆగష్టు 17 వ తేదీన ఋష్యేంద్రమణి స్వర్గస్థురాలయింది. ఆమె వర్థంతి సందర్భంగా  నివాళులు అర్పిస్తూ...
ఆమె నటనా కౌశలాన్ని తెలిపే సన్నివేశాలతో................కళానీరాజనం




Vol. No. 02 Pub. No. 005

Monday, August 16, 2010

మేకప్ గొప్పా......???

 మేకప్ మహత్యమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనాకారిని అందంగా మలచవచ్చు. అందంగా ఉన్నవారిని కురూపిగా చూపించవచ్చు.

అలాగే సన్నివేశంలోని భావప్రకటనకు అనుగుణంగా ముఖకవళికల్ని మార్చవచ్చు. ఈ విషయం మనతో బాటు ఒకప్పటి హాస్యనటుడు సీతారాం కూడా ఒప్పుకుంటాడు. ఓసారి ఆయన తన ముందు తరంలోని మేకప్ కళాకారుడు హరిబాబుని తలుచుకుంటూ.....

" ఆ రోజుల్లో హరిబాబు ఎంత అద్భుతంగా మేకప్ చేసేవారంటే, చిరునవ్వులు చిందే ముఖాన్ని అరగంటలో దుఃఖరసం ఉట్టి పడేటట్లు మలచేవారు " అన్నాడు.

అంతే ! ఆ ప్రక్కనే వున్న చాయాదేవి వెంటనే అందుకుని .............

" అదో గొప్పా ! ఒక్క మొట్టికాయతో అర సెకండ్ లో నేనా పని చెయ్యగలను " అందట.    

Vol. No. 02 Pub. No. 004

తెలుగు జాతి స్వరం - ప్రభంజనం



 జాతీయ సంగీత వేదిక  ఇండియన్ ఐడల్
ఆ వేదిక మీద నినదించిన తెలుగు స్వరం శ్రీరామచంద్ర

ప్రతిభకు ఎల్లలు లేవు, ప్రాంతాలు లేవు, భాషలు లేవు
అని చాటిన తెలుగు జాతి స్వరం శ్రీరామచంద్ర

భాషా, ప్రాంతీయ వివక్షతను చేధించిన స్వరమది
యావత్ భారత జాతిని పులకింపజేసిన గళమది

ఈ ఘనత శ్రీరామచంద్రది మాత్రమే కాదు
ఈ గౌరవం యావత్ తెలుగు జాతిది

తెలుగు జాతికి అతడు సాధించి పెట్టిన కీర్తి
తెలుగు జాతిని అతడు ఎక్కించిన అందలాలు
మరువలేనివి మరపురానివి

తనకీ ఘనకీర్తిని తెచ్చిన తెలుగు గడ్డను
తనకు అండగా నిలిచిన తెలుగు జాతిని
అతడెన్నడూ మరువరాదు

శ్రీరామచంద్ర గానం మరిన్ని శిఖరాలు అధిరోహించాలి 
తెలుగు జాతి స్వరాన్ని హిమాలయాల ఎత్తుకి  చేర్చాలి  

శ్రీరామచంద్రకు అభినందనలతో ........................

Vol. No. 02 Pub. No. 003

Sunday, August 15, 2010

స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి


 పరతంత్ర పాలనలో మగ్గిన భారతజాతి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుని 63 సంవత్సరాలు గడిచిపోయాయి.
ఎన్నెన్నో పంథాలు, పోరాటాలు, విధానాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు.......
వెరసి పరాయి పాలకుల పలాయనం, స్వతంత్ర్య బారతదేశ ఆవిర్భావం


 
స్వాతంత్ర్యోద్యమం కేవలం పరాయిపాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదు
మన హక్కులు, మన సంపద, మన సంస్కృతి కాపాడుకోవడానికి జరిగిన ఆత్మగౌరవ పోరాటం
రాజ్యంలోని మానవులందర్నీ సమానంగా చూడలేని రాజు... రాజు కాడు
సమాజంలోని తోటి మనుష్యుల్ని తమతో సమానంగా చూడలేని ప్రజలు... ప్రజలు కారు

రాజరికంలో యథా రాజా తథా ప్రజా
ప్రజాస్వామ్యంలో యథా ప్రజా తథా రాజా
ఇది స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి మనకు నేర్పించింది
ఇవే హక్కుల్ని రాజ్యాంగం  మనకు ప్రసాదించింది  

మన హక్కుల్ని మనమెంతవరకూ కాపాడుకుంటున్నాం ?
మన అధికారాల్ని మనమెంతవరకూ ఉపయోగించుకుంటున్నాం ?
ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు...సేవకులే అందరూ ....
మరి సేవకుల్ని పాలకులుగా ఎందుకు భావిస్తున్నాం ?

బ్రిటిష్ వలస పాలనలో 200 ఏళ్ళు మగ్గిన మనలో ఆ బానిస భావాలు పోలేదా ?
ఇంకా ఎన్ని తరాలు ఆ భావ దారిద్యంలో మగ్గాలి ? దానినుండి ఈ జాతికి విముక్తి లేదా ?
నవ భావాల ... ఆధునిక యువతరమైనా ఈ బానిస భావాలను చేదిస్తుందా ?
డబ్బు సంపాదనా మార్గాల అన్వేషణలో పడి కర్తవ్యం మరచిపోతుందా ?

వ్యక్తి కంటే సమాజం ముఖ్యమని నవతరం గుర్తిస్తే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను చూడవచ్చు
సమాజం బాగుంటేనే మనం హాయిగా, స్వేచ్చగా జీవించగలమని యువత గుర్తించాలి
నా కుటుంబం, నా బాగు, నా సంపాదన, నా సరదాలు అనే పరిధిని దాటి ఆలోచించాలి
అప్పుడే స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు నిజమైన విలువ నిచ్చినట్లవుతుంది
అప్పుడే సమసమాజ, నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది 

విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకూ ఒకే జాతిగా వున్న భారతీయుల్ని రెండుగా విడదీసింది . 63 ఏళ్ళు గడిచినా ఆ బేధాలు సమసిపోలేదు. సరిగదా మన నాయకులు ఈ బ్రిటిష్ సూత్రాన్ని బాగా వంటపట్టించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా నవతరం మేల్కొని ఇలాంటి కుత్సిత, స్వార్థపూరిత నాయకులకు మంగళం పాడకపోతే మన జాతిలో మరో ముసలం పుడుతుంది.

64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో .................... 
స్వాతంత్ర్యం సిద్ధించిన పరిణామ క్రమం చూడండి..............



Vol. No. 02 Pub. No. 001

Saturday, August 14, 2010

బ్లాగు లోకంలో తొలి అడుగు

బుడి బుడి నడకలు నేర్చుకున్నాకే పరుగెత్తడం నేర్చుకుంటారు
తప్పటడుగులు వేయడం వచ్చాకే తప్పుటడుగుల మర్మం తెలుసుకుంటారు
సుదీర్ఘ జీవన యానంలో ఒక సంవత్సర కాలం తక్కువేమీ కాదు
వెనుదిరిగి చూసుకుంటే సాధించినదేమిటో, సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది



ఈరోజు ఆగష్టు 14 వ తారీఖు
సరిగా సంవత్సరం క్రితం అనుకోకుండా ' శిరాకదంబం ' ప్రారంభమైంది
అందులో చెప్పడానికి, రాయడానికి చాలా కనిపించింది
నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను
ఎంత రాసినా తరగడం లేదు.. ఎంత రాసినా తృప్తి కలగడం లేదు
ఇంకా రాయాలి.. నా దగ్గరున్నవి, నాకు తెలిసినవి అన్నీ అందరికీ పంచాలి
అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది

ఇంకెంతకాలం రాయగలనో... ఇంకెన్ని విషయాలు రాయగలనో...!
  
చదివేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మొట్టికాయలు వేసే వాళ్ళు
............ ఇలా ఎంతోమంది కనిపించారు ఈ బ్లాగులోకంలో
అవును ఇదో లోకం
ఇందులో పడితే బయిట ప్రపంచం కనబడదు
కష్టాల, బాధల, అశాంతుల కేకలు వినిపించవు
మన లోకం మనది.... మన రాతలు మనవి
మనకి తెలిసింది రాస్తాం !..... మనకనిపించింది రాస్తాం !!

శిరాకదంబం గణాంకాలు -
సంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 376
సంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, రిపీట్ అయినవి కాక )          - 761
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు
( చేరకపోయినా అభిమానం కురిపిస్తున్నవారు అనేకమంది )                   -   20
శిరాకదంబం సందర్శకులు 
( బ్లాగులో ఉంచిన విడ్జెట్ ద్వారా మాత్రమే !  ఆది కూడా ప్రారంభించిన
నెల తర్వాత పెట్టినది. మిగిలిన లింక్ లలో విషయం తెలీదు )                   - 20928


' కళాకారులకు బలం ప్రేక్షకుల చప్పట్లే ' అన్నారు ఒక రచయిత
బ్లాగర్లకు వ్యాఖ్యలే బలం అంటున్నారు బ్లాగు మిత్రులు
ఆ వ్యాఖ్య మెచ్చుకోలైనా, విమర్శైనా, తిట్లయినా ఏవైనా
టపా రాసాక చకోర పక్షిలా బ్లాగరు ఎదురుచూసేది వ్యాఖ్యలకోసమే !

శిరాకదంబం లో తొలిసారి వ్యాఖ్యలు రాసినవారు
rayraj  గారు , నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు, భావన గారు
ఆది ఏడవ టపా - తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ? 
తొలి వ్యాఖ్యలు రాసిన ఈ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి అప్పుడు వారు కొన్ని ప్రశ్నలేసారు. వాటికి అప్పుడు సరిగా సమాధానం చెప్పగలిగానో.. లేదో గానీ తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతినీ భావితరాలకు అందించే కార్యక్రమం చేపట్టాలనేది నా చిరకాల వాంఛ . అన్నీ వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో ఇది కష్ట సాధ్యమైన విషయమే ! అయినా ఏటికి ఎదురీదడం విశేషం గానీ వాలుకి కొట్టుకుపోవడం విశేషం కాదేమో ! అందుకే చాలాకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికి బ్లాగుల ద్వారా మిత్రులైన కొందరు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది చిన్ననాటి మిత్రులు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు.  పూర్తిగా కార్యరూపం దాల్చాక వివరాలు ఇస్తాను. 

ఈ బ్లాగుల వల్ల కొత్తగా ఎంతోమంది మిత్రులను పొందగలిగాను. ఎన్నో భావాలు, ఉల్లాసాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు...మరికొన్ని విషాదాలు కూడా బ్లాగుల్లో చూసాను. అయితే నా అదృష్టం నాకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే మిత్రులు ఈ బ్లాగులోకంలో లభించారు.... లభిస్తున్నారు. 

ఈ సంవత్సరంలో కొన్ని మధుర జ్ఞాపకాలు  -
1 . ' కొత్తపాళీ ' నారాయణస్వామి గారి ' రంగుటద్దాల కిటికీ ' పుస్తకావిష్కరణ సభలో పాల్గోవడం, అక్కడ ' తెలుగు పద్యం ' భైరవభట్ల కామేశ్వరరావు గారు, ' నవ్వులాట ' శ్రీకాంత్ గారు, ' తెలుగు కళ ' పద్మకళ గారు, తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్  నూర్ రహమతుల్లా గారు మొదలైన వారి పరిచయ భాగ్యం లభించింది.
2 . జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు డెమో నిర్వహణలో పాల్గోవడం, ఆ సందర్భంగా డి.ఎస్.కె. చక్రవర్తి గారు, కశ్యప గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు మొదలైన బ్లాగర్లను కలవడం జరిగింది.
3 . సంక్రాంతికి ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది విజయవాడ బ్లాగర్లు కలవడం జరిగింది.

శిరాకదంబం అనే ఒక బ్లాగు వుందని అంతర్జాలంలో అందరికీ తెలియపరిచి తద్వారా కొంతమంది చదువరులను సంపాదించేందుకు దోహదపదడంలో కూడలి, హారం, మాలిక లాంటి బ్లాగు అగ్రిగేటర్లు, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యా రాక్స్, వెబ్ దునియా - తెలుగు లాంటి సైట్స్, పేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ బజ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పాత్ర మరువలేనిది.   

సంవత్సరం గడిచిందంటే బుడి బుడి నడకల స్థాయి నుంచి ధీమాగా తొలి అడుగు వేసే స్థితికి చేరుకున్నామనుకుంటాను. ఇన్నాళ్ళూ చేయి పట్టుకు నడిపించిన వారెందరో పేరు పేరునా చెప్పడం  కష్టమైనా సీనియర్ లూ, జూనియర్ లూ అనే తేడాలేకుండా బ్లాగు మిత్రులందరూ తమ సలహాలు, సూచనలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇందులో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని లెఖ్ఖలు చెప్పడం ఉచితం కాదనుకుంటాను. బ్లాగర్లే కాదు ఇతర మార్గాల ద్వారా చదవరులు కూడా శిరాకదంబం చూసి తమ అభిప్రాయాల్ని తెలుపుతూనే వున్నారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇలా శిరాకదంబం బలోపేతం కావడానికి దోహదపడుతున్న వారెందరో ................ అందరికీ శతకోటి వందనాలు. ముందు ముందు కూడా ఇలాగే మిత్రులందరూ తమ సలహాలు, సూచనలు, విమర్శలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.............


Vol. No. 01 Pub. No. 374

Friday, August 13, 2010

పదండి ముందుకు



రాజకీయ చైతన్యం పుష్కలంగా వున్న నటుడు జగ్గయ్య 1962 లో ' పదండి ముందుకు ' అనే చిత్రాన్ని నిర్మించారు.



ఆ చిత్రానికి ఆయనే సంభాషణలు సమకూర్చగా విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించారు.
స్వాతంత్ర్య సమరం, గాంధీ మహాత్ముని సత్యాగ్రహాలు, భగత్ సింగ్ లాంటి వీరుల త్యాగాలు ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరణ.

 అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మన రాష్ట్రంలోనే తొలిసారి సబ్సిడీ అందుకున్న చిత్రంగా ' పదండి ముందుకు ' ను చెబుతారు.

ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా జగ్గయ్య కృంగిపోలేదు.

" నా మనస్సు వ్యాపారపరమైంది కాదు. సాంఘిక బాధ్యతలెరిగిన వ్యక్తిని. రాజకీయవాదిగా నాకో ఇమేజ్ వుంది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణంలో రాజీ పడడానికి నా మనసొప్పదు " అనేవారాయన.

హీరో కృష్ణ తొలిసారి తెర మీద కనిపించిన చిత్రం కూడా ఇదే !

పదండి ముందుకు చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రాసిన దేశభక్తిని ప్రభోదించే టైటిల్ పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు , బి. వసంత ఆలపించగా ఎస్.పి. కోదందపాణి స్వరపరిచారు. ఆ పాట అందరి కోసం........



Vol. No. 01 Pub. No. 373

Thursday, August 12, 2010

కొల్లాయి గట్టితేనేమి ? ' గాంధీ '

 రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ' గాంధీ ' చిత్రం అద్భుతమైన చిత్రీకరణతో ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించింది.

ఆ మహాత్ముని అంతిమ యాత్ర దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ప్రజలందరూ విరివిగా పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ రేడియోల్లోనూ, టీవీల్లోనూ, పత్రికలలోనూ, ఇంకా చాలా విధాలుగా ప్రకటించారు .

కానీ ఎంత ప్రయత్నించినా పదిహేనువేలమంది దాటలేదు. వాళ్ళలో కూడా చాలామంది ఆధునిక దుస్తులు ధరించి వచ్చారు. ఆ కాలానికి తగ్గట్లు వాళ్ళ ఆహార్యం మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా అటెన్ బరో కి తృప్తి కలుగలేదు.

మిలిటరీ దళాలనుంచి సుమారు 1700 మందిని, BSF జవానుల్ని, డిల్లీ పోలీసుల్ని కూడా రప్పించినా ఆయనకు ఇంకా తృప్తి కలుగలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

చివరికి అటెన్ బరో కూడా తనే వేషం వేసుకుని ఆ జనాల్లో ఒకడుగా నిలబడ్డాక తృప్తి కలిగింది. అంతిమయాత్ర సీను అద్భుతంగా వచ్చింది.


 1938 లో వచ్చిన ' మాలపిల్ల ' చిత్రంలో  పి. సూరిబాబు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతం ' కొల్లాయి గట్టితేనేమి....'  బి. నరసింహారావు గారి స్వరకల్పనలో ..................






Vol. No. 01 Pub. No. 372

Wednesday, August 11, 2010

మన పతాక ప్రస్థానం

 ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా '
భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా
ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం...........



* తొలిసారిగా 1904 లో  భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు.  1906 లో కలకత్తాలో జరిగిన  కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.




 * 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.








* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.  




* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.


అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.




* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.  



1952 లో వచ్చిన ' జ్యోతి ' చిత్రంలో జి. వరలక్ష్మి గానం చేసిన గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం వినండి.




Vol. No. 01 Pub. No. 371

Tuesday, August 10, 2010

శ్రీలు పొంగిన జీవగడ్డయి.....




రాయప్రోలు సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన ఈ దేశభక్తి గీతం
మిత్రుడు పార్థసారధి గళం నుండి
దుగ్గిరాల స్వరం కల్పనతో వినండి.





శ్రీలు పొంగిన జీవగడ్డయు పాలుగారిన భాగ్యసీమయు
రాలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !              [[ శ్రీలు ]]

వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట
వేదశాఖలు పెరిగెనిచ్చట ఆదికావ్యం అందినిచ్చట

బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా !!    [[ శ్రీలు ]]

నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి 
నీలి కిన్నెర మేళవించి   రాయి కరుగగ రాగమెత్తి

పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా !
పాల తీయని బాలభారత పదము పాడరా తమ్ముడా ! !       [[ శ్రీలు ]]

నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా
నవరసమ్ములు నాట్యమాడగా చిగురు పలుకులు చెవులు విందుగా

కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా !
కవితలల్లిన కాంతి హృదయము గారవింపవే చెల్లెలా ! !        [[ శ్రీలు ]]

పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ
పాండవేయుల పదును కత్తుల మండి మెరిసిన మహిత రణకథ

కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా !
కండగల చిక్కని తెలుగుంల కలసి పాడరా తమ్ముడా ! !      [[ శ్రీలు ]]





Vol. No. 01 Pub. No. 370

Monday, August 9, 2010

పాములోడు ?? - జవాబు

      కనుక్కోండి చూద్దాం - 24  

 జవాబు 



 ఈ ప్రక్క ఫోటోలో పాములోడి వేషంలో వున్నది తెలుగు సినీ సంగీత రంగాన్నేలిన ఒక ప్రముఖుడు.

ఎవరో చెప్పగలరా ?

ఈ వేషం ఎందులోదో చెప్పగలరా ?


జవాబిచ్చిన వారిలో సునీత గారు సరైన జవాబివ్వలేదు. రాజేంద్ర కుమార్ గారు ఘంటసాలను బాగానే గుర్తించారు గానీ వేషం ఎందులోదో చెప్పలేదు.  ప్రముఖ రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భాను గారు మాత్రం పూర్తిగా సరైన సమాధానం ఇచ్చారు.  స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

జవాబు : 1950 లో వాహినీ స్టూడియోలో జరిగిన విజయావారు నిర్వహించిన కార్నివాల్ లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ వేషంలో అలరించారు.  

Vol. No. 01 Pub. No. 367a

Sunday, August 8, 2010

ఆంద్ర పుణ్యక్షేత్రాలు

  
 మధురకవి డా. వక్కలంక లక్ష్మీపతి రావు గారు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రచించిన ' ఆంధ్ర పుణ్యక్షేత్రాలు ' అనే గేయం ఆంధ్రదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ సాగుతుంది.  స్వర్గీయ సాలూరి హనుమంతరావు గారి స్వరకల్పనలో శ్రీమతి ఎస్. జానకి, శ్రీ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గేయం ప్రైవేటు ఆల్బం గా గ్రామఫోను రికార్డులలో  విడుదలై అత్యంత ప్రజాదరణ పొందింది.  అప్పట్లో ఆంధ్రదేశంలోని ప్రతి దేవాలయంలోను ప్రతిరోజూ తప్పనిసరిగా వినబడేది. ఆ అద్భుతమైన గేయం మీకోసం ................




ఇదే ఆంధ్ర భూమి ! ఇదే పుణ్య భూమి !
ఇది యోగులకు భోగులకు జన్మభూమి !
గౌతమీకృష్ణాతరంగాల పులకించు
మాతెలుగుసీమలో వెలయువేలుపులారా !
మాయిలవేల్పులారా !


తిరుమలశిఖరాల వెలసినదేవా !
మొర లాలించి లాలించి పాలించరావా ?
దివినుండి భువికి దిగి వచ్చినావు !
స్వర్గముగ తిరుపతిని వెలయించినావు !
కొం డెక్కి కూర్చున్న శ్రీవెంకటేశా !
అడుగుననె పడియున్న బడుగులను కనవా ?
ఒక్కొక్కమెట్టె పై కెక్కించ రావా ?
శ్రీవెంకటేశా ! శ్రీతిరుమలేశా !



శ్రీకాళహస్తీశ్వరా !
భూలోకకైలాసవాసా ! మహేశా !
శ్రీకాళహస్తీశ్వరా !
సాలెపురుగునూ పాము నేనుగును
కన్నప్పను ఏలినదేవా !
నీపరీక్షలకు నిలబడలేము !
నీ చరణములే శర ణన్నాము !
శ్రీకాళహస్తీశ్వరా !



శ్రీశైలమల్లేశ్వరా !
భ్రమరాంబికాసతీహృదయేశ్వరా !
పార్థునికి పాశుపత మందించినావే -
మాకు నీచేయూత నందించ వేమీ ?
మనసులో మల్లియలు విరబూయుస్వామీ :
మాబ్రతుకు పువుబాటగా మలచ వేమీ ?
శ్రీశైలమల్లేశ్వరా !



బెజవాడ కనకదుర్గమ్మా!
విశ్వమోహనముగా వెలసినా వమ్మా !
తెలుగుహృదయాలు నీపూజాసుమాలు !
చల్లగా మము చూడు మమ్మ ! అదే చాలు !
చల్లగా మము చూడు మమ్మా !
బెజవాడ కనకదుర్గమ్మా!


అంగీకృతాభంగగంగాతరంగా!
ఓకోమలాంగా ! శ్రీభీమలింగా !
నీ వెట నుండిన అదె కైలాసం !
దక్షిణకాశీ దక్షారామం !
తెలుంగుసీమకు వెలుం గొసంగిన
దక్షారామమె భూకైలాసం  !
ఈదక్షారామమె భూకైలాసం  !



చిరునవ్వువెన్నెలలచెలువములు పండించి
ర్యాలిలో రాలలో పూలు పూచినస్వామీ !
కోనసీమావాస ! శ్రీజగన్మోహనా !
జోహారు ! జోహారు ! జోహారు ! స్వామీ !
శ్రీజగన్మోహనా ! జోహారు ! స్వామీ !




త్యాగమయా ! అనురాగమయా !
భద్రాద్రినిలయా ! రామయ్యా !
అయోధ్య విడిచి అమ్మ సీతతో
ఆంధ్రావనికి అరుదెంచితివా !


నరుడుగ పుడితే దేవుడె అయినా
నానాబాధలు పడవలెనా ?
రామదాసు నలనాడు కష్టముల
నాదుకొన్నఓరామయ్యా !
చీకటిలో తారాడుమా కిపుడు
వెలుగుదారులను చూపవయా !
త్యాగమయా ! అనురాగమయా !


 శ్రీసత్యనారాయణా ! హేశ్రీఆదినారాయణా !
శ్రీభూదేవులసేవ లందుచూ
అన్నవరములో వెలసినదేవా !
ఆపదమ్రొక్కులవాడ వయీ
మాప్రా పై నిలచినబంగారుకొండా !
కనుగొన వయ్యా ! నీవారమూ మము
కన్నుల వెన్నెల నిండా !
శ్రీసత్యనారాయణా ! హేశ్రీఆదినారాయణా !



యాదగిరిని సింహాచలమందున
వెలసినలక్ష్మీనరసింహా !
ప్రహ్లాదుడు పిలువగనె కంట బడి
వరము లొసంగిన దయామయా ! 

ఎదలో నిలిచీ యెంత పిలిచినా
ఎందుకు పలుకవు ? దయ లేదా ?
నరసింహా ! దయ లేదా ?




అనంతభూభారము వహియింపగ
శ్రీకూర్మములో వెలసినదేవా !
చేకొను మివె మానుతులూ నతులూ ;
శ్రీనాథా ! భూనాథా ! శ్రీకూర్మనాథా !




జగదేకపావనా ! సూర్యనారాయణా !
ప్రత్యక్షదైవమా ! ఓలోకబంధూ !
భక్తజనహృదయాలు పద్మమ్ము లై విరియ
అరసవిల్లిని నీవు వెలసినావా !
అంజలింతుము దేవ ! మ మమ్మేలుకోవా ?
జగదేకపావనా ! సూర్యనారాయణా !
ప్రత్యక్షదైవమా ! ఓలోకబంధూ !
సూర్యనారాయణా ! సూర్యనారాయణా !
సూర్యనారాయణా !  ..........................





Vol. No. 01 Pub. No. 369

Saturday, August 7, 2010

స్వాతంత్ర్యమే మా జన్మహక్కనీ చాటండీ !




 అమర గాయకుడు
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు
గానం చేసిన ఈ దేశభక్తి గీతం మీకోసం..........




స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
స్వాతంత్ర్యమే మా జన్మ హక్కనీ చాటండీ !
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !! 
నిరంకుశమగు శక్తులెదిరినా నిర్భయమ్ముగా నిదురించండీ !!

పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు 
పరుల దాస్యమున బాధలు పొంది బ్రతికిన చచ్చిన బేధమే లేదు   
                                                                                   [[ స్వాతంత్ర్యమే ]]      
కవోష్ణ రుధిర జ్వాలలతోటి .............
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర్య సమరం నడపండీ !
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
ఎంతకాలమిటు సహించి వున్నా దోపిడీ మూకకు దయరాదన్నా
                                                                                   [[ స్వాతంత్ర్యమే ]]

 సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన .............
సంఘములోని ఐక్యత వేగమే సంఘటపరుపుము శాంతి పథాన
స్వర్గతుల్యమౌ  స్వతంత్ర్య జ్యోతికి మాంగల్యపు హారతులిమ్మా ...  మాంగల్యపు హారతులిమ్మా !!
                                                                                    [[ స్వాతంత్ర్యమే ]]  




Vol. No. 01 Pub. No. 368

పాములోడు ??

                            కనుక్కోండి చూద్దాం - 24


 ఈ ప్రక్క ఫోటోలో పాములోడి వేషంలో వున్నది తెలుగు సినీ సంగీత రంగాన్నేలిన ఒక ప్రముఖుడు.

ఎవరో చెప్పగలరా ?

ఈ వేషం ఎందులోదో చెప్పగలరా ?


 Vol. No. 01 Pub. No. 367
Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం