Friday, June 25, 2010

కుంచె 'కూచి' విలాసం

మూస కార్యక్రమాలు. మూస సీరియల్స్, జుగుప్స కలిగించే నృత్య కార్యక్రమాలు, గోరంతను కొండంత చేసే అభూతకల్పనల వార్తాకథనాలు  ... వెరసి  ప్రస్తుతం టీవీ చూడాలంటేనే భయమేసే పరిస్థితి. టామ్ రేటింగుల కోసం రకరకాల విన్యాసాలు, చర్చల్లో- కోర్టుల్లో వాటిని సమర్థించుకోవడాలు, బ్లాక్ మెయిలింగ్ వార్తలు .... ఒక  రకంగా టీవీ సామాన్య ప్రేక్షకుణ్ణి దూరం చేసుకుంటున్న పరిస్థితి. ఆప్పుడు ఏ రేటింగులు ఆదుకుంటాయో మరి. అయినా రేపటి సంగతి మనకేల ? నేడు సుఖపడు మనసారా ! అనే ఫిలాసఫీని వంటబట్టించుకున్నాయి చానెల్స్.

శాస్త్రీయ సంగీతమంటే టీవీ చానళ్ళకు అంటరానిదైపోయిన కాలంలో ధైర్యం చేసి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ' నాదవినోదం ' ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది ' మా టీవీ ' . ఎందరో వర్థమాన కళాకారులకు వేదికనిస్తూ, లబ్దప్రతిష్టులైన కళాకారుల సంగీత విన్యాసాలను కూడా అందిస్తోంది. మన సంస్కృతి లోని కళల వైశిష్ట్యాన్ని ప్రపంచమంతటా చాటుతున్న 'మా టీవీ'  కి జేజేలు. అసలు ఈ ధైర్యం చెయ్యడమే గొప్ప.  సాంప్రదాయానికి కూడా కమర్షియల్ సొగసులు అద్దింది. దేన్నైనా కమర్షియలైజ్ చెయ్యడానికి సాంప్రదాయాన్ని కించపరచనక్కర్లేదని నిరూపించింది. అర్థం పర్థం లేని సంగీతం, నృత్యం పదే పదే ప్రసారం చేస్తూ ప్రేక్షకుల చెవుల్లో తుప్పునీ, కళ్ళల్లో కారాన్నీ నింపుతున్న టీవీ చానళ్ళను సవాల్ చేస్తూ మన చెవులు, కళ్ళూ ఆరోగ్యంగా వుండేటట్లు చేసే కార్యక్రమం చేపట్టినందుకు అభినందించాల్సిందే !

'నాదవినోదం' మహోత్సవం పేరిట ప్రసారం చేస్తున్న ఎపిసోడ్లలో ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసింది ' మా టీవీ ' . వేదిక మీద సంగీత కళాకారుల విన్యాసం సాగుతుండగా వారి పాట / కీర్తన / కంపోజిషన్ కు అనుగుణంగా అప్పటికప్పుడు ఆ వేదిక మీదే ఒక చిత్రకారుడు తైలవర్ణ చిత్రాన్ని రచించడమనే కొత్త ప్రక్రియకు శ్రీకారం పలికింది ' మా టీవీ '.  నిన్న ( జూన్ 24 వ తేదీన ) జరిగిన ఎపిసోడ్ లో  మాండలిన్ పై వాయించిన ' మహా గణపతిం ' కీర్తనకు గణపతి పెయింటింగ్, ప్రముఖ మృదంగ విద్వాంసులు యెల్లా వెంకటేశ్వర రావు గారు అద్భుతంగా స్వరపరచిన ప్రాక్పశ్చిమ వాయిద్య విన్యాసానికి, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తన బృందంతో ఆలపించిన రెండు పాశ్చాత్య గీతాలకు అనుగుణంగా ఆయా పాటలు  /  కంపోజిషన్ లు పూర్తయ్యే లోపు పెయింటింగ్ వేయడం జరిగింది.

ఈ రోజు ( జూన్ 25 వ తేదీన ) సాయింత్రం గం. 07-00 లకు ( భారత కాలమానం ప్రకారం )  ప్రసారం కానున్న 'నాదవినోదం ' ఎపిసోడ్ లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ ను మీరందరూ తిలకించి మీ అభిప్రాయాలను తెలియపరిస్తే ఆరోగ్య కరమైన కార్యక్రమాలు మన ఇళ్ళల్లో చూడడానికి ప్రోత్సహించినట్లవుతుంది.

ఈ కార్యక్రమంలో వేదికపైన సంగీత విన్యాసంతో బాటు అప్పటికప్పుడు తన కుంచె విలాసాన్ని ప్రదర్శించిన చిత్రకారుడు కూచి సాయిశంకర్. ఈ వైభవాన్ని మీరూ తిలకించండి.

ఈ రోజు సాయింత్రం గం.07-00 లకు ' మా టీవీ ' లో .........


 Vol. No. 01 Pub. No. 331

8 comments:

ఆ.సౌమ్య said...

కూచిగారు మాకు బాగా తెలుసండీ. ఆయన్ని చాలాసార్లు కలిసాను కూడా. మా ఫేమిలీకి ఆయన బాగా సన్నిహితుడు. చాలా చాలా గొప్ప ఆర్టిస్టు. ఆయన వేలు కదిపినా చిత్రం అవుతుంది. మా అక్క శాస్త్రీయ సంగీత గాయని శ్రీమతి మండా (ఆలమూరు) సుధారాణి. ఆవిడ ఒకసారి త్యాగరాజ మహోత్సవాలలో పాడినప్పుడు కూచిగారు బొమ్మలు గీసారు ఇలాగే. ఆవిడ పాడిన ప్రతీ కీర్తనకి అనుగుణంగా బొమ్మలు గీసారు. అవి అద్భుతం, అత్యద్భుతం కూడా.

మా అక్క కచేరీలు CD లు చేస్తున్నప్పుడు వాటి పై బొమ్మ గీసారు. శ్రీమన్నారాయణుడు, వారి కింద ప్రహ్లాదుడూ, రామదాసు, త్యాగరాజు, మా అక్క...భక్త పరంపర అన్నట్టుగా గీసారు. అది ఆయన మా అక్కకి ఇచ్చిన గౌరవం. అసలు ఆ బొమ్మ చూసాక నాకు కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎప్పుడూ ఆయన కాళ్ళ మీద పడిపోవాలనిపిస్తూ ఉంటుంది నాకు.ఆయన చిత్రరచనా నైపుణ్యాన్ని మాటల్లో పొగడలేము, కొలవలేము.

రవిచంద్ర said...

అవునండీ ఈ కార్యక్రమం నేనూ తప్పకుండా చూస్తున్నాను.

Vinay Datta said...

definitely a good programme but unable to watch

SRRao said...

* సౌమ్య గారూ !
చాలా చాలా సంతోషం, మీరు నా అభిమాన గాయని ఆలమూరు సుధారాణి గారి చెల్లెలు కావటం. కొంతకాలం క్రితం టీవీ ప్రభావం పెద్దగా లేని రోజుల్లో ఆకాశవాణిలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు క్రమం తప్పకుండా వినడం నాకలవాటు. అప్పట్లో కొందరి కచేరీలు విడవకుండా వినేవాడిని. అందులో సుధారాణిగారొకరు. నేను త్యాగరాయ గాన సభ ( అమలాపురం ) కార్యవర్గ సభ్యునిగా వున్న కాలంలో ఆవిడ కచేరీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశ్యంతో ఆవిడ ప్రొఫైల్ కూడా తెప్పించాను. అయితే తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోవడంతో ఆ అదృష్టం నాకు దక్కలేదు. అది ఇంకా నా ఫైల్స్ లో వుండాలి. వెదికి వీలైతే దాని వివరాలు కూడా ఇద్దామనుకున్నాను. కానీ ఇతరత్రా కారణాల వాళ్ళ రెండు రోజులుగా సాధ్యం కాలేదు. మరోసారేప్పుడైనా ప్రయత్నిస్తాను.
ఇక కూచి విషయం. ఆతను నాకు బాల్యమిత్రుడు. వాళ్ళ కుటుంబమంతా కళాకారులే ! ఆ కుటుంబంతో నాకు విడదీయరాని అనుబంధం. నిజానికి ఇంకా ఎన్నో ఎత్తుల్లో ఉండాల్సిన వాడు. కళను వ్యాపారంగా చెయ్యడం చేతకాక కళ నడిపిన వైపు వెళ్ళాడు గానీ స్వార్థం వైపు వెళ్ళలేదు. తనకు తోచింది వేసుకుంటూ వెళ్ళాడు గానీ పబ్లిసిటీ కోసం, కాసుల కోసం ఆలోచించలేదు.
నిజానికి ఈ కార్యక్రమం మీద ఒక టపా రాయాలని ఎప్పుడో అనుకున్నాను. వాడి కళ ఇన్నాళ్ళకు ప్రజల్లోకి వస్తున్నందుకు ఆనందం పట్టలేక అర్జెంటుగా రాసేసాను. ఎప్పుడో కూచి పరిచయాన్ని అందిస్తాను.

మీ వ్యాఖ్య నన్నేకాదు కూచిని కూడా కదిపివేసింది. నిన్న ఫోన్లో వినిపించాను. చాలా సంతోషించాడు.

* రవిచంద్ర గారూ !
* మాధురి గారూ !
ధన్యవాదాలు

ఆ.సౌమ్య said...

ఓహో మీకు ఆ అక్క తెలుసా,చాలా సంతోషం. అమలాపురంలో మా అక్క ఒకసారి కచేరీ ఇచ్చింది. ఆ కచేరీకి మా నాన్నాగరు మా అక్కతో పాటే వచ్చారు...నా చిన్నతంలో లెండి, నాకంత గుర్తులేదు.

కూచిగారి గురించి నేను అదే అనుకుంటానండీ ఇంత ప్రతిభ ఉండి కూచిగారు ఇలా ఎక్కడో మరుగున ఉన్నారే అని....అంతటి కళాకారుడు ఎక్కడో ఉండాల్సినవారు. పొనీలెండి కళను వ్యాపారంగా చేసి డబ్బు సంపాదించేకన్న, మనసుకి నచ్చే పని చేసుకుంటూ జీవితాతం సుఖంగా ఉంటే అంటే చాలు.

SRRao said...

సౌమ్య గారూ !
కూచిని ఇలా మరుగున ఉన్నావంటే వొప్పుకోడు. అతనికి వున్నా ప్రతిభకు రావాల్సిన గుర్తింపు రాలేదనేది నిజం. కొంతమంది NRI లు కొన్ని ప్రాజెక్ట్ లు చేయించుకుంటుంటారు. దాంతో తృప్తి పడిపోతుంటాడు. నాకేమో బాపు గారి పేరులాగా కూచి అనే పేరు కూడా జనబాహుళ్యం లోకి వెళ్లాలని కోరిక. దానికి దోహదపడే ప్రాజెక్ట్ చేపట్టాలని వుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Surya Mahavrata said...

కూచికి నేను కూడా తెలుసు. మా ఆలిండియా రేడియో విశాఖపట్నం బావ వాళ్ళ ఆఫీసులో సంపూర్ణ రామాయణాన్ని కుడ్య చిత్రావళిగా కూచి కుంచెతో వేయిస్తున్నామని రెండేళ్ళ క్రితం చెప్పేడు కానీ ఇంకా అది కార్యరూపం దాల్చినట్టులేదు. గోడలింకా
తెల్లమొహాలేసుకునే ఉన్నాయి.

SRRao said...

సూర్య గారూ !
తప్పకుండా కూచికి చెబుతాను. మీకు ధన్యవాదాలు.

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం