Thursday, May 6, 2010

రక్తకన్నీరు

రక్తకన్నీరు - ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం
నాటక రంగానికి గ్లామర్ తెచ్చి ఐదువేలకు పైగా ప్రదర్శనలిచ్చిన నాటకం
ఆ ప్రదర్శన కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు
టికెట్ల కోసం సాధారణ జనం పడే పాట్లు
ఫ్రీ పాసులకోసం నాయకులు, అధికార్ల వెంపర్లాట
ఈ ఫ్రీ పాసు ప్రేక్షకులపై నాటక ప్రారంభంలోనే విసుర్లు
........ ఇదీ ఒకప్పుడు రక్తకన్నీరు రంగస్థల చిత్రం

ఆ రంగస్థల కథానాయకుడు, నాటకానికి క్రేజు తెచ్చిపెట్టిన నటుడు
విలక్షణమైన నటనతో , విభిన్నమైన సంభాషణా విధానంతో
తెలుగు చలన చిత్ర రంగానికి కొత్త తరహా విలనీ నందించిన నాగభూషణం

అందర్నీ మెప్పించి, ఒప్పించి తన చదువును కొనసాగించి
ఉద్యోగంకోసం చెన్నై చేరిన నాగభూషణం నాటకాలవైపు నడిచి
మిక్కిలినేని, జి. వరలక్ష్మి లాంటి నటుల సహచర్యం
ఆత్రేయ కప్పలు, భయం లాంటి నాటకాలు
కె.వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావుల రసన సమాఖ్యకు చేర్చింది.
రంగస్థలం నాగభూషణాన్ని ఆదరించింది
నాగభూషణం రంగస్థలాన్ని నమ్ముకున్నాడు

' ఏది నిజం ' లో కథానాయకుడిగా
1951 లో ' పల్లెటూరు ' నాగభూషణాన్ని వెండితెరకు పరిచయం చేసింది.
1956 లో ' ఏది నిజం ' నాగభూషణాన్ని కథానాయకుణ్ణి చేసింది
ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ నటునిగా రకరకాల పాత్రలు
విలనీలో కామెడీని రంగరించిన ఆయన పధ్ధతి
సంభాషణలు పలికే తీరులో ప్రదర్శించే విలక్షణత
నాగభూషణాన్ని తెలుగు ప్రేక్షకుల మనస్సులలో పదిలపరిచాయి  

1995 మే 6 వతేదీన ఆ రక్త కన్నీరు ఇంకిపోయింది.
ఆ నటభూషణం పైలోకంలో తన విశ్వరూపాన్ని చూపడానికి వెళ్ళిపోయాడు.


నాగభూషణం వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........

మనవి : రక్తకన్నీరు - ఓ జ్ఞాపకం నా స్వ ' గతం ' పేజీలో .............




Vol. No. 01 Pub. No. 282

4 comments:

Rao S Lakkaraju said...

తెలుగు తెరకొక భూషణం నాగభూషణం. అంతకన్నా నేనేమి చెప్పలేను. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

కొత్త పాళీ said...

ఇదేం సినిమా? నేను చూశనిది పేరు గుర్తు రావట్లేదు.
ఇలాంటి పాత్రలు నాగభూషణానికి కొట్టిన పిండి. విలనీలోనే ఆయన విలక్షణంగా చేసినవి మంచి మనసుల్లో, మళ్ళీ బాపు రమణల అందాల రాముడులో చాలా గురుతండిపోయే నటన.

SRRao said...

* రావు గారూ !
ధన్యవాదాలు

* కొత్తపాళీ గారూ !
ఈ చిత్రం ఎన్టీరామారావు నటించిన ' కథానాయకుడు '. ప్రస్తుత రాజకీయ నాయకులకు ప్రతిరూపంగా నాగభూషణం గారి పాత్ర వుంటుంది. ధన్యవాదాలు.

shri said...

నాగభూషణం విశ్వరూపం చూడాలంటే 'మంచి మనసులు'
(నాగేశ్వరరావు,సావిత్రి,షావుకార్ జానకి) ఒక్కటీ చూస్తే చాలు..
మనుషులంటే రోత పుట్టించే తరహా నటన..అలాంటి పాత్రనూ,పాత్రాధారినీ
ఇంతవరకూ చూడలేదు.'వాడే వీడు(నందమూరి)'లో కూడా చాలా గొప్ప నటన.
రక్తకన్నీరు చూడలేకపోవటం నాలాంటి వారి దురదృష్టం.

శ్రీదేవి

Related Posts Plugin for WordPress, Blogger...

ప్రాచుర్యం